ఆ ఇంట్లో 4 వేల కండోమ్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గంజాయి అలవాటు చేసి బాలికలను సెక్స్ వర్క్‌లోకి దింపుతున్న ముఠా

అనాథ బాలికలకు డబ్బు, బట్టలు ఎరగా వేసి గంజాయి మత్తులో ముంచి తరువాత వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న ఓ మహిళతో పాటు మరో ఐదుగురిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో ఒక బాలిక ఉందని తెలిపారు.

ముఠాలోని బాలిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉపయోగించి బాలికలను ట్రాప్ చేస్తున్నారని.. ఆ తర్వాత బాలికలను గంజాయి మత్తులో ముంచి.. సెక్స్ వర్క్‌లో దించాలనేది ఈ గ్యాంగ్ లక్ష్యం అని పోలీసులు వెల్లడించారు.

వరంగల్ జిల్లా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహించారని పోలీసులు చెప్పారు.

వరంగల్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ఒక బాలిక మిస్సింగ్ కేసు విచారణ చేస్తున్నప్పుడు ఈ ముఠా గుట్టు బయటపడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వరంగల్ పోలీస్, సెక్స్ రాకెట్

ఫొటో సోర్స్, Warangal Police

ఫొటో క్యాప్షన్, వివరాలు వెల్లడిస్తున్న వరంగల్ పోలీసులు

మిస్సింగ్ కేసుతో..

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. .

కమిషనరేట్ పరిధిలోని ఆజంజాహీ మిల్స్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 11న బాలిక మిస్సింగ్ కేసు ఒకటి నమోదైంది. అదే రోజు ములుగు క్రాస్ రోడ్ వద్ద ఆ బాలికను గుర్తించారు.

విచారణలో భాగంగా.. తనను కొంతమంది వ్యక్తులు అపహరించి, గంజాయి తాగించి అత్యాచారం జరిపినట్టుగా బాలిక తెలిపారు.

దీంతో, మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపిన పోలీసులు ల్యాదేళ్లలో దాడులు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.

అరెస్టయిన వారిలో ప్రధాన నిందితురాలైన ల్యాదేళ్లకు చెందిన ముస్కు లత, ఆమెకు సహకరించిన బాలికతో పాటు అబ్దుల్ అఫ్నాన్, షేక్ సైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, వదూద్‌ ఉన్నారు.

ఎస్ఎచ్‌వో జె.వెంకటరత్నం

ఫొటో సోర్స్, Warangal Police

ఫొటో క్యాప్షన్, ల్యాదేళ్ల గ్రామంలో నిందితురాలు లత గత ఏడెనిమిదేళ్లుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని ఎస్ఎచ్‌వో వెంకటరత్నం చెప్పారు.

'వారైతేనే ఎక్కువ డబ్బు వస్తుందని'

ఈ కేసు దర్యాప్తు బృందంలో ఒకరైన ఆజాంజాహీ మిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్‌వో జె.వెంకటరత్నం బీబీసీతో వివరాలు వెల్లడించారు.

''నిందితురాలు లత గత ఏడెనిమిదేళ్లుగా ల్యాదేళ్లలో బయటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చే మహిళలతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే వృత్తిలో కొనసాగి మృతి చెందిన తన స్నేహితురాలి కుమార్తెను కూడా ఈ వ్యవహారంలో ఉపయోగించారు'' అని ఎస్ఎచ్‌వో వెంకటరత్నం తెలిపారు.

డబ్బులు ఆశ చూపి ఆ బాలికను ఇతర బాలికలను ఆకర్షించేందుకు రంగంలోకి దింపారని ఆయన చెప్పారు.

''ఆ బాలిక తన తల్లిదండ్రులు మరణించాక హైదరాబాద్‌లో ఈవెంట్ పార్టీలు, వివాహ వేడుకల్లో రికార్డ్ డాన్స్ ట్రూప్‌లలో పనిచేస్తున్నట్లు బంధువుల ద్వారా తెలుసుకున్నారు ముస్కు లత. బాలిక తల్లితో తనకున్న పూర్వ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తన సంరక్షణలోకి తెచ్చుకున్నారు. తన వ్యాపారంలోకి కొత్త మహిళలు, బాలికలను తీసుకువస్తే వచ్చే డబ్బులో కొంత భాగం ఇస్తానని చెప్పారు. దీనికి ఆ బాలిక అంగీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే బాలికలను ఆకర్షించే ప్రయత్నం చేశారు'' అని కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చెప్పారు.

వరంగల్ సీపీ

ఫొటో సోర్స్, Warangal Police

ఫొటో క్యాప్షన్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

మైనర్లను ఎలా ట్రాప్ చేశారు?

