రిపబ్లిక్ డే: రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈ 75 ఏళ్లలో ఏం మారింది?

ఫొటో సోర్స్, Getty Images
రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. దాని 75వ వార్షికోత్సవం సందర్భంగా 2024 నవంబర్‌లో భారత పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
పౌరుల హక్కులు, విధులు, అవసరమైన నిబంధనలు ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత దేశానిది. ఇప్పటివరకు 100 సార్లకు పైగా భారత రాజ్యాంగాన్ని సవరించారు.
రాజ్యాంగంలోని వివిధ నిబంధనలు దేశంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇటీవలి సాధారణ ఎన్నికల్లో రాజ్యాంగం ప్రస్తావన వచ్చింది. రాజ్యాంగాన్ని మార్చడం, రద్దు చేయడంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. దీని కారణంగా బీజేపీ సొంతంగా పూర్తి మెజారిటీని పొందలేకపోయిందని చాలామంది ఎన్నికల విశ్లేషకులు విశ్వసించారు.
75వ రాజ్యాంగ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి, సామాజిక న్యాయం, విద్య, అవగాహన, ఆర్థికాభివృద్ధి, మత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి అంశాలతోపాటు దేశాభివృద్ధిలో రాజ్యాంగం ఎంతవరకు తన పాత్రను పోషించిందనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
దీనితో పాటు, సాంకేతికత అభివృద్ధితో తలెత్తుతున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిద్దాం.
బీబీసీ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ 'ది లెన్స్'లో కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముఖేష్ శర్మ ఈ ప్రశ్నలన్నింటినీ చర్చించారు. ఈ చర్చలో దిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అదితి నారాయణి పాశ్వాన్, లఖ్‌నవూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రవికాంత్, లోక్‌సత్తా ఎడిటర్ గిరీష్ కుబేర్ పాల్గొన్నారు.

75 ఏళ్లలో రాజ్యాంగం మార్చిందేంటి?
'రాజ్యాంగం అంటే మన గుర్తింపు' అని దిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అదితి నారాయణి పాశ్వాన్ అన్నారు. రాజ్యాంగం మనకు హక్కులను, సౌకర్యాలను కల్పించిందని ఆమె చెప్పారు.
ఆమె మాట్లాడుతూ.. "అందరికీ రాజ్యాంగం అంటే అంటరానితనం నిర్మూలన, సమాన అవకాశాలు. అది రిజర్వేషన్లను కల్పిస్తోంది. దీని కారణంగానే నేడు మనం వెనుకబడిన వర్గాలు, విద్యాపరంగా లేదా సామాజికంగా వెనుకబడిన వారందరి వాణిని వినగలుగుతున్నాం" అని అన్నారు.
దీనిపై లోక్‌సత్తా ఎడిటర్ గిరీష్ కుబేర్ మాట్లాడుతూ.. "మీరు భారత సంస్కృతి చరిత్రను పరిశీలిస్తే, వీరారాధనలు ఎక్కువ. రాజులు, పాలకుల కేంద్రంగానే అంతా సాగేది. రాజ్యాంగబద్ధ, క్రియాత్మక ప్రజాస్వామ్యం స్థాపన రాజ్యాంగంతోనే సాధ్యమైంది. రాజ్యాంగం లేకుంటే బ్రిటిష్ కాలం నాటి భారత దేశానికి, నేటి భారత దేశానికి పెద్దగా తేడా ఉండేది కాదు" అని అన్నారు.
కోట్లాది మంది దళితులు, మహిళలు, అణగారిన వర్గాల ప్రజలకు రాజ్యాంగం పౌర హక్కులను కల్పించిందని లఖ్‌నవూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రవికాంత్ అన్నారు.
ఈ 75 ఏళ్లలో ప్రజాస్వామ్యం ఎలా అభివృద్ధి చెందిందో చూస్తే దళితులు, వెనుకబడిన తరగతులు, మహిళల భాగస్వామ్యం ఎంతగా పెరిగిందో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. గతంలో ఆచారాలు, మత గ్రంథాల ఆధారంగా నడిచిన దేశం ఇప్పుడు రాజ్యాంగ పుస్తకం ఆధారంగా నడుస్తోందని, అందులో సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం ఉన్నాయన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
రిజర్వేషన్
ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడిన వర్గం) అనేది ఒక నిర్దిష్ట స్థాయి కంటే తక్కువ ఆదాయం, ఆస్తులు ఉన్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వర్గం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉండి ఆర్థికంగా ఇంకా బలంగా లేనివారు ఈ తరగతిలో ఉన్నారు.
ఆర్థిక పరిస్థితి ఆధారంగా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న నేటి కాలంలో దళితులలో మరింత వెనుకబాటు సమస్య తలెత్తుతున్నప్పుడు, సామాజిక అసమానత అనే అంశాన్ని రాజ్యాంగం సరిగ్గా ప్రస్తావించిందా? లేదా దానిని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందా?
