‘ఊళ్లో సంబరం చూడటానికి వచ్చిన బాలికపై ఏడుగురి అత్యాచారం’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఓ బాలికపై ఇద్దరు మైనర్ల సహా ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో జరిగింది.
బాలికను గమనించిన ఆటో డ్రైవర్ ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితులకు ఆశ్రయమిచ్చిన వ్యక్తితో సహా ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆత్కూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సీహెచ్ సురేష్ బీబీసీకి కేసు వివరాలు వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం...
‘‘ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకి చెందిన పద్నాలుగేళ్ల బాలిక ఆరో తరగతిలోనే చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. తమ ఇంటికి సమీపంలోనే ఉండే మహిళ ఆమె పుట్టిల్లు కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెంలో జరుగుతున్న ఓ ఉత్సవానికి వెళ్తుండగా తానూ వస్తానని బాలిక ఆమెను పలుమార్లు అడిగింది. అనంతరం తల్లిదండ్రుల అనుమతితో ఈ నెల 13న ఆ మహిళతో కలిసి బాలిక వీరపనేనిగూడెం వెళ్లింది.
అక్కడ ఆ మహిళ అమ్మమ్మతో మాట పట్టింపు రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది బాలిక. అలిగి వెళ్లిన బాలిక పది పదిహేను నిమిషాల్లో తిరిగి వచ్చేస్తుందని ఆ మహిళ భావించారు.
కానీ, పొద్దుపోయిన తర్వాత కూడా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆ మహిళ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు.
కంగారుపడిన తల్లిదండ్రులు, బంధువులు వెతకడం మొదలుపెట్టారు. అనంతరం, ఆత్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు’’ అని ఎస్ఐ సురేష్ చెప్పారు.


ఫొటో సోర్స్, UGC
ఆ బాలికకు ఏమైంది?
‘‘వీరపనేని గూడెంలోని ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక ఆ ఊరి చివర్లో ఒంటరిగా ఉండగా, అక్కడ మద్యం తాగుతున్న పదో తరగతి చదివే ఓ బాలుడు (14), మరో బాలుడు ఆమెను గమనించారు. ఆమెతో మాట కలిపి.. నిన్ను మీ సొంతూరు జి.కొండూరులో తమ ద్విచక్రవాహనంపై దింపేస్తామని నమ్మబలికి బండి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు.
అనంతరం ఆ బాలికను తమ స్నేహితులైన గతంలో గంజాయి కేసు నిందితులు వీరపనేనిగూడేనికే చెందిన జితేంద్రకుమార్, తేలప్రోలుకి చెందిన హర్షవర్ధన్‌కు అప్పగించారు. వారిద్దరు కూడా ఆమెను మాయమాటలతో లోబరుచుకున్నారు.
ఆ తర్వాత పాత కేసుల్లో నిందితుడైన కేసరపల్లికి చెందిన కొండేటి అనిల్‌కు ఆ బాలికను అప్పగించి వారు వెళ్లిపోయారు. కేసరపల్లిలోని అనిల్ ఇంట్లో నవీన్‌కుమార్, సంజయ్, రాజేష్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
అప్పటికీ నాలుగు రోజులు కావడం, బాలిక బాగా నీరసించిపోవడంతో వాళ్లు చివరికి ఆమెను ఈనెల 17వ తేదీ రాత్రి కేసరపల్లి రోడ్డుపై వదిలేసి పరారయ్యారు’’ అని ఎస్ఐ చెప్పారు.
ఆటో డ్రైవర్‌కు అనుమానం వచ్చి..
17వ తేదీ రాత్రి కేసరపల్లి వద్ద ఆటో ఎక్కిన బాలిక ఇంటికి వెళ్లడానికి భయపడి, ఆటో డ్రైవర్‌తో ముందుగా గూడవల్లికి వెళ్లాలని చెప్పింది.
అక్కడికి వచ్చిన తర్వాత మళ్లీ విజయవాడకు వెళ్లాలని చెప్పడంతో అనుమానం వచ్చిన ఆటోడ్రైవర్ ‘అసలు ఎక్కడికి వెళ్లాలమ్మా’ అని అనునయంగా మాట్లాడారు.
నీరసించి ఉన్న ఆ బాలిక మాటల్లో స్పష్టత లేకపోవడంతో ఆటోడ్రైవర్ నేరుగా మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులకు విషయం చెప్పారు.
ఈలోగా పోలీసులు నాలుగు రోజుల కిందట తప్పిపోయిన బాలిక ఫోటోలను తెప్పించి చూడగా, ఆ బాలిక, ఈమె ఒకరేనని గుర్తించారు.
దీంతో ఆత్కూరు పోలీసులు అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఫొటో సోర్స్, UGC
కీలకంగా సీసీటీవీ ఫుటేజ్
13వ తేదీ రాత్రి వీరపనేనిగూడెంలో ఇద్దరు బాలురు బాలికను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిన సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించి చూడగా ఆ బాలిక ఈమేనని పోలీసులు గుర్తించారు.
వెంటనే వాహనం నంబర్‌ను ట్రేస్ చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారిలో ఒక బాలుడు పదో తరగతి పరీక్షలకు హాజరువుతున్నాడు.
ఆ తర్వాత వారిద్దరు ఇచ్చిన సమాచారంతో జితేంద్ర, హర్షవర్ధన్‌ను.. ఆ తర్వాత కేసరపల్లికి చెందిన సంజయ్, నవీన్, రాజేష్‌తో పాటు వీరికి ఆశ్రయమిచ్చిన అనిల్.. మొత్తంగా ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తు మేరకు ఏడుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారని, నిందితులకు అనిల్ ఆశ్రయమిచ్చారని ఎస్‌ఐ సురేష్ బీబీసీకి తెలిపారు. బాలికను ఈ నెల 13 నుంచి 17 వరకు ఎక్కడెక్కడకి తీసుకెళ్లారనేది పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.
కాగా, ఇంకెవరి పాత్ర అయినా ఉందా అన్న కోణంలో కేసును మరింత లోతుగా విచారణ చేస్తున్నామని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ రావు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














