కేఎల్ రాహుల్: ఈ చాంపియన్స్ ట్రోఫీ సైలెంట్ హీరో‌ను ‘స్పేర్ టైర్ లా వాడారా’?

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒకటి నుంచి ఏడు వరకు ఏ స్థానంలోనైనా స్థిరంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్
    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీమిండియా 12 ఏళ్ల తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గింది.

భారత్ ఫీల్డర్లు 4 క్యాచ్‌లు జారవిడవడం, రోహిత్ పేలవంగా అవుటవ్వడం, కోహ్లీ ఎల్బీగా వెనుదిరగడం, వెంటవెంటనే వికెట్లు పడినప్పుడు అభిమానులకు ఒక్కసారి 2023 వరల్డ్ కప్ ఫైనల్ మదిలో మెదిలి ఉంటుంది.

తర్వాత అంతా సర్దుకుంది గానీ లేకపోతే ఈ తప్పిదాల కారణంగా భారత క్రికెటర్లు మళ్లీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది.

అహ్మదాబాద్ వేదికగా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమిని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేరు.

నాటి ఫైనల్‌కు సంబంధించి అభిమానులను బాగా కలవరపెట్టిన అంశాలు రెండు . అందులో ఒకటి ట్రావిస్ హెడ్ విధ్వంసం, రెండు కేఎల్ రాహుల్ ఆటతీరు.

ఆ ఫైనల్లో రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేసి భారత్ తరఫున టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

అయినప్పటికీ రాహుల్ చాలా నెమ్మదిగా ఆడాడంటూ అతని ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

అహ్మదాబాద్‌లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్‌లో ఏకంగా 49 డాట్ బాల్స్ ఉండటం, 52 సింగిల్స్, 5 డబుల్స్ తీయడంతో ప్రేక్షకులు విసిగిపోయారు. కేవలం ఒక ఫోర్ మాత్రమే కొట్టాడు.

భారత్ ఫైనల్లో తక్కువ స్కోరు చేయడానికి, ఓడిపోవడానికి పరోక్షంగా ఈ ఆటతీరు కూడా కారణమని రాహుల్‌పై ట్రోలర్లు విరుచుకుపడ్డారు.

మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎదురుదాడి చేయాలా? లేక నెమ్మదిగా ఆడాలా తేల్చుకోలేక పోయానని తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌తో చిట్‌చాట్ సందర్భంగా కేఎల్ రాహుల్ ఫైనల్లో తన నెమ్మదైన ఆటతీరుకు కారణాన్ని వెల్లడించాడు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓపెనర్‌గా, వికెట్‌కీపర్‌గా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా అప్పుడప్పుడు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.

సెంచరీలు లేవు కానీ..

చాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ ప్రదర్శన పట్ల తోటి ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆదివారం ఫైనల్ అనంతరం రాహుల్‌ను ఆకాశానికెత్తిన వారిలో కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.

అయితే, ఈ టోర్నీలో రాహుల్ సెంచరీల రూపంలో భారీస్కోర్లు చేయలేదు. కానీ, అవసరమైనప్పుడల్లా జట్టును ఆదుకున్నాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు.

ఆదివారం నాటి ఫైనల్లో తొలుత రోహిత్ ధాటిగా ఆడటం, శ్రేయస్ అయ్యర్, గిల్ రాణించడంతో భారత్ మంచి స్థితిలోనే నిలిచింది.

అయ్యర్ అవుటయ్యాక రాహుల్ క్రీజులోకి వచ్చిన సమయానికి భారత్ విజయానికి 68 బంతుల్లో 69 పరుగులు చేయాలి.

ఈ దశలో భారత జట్టుపై కాస్త ఒత్తిడి పెరిగింది. పరుగుల రాక కూడా నెమ్మదించింది. కివీస్ బృందం ఆత్మవిశ్వాసంతో కనిపించింది.

తర్వాత అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వికెట్లు పడుతున్నప్పటికీ రాహుల్ మంచి టైమింగ్‌ చూసి షాట్లు ఆడాడు. మ్యాచ్ మరింత క్లిష్టం కాకుండా చూసుకున్నాడు. చివరికి 33 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో అజేయంగా 34 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

''రాహుల్ చాలా ప్రశాంతంగా ఆడాడు. అతను సరైన సమయంలో అవకాశాలను వాడుకున్నాడు. తనలో అపారమైన ప్రతిభ ఉంది. అతని టైమింగ్‌తో ఎవరూ ఆడలేరు'' అని మ్యాచ్ అనంతరం రాహుల్‌ను హార్దిక్ పాండ్యా ప్రశంసించాడు.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు ఓపెనర్‌గా కనిపించిన రాహుల్ ఇప్పుడు మ్యాచ్ ఫినిషర్ అవతారమెత్తాడు.

సెమీస్‌లోనూ నిలిచాడు..

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ 5 మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో రాహుల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. మూడు మ్యాచ్‌ల్లో చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లోనూ రాహుల్ ఆకట్టుకున్నాడు.