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించినంత వరకు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినందుకు ఒకవిధంగా సంతోషంగా ఉందని అదితి పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.
"ఎందుకంటే మీరు సామాన్యులతో మాట్లాడితే, మీరు రిజర్వేషన్ ద్వారా వచ్చారా? అని అడుగుతుంటారు. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగేవారు కూడా ఈడబ్ల్యూఎస్ కిందకి వచ్చారు" అని ఆమె అన్నారు.
"ఒకవేళ ఉప వర్గీకరణను ప్రవేశపెడితే అది దళిత హక్కుల చుట్టూ ఉన్న చర్చను బలహీనపరుస్తుంది. గతకొన్ని దశాబ్దాలుగా దళితులు జాతీయ స్థాయి చర్చల్లో చోటు సంపాదించుకోగలిగారు. ఉప-వర్గీకరణను అమలు చేస్తే సమాజంలో అది అంతర్గత విభేదాలకు దారి తీస్తుంది" అని అదితి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజ్యాంగంపై రాజకీయాలు
రాజ్యాంగంపై రాజకీయాలనేవి సున్నితమైనవి, సంక్లిష్టమైనవి కూడా. రాజకీయ పార్టీలు తరచూ రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి మాట్లాడతాయి, దానిని పరిరక్షిస్తానని వాగ్దానం చేస్తుంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజ్యాంగం గురించిన అంశాన్ని తీసుకొస్తారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి.
దేశంలో కులాలు ఉన్నప్పుడు కుల రాజకీయాలు ఉంటాయని ప్రొఫెసర్ రవికాంత్ అంటున్నారు.
"రిజర్వేషన్ అనేది దాతృత్వం కాదు, పేదరిక నిర్మూలన కార్యక్రమం అంతకంటే కాదు. దాని వెనుక ఉన్న రెండు ప్రధాన కారణాలు విద్య, సామాజిక వెనుకబాటు'' అని ఆయన చెప్పారు.
కాన్షీరామ్ కులాలలో చైతన్యాన్ని తీసుకొచ్చి, వారిలో ఆత్మగౌరవాన్ని నింపారని, బహుజన ఐక్యతకు ప్రయత్నించారని రవికాంత్ అన్నారు.
దీనిపై గిరీష్ కుబేర్ మాట్లాడుతూ.. "ఎన్నికల ఫలితాల తర్వాత లాడ్లీ బెహన్ వంటి పథకాలు విస్తృతంగా చర్చకు వచ్చాయి. అయితే జాతీయ మీడియా చాలావరకు పట్టించుకోని ఒక కీలకమైన అంశం ఉప-వర్గీకరణ. ఇది రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసింది. కుల నిర్మూలన ఆలోచన నిజంగా సమానత్వాన్ని సాధించే లక్ష్యంతో ఉంటే, దానిని అంగీకరించడం సులభం. కానీ కుల సమస్య ఒక రాజకీయ సవాలును సృష్టించింది. మత అంశం ముందుకు రావడంతో కుల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు మతం కూడా సవాళ్లను ఎదుర్కొంటుండటంతో వారు మరొకదానితో ముందుకు రావాలనే ఒత్తిడిలో ఉన్నారు. ఇది వారికి ముఖ్యమైన సవాలు. దళిత నాయకత్వం ఈ సవాలును గుర్తిస్తుందని భావించడంలేదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అవగాహన కల్పించడం
రాజ్యాంగంపై అవగాహన అనేది ఎప్పటికప్పుడు చర్చనీయంగా మారే ముఖ్యమైన అంశం. దేశంలో రాజ్యాంగం ప్రాముఖ్యత గురించి ప్రజలకు మరింత అవగాహన ఉన్నప్పటికీ, అట్టడుగు స్థాయిలోని వారికి ఇప్పటికీ దాని గురించి తెలియదు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులు, విధుల గురించి ప్రజలకు తక్కువ అవగాహన ఉంది. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించాలని అదితి సూచించారు.
"ఇప్పుడు పోరాటం ఆర్థిక స్థితి కోసం కాదు, గౌరవం కోసం" అని ఆమె అన్నారు.
"ఒక దళిత మహిళ, మిగతా వర్గాల్లోని మహిళ ఎదుర్కొనే సమస్యలు వేరు. అదేవిధంగా ఇతర వర్గాల్లోని ఒక పురుషుడు, ఒక దళిత పురుషుడు ఎదుర్కొనే సవాళ్లు భిన్నంగా ఉంటాయి. ఆర్థికంగా లేదా రాజకీయంగా రెండూ ఒకేలా ఉండవచ్చు. కానీ గుర్తింపు విషయంలో అలా ఉండదు. 'నేను ఈ కమ్యూనిటీ నుంచి వచ్చాను' అని చాలామంది చెప్పుకోవడం లేదు. రిజర్వేషన్ అంతిమ లక్ష్యం సిద్ధించిందని నేనైతే భావించడం లేదు" అని అదితి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయ వ్యవస్థ, సోషల్ మీడియా పాత్ర
రాజ్యాంగానికి సంబంధించి న్యాయవ్యవస్థ, మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రెండూ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా పనిచేస్తాయి. పౌరుల హక్కులను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారుతోంది.
