జమ్ముకశ్మీర్‌లో అకస్మాత్తుగా మిలిటెంట్ దాడులు ఎందుకు పెరిగాయి?

జమ్మూకశ్మీర్‌లో దాడులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జమ్ముకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మిలిటెంట్ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. కిష్త్వార్‌, శ్రీనగర్‌లలో ఇలాంటి ఘటనలు జరిగాయి.

నవంబర్ 10న కిష్త్వార్‌లో భారత సైన్యం, మిలిటెంట్‌లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

ఈ ఘటనలో భారత ఆర్మీ అధికారి ఒకరు మృతి చెందగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. సోమవారం నుంచి ఈ ప్రాంతంలో మిలిటెంట్‌ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గతవారం కిష్త్వార్‌లోని ఒక గ్రామంలో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (వీడీజీ)తో సంబంధం ఉన్న ఇద్దరిని మిలిటెంట్‌లు చంపేశారు.

శ్రీనగర్‌లోని జబర్వాన్ కొండల్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మిలిటెంట్‌ దాడి జరిగింది.

సోపోర్‌లో ఈనెల 10న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మిలిటెంట్‌ను హతమార్చినట్లు పోలీసులు ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీనగర్‌లోని జబర్వాన్ కొండల్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మిలిటెంట్‌ దాడి జరిగింది.

పదిహేను మందికి పైగా మృతి

నవంబర్ 12న మంగళవారం ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరాలో సైన్యం, మిలిటెంట్‌ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని శ్రీనగర్‌లోని భారత సైన్యానికి చెందిన ‘చినార్ కార్ప్స్’ ఎక్స్ వేదికగా ప్రకటించింది.

ఆ పోస్టులో "బందిపోరాలోని నాగ్‌మార్గ్‌లో టెర్రరిస్టుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. భద్రతా బలగాలు టెర్రరిస్ట్‌లను సమీపించడంతో వారు కాల్పులు జరిపారు. మా సైనికులు వెంటనే ఎదురుదాడికి దిగారు. ఆపరేషన్ కొనసాగుతోంది’’ అని తెలిపింది.

గత నెలరోజులుగా కశ్మీర్ లోయలో అనేక మిలిటెంట్‌ దాడులు చోటు చేసుకున్నాయి. వీటిలో పదిహేను మందికి పైగా మృతి చెందారు. ఇందులో వలస కార్మికులు, సైనికులు, సాధారణ కశ్మీరీలు ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే కశ్మీర్ లోయలో దాడులు జరిగాయి.

జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

1989 నుంచి జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్‌ కార్యకలాపాలు వ్యాపించడం ప్రారంభమైంది. 2021 నుంచి జమ్ము ప్రాంతంలో నిరంతరం కనిపించాయి.

దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్‌లో మిలిటెంట్ ఘటనలకు సంబంధించిన డేటా ఉంది. 2020లో జమ్ముకశ్మీర్‌లో 140 మిలిటెంట్ సంబంధిత హత్యలు జరిగాయి. ఈ ఘటనల్లో 33 మంది పౌరులు, 56 మంది భద్రతా సిబ్బంది, 232 మంది మిలిటెంట్‌లు మరణించారు. 2021లో 153 హత్య ఘటనలు జరగ్గా.. ఇందులో 36 మంది సామాన్యులు, 45 మంది భద్రత సిబ్బంది, 193 మంది మిలిటెంట్‌లు చనిపోయారు.

2022లో 151 మిలిటెంట్‌ సంబంధిత హత్యలు జరిగాయి. ఈ ఘటనల్లో 30 మంది సాధారణ వ్యక్తులు, 30 మంది భద్రతా సిబ్బంది, 193 మంది మిలిటెంట్‌లు మరణించారు. 2023లో మొత్తం 72 హత్య ఘటనలు నమోదయ్యాయి. వీటిలో 12 మంది సామాన్యులు, 33 మంది భద్రతా సిబ్బంది, 87 మంది మిలిటెంట్‌లు మరణించారు.

అయితే ఈ ఏడాది నవంబర్ 7 వరకు మొత్తం 58 మిలిటెంట్‌ ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 30 మంది పౌరులు, 26 మంది భద్రత సిబ్బంది, 63 మంది మిలిటెంట్‌లు మరణించారు.

జమ్మూకశ్మీర్‌

ఫొటో సోర్స్, Getty Images

నిపుణులు ఏమంటున్నారు?

కశ్మీర్ లోయలో జరుగుతున్న ఘటనలపై పలువురు భద్రత నిపుణులతో బీబీసీ మాట్లాడింది. కశ్మీర్‌లో అంతా సరిగ్గా లేదని చెప్పేందుకు మిలిటెంట్‌లు ప్రయత్నిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.