సెమీస్‌లో విరాట్ కోహ్లీ (84) అద్భుత ఇన్నింగ్స్‌తో విజయానికి బాటలు వేశాడు. అయితే, కోహ్లీ ఉన్నంతసేపు అతనికి అండగా నిలిచిన రాహుల్ తర్వాత హార్దిక్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

గ్రూపు దశలో పాకిస్తాన్‌పై బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. న్యూజీలాండ్‌పై 23 పరుగులు, బంగ్లాదేశ్‌పై అజేయంగా 41 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా కీపర్‌గా 5 క్యాచ్‌లు, ఒక స్టంపౌట్‌లో భాగమయ్యాడు.

ఈ టోర్నీలో అతను మొత్తంగా 140 పరుగులు సాధించాడు. ఈ స్కోరు అతనికి అవార్డులు తెచ్చిపెట్టదు కానీ టీమిండియా మిడిలార్డర్‌కు అతను ఎంత విలువైన ప్లేయరో చూపిస్తుంది.

''రాహుల్ ఒత్తిడికి భయపడడు. అతను మానసికంగా . విజయవంతంగా ఆటను ముగిస్తాడనే ఉద్దేశంతో అతన్ని మిడిలార్డర్‌లో ఉండాలని మేం కోరుకున్నాం. ఆటలో అతని అనుభవం, ప్రశాంతమైన వైఖరి కారణంగా మరో ఎండ్‌లో ఉన్న హార్దిక్ లాంటి ప్లేయర్లు స్వేచ్ఛగా ఆడగలుగుతారు'' అని ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ రాహుల్‌ను మెచ్చుకున్నాడు.

ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో కీలక క్షణాల్లో ప్రశాంతంగా ఉండటం చాలా కీలకమని మ్యాచ్ అనంతరం రాహుల్ వ్యాఖ్యానించాడు.

'' అంత తేలిక కాదు. కానీ, మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలోని అయిదు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఇలాంటి పరిస్థితిలోనే నేను ఆడాను. ఒక మ్యాచ్‌లో నాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇలాంటి గేముల్లో చాలా ఒత్తిడి, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని రాహుల్ వ్యాఖ్యానించాడు.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాంపియన్స్‌ ట్రోఫీలో కీపర్‌గా 5 క్యాచ్‌లు, ఒక స్టంపౌట్‌లో భాగమయ్యాడు.

ఏ స్థానంలో దిగినా..

భారత వన్డే జట్టులో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఎప్పుడూ సందిగ్ధతే. అతను ఎప్పుడు ఏ స్థానంలో ఆడతాడో అర్థం కాదు. ఏ స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ ఆ స్థానానికి న్యాయం చేస్తాడు. సిరీస్, సిరీస్‌కు అతను ఏ ప్లేసులో ఆడతాడు అనేది ప్రశ్నార్థకంగానే ఉంటుంది.

ఒకప్పుడు ఓపెనర్‌గా కనిపించిన రాహుల్ ఇప్పుడు ఫినిషర్ అవతారమెత్తాడు.

చాంపియన్స్‌ట్రోఫీలో మిడిలార్డర్‌కు తగినట్లుగా తన బ్యాటింగ్ స్టయిల్‌ను మార్చుకొని బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు.

రాహుల్ వన్డే క్రికెట్‌లోకి అడుగు పెట్టి 9ఏళ్లు అవుతోంది. ఈ తొమ్మిదేళ్లలో 85 వన్డేలు ఆడాడు. రెండు వరల్డ్ కప్‌ టోర్నీలు, రెండు ఆసియా కప్ టోర్నీలు, ప్రస్తుత ఐసీసీ చాంపియన్స్ పోటీలో పాల్గొన్నాడు. ఈ వన్డేల్లో అతను బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనింగ్ నుంచి ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేశాడు.

అందుకే భారత మాజీ బ్యాట్స్‌మెన్ నవ్‌జ్యోత్ సిద్దూ, స్పోర్ట్స్‌స్టార్ ప్రతినిధులతో మాట్లాడుతూ, కేఎల్ రాహుల్‌ను టీమిండియా వాడినంతగా స్పేర్ టైర్‌ను కూడా ఎవరూ వాడరని అన్నారు.

''అతనితో ఒకసారి వికెట్ కీపింగ్ చేయిస్తారు, తర్వాత ఆరో నంబర్‌లో ఆడిస్తారు. మళ్లీ ఓపెనింగ్‌కు పంపిస్తారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి వచ్చేసరికి మూడో నంబర్‌లో ఆడమంటారు. తర్వాత టెస్టుల్లో ఓపెనింగ్ చేయమంటారు. వన్డే క్రికెట్‌లో ఓపెనింగ్ చేయడం ఈజీ. కానీ, టెస్టు క్రికెట్‌లో ఓపెనింగ్‌కు వెళ్లడమంత కష్టం ఇంకోటి ఉండదు. జట్టులో ఇబ్బందికర పరిస్థితి ఉన్నచోట అతన్ని ఆడమంటారు. అతను నో చెప్పడు. కేఎల్ రాహుల్ నిస్వార్థపరుడు. దేశం కోసం ఏమైనా చేస్తాడు'' అని సిద్దూ ప్రశంసలు కురిపించాడు.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో రాహుల్ 33 బంతుల్లో 34 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఓపెనింగ్ నుంచి ఏడోస్థానం వరకు..

