బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మిలిటెంట్ల కాల్పులు.. బందీలుగా వందల మంది ప్రయాణికులు

బలూచిస్తాన్ రైలుపై దాడి

ఫొటో సోర్స్, Pakistan Railways

    • రచయిత, అజాదే మోషిరి, అయేషియా పెరెరా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

పాకిస్తాన్‌లో ఎక్స్‌ప్రెస్ రైలుపై సాయుధ మిలిటెంట్లు దాడి చేశారు. బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ ఈ సంఘటనను ధ్రువీకరించారని బీబీసీ ఉర్దూ తెలిపింది.

క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై భారీ కాల్పులు జరిగినట్లు నివేదికలు ఉన్నాయని చెప్పారు.

ఈ దాడి తామే చేసినట్లుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించుకుంది. రైలుపై దాడికి ముందు, రైల్వే ట్రాక్‌పై బాంబు దాడి చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం, రైలు తమ నియంత్రణలో ఉందని బీఎల్‌ఏ పేర్కొంది.

భద్రతా అధికారులతో సహా అనేక మంది ప్రయాణికులను బందీలుగా ఉంచినట్లు, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అధికారులు ఏమంటున్నారు?

ఈ దాడిలో రైలు డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం అందిందని పాకిస్తాన్ పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు.

రైలు వద్ద "తీవ్రమైన కాల్పులు" జరిగినట్లు తెలిసిందని బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి స్థానిక వార్తాపత్రిక డాన్‌తో అన్నారు.

ప్రయాణికులు బందీలుగా ఉన్నారా? లేదా అనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.

కొండల మధ్య సొరంగం వద్ద రైలు ఉందని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ నివేదించింది.

మంగళవారం మధ్యాహ్నం, ధాదర్ సమీపంలో ఈ దాడి జరిగిందనే సమాచారం ఉందని బీబీసీ ఉర్దూ తెలిపింది.

ఆ ప్రాంతంలో నెట్‌వర్క్ సమస్య ఉన్నందున రైలు సిబ్బందిని సంప్రదించే అవకాశం లేదని క్వెట్టాలోని రైల్వే భద్రతా అధికారి జియా కాకర్ తెలిపారు. రైలులో తొమ్మిది కోచ్‌లు ఉన్నాయని, 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని జియా చెప్పారు.

మహిళలు, పిల్లలు రైలు దిగి సిబీ నగరం వైపు నడుస్తున్నారని పారామిలిటరీ వర్గాలను ఉటంకిస్తూ క్వెట్టాలోని రైల్వే అధికారులు బీబీసీతో చెప్పారు.

సిబీ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని, అంబులెన్సులను సంఘటనా స్థలానికి పంపామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

దాడి అనంతరం రైలును సిబీ సమీపంలో ఆపివేసినట్లు క్వెట్టాలోని రైల్వే కంట్రోల్ సెంటర్‌లోని సీనియర్ అధికారి మొహమ్మద్ కాశిఫ్ తెలిపారు.

'దాడిలో రైలు నడుపుతున్న వ్యక్తి గాయపడ్డారు' అని ఆయన అన్నారు.

ఉదయం 9 గంటలకు రైలు క్వెట్టా నుంచి పెషావర్‌కు బయలుదేరిందని కాశిఫ్ తెలిపారు.

బలూచిస్తాన్, హెలికాప్టర్

ఫొటో సోర్స్, BBC Urdu

'ఘటనా స్థలం కొండల్లో ఉంది'

భద్రతా దళాలను సంఘటనా స్థలానికి పంపించామని షాహిద్ రిండ్ చెప్పారు. సహాయానికి మరొక రైలును అక్కడికి పంపినట్లు చెప్పారు. ఘటనా స్థలం కొండల్లో ఉండటంతో అక్కడికి చేరడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు.

''సిబీ, క్వెట్టాలోని ప్రధాన ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల చికిత్స కోసం సిద్ధం కావాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు'' అని క్వెట్టా జిల్లా ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ వసీం బేగ్ బీబీసీతో చెప్పారు.

సిబీ ఆసుపత్రిలో 100 మంది రోగులకు చికిత్స అందించే సౌకర్యం ఉందని, అయితే తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టాకు పంపుతామని వసీం అన్నారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)