‘ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది’ అని చిరంజీవి ఎందుకన్నారు, దానిపై వివాదం ఏమిటి?

చిరంజీవి, పార్టీ గుర్తులు, పవన్ కల్యాన్

ఫొటో సోర్స్, Getty Images/prajarajyam/janasenaparty

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

''రాజకీయాలకు నేను దూరమైనప్పటికీ రాజకీయం నాకు దూరం కాలేదు..'' రెండున్నర ఏళ్ల కిందట వచ్చిన గాడ్‌ ఫాదర్‌ సినిమాలో చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్‌ నిజ జీవితంలో కూడా వర్తిస్తోందా?

యువ నటుడు విష్వక్‌సేన్ సినిమా 'లెలా' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల ప్రస్తావన తెచ్చారు.‘‘ జై జనసేన.. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా.. అయాం వెరీ హ్యాపీ'' అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు దాటిన తరువాత చిరంజీవి మొదటిసారి బహిరంగంగా జైజనసేన అనడం కొత్త చర్చకు దారితీస్తోంది. 2014 ఎన్నికల తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ చెబుతూ వచ్చిన చిరంజీవి, తాజా కామెంట్‌తో ఆయన పొలిటికల్ రీ ఎంట్రీపైనా చర్చ సాగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షైన్ స్క్రీన్స్, చిరంజీవి

ఫొటో సోర్స్, Shine Screens

ఫొటో క్యాప్షన్, విష్వక్‌ సేన్ నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి చెప్పారు

ఇదీ ‘చిరు’ ప్రస్థానం

చిరంజీవికి రాజకీయాలకు ముడి ఎక్కడ మొదలైందో ఒక్కసారి పరిశీలిస్తే

1978లో సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి 1983లో ఖైదీ సినిమాతో స్టార్‌డమ్‌ పొందారు. అంతకుముందే అగ్రశ్రేణి నటుడిగా ఉన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి సీఎం అయ్యారు.

ఖైదీ విజయం తరువాత వరుసహిట్లతో చిరంజీవి సినీ పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

ఇలా చిరంజీవి రెండు దశాబ్దాల కాలంలోనే సినీపరిశ్రమలో అగ్రశ్రేణి నటుడిగా ఎదగడంతోపాటు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెంచుకున్నారు. దీంతో ఆయన రాజకీయాలలో వస్తారనే చర్చ మొదలైనా, వివిధ సందర్భాలలో చిరంజీవి దానిని తోసిపుచ్చారు.

nara chandrababunaidu, chiranjeevi, chiranjivi

ఫొటో సోర్స్, facebook/narachandrababunaidu

సీఎంలతో సన్నిహితంగా..

చిరంజీవికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం ఉండేది. 1996 నుంచే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చిరంజీవి ఎంతో సన్నిహితంగా మెలిగే వారు. అన్నయ్య వంటి చిత్రాల శతదినోత్సవ సభలకు బాబును ఆహ్వానించారు.

2002లో ఇంద్ర వజ్రోత్సవ సభలో చంద్రబాబు చిరు అభిమానులను ఉద్దేశించి ''మీ నాయకుడు చిరంజీవి'' అని మాట్లాడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు అప్పట్లో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో చిరు మాటకు ఎంతో గౌరవం ఉండేదనే ప్రచారం జరిగింది.

ఇక ఆ తర్వాత 2004లో వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వంలో కూడా చిరు హవా తగ్గలేదు. పులివెందుల ఉత్సవాలకు వైయస్‌ దగ్గరుండి చిరంజీవిని హెలికాప్టర్లో తీసుకువెళ్లారు.

2008లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సాక్షి దినపత్రిక ఆవిష్కరణలోనూ చిరంజీవి అతిథిగా పాల్గొన్నారు.

ఆ పత్రిక ఫ్యామిలీ ఎడిషన్‌ను చిరంజీవితోనే ప్రారంభింపజేశారు.

ఇలా ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవిని ఆయన అభిమానులు మీరు ఎప్పుడు సీఎం అవుతారంటూ రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

చిరంజీవి

ఫొటో సోర్స్, Getty Images

ప్రజారాజ్యం స్థాపన

రాజకీయాల్లోకి తొలుత అంతగా ఆసక్తి చూపని చిరంజీవి చివరకు ప్రజారాజ్యం పార్టీ స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు 2008 ఆగస్టులో ప్రజారాజ్యం ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చారు.

''మార్పు కోసం'' అనే నినాదంతో 2008లో తిరుపతిలో ఘనంగా పీఆర్పీ ప్రారంభం కాగా, 2009లో జరిగిన ఎన్నికల్లో ఆ నాటి సమైక్య రాష్ట్రంలో ఆ పార్టీ కేవలం 18 సీట్లను మాత్రమే గెలుపొందింది.

చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీ చేసి తిరుపతి నుంచి మాత్రమే గెలిచారు.

ఆ ఎన్నికల్లో పీఆర్పీ 18% ఓట్లు సాధించింది.

ఇక 2009 సెప్టెంబర్‌ లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాతి పరిణామాల్లో చిరంజీవి.. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

ఇందులో భాగంగా తాను కేంద్ర మంత్రి కావడంతో పాటు రాష్ట్రంలో తన పార్టీ నేతలకు రెండు మంత్రి పదవులు ఇప్పించారు.

పవన్ కాంగ్రెస్ హఠావో నినాదం

2014లో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ లోనే ఉన్న చిరంజీవి.. ఆ ఏడాది ఎన్నికల సమయంలో కూడా తాను కాంగ్రెస్‌ లోనే కొనసాగుతానని ప్రకటించారు.

ఆ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డితో కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థులను సైతం చిరంజీవి నిర్ణయించారు.

సరిగ్గా అప్పుడే తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ హఠావో.. దేశ్‌ బచావో అంటూ నినదిస్తూ జనసేన పార్టీ పెట్టగా, దానిపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు.

ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో ఇక చిరంజీవి రాజకీయాలకు దూరం కావడం మొదలుపెట్టారు.

మళ్లీ సినిమాలపై వైపు దృష్టి పెట్టి ఖైదీ నెంబర్‌ 150తో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.

2019 ఎన్నికలకు వచ్చేసరికి చిరంజీవి తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని మరోసారి ప్రకటించారు.

తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కి మంచి జరగాలని కోరుకుంటానే తప్ప తనకు రాజకీయాలతో సంబంధం లేదని వెల్లడించారు.

జగన్, చిరంజీవి

ఫొటో సోర్స్, IandPR,AP

ఫొటో క్యాప్షన్, అప్పటి సీఎం జగన్‌కు చేతులు జోడించి టాలీవుడ్ సమస్యలను వివరించిన చిరంజీవి.

వైయస్‌ జగన్‌తో..

వైఎస్సార్‌సీపీ 2019లో అధికారంలోకి వచ్చి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే చిరంజీవి ఆయన్ను కలిసి అభినందించారు.

చిరంజీవి దంపతులను వైఎస్‌ జగన్‌ ఇంటికి పిలిచి గౌరవించిన విషయాన్ని ఇప్పుడు కూడా వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తుంటారు.

అప్పట్లో చిరంజీవి కూడా వైయస్‌ జగన్‌ పాలనపై పొగడ్తల వర్షం కురిపించేవారు.

సినీ రంగానికి జగన్‌ మేలు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పేవారు.

వైఎస్‌ జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రకటనను కూడా చిరంజీవి అప్పట్లో సమర్థించారు.

దండం పెట్టిన వీడియోతో..

అయితే సినీ టిక్కెట్ల ధర, అదనపు షోల విషయమై చర్చకు వచ్చినప్పుడు చిరంజీవి సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెట్టడం, అదే సమయంలో జగన్‌ పక్కకు చూసే వీడియో వైరల్‌ అయింది.

ఇప్పటికీ ఆ వీడియోపై జనసేన, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య రచ్చ నడుస్తోంది. చిరంజీవిని అవమానించారంటూ జనసేన శ్రేణులు అంటుంటే.. వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం చర్చల సందర్భంలో వచ్చిన ఓ క్లిప్‌ను పట్టుకుని రాద్ధాంతం చేయడం సరికాదని వాదిస్తుంటారు.

ఆ వీడియోపై తప్పుడు ప్రచారాలను చిరంజీవి ఖండించకపోవడం దారుణమవని వైఎస్సార్‌సీపీ నేతలు అంటుంటే.. అసలు వీడియోను అప్పటి ప్రభుత్వమే కావాలని బయటకి రిలీజ్‌ చేసిందని.. చిరంజీవితో కూడా దండం పెట్టించుకునే స్థాయి మాది అని చెప్పించుకునేందుకే అది రిలీజ్‌ చేశారని, లేదంటే ప్రభుత్వంతో చర్చల వీడియో బయటకు ఎలా వస్తుందని ప్రశ్నిస్తుంటారు.

పవన్, నాగబాబు

ఫొటో సోర్స్, Naga Babu/facebook

ఫొటో క్యాప్షన్, 2024 ఎన్నికల వేళ కూడా చిరంజీవి ఎక్కడా జనసేనకు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు

2024 ఎన్నికల వేళ దూరంగానే..

2024 ఎన్నికల వేళ కూడా చిరంజీవి ఎక్కడా జనసేనకు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. అయితే ఎన్నికలకు ముందు పవన్‌ కళ్యాణ్‌ని, నాగేంద్రబాబుని తన షూటింగ్‌ లోకేషన్‌కి పిలిపించుకుని ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆశీర్వదించారు. నా తమ్ముడు కచ్చితంగా మంచి పొజిషన్‌లో చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు.

అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల తర్వాత ఇప్పుడు చిరంజీవి జై జనసేన అనడం చర్చనీయాంశమైంది. ఆయనీ మాట యథాలాపంగా అన్నారా.. లేదంటే ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అంటున్న చిరంజీవి ఇప్పుడు జనసేన నాయకుడుగా మారతారా అనేది చూడాలని రాజకీయ విశ్లేషకులు దారా గోపీ బీబీసీతో అన్నారు. ఇదే క్రమంలో జనసేనతో బంధం ఉన్న బీజేపీ నుంచి ఏమైనా కీలక పదవి తీసుకుంటారా.. అనేది కూడా చూడాలని గోపీ అభిప్రాయపడ్డారు.

modi, chiranjeevi

ఫొటో సోర్స్, Kishan Reddy Gangapuram/FB

ఫొటో క్యాప్షన్, బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో చిరంజీవి సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల దిల్లీలో కిషన్‌ ఇంట నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మోదీతో కలిసి పాల్గొన్నారు.

చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నట్టేనా?

చిరంజీవి పదేళ్లకు పైగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌‌తో మాత్రం తనకు సంబంధం లేదని చెప్పడం లేదు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి కాంగ్రెస్‌ నాయకుడని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌ అరెస్టుపై ఢిల్లీలో ఓ మీడియాతో చేసిన వ్యాఖ్యల్లో ''అర్జున్‌ మేనమామ చిరంజీవి కాంగ్రెస్‌ లీడర్‌ అని చెప్పుకొచ్చారు.

మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో చిరంజీవి సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల దిల్లీలో కిషన్‌ ఇంట నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మోదీతో కలిసి పాల్గొన్నారు.

పవన్ ఓడిపోయింటే ఆ మాట అనేవారా?: వైసీపీ

''చిరంజీవివి అన్నీ పవర్‌ పాలిటిక్సే.,. రాజకీయాల్లో ఆయన ప్రయాణం చూస్తే ఎవరికైనా ఇదే అర్ధమవుతుంది. నాడు పీఆర్పీ ఓడిపోగానే అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేశారు. ఆ పార్టీ కేంద్రంలో పోగానే దూరంగా ఉండిపోయారు. అంతెందుకు..2019 ఎన్నికల మాదిరిగా పవన్‌ కళ్యాణ్‌ 2024లో కూడా ఓడిపోతే చిరంజీవి జై జనసేన అనే వారా?..కచ్చితంగా కాదు'' అని వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన సీనియర్‌ నాయకుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.

‘‘విజయం ఎటువైపు ఉంటే అటే చిరంజీవి ఉంటారు. ఇందులో అనుమానం లేదు..అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ వైపు గాని ఇప్పుడు బీజేపీ వైపు సన్నిహితంగా ఉండడం గానీ చూస్తే ఇది ఎవరికైనా అర్థమవుతుంది.. ’’ అన్నారు కేతిరెడ్డి . చిరంజీవి వ్యవహారశైలి గురించి మేం ముందు నుంచీ అదే చెబుతున్నాం.. జనమే అర్ధం చేసుకోవాలి'' అన్నారు.

పవన్, చిరంజీవి

ఫొటో సోర్స్, facebook/AlwaysRamCharan

జనం మాటే చిరంజీవి చెప్పారు..

''జై జనసేన అనేది మెగాభిమానుల మాటే కాదు.. కోట్లాదిమంది ప్రజల గుండెచప్పుడు.. కోట్లాదిమంది ప్రజల హృదయాలను గెలుచుకున్న చిరంజీవి ఇప్పుడు జన నినాదమైన జై జనసేనను నినదించారు..'' అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

‘‘చిరంజీవి బహిరంగంగా ఇప్పుడు అన్నారు గానీ నాటి ప్రజారాజ్యమే నేడు జనసేన.. ఇందులో అనుమానం ఏముందని’’ ఆయన ప్రశ్నించారు.

''అసలు ప్రజారాజ్యం పార్టీ పుట్టుక కేవలం పవన్‌ కళ్యాణ్‌ ఒత్తిడితోనే ప్రారంభమైంది. కానీ పరాజయం తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళుతున్న నేపథ్యంలో చిరంజీవి తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారే తప్ప ఆయన ఇష్టపూర్వకంగా చేయలేదు. అది ఏమాత్రం నచ్చని పవన్‌ కళ్యాణ్‌ ప్రజారాజ్యం సిద్ధాంతాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసేన పార్టీని స్థాపించారు.. అందుకే చిరంజీవి జై జనసేన'' అని అన్నారని బొలిశెట్టి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)