"ఎన్నికలు జరిగాయని, కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడిందని, కశ్మీర్‌కు పర్యటకులు కూడా వస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అంతా బాగానే ఉందనే ప్రభుత్వ వాదనను టెర్రరిస్టులు తప్పని చూపించాలనుకుంటున్నారు" అని భారత ఆర్మీ నార్తర్న్ కమాండ్ మాజీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) దీపేంద్ర సింగ్ హుడా తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను ఈ కోణంలోనే చూడాలన్నారు. దీని ద్వారా జమ్ముకశ్మీర్‌లో అంతా సరిగా లేదన్న సందేశాన్ని వారు ఇస్తున్నారని అన్నారు హుడా.

"మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వర్కర్లను, గ్రామ రక్షణ గార్డులను చంపుతున్నారు" అని ఆయన అన్నారు.

"చొరబాటు కారణంగానే జమ్ములో ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో దాడి జరిగింది. అది కూడా తాజా చొరబాటు ఫలితమే" అని హుడా చెప్పారు.

"పాకిస్తాన్ కూడా ఇక్కడ పరిస్థితి సాధారణంగా లేదని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఒక నిర్దిష్ట రకమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం. ఉగ్రవాదం అంటే ఒకరిని కాల్చిచంపడమే కాదు, సందేశం ఇవ్వడం కూడా. ఇలాగే ఉగ్రవాదం బతికుంటుంది" అని హుడా అన్నారు.

‘’గత ఏడాదితో పోల్చి చూసి ఒక్కసారిగా ఘటనలు పెరిగాయని అనుకోకూడదు. ఉగ్రవాదులు ఎలాంటి లక్ష్యాన్ని ఎంచుకుంటున్నారనేది చూడాలి. అంతేకాదు ఘటన జరిగిన సమయం కూడా ముఖ్యమైనదే" అని చెప్పారు.

ఈ ఘటనలు ఇంకా ఎందుకు ఆగడం లేదని బీబీసీ అడిగితే హుడా బదులిస్తూ ‘’శ్రీనగర్‌లోని ప్రతి గ్రామంలో భద్రత బలగాలను మోహరించడం సరైంది కాదు. అప్పుడు అక్కడ యూనిఫాంలో ఉన్న వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. పరిస్థితి సాధారణంగా ఉంటే ప్రతిచోటా భద్రత బలగాలను ఎందుకు మోహరించారని ప్రజలు ప్రశ్నిస్తారు" అని అన్నారు.

2019 తర్వాత దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు హుడా. అయితే, ఆర్టికల్ 370 అన్నింటికీ అడ్డంకి అని చెప్పడం సరికాదని హుడా చెప్పారు.

"ఉగ్రవాదాన్ని తగ్గించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాలి. అభివృద్ధి అవసరం. స్థానిక ప్రజలకు చేరువ కావాలి" అని తెలిపారు.

2019 ఆగస్టు 5న నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో ప్రత్యేక హోదా కూడా రద్దయింది.

జమ్ము కశ్మీర్‌లో తీవ్రవాదాన్ని నిర్మూలించడంతో పాటు, అభివృద్ధికి బాటలు వేయడానికి ఆర్టికల్ 370 ప్రధాన అడ్డంకిగా ఉందని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. పదేళ్ల తర్వాత ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గత నెలలోనే జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

చొరబాట్లపై భారత ప్రభుత్వం, భద్రతా సంస్థలు పాకిస్తాన్‌పై పదేపదే ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ వాదనలను పాకిస్తాన్ ఖండిస్తోంది.

కశ్మీర్‌లో దాడులు

ఫొటో సోర్స్, Getty Images

'పాకిస్తాన్‌కు శాంతి అక్కర్లేదు'

ఇటీవలి దాడులపై జమ్ముకశ్మీర్ పోలీస్ మాజీ డైరెక్టర్ జనరల్ శేష్ పాల్ వేద్ మాట్లాడుతూ "ఇదంతా చొరబాటు ఫలితం. ఎన్నికలకు ముందు జమ్ము ప్రాంతంలో చొరబాట్లు జరిగాయి. అక్కడ తమ ఉనికిని చూపించారు" అని అన్నారు.

"కశ్మీర్ ప్రాంతంలో కూడా చొరబాట్లు జరిగాయి. అక్కడ కూడా దాడులు చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొనాలని పాకిస్తాన్ కోరుకోవడం లేదు" అని ఆయన ఆరోపించారు.

‘’ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత పరిస్థితి సాధారణమైందన్న ప్రభుత్వ ప్రకటనలను వారు మార్చాలనుకుంటున్నారు. కశ్మీర్ సమస్య ఇంకా సజీవంగా ఉందని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, సైనిక యంత్రాంగం రహస్యంగా ఈ విషయాలను ప్రచారం చేస్తున్నాయి" అని వేద్ ఆరోపించారు.

"ఇంటెలిజెన్స్ ఏజన్సీల కారణంగానే ఉగ్రవాదులను చేరుకోగలుగుతున్నాం. వారు కూడా హతమవుతున్నారు’’ అని వేద్ చెప్పారు.

