విశాఖ బీచ్‌ లైట్ హౌస్‌ చుట్టూ కంచె ఎందుకు వేశారు, దీనిని కూల్చేస్తున్నారా?

ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్
ఫొటో క్యాప్షన్, ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖ బీచ్‌లో ఎంత దూరం నుంచైనా ఒక లైట్ హౌస్ కనిపిస్తుంటుంది. విశాఖలో సినిమా షూటింగ్‌లు ఎక్కువగా ఈ లైట్ హౌస్ వద్దే జరగడంతో దీనిని సినిమా లైట్ హౌస్ అని కూడా పిలుస్తుంటారు.

అసలు దీని పేరు ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్. ఇప్పుడీ లైట్ హౌస్‌ని కూల్చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. దీనికి మరమ్మతులు చేయించి... చరిత్రకు ఆనవాలైన ఈ లైట్ హౌస్‌ని కాపాడాలంటూ ప్రజలు, చరిత్రకారులు కోరుతున్నారు.

ఇంతకీ అకస్మాత్తుగా ఈ లైట్ హౌస్ కూల్చేస్తున్నారనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఇందులో నిజమెంత?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్

లైట్ హౌస్ చరిత్ర ఏంటి

విశాఖ బీచ్ రోడ్డులోని సబ్ మెరైన్ మ్యూజియం సమీపంలో ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్ ఉంది. దీనిని 1950వ దశకంలో విశాఖ పోర్టుకు నౌకల రాకపోకల కోసం నిర్మించారు. అప్పట్లో దీని నిర్వహణా బాధ్యతలు పోర్టే చూసేది. విశాఖలో మొత్తం 5 లైట్ హౌస్‌లు ఉంటే నగరంలో ఉన్న లైట్ హౌస్ ఇదే.

'' ఇది చాలా కాలం నుంచి పనిచేయడం లేదు. గతంలో పలుమార్లు మరమ్మతులు కూడా చేశారు. ప్రస్తుతం ఈ లైట్ హౌస్ శిథిలావస్థకు చేరుకుంది. దీంతో, దీన్ని కూల్చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఎంతో చరిత్ర ఉన్న ఇటువంటి కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.'' అని చరిత్రకారులు ఎడ్వార్డ్ పాల్ బీబీసీతో అన్నారు.

'' సాధారణంగా లైట్ హౌస్‌లో తెల్లని లైట్ వెలుగుతుంది. కానీ, దీంట్లో తెల్లని లైట్‌తో పాటు ఎర్రని లైట్ వెలిగేది. దీనివల్ల తీర ప్రాంతంలో ఎక్కువ రాళ్లు ఉన్నాయనే విషయాన్ని నౌకలకు చెప్పేందుకు ఇదొక సిగ్నల్‌గా వాడేవారని అప్పట్లో మాకు చెప్పేవారు." అని ఎడ్వార్డ్ పాల్ తెలిపారు.

'' విశాఖలో ఉన్న అన్నీ లైట్ హౌస్‌ల కంటే దీని వయసు తక్కువే. ఇది ఒక రకంగా యంగ్ లైట్ హౌస్ అని చెప్పవచ్చు." అని ఏయూ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

లైట్ హౌస్

కూల్చేస్తారనే ప్రచారం ఎందుకు?

ఈ లైట్ హౌస్ నిర్వహణ అంతా తొలి రోజుల్లో విశాఖ పోర్టు ట్రస్టే చూసుకునేది. కాలక్రమంలో నిర్వహణా బాధ్యతల నుంచి తప్పుకుంది. కానీ ఈ లైట్ హౌస్ చుట్టూ ఉన్న స్థలం అంతా విశాఖ పోర్టు ట్రస్టుదే.

ఖాళీగా ఉన్న ఈ స్థలం నుంచి ఆదాయం కోసం ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ఆ ప్రైవేటు వ్యక్తులే దీన్ని కూల్చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

గతంలో ఈ లైట్ హౌస్ వద్దకు ఎవరైనా వెళ్లేందుకు దారి ఉండేది. సముద్ర తీరం వైపు నుంచి, బీచ్ రోడ్డు వైపు నుంచి...ఇలా రెండు వైపులా దారి ఉండేది.

ఇక్కడకు కుటుంబాలతో వచ్చే సందర్శకులు.. దీని బ్యాక్‌గ్రౌండ్‌లో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ, ఇది ఫలానా సినిమాలో చూశాం, యూట్యూబ్‌లో చూశామంటూ మాట్లాడుకునే వారు.

ఇప్పుడు ఈ లైట్ హౌస్ చుట్టూ కంచె వేశారు. రెండు వైపులా దారులు మూసేశారు. దీంతో దీనిని దూరం నుంచి చూడటమే తప్ప, దగ్గరకు వెళ్లే అవకాశం లేకుండా పోవడంతో, ఇక్కడేదో జరుగుతుందని, దీనిని కూల్చేస్తారనే ప్రచారం మొదలైంది.

"ఎన్నో సార్లు ఈ లైట్ హౌస్‌కు రిపేర్లు వస్తే.. అవి చేయించారే తప్ప, దీన్ని కూల్చాలనుకోలేదు. దీనిని కూల్చాలనే ఆలోచన ఎందుకుంటుంది? లీజుకు తీసుకున్న వారు కూడా అలా చేస్తారని అనుకోవడం లేదు. అసలు కూల్చివేస్తారనే ప్రచారం ఎందుకు జరుగుతుందో తెలియదు." అని పోర్టు ట్రస్ట్ సెక్రటరీ వేణుగోపాల్ బీబీసీతో అన్నారు.

