కశ్మీర్‌లో ఈ ముగ్గురి మరణాల మిస్టరీ ఏంటి?

ఎడమ నుంచి వరుసగా వరుణ్ ఠాకూర్ (15), జోగేశ్ సింగ్ (32), దర్శన్ సింగ్ (40)

ఫొటో సోర్స్, Family Handouts

ఫొటో క్యాప్షన్, ఎడమ నుంచి వరుసగా వరుణ్ ఠాకూర్ (15), జోగేశ్ సింగ్ (32), దర్శన్ సింగ్ (40)
    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా బిలావర్‌లో ముగ్గురి మరణంతో అక్కడి వాతావరణం ఆందోళనకరంగా మారింది.

ఈ హత్యలపై సోమవారం జమ్మూకశ్మీర్ అసెంబ్లీలోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది.

మరణించిన ఈ ముగ్గురు పౌరులను వరుణ్ ఠాకూర్ (15), జోగేశ్ సింగ్ (32), దర్శన్ సింగ్ (40)లుగా గుర్తించారు. మార్చి 8న కథువాలోని మారుమూల ప్రాంతం మల్హర్‌లోని ఒక నది సమీపంలో ఈ ముగ్గురి మృతదేహాలను భద్రతా దళాలు కనుగొన్నాయి.

మార్చి 5న తమ గ్రామంలోని ఒక పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న సమయంలో ఈ ముగ్గురు కనిపించకుండా పోయారు.

ఈ ముగ్గురు వరుసకు బంధువులు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మృతుల బంధువులు ఏమంటున్నారు?

తీవ్రవాదుల దాడిలో ఈ ముగ్గురు చనిపోయారని మృతుల బంధువు ఒకరు బీబీసీతో అన్నారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరణించిన ఈ ముగ్గురికి బంధువు అయిన అక్షయ్ కుమార్‌ ఫోన్‌లో బీబీసీతో మాట్లాడారు.

ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో అక్షయ్ వివరించారు.

''మా ఇంట్లో ఒక పెళ్లి జరిగింది. మధ్యాహ్నం 4 గంటలకు పెళ్లి ఊరేగింపు బయల్దేరింది. పెళ్లి వేదికను చేరుకోవడానికి మేం కాలినడకన నాలుగు గంటలు ప్రయాణించాలి. ఊరేగింపులో ఈ ముగ్గురు వెనుకబడ్డారు. వారంతట వారే వేదిక వద్దకు వస్తారని మేం అనుకున్నాం. తర్వాత, వారు మళ్లీ కనిపించలేదు.

వాళ్లు తప్పిపోయారని మాకు తెలియదు. మాకు ముందే ఈ విషయం తెలిసి ఉంటే, వారిని వెతుక్కుంటూ వెళ్లేవాళ్లం. లేదా రిపోర్ట్ చేసేవాళ్లం. మేం నడుస్తూ వచ్చిన దారి అడవిలో ఉంటుంది.

మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వారి కోసం ఎదురుచూశాం. తర్వాత, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. తర్వాతి రోజు కూడా అడవిలో వాళ్లని వెతుక్కుంటూ వెళ్లాం. మాతో పోలీసులు కూడా వచ్చారు.

వాళ్లని వెతకడానికి పోలీసులు పెద్దగా ప్రయత్నించలేదు. నాలుగు రోజుల తర్వాత వారి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. మృతదేహాలు దొరికిన స్థలం నుంచి 2000 అడుగుల ఎత్తులో వారి వస్తువులు లభ్యమయ్యాయి'' అని ఆయన వివరించారు.

ఈ మరణాల తర్వాత, బిలావర్‌లో రెండు రోజులు మార్కెట్లు తెరవలేదు. ప్రజలు నిరసనలు చేశారు.

కథువాలో బీజేపీ నిరసనలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కథువాలో జరిగిన హత్యలకు సంబంధించిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ సోమవారం నిరసన ప్రదర్శనలు చేపట్టింది

గత నెలలో ఏం జరిగింది?

కథువాలోని బిలావర్ ప్రాంతంలో గత నెల రోజులలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.

ఫిబ్రవరి 16న బతేరి గ్రామానికి సమీపంలోని ఒక నది వద్ద రోషల్ లాల్, శంషీర్‌ అనే ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఈ మరణాల నేపథ్యంలో అప్పుడు కూడా బిలావర్ గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చి నిరసనలు చేశారు.

