తెలంగాణ బడ్జెట్: రోడ్ల ప్రైవేటీకరణ నుంచి నిరుద్యోగులకు రుణాల వరకు.. ఏమేం ఉన్నాయంటే

ఫొటో సోర్స్, IPRTelangana
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాష్ట్రంలో 'తెలంగాణ రైజింగ్-2050' ప్రణాళికతో పాలనను ముందుకు నడిపిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
''అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. అంశాలతో తెలంగాణ నమూనా దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాం'' అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు .
మార్చి 19వ తేదీ(బుధవారం)న అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు భట్టి.
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు ఉండగా.. మూల ధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది.
మరోవైపు, ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇంతకీ ఈ బడ్జెట్ విశేషాలేంటి?. నిరుద్యోగులకు ఇచ్చే రుణాలేంటి?


రహదారుల ప్రైవేటీకరణ
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రహదారులను ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో 60 శాతం ప్రైవేటు డెవలపర్ల పెట్టుబడి, 40 శాతం ప్రభుత్వ నిధులతో రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లుగా భట్టి విక్రమార్క ప్రకటించారు.
''17 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను రూ.28 వేల కోట్ల అంచనాతో 2028 నాటికి అభివృద్ధి చేయనున్నాం'' అని ఆయన చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు భట్టి ప్రకటించారు.
19 ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు వీలుగా స్పీడ్ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు.
''మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగు రోడ్డు నిర్మాణం, దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం, మాదక ద్రవ్యాల నిరోధక వ్యూహాల అమలు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి'' అని భట్టి విక్రమార్క ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సుల సంఖ్యను పెంచబోతున్నట్లుగా ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది.
''యానిమేషన్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిర్మాణ రంగం, రిటైల్, మీడియా, సినిమా రంగం, నౌకా, విమానయాన రంగం కోర్సులు తీసుకువస్తున్నాం'' అని చెప్పారు భట్టి విక్రమార్క.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతను ఆర్థికంగా ఆదుకునేందుకు రాజీవ్ యువ వికాసం తీసుకువచ్చినట్లుగా చెప్పారు ఆర్థిక మంత్రి భట్టి.
''యువతకు ఉపాధి కల్పనలో ఇదొక గేమ్ ఛేంజర్'' అని ఆయన అన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రూ.6 వేల కోట్లను కేటాయించినట్లు, అర్హులైన ప్రతి నిరుద్యోగికి స్వయం ఉపాధి కొరకు గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే, కీలక రంగాలకు నిధుల కేటాయింపులు తక్కువగా జరిగాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్ర్త ఆచార్యుడు ప్రొ.చిట్టెడి కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
''అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి కేటాయింపులు చాలా తక్కువ జరిగాయి. ముఖ్యంగా మౌలిక వసతుల పరంగా నిధులు కేటాయింపులు తక్కువగా ఉన్నాయి.'' అని ఆయన చెప్పారు.
అంబేడ్కర్ స్టడీ కోచింగ్ సెంటర్లు జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పడం మంచి పరిణామం అని కృష్ణారెడ్డి అన్నారు. వాస్తవ రాబడికి, అంచనాలకు చాలా తేడాలున్నాయని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, IPRTelangana
మరికొన్ని ముఖ్యాంశాలు
నేషనల్ హైవే 163 ఇరువైపులా హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.
రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు.
హైదరాబాద్ నగరంలో 31 ఫ్లై ఓవర్లు, 17 అండర్ పాస్‌లు, పది రోడ్ల విస్తరణ పనులను రూ.7,032 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం. హెచ్-సిటీలో భాగంగా అమలు.
వచ్చే నెలలో అధికారికంగా సినీ, టీవీ, నాటక కళారంగానికి గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం.

ఫొటో సోర్స్, Getty Images
శాఖల వారీగా కేటాయింపు ఇలా..
వ్యవసాయ శాఖ – రూ.24,439 కోట్లు
పశు సంవర్థక శాఖ – రూ.1,674 కోట్లు
పౌర సరఫరాల శాఖ – రూ.5,734 కోట్లు
విద్యా శాఖ – రూ.23,108 కోట్లు
కార్మిక, ఉపాధి కల్పన శాఖ – రూ.900 కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ – రూ.31,605 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ – రూ.2,862 కోట్లు
షెడ్యూల్డ్ కులాల సంక్షేమం – రూ.40,232 కోట్లు
షెడ్యూల్డ్ తెగల సంక్షేమం – రూ.17,169 కోట్లు
వెనుకబడిన తరగుతల సంక్షేమం – రూ.11,405 కోట్లు
చేనేత రంగం – రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
పరిశ్రమల శాఖ – రూ.3,527 కోట్లు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ – రూ.774 కోట్లు
విద్యుత్తు శాఖ – రూ.21,221 కోట్లు
ఉచిత విద్యుత్తు, గృహజ్యోతి పథకాలు – రూ.3,000 కోట్లు
వైద్యారోగ్య శాఖ – రూ.12,339 కోట్లు
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ – రూ.17,677 కోట్లు
నీటి పారుదల శాఖ – రూ.23,373 కోట్లు
రోడ్లు భవనాల శాఖ – రూ.5,907 కోట్లు
పర్యాటక శాఖ – రూ.775 కోట్లు
క్రీడా శాఖ – రూ.465 కోట్లు
అటవీ శాఖ – రూ.1023 కోట్లు
దేవదాయ శాఖ – రూ.190 కోట్లు
హోం శాఖ - రూ.10,188 కోట్లు

ఫొటో సోర్స్, Facebook/KTR
బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే…
బడ్జెట్ ద్వారా ఆటో డ్రైవర్ నుంచి అన్నదాత వరకు అందరికీ మోసం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు .
''బడ్జెట్లో ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచారు. 6 గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం పాడారు. ట్రిలియన్ డాలర్ల అప్పు దిశగా ఉండే బడ్జెట్ తయారు చేశారు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం'' అని అన్నారు కేటీఆర్.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు .
''ఉన్నంతలో ప్రాక్టికల్‌గా బడ్జెట్ పెట్టారు. గొప్పలకు పోలేదు. అయితే, నీటి పారుదల శాఖకు 23,354 కోట్లు మాత్రమే ఇచ్చారు, ఈ నిధులు సరిపోవు. వైద్య రంగానికి కేవలం 6 శాతం మాత్రమే కేటాయింపులు చేశారు'' అని అన్నారు.
దీన్ని వాస్తవిక బడ్జెట్‌గా అభివర్ణించారు తెలంగాణ మంత్రి సీతక్క.
''బీఆర్ఎస్ హయాంలో కోతల బడ్జెట్ ఉండేది. అందుకే ప్రజలు వాతలు పెట్టారు. ఇప్పుడు మహిళా, రైతు, యువత, అట్టడుగు వర్గాల సంక్షేమ బడ్జెట్‌గా ఉంది. వాస్తవాలను ప్రతిబింబించేలా ఉంది'' అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














