అత్యాచారానికి గురైన 8 ఏళ్ల బాలిక మరణంతో బంగ్లాదేశ్‌లో పెల్లుబికిన నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గెవిన్ బట్లర్
- హోదా, బీబీసీ న్యూస్
హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు కలిచివేయొచ్చు.
బంగ్లాదేశ్‌లో అత్యాచారానికి గురైన ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
మగురా నగరంలోని తన అక్క ఇంటికి వెళ్లినప్పుడు, మార్చి 5వ తేదీ రాత్రి - మరుసటి రోజు తెల్లవారుజాము మధ్య సమయంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాలిక అక్క భర్త (18 ఏళ్లు)తోొ పాటు ఆయన తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలిక చనిపోయినట్లు తెలియడంతో ఆగ్రహానికి గురైన కొందరు అత్యాచార ఘటన జరిగిందని భావిస్తున్న ఇంటిపై గురువారం రాత్రి దాడి చేసి, నిప్పంటించారు.
ప్రభుత్వ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విభాగం విడుదల చేసిన ప్రకటన మేరకు, మూడుసార్లు గుండెపోటు రావడంతో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు బాలిక మరణించింది.
"వైద్యులు రెండుసార్లు పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చినప్పటికీ, మూడోసారి మాత్రం చికిత్సకు గుండె స్పందించలేదు" అని ప్రకటనలో పేర్కొంది.
మార్చి 8న రాజధాని ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రిలో బాలికను చేర్చారు. ఆరు రోజులపాటు ఆమె మృత్యవుతో పోరాడి ప్రాణాలు విడిచింది.
"నా కూతురు బతుకుతుందని అనుకున్నా, అదే జరిగి ఉంటే మరోసారి తనను ఎక్కడికీ ఒంటరిగా వెళ్లనిచ్చేదాన్నికాదు" అని బాలిక తల్లి ఆవేదన చెందారని స్థానిక మీడియా తెలిపింది.
బాలిక మృతదేహాన్ని ఆర్మీ హెలికాప్టర్‌లో మగురాకు తీసుకొచ్చారు, సాయంత్రం 6:00 గంటలకు హెలికాప్టర్ స్థానిక స్టేడియంలో ల్యాండ్ అయింది. అప్పటికే నిరసనలు తీవ్రమయ్యాయి.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చాలా కష్టపడ్డారని మగురా సదర్ పోలీస్ స్టేషన్ అధికారి అయూబ్ అలీ చెప్పారని స్థానిక వార్తా సంస్థ ది డైలీ స్టార్ పేర్కొంది.
బాలిక అంత్యక్రియలు 7.30 నిమిషాలకు జరిగాయి. అంత్యక్రియలకు ముందు నిర్వహించిన చివరి ప్రార్థన 'నమాజ్-ఇ-జనాజా' సందర్భంగా మగురా పబ్లిక్ స్క్వేర్ వద్ద వేలాది మంది గుమిగూడారు.

దేశ రాజధానిలోని ఢాకా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన, విద్యార్థినుల ప్రసంగాల మధ్య ఖాళీ శవపేటికతో బాలికకు అంత్యక్రియల తంతు నిర్వహించారు.
అత్యాచార బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
అత్యాచారం అంటే ఏమిటి? అనే దానికి చట్టపరంగా మరింత స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇది అస్పష్టంగా ఉందనేది వారి వాదన.
ఏడు రోజుల్లో అత్యాచారం, హత్య కేసు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు.
"DNA నమూనా సేకరణ పూర్తయింది. ఐదు రోజుల్లో నివేదిక రావొచ్చని ఆశిస్తున్నాం" అని గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నజ్రుల్ అన్నారు. ఇప్పటికే 12 నుంచి 13 మంది వాగ్మూలాలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
"మేం ఏడు రోజుల్లో విచారణ ప్రారంభించగలిగితే, న్యాయమూర్తులు వేగంగా న్యాయం జరిగేలా చూడగలుగుతారు" అని ఆయన అన్నారు.
2020లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం, బంగ్లాదేశ్‌లో మైనర్లపై అత్యాచారం రుజువైతే మరణశిక్ష విధించవచ్చు.
ఈ చట్టం వచ్చిన తర్వాత, 37 ఏళ్ల మహిళపై క్రూరమైన సామూహిక దాడికి పాల్పడి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనతో సహా అనేక హై ప్రొఫైల్ లైంగిక హింస కేసులు నమోదయ్యాయి.
మగురాలో బాలికపై అత్యాచారం జరిగిన వారంలోపే, బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ఒకే వయస్సు కలిగిన ముగ్గురు చిన్నారులు అత్యాచారానికి గురైనట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
కొన్ని కేసుల్లో నిందితులు బాధితురాలి ఇంటి పొరుగువారే కాగా, మరికొన్ని కేసుల్లో దగ్గరి బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారు.
లా అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ గణాంకాల ప్రకారం, గడచిన 8 ఏళ్లలో బంగ్లాదేశ్‌లో చిన్నారులపై అత్యాచార కేసులు 3,438 నమోదయ్యాయి. వారిలో కనీసం 539 మంది ఆరు సంవత్సరాలలోపు వారు, 933 మంది 7 నుంచి 12 ఏళ్ల వయస్సు వారు.
చాలా సందర్భాలలో, చిన్నారులు తమకు తెలిసిన వ్యక్తుల చేతిలోనే లైంగిక వేధింపులకు లేదా అత్యాచారానికి గురవుతున్నారని పరిశోధనలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














