సునీత విలియమ్స్‌ను భూమి మీదకు తెచ్చే ప్రయత్నం ఎందుకు వాయిదా పడింది? మళ్లీ ఎప్పుడు రాకెట్ ప్రయోగిస్తారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్టల్ హేస్
- హోదా, బీబీసీ న్యూస్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఎదుర్కొంటున్న కష్టాలు అంత త్వరగా తీరేలా కనిపించడం లేదు.
వారిని భూమి మీదకు తీసుకువచ్చే ప్రయోగం మార్చ్ 12న జరగాల్సినప్పటికీ అది వాయిదా పడింది.
లాంచ్ ప్యాడ్‌లోని హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ స్పేస్ స్టేషన్ నుంచి చేపట్టాల్సిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది.
ఈ రాకెట్‌లో నలుగురు కొత్త వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించి అక్కడి నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను భూమిపైకి తేవాలని అనుకున్నారు. కానీ, ఈ ప్రయోగం ఇప్పుడు కాస్త ఆలస్యమైంది.
సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్ 8 రోజుల మిషన్ కోసం 2024 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ విమానంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
అయితే అనూహ్యంగా వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
బుధవారం నాటి రాకెట్ ప్రయోగం అనుకున్నప్రకారం జరిగి ఉంటే సునీత విలియమ్స్, విల్‌మోర్‌లు ఆదివారం భూమికి చేరుకునేవారు.
క్లాంప్ ఆర్మ్స్‌లో హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య కారణంగా రాకెట్ ప్రయోగం జరగలేదని.. అన్నీ అనుకూలిస్తే శుక్రవారం గ్రీన్‌విచ్ కాలమానం ప్రకారం రాత్రి 11.03 గంటలకు ప్రయోగించే అవకాశం ఉందని స్పేస్ ఎక్స్ తెలిపింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బాధ్యతలను మార్చ్ 8న సునీతా విలియమ్స్ రష్యన్ కాస్మోనాట్ అలెక్కీ ఒచినిన్‌కు అప్పగించారు.
మార్చ్ 12న భూమి నుంచి ప్రయోగించాల్సిన ఫాల్కన్-9లో తిరిగి వెళ్లాల్సి ఉంటుందన్న కారణంతో ఆమె తన బాధ్యతలను అప్పగించారు.
స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ నైన్ మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్‌కు వెళ్లినవారితో పాటు సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్ కూడా భూమికి తిరిగి రావాల్సి ఉంది.


ఫొటో సోర్స్, X / @Space_Station
స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్‌లో ఏం నిర్ణయించారు?
స్పేస్ ఎక్స్ క్రూ 10 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పదో గ్రూపును పంపాలని నిర్ణయించారు.
దీని కోసం డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను మార్చ్ 12న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేశారు.
షెడ్యూల్ ప్రకారం మార్చ్ 13న డ్రాగన్ స్పేస్ క్రాప్ట్ ఐఎస్ఎస్‌తో అనుసంధానం కావల్సి ఉంది. ఇది అనుసంధానమైతే టెన్త్ గ్రూప్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్‌లోకి వెళ్లి, తొమ్మిదో గ్రూప్ తిరిగి భూమికి వస్తుంది.
వీరితో పాటు 9నెలలుగా అక్కడ చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్ కూడా భూమికి రావాలి.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకు వెళ్లడానికి, తీసుకు రావడానికి నాసా ప్రస్తుతం స్పేస్ ఎక్స్‌కు చెందిన రాకెట్లను ఉపయోగిస్తోంది.
స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకు వెళ్లేందుకు నాసా చేపట్టిన పదకొండో మిషన్ ఇది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములను తీసుకుని ఐఎస్ఎస్‌తో విడివడిన తర్వాత మార్చ్ 16,19 మధ్యన ఈ రాకెట్ భూ కక్ష్యలోకి వచ్చేలా ఈ మిషన్‌ను షెడ్యూల్ చేశారు.
రాకెట్ తిరుగు ప్రయాణానికి నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్ పైలట్‌గా వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమి మీదకు రానున్నారు.
సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు స్పేస్ ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కితే ఆమె పేరున మరో రికార్డు నమోదవుతుంది. నాలుగు రకా అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత గుర్తింపు పొందుతారు.

ఫొటో సోర్స్, SPACEX
అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటంపై రాజకీయాలు
సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోవడం రాజకీయ మలుపు తీసుకుంది. వ్యోమగాములను తీసుకు వచ్చే విషయంలో బైడెన్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ట్రంప్, ఎలాన్ మస్క్ ఆరోపించారు.
ట్రంప్ వారితో మాట్లాడుతున్నప్పుడు సునీత విలియమ్స్ గురించి "ది విమెన్ విత్ వైల్డ్ హెయిర్" అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
వాళ్లను వీలైనంత త్వరగా భూమి మీదకు తీసుకురావాలని తాను మస్క్‌ను ఆదేశించినట్లు ట్రంప్ చెప్పారు.
2030 నాటికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను పక్కన పెట్టాలని ఎలాన్ మస్క్ సూచించారు. అయితే మస్క్ వ్యాఖ్యలపై సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అత్యుత్తమంగా పని చేస్తోందని ఆమె చెప్పారు.
9నెలలు అంతరిక్షంలో ఉండటం వల్ల అస్ట్రోనాట్స్ శరీరంలో వచ్చే మార్పులపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
అయితే అస్ట్రోనాట్స్ ఇద్దరూ ఇది తమకు లభించిన అరుదైన అవకాశం అని అంటున్నారు.
వీళ్లిద్దరూ అంతరిక్షంలో ఉన్న 9నెలల కాలంలో క్రూ నైన్‌తో కలిసి స్పేస్ వాక్, అంతరిక్షంలో మొక్కల పెంపకం సహా అనేక ప్రయోగాల్లో పాల్గొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














