కొత్త పన్ను విధానం: ఇక పొదుపు చేయక్కరలేదా, పన్నుఆదాయ పథకాల నుంచి తప్పుకోవడం మంచిదేనా?

పర్సనల్ ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
    • హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం

ఆర్థిక సంవత్సరం ముగింపుదశకు వచ్చేసింది. ఇప్పుడు పన్ను ఆదా కోసం ఉద్యోగులంతా హడావుడి పడుతుంటారు. మార్చి నెల మూడో వారంలోనో, ఆఖరి వారంలోనో ఎల్ఐసీ పాలసీలు, యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు (యూలిప్), ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్ స్కీమ్‌ (ఈఎల్ఎస్ఎస్) వంటివి తీసుకుంటూ ఉంటారు.

అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్‌ చేసే వాళ్లలో ఎక్కువ శాతం కొత్తపన్ను విధానం వైపు మళ్లుతున్నప్పటికీ పాతపన్ను పద్ధతిలోనే రిటర్న్స్‌ దాఖలు చేసినవాళ్లు సుమారు 28 శాతం మంది ఉన్నారు.

గతేడాది ఐటీ శాఖ లెక్కల ప్రకారం చూస్తే సుమారు కోటి 90 లక్షల మంది ఇంకా ఈ పద్ధతిలోనే రిటర్న్స్‌ వేశారు.

కొత్త పన్ను విధానంలో అసలు పొదుపు, మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. తాజా కొత్త పన్ను విధానం కింద 12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో మార్కెట్లోని వివిధ పన్ను ఆదాయ మార్గాల పథకాలకు కాలం చెల్లుతోంది. అదే కోవలోకి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ కూడా వస్తోంది.

ఇంతకీ ఈ పథకం కింద పెట్టుబడులను కొనసాగించాలా, వద్దా? ఒకవేళ మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటే ఏం చేయాలి?ట్యాక్స్ ప్రయోజనం అవసరం లేనప్పుడు ఈఎల్‌ఎస్‌ఎస్‌ వంటి వాటితో లాభం ఏంటి?.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈఎల్ఎస్ఎస్, ఫండ్స్, పెట్టుబడులు

ఫొటో సోర్స్, Getty Images

ఈఎల్ఎస్ఎస్ అంటే?

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌.. పన్ను ఆదా చేసుకునే మార్గాల్లో ఇదొకటి. మనం పెట్టుబడి పెట్టే డబ్బును నేరుగా స్టాక్‌ మార్కెట్‌లోనో, ప్రభుత్వ బాండ్లలోనో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 80సీ కింద లక్షన్నర రూపాయల వరకూ రాయితీ లభిస్తుంది.

అందుకే ఈ పథకానికి మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్‌ చేసిన మూడేళ్ల తర్వాత మాత్రమే మనం నిధులను ఉపసంహరించుకోవచ్చు. లాభం రూ.లక్ష దాటితే దానిపై పది శాతం లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ విధిస్తారు.

ఈ స్కీమ్‌ ద్వారా సమకూరిన నిధుల్లో ఫండ్‌ మేనేజర్లు 80 శాతం వరకూ ఈక్విటీకి సంబంధించిన వాటిలో పెట్టుబడిగా పెడతారు. లాంగ్‌ టర్మ్‌ ఉద్దేశంతోనే పెట్టుబడులు ఉంటాయి కాబట్టి ఫండ్‌ మేనేజర్లు డైవర్సిఫికేషన్‌ చేసి ఇన్వెస్ట్‌ చేస్తారు.

లక్షన్నర వరకూ ఆప్షన్‌ ఉంది కాబట్టి, ఇందులో గరిష్ఠ శ్లాబుల్లో ఉన్న వాళ్లు రూ.46,800 వరకూ ఆదా చేసుకోవచ్చు.

పర్సనల్ ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలొస్తాయా?

కొద్దికాలం క్రితం వరకూ ఈఎల్‌ఎస్ఎస్‌కు మంచి ప్రాధాన్యం ఉండేది. ట్యాక్స్‌ సేవింగ్స్‌ కోసం ఉండే ఇతర సాధనాలతో పోలిస్తే, వీటికి లాకిన్‌ పీరియడ్‌ చాలా తక్కువ. వీటికి తోడు రిటర్న్స్‌ కాస్త ఎక్కువే ఉంటాయి. రిస్క్‌తో పాటు రివార్డ్‌ కూడా ఎక్కువే ఉండటం వల్ల వీటికి డిమాండ్‌ ఉండేది.

ఉదాహరణకు పీపీఎఫ్‌కు 15 ఏళ్లు, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ 5 ఏళ్లు, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో మనకు 60 ఏళ్లు అని వివిధ టైమ్‌ పీరియడ్స్‌ ఉన్నాయి.

