పులికాట్ సరస్సు దగ్గరలో పుర్రెలు, అస్థిపంజరాల బొమ్మలతో భయం పుట్టించే డచ్ సమాధులు, వీటి చరిత్రేంటి?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చూడగానే భయం పుట్టించేలా ఉండే అస్థిపంజరాలు, పుర్రెలతో కనిపించే ఈ శ్మశానవాటికకు ఆధునిక భారత చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. భారత్‌లో యూరోపియన్ వలస పాలనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోందీ శ్మశానవాటిక.
ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సు దిగువన పళవేర్కాడులో ఉందీ డచ్ సెమెట్రీ(శ్మశానం).
ఇది కేవలం శ్మశాన వాటికే కాదు, దీన్ని ఆనుకుని ఒకప్పుడు డచ్ వారి కోట ఉండేది. దాన్ని ఫోర్ట్ గెల్డ్రియా అని పిలిచేవారు.
ఆ కోటను ఈ శ్మశానం కన్నా ముందే నిర్మించారు. ఈ డచ్ సెమెట్రీని ఎప్పుడు ఏర్పాటు చేశారనే దానిపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.

డాక్టర్ జయపాల్ అజరియా రాసిన వివరాల ప్రకారం, డచ్ వారు 1610లో పులికాట్‌లో స్థావరం ఏర్పరచుకుని, 1613లో ఫోర్ట్ గెల్డ్రియాను నిర్మించారు. తరువాత 1656లో ఈ సెమెట్రీ ఏర్పాటైంది.

పోర్చుగీసు కోట పునాదులపైనే...
డచ్ వారు భారత్‌లోని తమ స్థావరాలన్నింటినీ వర్తక కేంద్రాలుగానే ఉంచారు. కానీ, పులికాట్ స్థావరాన్ని మాత్రమే కోటగా నిర్మించారు.
అప్పటికి ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న విజయనగర పాలకుల అనుమతితో, అప్పటికే అక్కడ ఉన్న పోర్చుగీసు కోట పునాదులపైనే దీన్ని నిర్మించారని మెజార్టీ చరిత్రకారుల అభిప్రాయం.

తరువాత మొఘల్ సామ్రాజ్య విస్తరణ, బ్రిటిష్ వారితో పోటీ వల్ల ఇక్కడ వ్యాపారం తగ్గడంతో డచ్ వారు క్రమంగా శ్రీలంక వైపు వెళ్లిపోయారు.
1606 నుంచి 1825 వరకూ అంటే దాదాపు 214 ఏళ్లు డచ్ ఆధిపత్యం ఇక్కడ కొనసాగిందని చరిత్రకారుల కథనం.
తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లింది. స్వాతంత్య్రం తరువాత నుంచి భారత పురావస్తు శాఖ ఈ డచ్ సెమెట్రీని నిర్వహిస్తోంది.

పుర్రె బొమ్మలతో పాటు డచ్ శైలిలో అలంకరణలు
ఈ శ్మశాన ద్వారంపై పుర్రె బొమ్మతో పాటు డచ్ శైలిలో అనేక అలంకరణలు ఉంటాయి. తోరణంపై కొత్త నిబంధనలోని బుక్ ఆఫ్ రివిలేషన్ నుంచి కొన్ని వాక్యాలు పొందుపరిచారు.
లోపల ఉన్న సమాధులపై కూడా వాటిలో పూడ్చిపెట్టిన వారి వివరాలు డచ్ భాషలో ఉన్నాయి. ఇందులో డచ్ అధికారులు, వ్యాపారులు, సైనికులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులవి… మొత్తం 76 సమాధులు ఉన్నాయి.

ఒక అస్థిపంజరం తలకింద చెయ్యి పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ సమాధులను భారత పురావస్తు శాఖ మరమ్మతులు చేసి పునరుద్ధరించింది.
ఈ ఊరిలో మరో 22 సమాధులతో మరో శ్మశానం, పురాతన పోర్చుగీసు చర్చి వంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి.

దక్షిణ భారతదేశంలో ప్రత్యేక స్థానం..
దక్షిణ భారతదే ఆర్థిక, రాజకీయ చరిత్రలో పులికాట్‌ది ప్రత్యేక స్థానం.
ప్రాచీన తమిళ రాజుల నుంచి, విజయనగర సామ్రాజ్యం వరకు ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ ఓడరేవు కేంద్రంగా వ్యాపారం చేశారు.
దాదాపు ఐదు వందల ఏళ్ల కిందటే పోర్చుగీసు వారు ఇక్కడకు వచ్చారు. వారు వచ్చిన వందేళ్లకు డచ్ వారు ఇక్కడకు వచ్చారు.
ఈ చరిత్రను పరిరక్షించడానికి ఇక్కడ వివిధ స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














