ఇండోనేషియా అధ్యక్షుడిది భారతీయ డీఎన్ఏనా? ఆయన ఏం చెప్పారు?

ప్రబోవో సుబియాంతో

ఫొటో సోర్స్, ANI

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భారత పర్యటన ముగిసింది. అనంతరం ఆయన మలేసియా చేరుకున్నారు. అయితే ఆయన భారత పర్యటన చర్చనీయాంశమైంది.

భారత గణతంత్ర వేడుకలకు సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యూ దిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పాల్గొని, గౌరవ వందనం స్వీకరించారు.

అంతకుముందు శనివారం మధ్యాహ్నం దిల్లీలో రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద సుబియాంతో నివాళులు అర్పించారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన డీఎన్ఏ గురించి సుబియాంతో చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భారత పర్యటన

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత గణతంత్ర వేడుకలకు సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు

ఇండోనేషియా అధ్యక్షుడు ఏమన్నారు?

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందులో రాష్ట్రపతి, ప్రధానితో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, ఇండోనేషియా అధ్యక్షుడు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి భవన్ ఆదివారం విడుదల చేసింది.

వీడియోలో భారత ప్రధాని, రాష్ట్రపతి.. మిగిలిన అతిథులంతా డిన్నర్ టేబుల్ వద్ద కూర్చున్నారు. ఆ సమయంలో సుబియాంతో మాట్లాడారు.

''రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొన్ని వారాల క్రితం నాకు జెనెటిక్ సీక్వెన్సింగ్, డీఎన్‌ఏ టెస్ట్ జరిగింది. నాలో భారతీయ డీఎన్‌ఏ ఉందని వారు చెప్పారు. నేనెప్పుడు భారతీయ సంగీతాన్ని విన్నా డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తానని అందరికీ తెలుసు. బహుశా దీనికి కారణం అదేనేమో" అని సుబియాంతో అన్నారు.

ఇండోనేషియా అధ్యక్షుడు ఇలా చెప్పడంతో పక్కనే కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌కర్ గొల్లున నవ్వారు.

ఈ వ్యాఖ్యలకు ముందు భారత్, ఇండోనేషియాల మధ్య చారిత్రక సంబంధాల గురించి సుబియాంతో మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సుబియాంతో, ద్రౌపది ముర్మ, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, X/narendramodi

'మాపై భారతీయ నాగరికత ప్రభావం ఉంది'

"భారత్‌, ఇండోనేషియాలకు సుదీర్ఘ ప్రాచీన చరిత్ర ఉంది. నాగరికత సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల భాషలు సంస్కృతం నుంచి ఉద్భవించాయి'' సుబియాంతో చెప్పారు.

"ఇండోనేషియాలోని చాలా పేర్లు సంస్కృతంలోనివే. ప్రాచీన భారతీయ నాగరికత ప్రభావం మా రోజువారీ జీవితంలో బలంగా కనిపిస్తుంది. మా జన్యుశాస్త్రంలో ఇదొక భాగం కావొచ్చు" అని సుబియాంతో అన్నారు.

ఈ కార్యక్రమంలో సుబియాంతో కంటే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మాట్లాడారు. భారత్, ఇండోనేషియాల మధ్య నాగరికత సంబంధాలు వేల సంవత్సరాల నాటివని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఒడిశాలో జరుపుకొనే 'బాలి జాతర' పండుగను రాష్ట్రపతి ముర్ము ఉదహరించారు.

ఇది పురాతన కాలంలో భారత్ నుంచి బాలి, ఇండో-పసిఫిక్‌లోని ఇతర ప్రాంతాలకు భారతీయ నావికులు, వ్యాపారులు చేసిన వాణిజ్య ప్రయాణాలను గుర్తుచేస్తుందని రాష్ట్రపతి తెలిపారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో నేటికీ 'బాలి జాతర'ను జరుపుకుంటారు.

ఇండోనేషియా ప్రతినిధులు

ఫొటో సోర్స్, ANI

ఇండోనేషియా ప్రతినిధులు బాలీవుడ్ పాట 'కుచ్ కుచ్ హోతా హై' పాటను పాడారు.

'కుచ్ కుచ్ హోతా హై'

ఇదే కార్యక్రమంలో ఇండోనేషియా ప్రతినిధి బృందం బాలీవుడ్ పాపులర్ చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై' టైటిల్ ట్రాక్‌ని పాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ బృందంలో పలువురు సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు.

ఈ సమయంలో భారత్, ఇండోనేషియా దౌత్యవేత్తలు, అధికారులు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పోషించిన కాజోల్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఎక్స్‌లో రీపోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)