రేవంత్ రెడ్డిని బూతులు తిడుతూ వీడియో, ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్ - ముఖ్యమంత్రి ఏమన్నారు

ఫొటో సోర్స్, X/revathitweets
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషిస్తున్న వీడియోను యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేయడంతోపాటు సోషల్ మీడియాలో పోస్టు చేసి ట్రోల్ చేసినందుకు వారిని అరెస్టు చేసినట్లుగా హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.
ఈ అరెస్టు వ్యవహారాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఖండించగా ప్రభుత్వం సమర్థించుకుంది.

ఆ వీడియోలో ఏముందంటే..
హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ పి.రేవతి గతంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం పల్స్ న్యూస్ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు.
ఈ చానల్‌లో బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.
రైతుగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషిస్తున్న వీడియోను పల్స్ న్యూస్ యూట్యూబ్ చానల్‌తోపాటు నిప్పుకోడి అనే ఎక్స్ ఖాతాలో మార్చి 10న పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, screengrab
ఆ తర్వాత అదే వీడియోను తన్వి యాదవ్ తన ఇన్ స్టా అకౌంట్‌లోనూ పోస్టు చేశారు.
ఈ వీడియోను బీబీసీ పరిశీలించింది.
ఇందులో ఓ వ్యక్తిని పల్స్ న్యూస్ రిపోర్టర్ తన్వి యాదవ్ ఇంటర్వూ చేస్తున్నట్లుగా ఉంది.
ఆ వ్యక్తి రేవంత్ రెడ్డిని తీవ్ర అసభ్య పదజాలంతో బూతులు తిడుతున్నట్లుగా ఉంది.
వీడియోలో.. వినలేని, ఇక్కడ రాయలేని బూతులు చాలా ఉన్నాయి.
అందుకే ఆ వీడియో లింకును కూడా మేం ఇక్కడ ఇవ్వడం లేదు.
'పోలీసుల రక్షణ లేకపోతే రేవంత్ రెడ్డిని చంపేస్తా' అంటూ బెదిరించడం ఆ వీడియోలో కనిపించింది.
అయితే, ఈ వీడియోలో మధ్యలో ఓ చోట.. ''ముఖ్యమంత్రిని అట్ల తిట్టొద్దు'' అని సదరు వ్యక్తితో అన్నారు తన్వియాదవ్.

ఫొటో సోర్స్, x.com/thanviyadav
పోలీసులకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు
ఈ వీడియోను పోస్టు చేసి ట్రోల్ చేయడంపై మార్చి 10న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీఎస్ వంశీ కిరణ్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
''పల్స్ న్యూస్ తరఫున ఒక వ్యక్తిని రెచ్చగొట్టి రేవంత్ రెడ్డిని తీవ్రంగా తిట్టించారు'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు.. ఎ1 గా రేవతి, ఎ2గా సంధ్య, ఎ3గా నిప్పుకోడి అనే ఎక్స్ హ్యాండిల్ యూజర్‌ను చేర్చారు.
పల్స్ న్యూస్ యూట్యూబ్ చానల్ కార్యాలయంలో తనిఖీలు చేసి ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు, లోగో మైకు, సీపీయూ, రౌటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా సైబర్ క్రైం పోలీసులు చెప్పారు.
అనంతరం వారిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఒకేసారి అన్ని ఖాతాల్లో షేర్ చేశారంటున్న పోలీసులు
సాధారణంగా మీడియా రంగంలో ఎవరైనా సరే బూతులు మాట్లాడినా లేదా అసభ్య పదజాలం వాడినా వాటిని ఎడిట్ చేసి వాడుతుంటారు.
అలాంటిదేమీ లేకుండా వినడానికి కూడా వీల్లేని భాషలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టిన వీడియోను పల్స్ న్యూస్ తరఫున షేర్ చేశారు.