'' ఇది చరిత్రకు సంబంధించినది కాబట్టి దీనిని కూల్చేస్తామని ఎవరు అనరు. లీజు ఎవరు తీసుకున్నారనే విషయాలు బయటకు చెప్పలేం." అని వేణుగోపాల్ తెలిపారు.

ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్

లైట్ హౌస్ ప్రస్తుతం ఎలా ఉందంటే..

ఈ లైట్ హౌస్ బయట భాగం చాలా వరకు పెచ్చులూడుతూ కనిపిస్తోంది. రంగులు కూడా ఇటీవలే వేసినట్లు స్పష్టగానే కనిపిస్తున్నాయి. అయితే ఎప్పట్నుంచో పని చేయక పోవడంతో, చూడగానే అది లైట్ హౌస్ అని గుర్తుపట్టేందుకే కానీ, ఉపయోగంలో లేదు.

లైట్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఉన్న దారి చుట్టూ కంచె వేసి ఉంది. రెండో వైపు దారికి తాళం వేశారు. యూట్యూబర్లు, షార్ట్ ఫిలిమ్స్ తీసుకునే వారు దీని బ్యాక్ గ్రౌండ్‌లో షూటింగులు చేసుకోవడం కనిపించింది. ఇంతక ముందు దీని దగ్గరగా వెళ్లి షూట్స్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

యారాడ కొండపై ఉన్న డాల్ఫిన్ నోస్ లైట్ హౌ
ఫొటో క్యాప్షన్, యారాడ కొండపై ఉన్న డాల్ఫిన్ నోస్ లైట్ హౌ

విశాఖలో మరో నాలుగు లైట్ హౌస్‌లు...

ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్‌తో కలిపి విశాఖలో ఐదు లైట్ హౌసులు ఉన్నాయి.

ఒకటి యారాడ కొండపై ఉన్న డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్. రాత్రి పూట విశాఖలో ఏ మూల నుంచి చూసిన ఈ లైట్ హౌస్ నుంచి వచ్చే కాంతి కనిపిస్తుంది. యారాడ కొండ డాల్ఫిన్ నోస్ ఆకారంలో ఉండటంతో...ఈ కొండపై ఉన్న లైట్ హౌస్‌ను డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ అంటారు.

మరొకటి వన్ టౌన్ ఏరియాలో ఉంటుంది. 1903లో వన్ టౌన్ ఏరియాలో సెయింట్ అలోసియస్ స్కూల్ ముందు 59 అడుగుల ఎత్తున ఒక లైట్ హౌస్ నిర్మించారు. నౌకాశ్రయంలో నౌకల రాకపోకలకు సాయపడే ఒక ట్రాన్సిట్ లైట్‌హౌస్‌గా ఇది ఉపయోగపడేది.

దాదాపు 20 కి.మీల దూరం వరకు ప్రతి 20 సెకన్లకు ఒకసారి దీని నుంచి వెలుతురు వచ్చేది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ లైట్‌ హౌస్ నిరూపయోగంగా ఉన్నప్పటికీ, దీనికి ఎప్పుడూ మరమ్మతులు చేయిస్తూ కాపాడుతున్నారు.

భీమిలి లైట్ హౌస్
ఫొటో క్యాప్షన్, భీమిలి లైట్ హౌస్

మరోకటి భీమిలిలో ఉన్న లైట్ హౌస్. బ్రిటీష్ పాలనా సమయంలో సముద్ర ఎగుమతులకు, దిగుమతులకు ఇబ్బందులు తలెత్తకుండా భీమిలికి వచ్చి వెళ్లే ఓడల కోసం 1854లో ఈ లైట్ హౌస్‌ను ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 36 అడుగులు మాత్రమే. తక్కువ ఎత్తు కావడంతో నావికులకు మార్గనిర్దేశం చేయడంలో ఇబ్బందులు తలెత్తేవి. దీని సేవలు పెద్దగా ఉపయోగపడలేదు.

ప్రస్తుతం దీని సేవలు వేటకు వెళ్లే మత్స్యకారులకు పరిమితంగా ఉపయోగపడుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు కాకినాడ పోర్టు ఆధీనంలో ఉన్న ఈ లైట్ హౌస్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని షిప్స్ అండ్ లైట్ హౌసెస్ విభాగం అధీనంలోకి వెళ్లింది.

విశాఖ కేజీహెచ్ సమీపంలోని ఇసుక కొండపై కూడా ఒక లైట్ హౌస్ ఉండేది. అయితే, అది ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని, నేలమట్టమై గుర్తించడానికి వీలు లేకుండా ఉంది.

విశాఖలో ఉన్న ఈ 5 లైట్ హౌసులలో ప్రస్తుతం రెండే ఉపయోగంలో ఉన్నాయి. యారాడ కొండపై ఉన్న లైట్ హౌస్ పూర్తి స్థాయిలో పని చేస్తుండగా... భీమిలిలో ఉన్న లైట్ హౌస్ మత్స్యకారులకు ఉపయోగపడుతూ పాక్షికంగా పనిచేస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)