జాన్ ఎఫ్ కెనెడీ హత్య మిస్టరీ: ట్రంప్ సర్కారు విడుదల చేసిన డాక్యుమెంట్లు చెప్పిన కొత్త విషయాలేంటి?

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ హత్యపై జరిగిన విచారణకు సంబంధించి డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా 2వేలకు పైగా పత్రాలను విడుదల చేసింది.
జాన్ ఎఫ్ కెనెడీని 1963లో హత్య చేశారు. అప్పటి నుంచి ఈ హత్యపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సమాధానం లేని ప్రశ్నలూ ఉన్నాయి.
ట్రంప్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పత్రాలు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవని, అలాగే ఆ రోజు ఏం జరిగిందనే అవగాహనను పెద్దగా మార్చదని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.
హత్యకు సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాలను వేటినీ ఇవి పట్టించడం లేదు.
అయితే ఈ కొత్త పత్రాలలో ఖాళీలు, నలుపురంగుతో కొట్టేయడం లాంటివి లేకుండా, ఎటువంటి సవరణలు లేని సమాచారాన్ని యథాతథంగా అందించారు. వీటిల్లోని అనేక అంశాలు చరిత్రకారులకు, జేఎఫ్‌కే కేసును గమనించేవారికి ఆసక్తి కలిగిస్తాయి.
కెనెడీ వాహనంపై సమీపంలోని ఓ భవనం నుంచి జరిగిన కాల్పులలో లీ హార్వే ఓస్వాల్డ్ ఒక్కరే పాల్గొన్నారని అమెరికా ప్రభుత్వ విచారణా సంస్థ ఒకటి పేర్కొంది.
లీ హార్వే ఓస్వాల్డ్ ఓ డ్రిఫ్టర్, అమెరికా నౌకాదళంలోని మెరైన్ విభాగంలో పనిచేశారు. ఆయన మార్క్సిజం అభిమాని. ఒకదశలో ఆయన సోవియట్ యూనియన్ పౌరసత్వం కోరుకుని అక్కడకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ హత్యకు పాల్పడ్డారని విచారణ సంస్థ తెలిపింది.
అయితే ఈ విచారణతో అనేకమంది అమెరికన్లు విభేదిస్తున్నారు. ఈ అధికారిక కథనంపై దశాబ్దాలుగా జరుగుతున్న పోల్స్‌లో అనుమానాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
ఈ కేసు ఇంకా అనేక కుట్రసిద్ధాంతాలను, ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉంది. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఈ కేసు మిస్టరీపై తాజా పత్రాలు సమాధానం చెప్పలేకపోయాయి. ఇందుకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు చూద్దాం.


ఫొటో సోర్స్, Reuters/Dallas Police Department
హత్యకు ముందే ఓస్వాల్డ్‌పై నిఘా
ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ పత్రాలు కెనెడీ హత్యకు సంబంధించి నిజాలను నిష్పక్షపాతంగా వెల్లడించే ఓ ముందడుగు అని పలువురు నిపుణులు కొనియాడారు.
అమెరికా అధికారులు గతంలో లక్షల సంఖ్యలో పత్రాలను విడుదల చేశారు కానీ, జాతీయ భద్రత పేరుతో అనేక అంశాలు ఉపసంహరించుకోవడం లేదంటే వాటిని పాక్షికంగా సవరించడమో చేశారు. గతంలో విడుదలైన డాక్యుమెంట్లతో పోల్చుకుంటే తాజా విడుదలలో మరింత సమాచారం కనిపిస్తోంది.
అనేక కేసుల్లో నల్లరంగు పూసిన సీఐఏ ఏజెంట్ల పేర్లు, చిరునామాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి.
అయితే భారీస్థాయిలో పత్రాలు విడుదల చేయడంతో నిపుణులు ఇంకా వాటిని పరిశీలిస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు భూమి బద్దలైపోయే కథనాలైతే బయటకు రాలేదు.
కానీ, పత్రాల తాజా విడుదల ''1990ల నుంచి జేఎఫ్‌కే రికార్డులకు సంబంధించి అత్యంత ఉత్సాహాన్ని కలిగించే వార్త'' అని వాషింగ్టన్ పోస్ట్ మాజీ రిపోర్టర్, జేఎఫ్‌కే ఫ్యాక్ట్స్ బ్లాగ్ సంపాదకుడు జెఫర్సన్ మోర్లే చెప్పారు.
''అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు ప్రజల దృష్టిలోకి వచ్చాయి'' అని ఆయన చెప్పారు. ఈ పత్రాలలో ఓస్వాల్డ్‌పై సీఐఏ నిఘా వేసిన విషయం ఇటీవలే అర్థమైంది.
'' కెనెడీ హత్యకు ముందు నుంచే సీఐఏ ఓస్వాల్డ్ పై నిఘా వేసింది.'' అని మోర్లే చెప్పారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
ఇంటెలిజెన్స్ ఎలా ఉండేది?
అనేక డాక్యుమెంట్లు ఆ కాలంలో ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ పద్ధతులను వెలుగులోకి తెచ్చాయి. ఎటువంటి సవరణలు లేని ఓ డాక్యుమెంట్‌లో ఫ్లూరోస్కోపిక్ స్కానింగ్ (ఎక్స్‌రే కిరణాలు ఉపయోగించి ఓ వస్తువు లోపలి చిత్రాలను చూడటం) గురించి వివరణ ఉంది. ఇది సీఐఏ కార్యాలయాల్లో దాచి పెట్టిన మైక్రోఫోన్లను గుర్తించడానికి అభివృద్ధి చేసిన టెక్నిక్.
అలాగే ఈ పత్రాలలో వాటర్‌గేట్ కుంభకోణంలో ప్రమేయం ఉన్న జేమ్స్ మెక్‌కార్డ్ పేరు కూడా ఉంది. ఈ కుంభకోణం కారణంగానే అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ గద్దె దిగాల్సి వచ్చింది.
సీఐఏ పబ్లిక్ ఫోన్ బాక్సులను రహస్యంగా గమనించేందుకు అతినీల లోహిత కాంతిలో మాత్రమే కనిపించే ఓ రంగును ఆ బాక్సుల దగ్గర వేసేవారని తాజా పత్రాలలో ఓ భాగం చెబుతోంది.
సీఐఏ తన కార్యకలాపాలను కానీ, బడ్జెట్ వివరాలు కానీ వెల్లడించడాన్ని సహజంగా వ్యతిరేకిస్తుంటుందని సీఐఏ, అధ్యక్షుడి అధికారాలపై అనుభవజ్ఞుడైన విల్లనోవా యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ బారెట్ చెప్పారు.
''పత్రాలు విడుదల చేయడం ప్రభుత్వానికి మంచిదే'' అని ఆయన చెప్పారు.
విదేశాంగ విధాన రూపకల్పనలో సీఐఏ పాత్రను విమర్శిస్తూ కెనెడీ సహాయకుడు ఆర్థర్ ష్లెసింగర్ రాసిన ఓ నోట్ కూడా వీటిల్లో ఉంది.
ఫ్రాన్స్ వంటి మిత్ర దేశాలలోని యుఎస్ రాయబార కార్యాలయాల్లో ఈ సంస్థ ఉనికి ఉందని కొత్త పత్రాలు చెబుతున్నాయి.
అమెరికా విదేశాంగ విధానంలో సీఐఏ ప్రభావం గురించి ష్లెసింగర్ కెనెడీని హెచ్చరించారు. ఈ పత్రం హత్యకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వనప్పటికీ, సీఐఏకు అధ్యక్షుడికీ మధ్య ఉన్న దృఢమైన సంబంధంపై చరిత్రకారులకు సమాచారాన్ని ఇస్తుంది.

ఫొటో సోర్స్, AFP
పాతవే చెప్పారా?
కెనెడీపై కుట్రల గురించి ఈ పత్రాలు కొత్త వివరాలను వెల్లడిస్తున్నాయని కొన్ని ప్రసిద్ధ ఆన్‌లైన్ ఖాతాలు పేర్కొంటున్నాయి. అయితే వీటిల్లోని కొన్ని అంశాలు పాతవే. ఎప్పటి నుంచో ప్రజల్లో నానుతున్నవే.
వీటిల్లో రెండో ప్రపంచ యుద్ధంలో మిలటరీ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా పనిచేసిన గారీ అండర్‌హిల్ గురించిన వైరల్ పోస్టులు కూడా ఉన్నాయి.