''పక్కా ప్రణాళికతోనే సదరు వ్యక్తిని రెచ్చగొట్టి సీఎంకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలం వాడించి మాట్లాడించారు.'' అని హైదరాబాద్ సైబర్ క్రైం అదనపు సీపీ పి.విశ్వప్రసాద్ చెప్పారు.
పోలీసుల విచారణలో నిప్పు కోడి అనే ఎక్స్ హ్యాండిల్‌తోపాటు పల్స్ న్యూస్ యూ ట్యూబ్ చానెల్‌లో ఈ తరహా వీడియోలు ఇంకా ఉన్నట్లుగా తేలింది.
బీబీసీ ఆయా ఖాతాలను పరిశీలించినప్పుడు, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నట్లుగానూ, బూతులు తిడుతున్న వీడియోలు గతంలోనూ పోస్టు చేసి ఉన్నాయి.
బీఆర్ఎస్‌కు, ఆ పార్టీ నేతలకు అనుకూలంగా వీడియోలు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ను ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా వీడియోలున్నాయి.
జర్నలిజం పేరుతో వ్యక్తిగతంగా దూషణలు, బెదిరింపులకు పాల్పడిన వీడియోలు పోస్టు చేయడం ఏ మాత్రం సరైనది కాదని సీనియర్ జర్నలిస్టు, మన తెలంగాణ పత్రిక ఎడిటర్ దేవులపల్లి అమర్ చెప్పారు.
ఈ వ్యవహారంపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
''జర్నలిజం అంటే ప్రజలకు సమాచారం తెలియజేయడం. అలాంటిది యూట్యూబ్ చానల్‌లో అలాంటి వీడియోలు పోస్టు చేయడం సరైనదేనా.. అని ఆలోచించాలి..
అదేమీ లైవ్ కాదు. ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ అలాంటి వ్యాఖ్యలున్న వీడియోను ఆపకుండా ప్రజలల్లోకి పంపించి కేసు లేకుండా ఉండాలంటే.. ఎలా సాధ్యమవుతుంది?'' అని అన్నారు.
'పోలీసుల రక్షణ లేకపోతే రేవంత్ రెడ్డిని చంపేస్తా' అంటూ ఆ వీడియోలోని వ్యక్తి బెదిరింపులకు సైతం దిగాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గానీ, ఇలాంటి వ్యాఖ్యలున్న వీడియోలు పోస్టు చేయడం గానీ సరికాదని చెప్పారు దేవులపల్లి అమర్.

ఫొటో సోర్స్, UGC
బీఆర్ఎస్ ఆఫీసులో రికార్డ్ చేశారా?
మరోవైపు, వీడియో రికార్డు చేసిన ప్రదేశంపైనా వివాదం రేగింది.
రేవంత్ రెడ్డిని దూషించిన వీడియోను ఫిబ్రవరిలో రికార్డు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
''వీడియోను మార్చి పదో తేదీన ఒకేసారి వారికి చెందిన అన్ని ఖాతాల్లో పోస్టు చేసి వైరల్ చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు.'' అని పి.విశ్వప్రసాద్ చెప్పారు.
''ఒక పొలిటికల్ పార్టీతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. వీడియోలో మాట్లాడేవారికి డబ్బులు ఇచ్చి అసభ్యకరమైన పదజాలం చెప్పిస్తూ రికార్డు చేయించినట్లుగా మా విచారణలో తేలింది.'' అని చెప్పారు.
ఈ వీడియోను పల్స్ న్యూస్ రిపోర్టర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రికార్డు చేశారని పోలీసులు చెబుతున్నారు.
''వీడియోను బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రికార్డు చేసినట్లు అర్థమవుతోంది.'' అని మీడియాకు చెప్పారు పి.విశ్వప్రసాద్.
వీడియో ఎక్కడ రికార్డు చేశారనే విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
'నా గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది..'
మార్చి 12వ తేదీన అరెస్టు తర్వాత రేవతి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మీడియాను నియంత్రించాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు.
తనను తెల్లవారుజామున నాలుగున్నర, ఐదు గంటల సమయంలో పోలీసులు వచ్చి అరెస్టు చేశారని చెప్పారు.