తాజాగా ముగ్గురు పౌరుల మృతదేహాలు లభ్యమైన మూడు రోజుల తర్వాత, కథువా జిల్లా హర్దూ గ్రామంలోని గుజ్జర్ సముదాయానికి చెందిన ఇద్దరు బాలురు దీన్ మొహమ్మద్ (15), రహ్మత్ అలీ (12) కనిపించకుండా పోయారు.

వీరిద్దరూ బంధువులు. కథువాలోని రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరూ కనిపించకుండా పోయినట్లు కేసు నమోదైంది. ఈ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిల్లలిద్దరూ పశువుల్ని మేపడానికి వెళ్లి మళ్లీ తిరిగిరాలేదని కుటుంబీకులు చెబుతున్నారు.

డీఐజీ శివకుమార్ మంగళవారం తప్పిపోయిన పిల్లల కుటుంబాలను కలిశారు.

పోలీసులపై బాధిత కుటుంబీకుల ఆరోపణలు

ఫొటో సోర్స్, Ishant Sudan

ఫొటో క్యాప్షన్, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బాధితుల కుటుంబీకులు ఆరోపించారు.

స్థానికులు ఏమంటున్నారు?

బిలావర్‌తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు దట్టమైన అడవులతో కప్పి ఉంటాయి. దారులు కూడా దుర్భేద్యంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో జరిగిన ఘటనలన్నీ బిలావర్‌కు ఎగువ ప్రాంతంలో సంభవించాయి.

ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, పశువుల పోషణతో ఉపాధి పొందుతారు. జనాభాలో హిందువులు, ముస్లింలు ఉన్నారు.

ఇలాంటి ఘటనల కారణంగా చుట్టుపక్కల ఏరియాల్లో భయానక వాతావరణం నెలకొందని స్థానిక జర్నలిస్ట్ ఇషాంత్ సుదాన్ చెప్పారు. రాత్రిపూట ప్రజలు మరింత ఎక్కువగా భయపడుతున్నారని ఆయన తెలిపారు.

''కథువా ఎగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత ఎక్కువగా భయపడుతున్నారు. రాత్రిపూట అడవిలో ఒక్కరే ఎక్కడికి వెళ్లలేరు. సాయంత్రం దాటాక ప్రజలు అటవీ ప్రాంతంవైపు వెళ్లడం మానేశారు. పశువులను మేపడానికి ప్రజలు అడవిలోకి వెళ్తుంటారు. ఇలాంటి ఘటనలు జరగడం మొదలైనప్పటి నుంచి అటువైపు అసలు వెళ్లడం లేదు. చాలా కాలంగా ఇదే ధోరణి కొనసాగుతోంది. కథువా నగరంలో అంతా బాగానే ఉంది. కానీ, చుట్టుపక్కల ఏరియాల్లోనే పరిస్థితి బాగాలేదు'' అని ఆయన వివరించారు.

జమ్మూలో ఉద్రిక్త వాతావరణం

ఫొటో సోర్స్, Ishant Sudan

ఫొటో క్యాప్షన్, వరుస ఘటనలతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది

పోలీసులు ఏం చెబుతున్నారు?

ముగ్గురు వ్యక్తుల హత్యలకు సంబంధించిన కేసులో దర్యాప్తు సాగుతోందని బీబీసీతో ఫోన్‌లో జమ్ము జోన్ డీఐజీ శివ కుమార్ చెప్పారు.

దర్యాప్తులో వెల్లడైన వివరాలను అతి త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

''ప్రతీ కోణంలో మేం దర్యాప్తు చేస్తున్నాం. మా దర్యాప్తు పూర్తయ్యేవరకు ఏమీ చెప్పలేం'' అని ఆయన అన్నారు.

గత నెల రోజుల కాలంలో కథువాలో జరిగిన అనేక ఘటనలకు కారణమేంటని ప్రశ్నించగా, ''అన్ని ఘటనలకు సంబంధించిన దర్యాప్తు ఇంకా జరుగుతోంది'' అని ఆయన చెప్పారు.

గత నెలలో సంభవించిన ఈ అయిదు మరణాల వెనుక తీవ్రవాదులు ఉన్నారా? అని ప్రశ్నించగా, 'ఈ వివరాలన్నీ దర్యాప్తు పరిధిలోకి వస్తాయి. ఇంకా దర్యాప్తు జరుగుతోంది' అని ఆయన బదులిచ్చారు.