కెనెడీ హత్య వెనుక సీఐఏ ఏజెంట్ల హస్తముందని అండర్ హిల్ చెప్పినట్టు 1967లో వామపక్ష పత్రిక రాంపార్ట్స్‌లో ప్రచురితమైంది. 1964లో అండర్ హిల్ మరణించగా, దానిని ఆత్మహత్యగా నిర్థరించారు. కానీ రాంపార్ట్స్ పత్రిక మాత్రం ఆయన మృతిపై సందేహాలు వ్యక్తం చేసింది.
అండర్‌హిల్‌కు సంబంధించిన ఏడుపేజీల మెమో, ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే వీటిల్లో చాలామటుకు పాతవే. ఈయన గురించిన చర్చ ఆన్‌లైన్‌లో చాలాకాలంగా జరుగుతున్నదే. అండర్ హిల్ గురించి పేర్కొన్న సీఐఏ డాక్యుమెంట్ 2017లోనే విడుదల అయింది.
తాజాగా విడుదలచేసిన మెమోలోని ఓ పేజీలో కొన్ని వాక్యాలు మాత్రమే సవరించకుండా ఉన్నాయి. పైగా ఈ థియరీ (కెనెడీ హత్యలో సీఐఏ ఏజెంట్ల పాత్ర) హిల్ మరణించిన తరువాత ఎవరో చెప్పిన విషయాల ఆధారంగా రూపొందించిందే కానీ, ప్రత్యక్ష సాక్షుల సమాచారం లేదు. ఈ సిద్ధాంతం కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న నిరాధారమైన వాటిల్లో ఒకటి.
యథాతథంగా వెల్లడించారా?
హత్యకు సంబంధించిన అన్ని పత్రాలను 25 ఏళ్లలోపు విడుదల చేయాలని 1992నాటి చట్టం చెబుతోంది. కానీ ఇందుకు జాతీయ భద్రతా మినహాయింపులు కూడా ఉన్నాయి.
అయితే మరింత పారదర్శకత కోసం చేసిన కృషి కాలక్రమేణా మరిన్నిపత్రాల విడుదలకు దారితీసింది. అధ్యక్షుడు ట్రంప్ తన మొదటి టర్మ్‌లోనూ, బైడెన్ 2023 లోనూ పత్రాలను విడుదల చేశారు.
తాజా పత్రాల విడుదలకు ముందు ట్రంప్ మాట్లాడుతూ ''ఏ సవరణలూ చేయవద్దు'' అని సిబ్బందిని కోరినట్టు చెప్పారు. కానీ ఇది పూర్తిగా నిజమనిపించదు. కొత్త పత్రాలలో ఇప్పటికీ కొన్ని సవరణలు ఉన్నాయి. కానీ తాజాగా ఈ పత్రాల విడుదల పారదర్శకతలో ఒక ముందడుగని ఎక్కువమంది నిపుణులు ఒప్పుకుంటున్నారు.
ఇంకా విడుదల చేయాల్సిన డాక్యుమెంట్లు నేషనల్ ఆర్కైవ్స్ లో ఉన్నాయని, సీఐఏ, ఎఫ్‌బీఐ దగ్గరున్న డాక్యుమెంట్లు ఇంకా లెక్కలోకి రాలేదని జేఎఫ్‌కే ఫైల్స్ జర్నలిస్ట్ మోర్లే తెలిపారు.
అలాగే రాబర్ట్ ఎఫ్ కెనెడీ సీనియర్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన పత్రాలు కూడా వెల్లడిస్తామనే హామీలు ఇచ్చినప్పటికీ, జేఎఫ్‌కే హత్యకు సంబంధించిన ప్రశ్నలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
''ఎప్పుడైనా హత్య జరిగితే దానిపై చర్చ నడుస్తుంది, కుట్రసిద్ధాంతాలు వస్తాయి. అలాంటివాటిని ఈ డాక్యుమెంట్లు కానీ, ఇంకా ఏ ఇతర డాక్యుమెంట్లయినా మార్చలేవు'' '' అని విల్లనోవా చరిత్రకారుడు బారెట్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