''ఒక వృద్ధుడు పల్స్ న్యూస్‌తో మాట్లాడుతూ తనకు వచ్చిన భాషలో తనకున్న అసహనాన్ని ప్రదర్శించాడు. తెలంగాణ కాంగ్రెస్ కేసులు పెట్టి పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించే పనిలో ఉంది'' అని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ విషయంపై సైబర్ క్రైం అదనపు సీపీ విశ్వప్రసాద్ స్పందించారు.
''మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఎదుటి వ్యక్తులను తీవ్రమైన అసభ్య పదజాలంతో తిట్టకూడదు కదా..? అన్ని హద్దులు దాటి మాట్లాడకూడదు కదా..?'' అని అన్నారు.
వీడియోలో వాడిన భాషను మీడియా ముందు తానే మాట్లాడలేకపోతున్నానని చెప్పారాయన.
అయితే, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరుపై దేవులపల్లి అమర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
''తెల్లవారుజాము సమయంలో మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, x.com/revanthreddy
ఆ తిట్లలో నా పేరు తీసేసి మీ పేరు రాసుకుని వినండి: రేవంత్ రెడ్డి
ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం(15.03.2025) అసెంబ్లీలో మాట్లాడారు. 'పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో పెడుతున్నారు. వాళ్లు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే పోలీసులు కేసులు పెట్టారు. వారు సామాజిక మాధ్యమాలలో పెట్టిన భాషను చూడండి. అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు? అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎవరు పడితే వాళ్లు ఒక ట్యూబ్ పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడితే జర్నలిస్ట్ అవుతారా? వాళ్లు మాట్లాడే భాష చూస్తే రక్తం మరిగిపోతుంది. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం. కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే... మీకు భార్యబిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, చెల్లినో, భార్యనో ఇలా అంటే మీరు వింటారా. నా భార్యను, బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది. ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే మీకు నొప్పి కలగదా? ఏ సంస్కృతిలో ఉన్నామని నేను అడుగుతున్నాను. వాళ్లు తిట్టిన తిట్ల చోట నా పేరు తీసేసి మీ పేరు రాసుకుని వినండి. అవి విన్నాక అన్నం తినబుద్ధి అవుతుందేమో చూడండి' అన్నారు రేవంత్ రెడ్డి.
రేవతిపై గతంలో రెండు కేసులు నమోదు
కాగా రేవతి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఓ కేసులో అరెస్టయ్యారు.
రేవతిపై గతంలోనూ రెండు కేసులున్నాయని చెప్పారు పోలీసులు. గతంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న విమర్శలున్నాయి.
2019లో ఓ లైవ్ షోలో దళిత వ్యక్తిని దూషించిన కేసులో రేవతి జైలుకు వెళ్లి వచ్చారని, నిరుడు టీఎస్పీడీసీఎల్‌కు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేసు నమోదైందని పి.విశ్వప్రసాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Editors Guild Of India
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏమంటున్నాయంటే..
అరెస్టు చేసిన తీరుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది.
తెల్లవారుజామున మహిళ జర్నలిస్టు ఇంటికి వెళ్లి అరెస్టు చేయడం సరికాదని పేర్కొంది.
''ఎలాంటి కక్షపూరితంగా ఉండకుండా పారదర్శకంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తూ జర్నలిస్టు బాధ్యతగా వార్తా కథనాలు అందించాల్సిన అవసరం ఉంది.'' అని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
మరోవైపు, మహిళ జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్ఎస్ పార్టీ ఖండించింది.
''ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న దాడులను, అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలి.'' అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ మీడియా సలహాదారు శ్రీరామ్ కర్రి స్పందించారు.
బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న అసభ్య, అమర్యాదపూర్వక వ్యాఖ్యలను రాజకీయ విమర్శగా ఎవరూ భావించరని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














