చిరంజీవి: 'మేము ఆశతో అడగడం లేదు సార్.. అవసరం కోసం అడుగుతున్నాం' - ప్రెస్‌రివ్యూ

చిరంజీవి

ఫొటో సోర్స్, Konidela Chiranjeevi/FB

ఫొటో క్యాప్షన్, చిరంజీవి

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు హాజరైన చిరంజీవి చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించడంతో పాటు, సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

‘‘ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘చలన చిత్ర పరిశ్రమను కొన్ని దశాబ్దాలుగా పరిశీలిస్తే.. సక్సెస్ రేట్ 20 శాతం మాత్రమే. ఈ 20 శాతానికే సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంటుందని అంతా అనుకుంటూ ఉంటారు.

కానీ ఇక్కడ ఇబ్బందులు, కష్టాలు పడేవాళ్లు, రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు.. ప్రత్యక్షంగా వేలమంది, పరోక్షంగా లక్షలాదిమంది ఉన్నారు. ఇలాంటి వారందరూ కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఓ ఐదారుగురు హీరోలో, ఐదారుగురు డైరెక్టర్లో, ఐదారుగురు నిర్మాతలో కాదు సినిమా ఇండస్ట్రీ. వీళ్లంతా బాగున్నారు కదా అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత ఇక్కడ వర్తిస్తుంది.

ఈ మధ్య కరోనాతో 4- 5 నెలలు షూటింగ్స్ ఆగిపోతే కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారో అనేది కళ్లారా చూశాం. మాకు తోచినట్లుగా హీరోలు, ఇండస్ట్రీలోని పెద్దల హకారంతో కొన్ని కోట్లు కలెక్ట్ చేసి మూడు, నాలుగు నెలలు వారికి గ్రాసరీస్ అందించగలిగాం. ఆ తర్వాత లక్కీగా షూటింగ్స్ మళ్లీ మొదలయ్యాయి. అంతా కాస్త ట్రాక్‌లోకి వచ్చారు. కానీ ఒక నెల షూటింగ్ లేకపోతే ఎంతగా అల్లాడిపోయారో అనే విషయం ఈ సందర్భంగా చెప్పదలిచాను. కాబట్టి ఇండస్ట్రీ నిత్యం పచ్చగా ఉంటుందనుకుంటే పొరబాటే.

అలాగే ఏ విపత్తు వచ్చినా, ఏ ప్రమాదం జరిగినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా ముందుగా స్పందించేది సినిమా ఇండస్ట్రీయే. అది గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈరోజున అటువంటి సంక్షోభాన్నే ఎదుర్కొంటుంది. సినిమా కాస్ట్ పెరిగిపోయింది. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు.

దీనికిగానూ ఈ లవ్‌స్టోరి వేదికగా రెండు ప్రభుత్వాలకు నేను విన్నవించుకుంటున్నాను. ఆల్రెడీ పెద్దలు నారాయణదాస్ గారి నేతృత్వంలో చర్చించడం జరిగింది. అంతగా కాస్ట్ పెరిగినప్పుడు ఎందుకు రెవెన్యూ రావడం లేదు అని చర్చించడం జరిగింది. కాబట్టి వినమ్రంగా రెండు ప్రభుత్వాలను అడుగుతున్నాను. ప్లీజ్.. దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి.. మా అభ్యర్థనలకు పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాను.

మేము ఆశకు అడగడం లేదు సార్.. అవసరం కోసం అడుగుతున్నాం.. అది మీరు ఒప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదంటే.. సినిమాలన్ని పూర్తయ్యి కూడా.. విడుదల చేయాలా? వద్దా? అనే సందిగ్థంలో పడిపోయాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే.. రెవెన్యూ వస్తుందా? రాదా? అసలే జనం థియేటర్లకి వస్తారా? రారా? అనేదానిపై ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం వస్తుంది. ఇలాంటి టైమ్‌లో ప్రభుత్వాలు కూడా సపోర్ట్ అందిస్తే.. మళ్లీ చిత్రపరిశ్రమ నిలదొక్కుకుంటుంది. రెండు ప్రభుత్వాలకు ఇది ఇండస్ట్రీ తరపున నా వినతిగా తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