బిలావర్‌లో పరిస్థితి సాధారణంగానే ఉందని, మార్కెట్లు తెరుచుకున్నాయని ఆయన స్పష్టం చేశారు.

లెఫ్టినెంట్ గవర్నర్ ఏమంటున్నారు?

ఈ మరణాలపై మార్చి 10న జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. దోషులకు తప్పనిసరిగా శిక్ష పడుతుందని, ఈ కేసుల దర్యాప్తునకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.

''కథువాలో వరుణ్ సింగ్, యోగేశ్ సింగ్, దర్శన్‌ సింగ్‌ల మరణాలతో కలత చెందాను. ఈ దు:ఖ సమయంలో మృతుల కుటుంబీకులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కేసు విషయంలో సమగ్ర, పారదర్శక దర్యాప్తు ఆదేశించాను. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందజేస్తాం. దోషులను వీలైనంత త్వరగా శిక్షిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నా'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇల్తిజా ముఫ్తీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పీడీపీ నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ

రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?

ముగ్గురు పౌరుల హత్యల పట్ల అడ్మినిస్ట్రేషన్‌ను పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ విమర్శించారు.

కథువా, బిలావర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవలి కాలంలో అక్కడ జరిగిన ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

సోమవారం బిలావర్‌కు వెళ్లాలని అనుకున్నానని, కానీ తనను వెళ్లడానికి అనుమతించలేదని మీడియాతో ఆమె చెప్పారు. అదేసమయంలో బీజేపీ నాయకులను బిలావర్‌కు వెళ్లేందుకు అనుమతించారని ఆరోపించారు. పోలీసులు నిష్పాక్షికంగా పనిచేయట్లేదని ఆరోపించారు.

బిలావర్ ఏరియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సతీశ్ శర్మ ఫోన్‌లో బీబీసీతో మాట్లాడారు.

''ఈరోజు పరిస్థితులు దిగజారడానికి బీజేపీ కారణమంటూ నిందిస్తున్న వారి వల్లే జమ్మూకశ్మీర్‌లో రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. గత 70 ఏళ్లలో పాలకులు సరైన రోడ్లు నిర్మించి ఉంటే, పెళ్లి వేడుక కోసం వారి కాలినడకన వెళ్లేవారు కాదు. ఈ ఘటన జరిగి ఉండకపోయేది'' అని ఆయన అన్నారు.

నిజం బయటకు రావాలంటే ఈ ఘటనలో దర్యాప్తు సరిగ్గా జరగాలని సతీశ్ శర్మ అన్నారు.

రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని కథువాలోని బనీ ఏరియా స్వతంత్ర ఎమ్మెల్యే డాక్టర్ రామేశ్వర్ అన్నారు.

అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికార ప్రతినిధి ఇమ్రాన్ నబీ దర్, బీబీసీతో మాట్లాడుతూ, ''ఇది కథువా సమస్య మాత్రమే కాదు. కొంతకాలంగా జమ్మూకశ్మర్ అంతటా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. గతంలో జమ్మూలోని చాలా ప్రాంతాల్లో 'టార్గెటెడ్ కిల్లింగ్స్' జరిగాయి. ఇది అందరికీ ఆందోళన కలిగించే విషయం. ఇవన్నీ తీవ్రవాదం నీడ లేని ప్రాంతాలు'' అని అన్నారు.

జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా 2019లో రద్దు అయింది. తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉంటుంది.

జమ్ము ప్రాంతంలో తీవ్రవాద ఘటనలు పెరిగాయా?

గత నాలుగేళ్లలో జమ్ము ప్రాంతంలోని చాలా ఏరియాల్లో తీవ్రవాదం పడగ విప్పింది. పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఎక్కువ తీవ్రవాద ఘటనలు జరిగాయి.

2021 వరకు జమ్మూలో తీవ్రవాద కార్యకలాపాలు అరుదుగా కనిపించేవి.

2021 నుంచి 2024 మధ్య ఇక్కడ తీవ్రవాద సంబంధిత ఘటనలు33 జరిగాయి.

2024 తొలి ఏడు నెలల కాలంలో జమ్మూ రీజియన్‌లో ఎనిమిది తీవ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది చనిపోగా, 18 మంది సైనికులు గాయపడ్డారు.

అదే సమయంలో జమ్ములో 12 మంది పౌరులు మరణించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)