జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్ల దాడి: డాక్టర్, ఆరుగురు కార్మికులు మృతి, పోలీసులు ఏం చెప్పారంటే..

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో ఆదివారం జరిగిన మిలిటెంట్ల దాడిలో ఏడుగురు చనిపోయారు. నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం దగ్గర ఈ దాడి జరిగింది.
మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఒకరు డాక్టర్ ఉన్నట్లు అధికారులు చెప్పారని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
గందర్బాల్, సోనామార్గ్ ప్రాంతంలోని గుండ్ వద్ద సొరంగ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, సాయంత్రం తమ క్యాంపుకు తిరిగి వస్తున్న సమయంలో మిలిటెంట్లు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇద్దరు కార్మికులు ఘటనా స్థలంలోనే చనిపోయారని, డాక్టర్, మరో నలుగురు కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు.

గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మిలిటెంట్ల దాడిలో చనిపోయిన వారు డాక్టర్ షానవాజ్, ఫహీమ్ నజీర్, కలీమ్, మొహమ్మద్ హనీఫ్, షషి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మీత్ సింగ్‌గా గుర్తించినట్లు పీటీఐ పేర్కొంది.
జమ్మూకశ్మీర్‌లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పెద్ద దాడి ఇదే.
అక్టోబర్ 18న జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో అశోక్ చౌహాన్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆయన శరీరంపై బుల్లెట్ గాయాలు కనిపించాయి.
అశోక్ చౌహాన్ బిహార్‌కు చెందిన వ్యక్తి. జమ్మూకశ్మీర్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏమన్నారు?
ఈ దాడిని ఖండించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, దాడికి పాల్పడిన వారిని వదిలేది లేదన్నారు.
‘‘పౌరులపై జరిగిన ఈ మిలిటెంట్ల దాడి హేయమైన చర్య. ఈ నీచమైన దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు. మా భద్రతా బలగాల నుంచి గట్టి స్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో అమిత్ షా పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ దాడిని ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
‘‘సోనామార్గ్ గగన్‌గీర్ ప్రాంతంలోని స్థానికేతర కార్మికులపై జరిగిన ఈ దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. వీరు ఈ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ఎలాంటి ఆయుధాలు లేని, అమాయక ప్రజలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి’’ అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
భద్రతా బలగాలు ఈ దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు.
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరీ, పరిస్థితిని మెరుగుపర్చడంపై మాట్లాడారు.

ఫొటో సోర్స్, ANI
‘కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి’
ఈ దాడి వెనుక పాకిస్తాన్ కుట్రం ఉందని బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీంద్ర ఆరోపించారు.
‘‘కశ్మీర్‌లోని సోనామార్గ్‌లో పాకిస్తానీ మిలిటెంట్లు అమాయక కార్మికులపై ఈ దాడికి పాల్పడ్డారు. ఇది మానవత్వంపై జరిగిన దాడి. ఆయుధాలు లేని, అమాయక కార్మికులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడికి పాకిస్తాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తాన్ని ఆర్మీ, పోలీసులు గాలిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారికి త్వరలోనే శిక్ష పడుతుంది’’ అని ఆయన అన్నారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
‘‘జమ్మూకశ్మీర్‌లోని గందర్బాల్ ప్రాంతంలో మిలిటెంట్లు దాడి చేసి డాక్టర్, వలస కార్మికులను హత్య చేయడం పిరికిపంద చర్య, క్షమించరాని నేరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. జమ్మూకశ్మీర్ నిర్మాణ ప్రక్రియను, ప్రజల నమ్మకాన్ని ఈ మిలిటెంట్ల చర్య వమ్ము చేయదు. ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతా కలిసి పోరాటం చేస్తుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