"ఉగ్రవాదులు కూడా తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. వారు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించలేరు. వారికి స్థానికంగా ఎక్కడి నుంచి సాయం లభించినా భద్రతా బలగాలు, పోలీసులు వారిని చేరుకుంటారు. వారు కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోతున్నారు" అని వేద్ అన్నారు.

అయితే, 2019 తర్వాత కశ్మీర్ లోయలో మిలిటెంట్‌ ఘటనలు మినహా రాళ్ల దాడి ఘటనలు ఆగిపోయాయి.

'ఉగ్రవాదాన్ని ముందుగా సరిహద్దు ఆవల నుంచి అరికట్టాలి'

జమ్ముకశ్మీర్ పోలీస్ మాజీ డీఐజీ, రచయిత అలీ మొహమ్మద్ వాట్లీ మాట్లాడుతూ "ఇక్కడ ఉగ్రవాదం ఎప్పుడు అంతమైందో చెప్పండి. ఒక్కోసారి దాని గ్రాఫ్ పెరగడం, మరోసారి తగ్గడం జరుగుతోంది" అని అన్నారు.

"కశ్మీర్ లోయలో గత కొద్ది రోజులుగా ఉగ్రవాద సంఘటనలు పెరిగాయి. జమ్ముకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాబట్టి వారు తమ ఉనికిని చాటుకుంటున్నారు" అని ఆయన చెప్పారు.

"ప్రభుత్వం కొత్తదైనా పాతదైనా ఈ విషయాలు ఎప్పటికీ ఆగవనుకుంటున్నాను. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో జమ్ముకశ్మీర్ ఉంది. ఆ సమయంలో కూడా ఉగ్రవాద సంఘటనలు జరిగాయి" అని అలీ మొహమ్మద్ గుర్తుచేశారు.

"నెల రోజుల క్రితం కశ్మీర్‌లో నిశ్శబ్దం నెలకొని ఉంది. ఇప్పుడది చెదిరిపోతోంది. ఈ ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదాన్ని అదుపులోకి తెచ్చామని చెబితే అది తప్పు. అక్కడ ఉగ్రవాదులు లేనపుడే దాన్ని అదుపులోకి తీసుకువచ్చామని చెప్పాలి" అని ఆయన సూచించారు.

‘’ఉగ్రవాద ఘటనల్లో స్థానికులు, బయటి వ్యక్తులు భాగమవుతున్నారు’’ అని అలీ మొహమ్మద్ ఆరోపించారు.

"ఉగ్రవాదాన్ని మొదట సరిహద్దులో అరికట్టాలి. ఉగ్రవాదులు సరిహద్దు నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశిస్తారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత వారు మరో నలుగురిని తమ గ్రూపులో చేర్చుకుంటారు" అని ఆయన అన్నారు.

"ఇప్పుడు డ్రగ్స్ కూడా సరిహద్దుల గుండా స్మగ్లింగ్ అవుతోంది. తీవ్రవాదం, డ్రగ్స్‌కు మధ్య బలమైన బంధం ఉంది. డ్రగ్స్ తెచ్చే వారే ఆయుధాలు కూడా తెస్తారు" అని అలీ మొహమ్మద్ అన్నారు.

జమ్ముకశ్మీర్‌లో ఏదైనా పెద్ద మిలిటెంట్‌ ఘటన చోటుచేసుకుంటే వెంటనే వారి మౌలిక సదుపాయాలను నాశనం చేయాలని ప్రభుత్వం భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేస్తోంది.

2021 నుంచి జమ్ము ప్రాంతంలో మిలిటెంట్‌ ఘటనలు మళ్లీ మొదలయ్యాయి. వీటి పరిధి జమ్ములోని పీర్ పంజాల్ (పూంచ్-రాజౌరీ) ప్రాంతం వరకే ఉండేది. కానీ, ఇప్పుడు మొత్తం జమ్ము ప్రాంతానికి వ్యాపించింది.

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఫారూక్ అబ్దుల్లా

రాజకీయ నాయకులు ఏమంటున్నారు?

జమ్ముకశ్మీర్‌లో అకస్మాత్తుగా మిలిటెంట్ దాడులు పెరగడంపై రాజకీయ పార్టీలు స్పందించాయి.

ఈ దాడులపై దర్యాప్తు చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ మిలిటెంట్‌ దాడులకు పాకిస్తాన్ కారణమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపిస్తోంది. ఫారూక్ అబ్దుల్లా ప్రకటనపై జమ్ముకశ్మీర్ మాజీ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా విమర్శలు చేశారు.

'పాకిస్తాన్ నుంచి ఇదంతా జరుగుతోందని ఫారూక్ అబ్దుల్లాకు తెలిస్తే దానిపై దర్యాప్తు ఎందుకు?. సైన్యం, పోలీసులకు అందరం మద్దతివ్వాలి' అని రైనా నవంబర్ 2న వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)