దీనిపై ప్రొఫెసర్ రవికాంత్ మాట్లాడుతూ.. మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్య్రాన్ని కల్పిస్తోందని, అయితే మీరు ఏం మాట్లాడవచ్చు, ఎంత చెప్పాలనే దానిపై కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తుచేశారు.
"కొన్నిసార్లు ప్రజలు ఆ ఆంక్షలను పాటించకపోవడాన్ని తరచుగా సోషల్ మీడియాలో చూస్తుంటాం. కానీ బయట తమ గళం వినిపించే అవకాశం దక్కని వారికి సోషల్ మీడియా ఆ అవకాశం ఇచ్చింది" అని అన్నారు.
"భావప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియాలు ప్రజల వ్యక్తిత్వ వికాసానికి ముఖ్యమైనవి. కానీ కొన్నిసార్లు దీనితో ఫేక్ న్యూస్ వంటి సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి" అని రవికాంత్ చెప్పారు.
"గతంలో సుప్రీంకోర్టులోని నలుగురు న్యాయమూర్తులు బయటకు వచ్చి తమపై ఒత్తిడి ఉందని, పని చేయనివ్వడం లేదని చెప్పడం చూశాం. అయితే, కొన్ని తీర్పులను, వాటిని ఇచ్చిన జడ్జీల నియామకాన్ని పరిశీలిస్తే న్యాయవ్యవస్థ సమగ్రత గురించి ప్రశ్నలు తలెత్తుతాయి. సుప్రీంకోర్టు అనుకుంటే రూ. 2,000 నోట్లలో చిప్‌లు ఉన్నాయనే నిరాధార వార్తలు నిలిచిపోయేవి. అయితే, రాజ్యాంగం ఆశించిన స్థాయిలో సుప్రీం క్రియాశీలతను ప్రదర్శించడం లేదని మాత్రం అనుకుంటున్నాను" అని రవికాంత్ అన్నారు.
"బాబా సాహెబ్ అంబేడ్కర్ చివరి ప్రసంగాన్ని పరిశీలిస్తే, అందులో ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పటి పరిస్థితికి అద్దం పడతాయి" అని చెప్పారు రవికాంత్.
దేశంలోని ప్రతి పౌరుడికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టుపై ఎంతో నమ్మకం ఉందని, తమ హక్కులు లేదా విధుల్లో ఏదైనా ముప్పు వాటిల్లిందని భావించినప్పుడల్లా సుప్రీంకోర్టు తగిన విధంగా జోక్యం చేసుకుంటుందని అదితి నారాయణి పాశ్వాన్ అన్నారు.
"నేను పిల్లలకు పాఠాలు చెబుతాను. వారు రాజకీయాలు, లౌకికవాదం, సార్వభౌమాధికారం, గణతంత్రం.. మొదలైన వాటికి అర్థం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుసుకుంటున్నారు" అని ఆమె చెప్పారు.
గిరీష్ కుబేర్ స్పందిస్తూ.. "మనల్ని మనం పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌తో పోల్చుకోవడం కరెక్టేమో. కానీ, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం కలిగిన ఇతర దేశాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉండాలి?" అని ఆయన ప్రశ్నించారు.
"ఒక దేశంలో ఉండాల్సిన రాజ్యాంగ స్ఫూర్తి ఇక్కడ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదని భావిస్తున్నాను" అని గిరీష్ అన్నారు.
"నేను ఎవరినైనా ఎక్కువగా నిందించాల్సి వస్తే అది మీడియానే అవుతుంది. మనం మన పాత్రను సరిగ్గా నిర్వర్తిస్తున్నామని అనుకోవడం లేదు. మనం విఫలమవుతున్నాం. రాజ్యాంగ ఆశయాలను వమ్ము చేస్తున్నాం. మీడియాకు ముఖ్యమైన బాధ్యత ఉంది, కానీ అది నెరవేరడం లేదు" అని గిరీష్ అంటున్నారు.
''జర్నలిజం కూడా జవాబుదారీగా ఉండాలని నమ్ముతున్నాను. ఆర్టీఐ (సమాచార హక్కు)ని జర్నలిజం కిందకు ఎందుకు తీసుకురాకూడదు?'' అని ప్రశ్నించారు.
"మనం బాధ్యతగా భావించే సమాజం మనల్ని జవాబుదారీగా ఉంచాలి. కానీ ఆ సమాజం అలా చేయడం లేదు" అని గిరీష్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