తన పథకంలో భాగంగా మైనర్ నిందితురాలు వరంగల్ ఆజాంజాహీ మిల్స్ పరిధిలోని ఒక బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నారు.

గత రెండు నెలలుగా తనపై నమ్మకం పెరిగేలా తరచూ స్కూల్ సమయంలో వెళ్లి ఆ బాలికను కలవడం, అడపాదడపా షాపింగ్, కొత్త దుస్తులు కొనివ్వడంతో పాటు నిందితుల్లో ఒకరైన తన ప్రియుడు అబ్దుల్ అఫ్నాన్‌తో కలిసి మద్యం, గంజాయి తాగడం అలవాటు చేసింది.

ఈ క్రమంలో వారిపై పూర్తి నమ్మకాన్ని పెంచుకున్న బాలికను మార్చి 11న మైనర్ నిందితురాలు తన గ్యాంగ్‌తో కారులో నర్సంపేటకు తీసుకెళ్లింది. గ్యాంగ్ సభ్యుల్లో ఒకరైన షేక్ సైలానీ బాబా తన పాత ఇంటిలో బాలికతో గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. గంజాయి తాగడం, అత్యాచారం జరపడం వీడియోలు రికార్డ్ చేశామని ఇక నుంచి తాము చెప్పినట్టుగా వినాలని, లేదంటే వీడియోలన్నీ బయటపెడతాని బ్లాక్‌మెయిల్ చేసి, అదే రోజు బాలికను ములుగు క్రాస్ రోడ్ వద్ద వదిలేశారని పోలీసులు వెల్లడించారు.

నిందితుల నుంచి సుమారు రెండు కిలోల గంజాయి, కారు, 75 వేల నగదు, 4 సెల్ ఫోన్లు, పెద్ద సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

'మత్తు ఇచ్చి, మాట వినేలా'

బాలికలను వ్యభిచారంలోకి దించడంలో భాగంగా ప్రధాన నిందితురాలు ముస్కు లత గ్యాంగ్ నేర విధానాన్ని(మోడస్ ఆపరండి) ఆజాంజాహీ మిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్‌వో వెంకటరత్నం బీబీసీకి వివరించారు.

'ముందుగా సోషల్ మీడియా వేదికగా తమ ప్రాంతానికి చెందిన బాలికలతో స్నేహం చేయడం, ఆ తర్వాత వారి కుటుంబ స్థితిగతులు అంచనా వేయడం, వ్యక్తిగత వివరాలు కనుక్కోవడం, సమస్యల్లో ఉన్న వారిపై సానుభూతి చూపడం, చిన్నచిన్న సహాయాల ద్వారా ఎమోషనల్‌గా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. తరచూ మంచి తిండి వండి పెట్టడం చేశారు. గంజాయిని మొదట పాలల్లో కలిపి తాగించడం అలవాటు చేసి, ఆ తర్వాత గంజాయి సిగరెట్లు అలవాటు చేశారు. గ్యాంగ్‌లోని వ్యక్తితోనే బాలికపై లైంగిక దాడి చేయించి, ఆ తర్వాత భయపెట్టి తమ గ్యాంగ్‌లో కలుపుకోవాలన్నది వారి ప్లాన్'' అని తెలిపారు.

ల్యాదేళ్లలోని ముస్కు లత ఇంటి నుంచి సుమారు 4 వేల కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీసులు తెలిపారు.

బాలికలపై అత్యాచారాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'తల్లిదండ్రులు చూసుకోవాలి'

''సోషల్ మీడియా ఎక్కువగా వాడుతూ పరిచయం లేని వ్యక్తులతో ఆన్‌లైన్ స్నేహాలు లైక్‌లు, షేర్‌లతో మొదలై వ్యక్తిగత వివరాలు పంచుకుంటున్నారు. ఆ తర్వాత ఇవి ఇలాంటి సంఘటనలకు దారితీస్తున్నాయి''అని ఎస్ఎచ్‌వో వెంకటరత్నం అన్నారు.

"తమ పిల్లల పట్ల ఉన్న ఇష్టాన్ని తల్లిదండ్రులు బహిర్గతం చేయరు, చెబితేనే ప్రేమ ఉన్నట్టా అని ప్రశ్నిస్తారు. పిల్లల పట్ల ఉండే 'బాధ్యతలే' ప్రేమానుబంధాలు అనుకుంటున్నారు. కానీ బాధ్యతలు, బంధాలు వేర్వేరు'' అని నిజామాబాద్‌కు చెందిన పేరెంట్ సైకాలజీ నిపుణులు డాక్టర్ అచ్చంపేట వికాస్ బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)