లైంగిక వేధింపులు - ప్రతీకాత్మక చిత్రం

'ఒక్క ముద్దిస్తే రూ.25 వేలు ఇస్తా.. దళిత ఆర్‌ఎంపీకి వేధింపులు

దళిత ఆర్‌ఎంపీ వైద్యురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో చోటుచేసుకున్నదని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

ఇన్‌స్పెక్టర్‌ బి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ ఆర్‌ఎంపీగా స్థానికంగా క్లినిక్‌ నడుపుతున్నారు. అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్‌రెడ్డి వారం క్రితం ఆమె క్లినిక్‌కు వెళ్లి ఆరోగ్య సమస్యపై వైద్య సలహాలు తీసుకున్నాడు. అనంతరం ఆమె సెల్‌ నంబర్‌ తీసుకుని కాల్‌ చేయడం, మెస్సేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు.

ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈనెల 17న మధ్యాహ్నం క్లినిక్‌కు వెళ్లాడు. ‘నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నా.. ఒక్క ముద్దిస్తే రూ.25 వేలు ఇస్తా, 5 నెలలపాటు క్లినిక్‌ షెట్టర్‌ కిరాయి కడతా’నంటూ వేధించాడు. అంతటితో ఆగకుండా అసభ్యకరంగా మాట్లాడాడు.

ఈ విషయాన్ని ఆమె అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అతని ఇంటికి వెళ్లే సరికి పరారయ్యాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ప్రసాద్‌రెడ్డిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారని ఈ వార్తలో రాశారు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, PA MEDIA

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ

‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు’ కెప్టెన్సీకి గుడ్‌బై అంటున్న విరాట్ కోహ్లీ

విరాట్‌ కోహ్లి తన అభిమానులకు మరోసారి షాకిచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ వరకే భారత టీ20 జట్టుకు సారథిగా ఉంటానని చెప్పిన ఈ స్టార్‌ క్రికెటర్‌ ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ముగించాలని నిర్ణయించుకున్నాడని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.

నాయకుడిగా ఈ సీజనే తనకు ఆఖరిదని ఆదివారం ప్రకటించాడు. క్రికెటర్‌గా తన కెరీర్‌ ముగిసే వరకు బెంగళూరు జట్టుతో కొనసాగుతానని చెప్పాడు.

‘‘బెంగళూరు కెప్టెన్‌గా ఇదే నా ఆఖరి ఐపీఎల్‌. ఇది తేలికైన నిర్ణయం కాదు. కానీ.. ఫ్రాంఛైజీ ప్రయోజనాల దృష్ట్యా సరైందని భావిస్తున్నా. గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా క్రికెటర్‌గా కెరీర్‌ ముగిసేవరకు ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకే ఆడతాను. టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకన్నప్పటి నుంచి ఐపీఎల్‌లోనూ సారథ్య బాధ్యతలకు దూరం కావాలని ఆలోచిస్తున్నా. ఈ విషయంపై జట్టు సభ్యులతో చర్చించాను. ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం గొప్ప, స్ఫూర్తిదాయక ప్రయాణం. ఈ అవకాశం కల్పించిన మేనేజ్‌మెంట్‌కు, నా ప్రయాణంలో భాగమైన కోచ్‌లు, ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు’’ అని వీడియో సందేశంలో కోహ్లి పేర్కొన్నాడు.

కోహ్లి బెంగళూరు జట్టుకు గొప్ప ఆస్తి అని, అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆ ఫ్రాంఛైజీ ఛైర్మన్‌ ప్రథమేశ్‌ మిశ్రా చెప్పాడు. కోహ్లి ఐపీఎల్‌ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. 2013లో డానియల్‌ వెటోరి నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అతడి కెప్టెన్సీలో 2016లో ఫైనల్‌ చేరడమే బెంగళూరుకు అత్యుత్తమ ప్రదర్శన. పని భారం తగ్గించుకోవడం కోసం టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు కోహ్లి ఇంతకుముందు తెలిపిన సంగతి తెలిసిందే.

బెంగళూరు తరఫున కోహ్లి ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడాడు. 5 సెంచరీలు సహా 6076 పరుగులు చేశాడు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ అతడి ఐపీఎల్‌ కెరీర్లో 200వ మ్యాచ్‌.