రాహుల్ 24 ఏళ్ల వయస్సులో 2016లో జింబాబ్వేతో మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా సెంచరీ సాధించాడు. తర్వాత రెండో స్థానంలో ఆడాడు.

2017లో శ్రీలంక పర్యటన తర్వాత అతని స్థానం వన్‌డౌన్‌కు మారింది.

తర్వాత మ్యాచ్ మ్యాచ్‌కూ అతని స్థానం మారుతూ వస్తోంది.

రోహిత్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీలతో టాపార్డర్ నిండిపోవడంతో టాప్-3లో అతనికి చోటు దక్కడం కష్టమైంది.

2019 వరల్డ్ కప్‌లో నాలుగో నంబర్‌లో ఆడాడు. తర్వాత ఆరో నంబర్‌లో ఆడాడు. శిఖర్ గాయంతో తప్పుకుంటే మళ్లీ ఓపెనింగ్ చేశాడు.

ఆ టోర్నీలో కోహ్లీ, రోహిత్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. కానీ, తర్వాతి వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే భారత వన్డే జట్టులో అతనికి చోటు దక్కలేదు.

ఓపెనర్‌గా, వికెట్‌కీపర్‌గా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా అప్పుడప్పుడు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేఎల్ రాహుల్‌ను టీమిండియా వాడినంతగా స్పేర్ టైర్‌ను కూడా ఎవరూ వాడరని సిద్దూ అన్నారు.

అక్షర్ పటేల్‌ కోసం ఆరో స్థానానికి

2020 నుంచి రాహుల్ వన్డేల్లో స్థిరంగా అయిదో స్థానంలో ఆడుతున్నాడు.

వన్డేల్లో అయిదో స్థానంలో కనీసం 20 ఇన్నింగ్స్‌లు ఆడిన వాళ్లలో చూస్తే రాహుల్ కంటే ఎక్కువ సగటు సాధించిన ఆటగాళ్లు ఎవరూ లేరని క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. అయిదో స్థానంలో రాహుల్ సగటు 61.52 ఉందని పేర్కొంది.

కానీ, రాహుల్ చాంపియన్స్ ట్రోఫీలో ఆరో స్థానంలో బరిలోకి దిగాల్సి వచ్చింది.

జట్టు కూర్పు కోసం ఎడమ చేతి వాటం ప్లేయర్ అక్షర్ పటేల్‌ను అయిదో స్థానంలో పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఫలితంగా రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ ఆరుకు మారింది. ఆరో స్థానానికి తగినట్లుగా అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

''టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఆస్వాదిస్తాను. నేను అబద్ధం చెప్పట్లేదు'' అని చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్‌ ఇంటర్వ్యూలో రాహుల్ చెప్పాడు.

''ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఓపెనింగ్ చేస్తాను. వన్డేలకు వచ్చేసరికి మిడిలార్డర్‌లో ఆడటం కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ, గత నాలుగైదేళ్లుగా వన్డేల్లో నేను ఇలాగే ఆడుతున్నా. బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి కిందకు మారడానికి అలవాటుపడ్డాను. మిడిలార్డర్‌లో లేదా వేరే కేటాయించిన స్థానంలో ఆడే అవకాశం దక్కడం పట్ల సంతోషంగా ఉన్నా. శ్రీలంకతో సిరీస్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాను. కాబట్టి అందుకు తగినట్లుగా బౌండరీ హిట్టింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను'' అని రాహుల్ స్టార్ స్పోర్ట్స్‌ ఇంటర్వ్యూలో చెప్పినట్లు క్రిక్ ఇన్ఫో పేర్కొంది.

జట్టులో స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ లేకపోవడం గురించి చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ తర్వాత రాహుల్ స్పందించాడు.

''2020 నుంచి నేను అయిదో స్థానంలోనే ఆడుతున్నా. నేను ఏ స్థానంలో ఆడుతుంటానో అందరూ మర్చిపోతుంటారు. ఎందుకంటే ఒక సిరీస్‌లో ఆడిన తర్వాత వన్డే క్రికెట్‌కు బ్రేక్ వస్తుంది. తర్వాతి సిరీస్ వచ్చేసరికి, తుది జట్టులో ఎక్కడ ఆడించాలనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక్కోసారి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని ఇంకా నేను ఏం చేయగలను? అని ఆలోచిస్తుంటా. నన్ను ఆడమని కోరిన ప్రతి స్థానంలో నేను బరిలోకి దిగాను. రోహిత్ చెప్పినదాని ప్రకారం, నేను బాగానే ఆడాను అనుకుంటున్నా'' అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)