తెలంగాణ: పార్టీ మారిన ఆ 10మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా?

ఫొటో సోర్స్, FB/Revanth,Kcr
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయం. త్వరలోనే ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి'' అని ఇటీవల వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
గత కొన్ని రోజులుగా కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.
ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా నలుగుతున్న అంశం కూడా ఇదే.
తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వేసిన పిటిషిన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. నిర్ణీత కాలవ్యవధిలోగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై ఈ నెల 18న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల), ఎం.సంజయ్ కుమార్ (జగిత్యాల) పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటువేయాలని స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
దీనిపై ఫిబ్రవరి 4న ఆ ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.
ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఒత్తిడి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఫొటో సోర్స్, legislature.telangana.gov.in/main/Screengrab
తెలంగాణ అసెంబ్లీలో ఎవరి బలం ఎంత?
తెలంగాణ అసెంబ్లీకి 2024 నవంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. మిత్రపక్షంగా ఉన్న సీపీఐ నుంచి ఒకరు గెలిచారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించడంతో ఆ పార్టీ బలం 65కు పెరిగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ చెబుతుండటంతో.. గులాబీ పార్టీ బలం 29కు తగ్గినట్లు అయింది.
తమ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే ప్రజల్లో ప్రస్తావిస్తున్నారు.
''పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ అనర్హతకు గురవడం ఖాయం. ఆ స్థానాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి. ఎన్నికలకు సిద్ధం కావాలి'' అని శ్రేణులకు కేటీఆర్ చెబుతున్నారు.
అయితే పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
2014, 2018లో బీఆర్ఎస్‌లోకి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మారిన విషయాన్ని వాళ్లు గుర్తుచేస్తున్నారు.
''గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించి ఎన్నికలకు ఎందుకు వెళ్లలేదు'' అని కేటీఆర్‌ను ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.

ఫొటో సోర్స్, FB/BRSParty
బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది?
తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులు కొత్త విషయమేం కాదు.
2014లో రెండు రాష్ట్రాలు విడిపోయి, సరిపడా ఎమ్మెల్యేలతో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడినా, అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులను ఆహ్వానించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 66 మంది ఎమ్మెల్యేలలో 23 మందిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమవైపు తిప్పుకొంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభా పక్షం మొత్తాన్ని విలీనం చేసుకుంది.
మొదట ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్లగా, ఆ తర్వాత 10మంది ఎమ్మెల్యేలు టీడీపీ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరడం, ఆయన దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 15 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ .. నాలుగేళ్లు గడిచేసరికి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్యలు మాత్రమే ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా మిగిలారు.
తెలంగాణలో 2018 ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు (సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు) కూడా తమను పార్టీలో విలీనం చేసుకోవాల్సిందిగా టీఆర్ఎస్‌ను కోరగా ఆ విలీనం కూడా జరిగిపోయింది.
2018 ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా దశలవారీగా 16 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరగా, కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సభ్యులు ముగ్గురే అసెంబ్లీలో మిగిలారు.
''గతంలో బీఆర్ఎస్‌లోకి తెలుగుదేశం, కాంగ్రెస్ శాసన సభాపక్షాల విలీనం జరిగింది. వాటిని ఫిరాయింపులుగా భావించకూడదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు అది శాసన సభాపక్షం విలీనం అవుతుంది'' అని బీబీసీతో చెప్పారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.
ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఈ విలీన ప్రక్రియకు ముందే అప్పటి స్పీకర్‌కు విజ్జప్తి చేశామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
''కాంగ్రెస్ నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారగానే అనర్హులుగా ప్రకటించాలని కోరాం. కానీ, స్పీకర్ మా వినతిని వినకుండా ఎమ్మెల్యేలందరూ చేరేవరకు వేచి చూసి విలీనం అయినట్లుగా ప్రకటించారు'' అని చెప్పారు అద్దంకి దయాకర్.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు పార్టీలు వక్రభాష్యం చెబుతున్నాయని అభిప్రాయపడ్డారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్.
''రాజ్యాంగంలో ఎక్కడా లెజిస్లేచర్ పార్టీ అనేది ఉండదు. రాజకీయ పార్టీ విలీనం ఉంటుంది కానీ లేజిస్లేచర్ పార్టీ విలీనం ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లేజిస్లేచర్ పార్టీ విలీనాన్ని తప్పుగా అన్వయించారు. లెజిస్లేచర్ పార్టీ అనేది కేవలం అసెంబ్లీకి పరిమితమైన వ్యవహారం. పార్టీ విలీనం అంటే.. ఆ తర్వాత ఆ పార్టీయే ఉండకూడదు. కానీ విలీనం తర్వాత కూడా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది కదా'' అని ప్రొఫెసర్ నాగేశ్వర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'రీజనబుల్ టైం' అంటే ఎంత?
'రీజనబుల్ టైం'లో అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టుకు నివేదించింది తెలంగాణ స్పీకర్ కార్యాలయం.
ఈ 'రీజనబుల్ టైం' అంటే ఎంత అనేది ఇప్పుడు కీలకంగా మారింది.
దీనిపై మాజీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
మణిపుర్‌లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో నిర్ణయానికి కాల వ్యవధి మూడు నెలలు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయనన్నారు. రాజ్యాంగంలో గాని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో గాని ఈ సమయం నిర్దుష్టంగా లేదని ఆయన చెప్పారు.
2004-09 మధ్య కాలంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారంటూ అనర్హత వేటు వేశారు అప్పట్లో స్పీకర్‌గా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి.
''ప్రతి కేసును వేర్వేరుగా చూడాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా అప్పటి నిర్ణయాలుంటాయి. తర్వాత కూడా 2014 నుంచి 2023 మధ్య కాలంలో శాసన సభాపక్షాల విలీనాలు జరిగాయి'' అని చెప్పారు సురేష్ రెడ్డి.
అయితే, ఇలాంటి విషయాలను స్పీకర్ ఎక్కువకాలం పెండింగులో ఉంచడం సరికాదని, ఇది నైతికతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వర్. రాజ్యాంగంలో నిర్దేశిత సమయం చెప్పకపోయినా సరే... స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, https://manifesto.inc.in/Screengrab
కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే...
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి పార్టీని విడిచినా లేదా చట్టసభల్లో ఓటింగ్ సమయంలో పార్టీ నాయకత్వం ఆదేశాలు ధిక్కరించినా ఫిరాయింపులకు పాల్పడినట్లుగా పరిగణిస్తారు.
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేసింది.
''రాజ్యాంగంలోని పదో షెడ్యూలుకు సవరణ చేసి, ఎమ్మెల్యేలు లేదా ఎంపీ పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హులయ్యేలా చట్టం చేస్తాం'' అని చెప్పింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాము అడుగుతున్నామని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బీబీసీకి వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