లోబో

ఫొటో సోర్స్, facebook/starmaa

'లోబోను హౌస్‌లో ఎంతోమంది కించపరుస్తున్నారు'... కుండ బద్దలుగొట్టిన ఉమాదేవి

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో రెండోవారం కూడా ముగిసింది. ఫస్ట్‌ వీక్‌లో సరయూ హౌస్‌ నుంచి వెళ్లిపోగా తాజాగా కార్తీకదీపం ఫేమ్‌ భాగ్యం అలియాస్‌ ఉమాదేవి షో నుంచి ఎలిమినేట్‌ అయ్యిందని సాక్షి పత్రిక తెలిపింది.

బండ బూతులు మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆగ్రహానికి గురైన ఆమె సండే ఎపిసోడ్‌లో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. ఆమెను ప్రేమగా పొట్టి అని పిలుచుకునే లోబో ఉమా ఎలిమినేట్‌ అవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కన్నీళ్లు ఉబికి వస్తున్నా వాటిని కనురెప్ప దాటనీయకుండా జాగ్రత్తపడ్డాడు.

ఇక స్టేజీ మీదకు వచ్చిన ఉమతో హోస్ట్‌ నాగార్జున ఓ గేమ్‌ ఆడించాడు. 17 మంది కంటెస్టెంట్ల ఫొటోలు ఉన్న కుండలను ఆమె ఎదుట పెట్టి అందులో 8 కుండలను బద్ధలు కొట్టాలని టాస్క్‌ ఇచ్చాడు. దీంతో ఆట మొదలెట్టిన ఉమా.. నీకు అనిపించింది చెప్పేస్తావ్‌ కానీ, కానీ ఎదుటివాళ్లు ఎలా తీసుకుంటారు? అనేది పట్టించుకోవంటూ సిరి ఫొటో ఉన్న కుండ పగలగొట్టింది. అంతేకాకుండా షణ్ముఖ్‌ ఆట సిరి ఆడుతుందని ఆరోపించింది. లహరి.. ఈ ప్లాట్‌ఫామ్‌ మీద చాలా వీక్‌ అని, పక్కవాళ్లు సపోర్ట్‌ చేస్తేనే ఆడుతుందే తప్ప సొంతంగా ఆడట్లేదని చెప్పింది. సేఫ్‌గా ఆడుతున్నారంటూ ప్రియ ఫొటో ఉన్న కుండ బద్ధలు కొట్టింది.

షణ్ముఖ్‌ను నీ గేమ్‌ నువ్వు ఆడుకోమని సలహా ఇస్తూనే, సిరి కేవలం ఫ్రెండ్‌ మాత్రమేనని, గేమ్‌పరంగా తనను పక్కన పెట్టమని నొక్కి చెప్పింది. ఆ తర్వాత యాంకర్‌ రవి గురించి చెప్తూ అందరినీ దగ్గరకు తీసుకుంటున్నావు, కానీ ఈ క్రమంలో వేరేవాళ్లకు దూరమైపోతున్నావన్న విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరించింది.

లోబోను హౌస్‌లో ఎంతోమంది కించపరుస్తున్నారంటూ ఎమోషనల్‌ అయింది. ఎంతోమంది స్వీట్‌ హార్ట్‌ అని అంటారు, కానీ లోపలి నుంచి అనరు. ఇకనైనా నీ బుర్రతో గేమ్‌ ఆడంటూ సలహా ఇచ్చింది.

యానీ మాస్టర్‌తో ఎటువంటి గొడవా లేదని, కానీ ఆమెకు కోపం ఎక్కువని పేర్కొంది. ఇక్కడ మనకు ఎవ్వరూ ఏం కాదు! అమ్మ, అక్క, చెల్లి అని మాత్రం చూడకండి అని యానీ మాస్టర్‌కు సూచించింది. తర్వాత నటరాజ్‌ మాస్టర్‌ను బాగా ఆడాలని, ఇలాగే ఆడితే వేరే లెవల్‌లో ఉంటారంటూ అతడి కుండ పగలగొట్టింది. అనంతరం అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుందని ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)