గత మూడేళ్ల కాలంలో ఈఎల్ఎస్‌ఎస్ గరిష్ఠంగా 14.24 శాతం రిటర్న్స్‌ ఇచ్చింది. కానీ ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులలో 7 శాతం వరకూ నెగిటివ్‌ రిటర్న్స్‌ ఇచ్చిన దాఖలాలూ ఉన్నాయి.

ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఫండ్స్‌ గరిష్ఠంగా ఏడాదికి 13 శాతం రిటర్న్స్‌ ఇచ్చాయి. వరస్ట్‌ కేస్‌లో రెండు శాతం నెగిటివ్‌ రిటర్న్స్‌ కూడా ఇచ్చాయి.

ఏడేళ్ల కాలానికి చూస్తే వార్షికంగా గరిష్ఠంగా 13 శాతం, కనిష్ఠంగా ఏడు శాతం రిటర్న్స్‌ వచ్చాయి.

అంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌లో మెజార్టీ ఫండ్స్ దాదాపుగా ఒకేలా నడిచాయి. వీటికి తోడు ఐటీ రాయితీ ప్రయోజనం కూడా ఉంటుంది కాబట్టి అది డబుల్ బోనస్‌.

స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

వీటి ప్రాధాన్యం పోయిందా?

2024-25 ఆర్థిక సంవత్సరంలో దాఖలు అయిన 8-8.5 కోట్ల వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులులో 74 శాతం కొత్త ట్యాక్స్ విధానాన్నే ఎంపిక చేసుకున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ ఛైర్మన్‌ రవి అగర్వాల్‌ వెల్లడించారు. రాబోయే రోజుల్లో 95 - 97 శాతం మంది కొత్త విధానంలోకి మారే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.

దశల వారీగా పాత విధానాన్ని పూర్తిగా కేంద్రం ఎత్తేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన దేశాన్ని సేవింగ్స్‌ ఎకానమీ నుంచి స్పెండింగ్‌ ఎకానమీ వైపు తీసుకెళ్లాలనేది కేంద్రం ఆలోచన. అందుకే మొన్నటి బడ్జెట్లో కూడా ట్యాక్స్‌ మినహాయింపులు ఇచ్చి సుమారు రూ.లక్ష కోట్లను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని కేంద్రం చూస్తోంది.

కేంద్రం ప్రకటించిన కొత్త శ్లాబ్స్ వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఆదా చేయాల్సిన అవసరం లేకుండా పోతోంది.

హౌసింగ్‌ లోన్‌ వడ్డీ, అసలు, పీపీఎఫ్, ఎన్‌పీఎస్, ఈఎల్ఎస్ఎస్ వంటి వాటి అవసరం మెల్లిగా తీరిపోతోంది. రూ.12 లక్షల వరకూ ఎలాంటి మినహాయింపులు లేకపోవడం (సెక్షన్ 87ఏ ప్రకారం) వల్ల పన్ను ఆదాయ మార్గాలకు కాలం చెల్లిపోతోంది.

వీటిల్లో ఈక్విటీ మార్కెట్లకు లింక్‌ అయిన ఈఎల్ఎస్ఎస్‌, యూలిప్స్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ)లను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండట్లేదు.

ఏఎంఎఫ్ఐ జనవరి 2025 డేటా ప్రకారం..మొత్తం స్కీముల్లో 1.69 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వీళ్లందరి మొత్తం 'యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్' రూ.2.34 లక్షల కోట్లుగా ఉంది. గత ఆరు నెలల కాలంలో మెల్లిగా విత్‌డ్రాయల్స్‌ పెరుగుతూ వచ్చాయి.

అయితే సాధారణంగా జనవరి నుంచి మార్చి నెలల్లో ఈ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ల సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం చివరలో ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇప్పటికీ సుమారు కోటిన్నరకుపైగా పోర్ట్‌ఫోలియోస్ యాక్టివ్‌గా ఉన్నాయి, కాబట్టి వీటిల్లో ఇంకా ఇన్‌ఫ్లోస్‌ ఉన్నాయి.

గత మూడేళ్లుగా ఇతర ఫండ్స్‌ను పరిశీలించినప్పుడు వాటిల్లోకి సుమారు 120 శాతం అధిక ఇన్‌ఫ్లోస్‌ వస్తే, ఈఎల్‌ఎస్‌ఎస్‌లోకి మాత్రం ఇది 58 శాతానికి మాత్రమే పరిమితమైంది.

మనీ, ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇపుడేం చెయ్యాలి?

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ను సాధారణంగా ఐటీ మినహాయింపు కోసం ఉపయోగించే ట్యాక్స్‌ సేవింగ్‌ సాధనంగా మాత్రమే మనం చూస్తాం. కాకపోతే ఇందులోని ప్రయోజనాలు కూడా తెలుసుకోవాలి.

ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవాళ్లు ఇప్పటికిప్పుడు కాకపోయినా మెల్లిగా ఈఎల్ఎస్ఎస్ నుంచి ఫండ్స్ విత్‌డ్రా చేసుకుని ఫ్లెక్సిబుల్, హైబ్రిడ్‌ ఫండ్స్‌ వైపు మళ్లొచ్చు. ఇప్పుడు ట్యాక్స్‌ బెనిఫిట్‌ సమస్య లేదు కాబట్టి ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌ వైపు మన నిధులను పంపవచ్చు.

చరిత్ర చూస్తే ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో ఈ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్స్‌ సగటున 13-14 శాతం రిటర్న్స్‌ ఇచ్చాయి. అందుకే ఒకవేళ ఈఎల్ఎస్ఎస్ నుంచి మారాలంటే కాస్త మీడియం రిస్క్‌ ఉన్న ఫ్లెక్సీక్యాప్‌ వైపు వెళ్లడం మంచిది. దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి ఇది కూడా మంచి సాధనంగా ఉంటుంది.

ఎవరికి ఉత్తమం?

సాధారణంగా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోడక్ట్‌కు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటే, మనం దాని జోలికి అంత త్వరగా వెళ్లం. లేకపోతే ఏ చిన్న అవసరమొచ్చినా ఈ డబ్బే మనకు మొదటగా గుర్తొస్తుంది. ఈఎల్ఎస్ఎస్ విషయంలో కూడా ఇదే పనిచేస్తోంది.

ఒక వైపు ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ అయితే, మరోవైపు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడి. సరాసరి 13-15 శాతం వరకూ రిటర్న్స్‌ ఇస్తున్న ఈ ఫండ్ సాధారణంగా ప్రతి ఒక్కరికీ మంచి ఆప్షనే అవుతుంది.

వీటిల్లో 80 శాతం మాత్రమే ఈక్విటీలో పెట్టి, మిగిలినవి ప్రభుత్వ బాండ్స్, సెక్యూరిటీస్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో కొద్దిగా రిస్క్‌ డైవర్సిఫై అవుతుంది.

ఇన్వెస్ట్‌ చేసే వాళ్లందరి ఉద్దేశం దీర్ఘకాలం కాబట్టి ఫండ్‌ మేనేజర్లు కూడా క్వాలిటీ లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌వైపే ఎక్కువగా మొగ్గుచూపుతారు.

అందుకే లాంగ్‌ టర్మ్‌ ఆలోచన ఉండి, ఇలాంటి లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉన్నప్పుడే మనం నియంత్రణలో ఉంటాం అనుకునే వాళ్లకు ఇది మంచి ఎంపిక.

అయితే ఇప్పుడు అదే పనిగా వెళ్లి మరీ ఇందులో ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు కానీ, ఉన్నవాటిని కొనసాగించడంలో తప్పేం లేదు.

ఎందుకంటే మిగిలిన ఫండ్స్‌ ఇంతకంటే మెరుగైన రిటర్న్స్ ఇస్తే ఆలోచించాలి కానీ, సరాసరిన ఇదే స్థాయిలో ఇస్తూ ఉంటే పెద్దగా వచ్చిన నష్టమేమీ ఉండదు.

పర్సనల్ ఫైనాన్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పొదుపు ఆపొద్దు

బడ్జెట్‌ ప్రకటనతో మనకు ట్యాక్స్‌ ఆదా అవుతోందని, వచ్చే ఏడాది నుంచి వివిధ పెట్టుబడుల మార్గాలన్నింటినీ ఆపేయడం సమంజసం కాదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఖర్చు పెట్టడం వైపు ప్రోత్సహిస్తోంది.

కానీ, మన ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. మన కుటుంబ అవసరాలపై మనకు మాత్రమే అవగాహన ఉంటుంది. అందుకే రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్నూ కట్టాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో మొత్తం డబ్బును విలాసాల కోసం ఖర్చు చేయకూడదు.

ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో అత్యంత ముఖ్యమైన రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ వంటివాటికి ఇలాంటి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ ఉపయోగపడతాయి. అందుకే పన్ను ఆదా సాధనంగా మాత్రమే ఈఎల్‌ఎస్‌ఎస్‌ను చూడొద్దు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు దీన్ని సర్దుబాటు చేసుకుంటూ మీ పెట్టుబడులు కొనసాగించండి.

మార్కెట్‌పైన మంచి అవగాహన ఉండి, ఎప్పటికప్పుడు మీ పెట్టుబడి నిర్ణయాలను సొంతంగా సమీక్షించుకునే అనుభవం ఉన్నప్పుడే ఇతర ఫండ్స్‌ వైపు మీ నిధులు మళ్లించండి.

(గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)