బ్రెజిల్‌లో రూ. 41 కోట్లు పలికిన ఒంగోలు జాతి పశువు, ఈ జాతి అసలు ఎలా ఫేమస్ అయ్యింది?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
బ్రెజిల్ మార్కెట్‌లో ఒంగోలు జాతి పశువు ధర రూ. 41 కోట్లు పలికినట్లు మీడియాలో కథనాలు రావడంతో ఈ జాతి పశువుల ప్రాశస్త్యం చర్చలో నిలిచింది.
ఫిబ్రవరిలో బ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతి ఆవు (వియాటినా 19 రకం) అధిక ధరకు అమ్ముడై ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించిందంటూ కథనాలు వచ్చాయి.
ఇదంతా ఒంగోలు జాతి పశువుల వైభవమని పేర్కొంటూ ప్రకాశం జిల్లా వాసులు, ప్రత్యేకించి కరవది గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


‘‘అది మా ఊరి ఆవే...’’
ఒంగోలు జిల్లా కేంద్రానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని కరవది ఒకప్పుడు ఈ ఒంగోలు జాతి పశువులకు పెట్టింది పేరు.
ఈ ఊరికి చెందిన పోలవరపు హనుమయ్య 1960ల్లో బ్రెజిల్ దేశస్థుడికి ఆవును, ఎద్దును అమ్మారని, వాటి సంతతికి చెందిన ఆవు ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో రికార్డు ధర దక్కించుకుందని ఈ గ్రామస్థుడు పోలవరపు చెంచురామయ్య సంతోషం వ్యక్తం చేశారు.
తమ గ్రామానికి చెందిన ఆవు వల్ల దేశానికి, రాష్ట్రానికి గొప్ప పేరు రావడం ఎంతో ఆనందంగా ఉందని మాజీ సర్పంచ్ పోలవరపు వెంకట్రామయ్య అన్నారు.

'ఇప్పటికీ ఆ ఎద్దు వీర్యాన్ని భద్రపరిచి ఉంచారు'
"1962లో పోలవరపు హనుమయ్యకు చెందిన ఎద్దును టికో అనే వ్యక్తి రూ.60వేలకు కొని బ్రెజిల్ తీసుకువెళ్లారు. ఆయన దాని వీర్యాన్ని భద్రపరిచారు. ఈ రోజుకీ దాని వీర్యం బ్రెజిల్ వాళ్ల వద్ద ఉంది'' అని ఒంగోలుకి చెందిన రైతు, డాక్టర్ చుంచు చెలమయ్య బీబీసీతో అన్నారు. ఆయన ఒంగోలు గిత్తలపై పరిశోధనలు చేస్తున్నారు.
"అప్పుడు నేను ఆ ఎద్దును చూశాను. దిల్లీలో అప్పటో జరిగిన పశువుల పోటీల్లో ఆ ఎద్దుకు ప్రథమ బహుమతి వచ్చింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా దాన్ని అభినందించారు. దాంతో బ్రెజిల్ దేశస్థులు ఆ ఎద్దును కొనుగోలు చేశారు'' అని చెలమయ్య చెప్పారు. ఆయన వయసు ఇప్పుడు 88ఏళ్లు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఒంగోలు జాతి గిత్తలు 4 లక్షలు ఉన్నాయని లాం ఫాం ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ ముత్తారావు తెలిపారు. బ్రెజిల్‌లో పశువుల సంఖ్య 22 కోట్లు ఉండగా, ఇందులో ఒంగోలు జాతి పశువుల నుంచి పుట్టించిన వాటి సంఖ్య 80 శాతం ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఏమిటీ ఈ జాతి పశువుల ప్రత్యేకత?
తెల్లని శరీరం, సౌష్టవం, రంకెల్లో రాజసం, చూపరులను ఆకట్టుకునే మూపురం.. ఒంగోలు జాతి పశువుల పేరు ఎత్తగానే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేవి ఇవే.
ఎద్దుల్లో అనేక జాతులున్నా ఒంగోలు జాతి గిత్తలకు ఉన్న క్రేజ్ వేరు. ఎందుకంటే దాదాపు 1100 కేజీల బరువు ఉండే ఒంగోలు గిత్తలు చాలా బలిష్టంగా ఉంటాయి. వేడి వాతావరణాన్ని తట్టుకుంటాయి. అనారోగ్యానికి అంత తొందరగా గురికావు. చురుగ్గా ఉంటాయి. కాడి కట్టుకుని పొలంలోకి దిగితే ఐదారెకరాలు దున్నేయగల శక్తితో ఉంటాయని చెబుతారు. అలాంటి గిత్తల పుట్టినిల్లు ప్రకాశం జిల్లా.
"ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒంగోలు జాతి ఎద్దులు, ఆవులకు పుట్టినిల్లు గుండ్లకమ్మ, పాలేరు నది మధ్యలో ఉన్న ప్రాంతమే. ఈ ప్రాంతంలో ఉన్న భూ పరిస్థితులు, భూమిలో ఉన్న లవణాలు, వాటి నుంచి వచ్చిన గడ్డి తినడం...వీటి వల్ల బలిష్టమైన ఒంగోలు జాతి పుట్టుకొచ్చింది'' అని ఒంగోలుకి చెందిన రైతు సంఘం నేత దుగ్గినేని గోపీనాథ్ చెప్పారు.

ఒంగోలు గిత్తల సంఖ్య ఎందుకు తగ్గుతోంది?
ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఇంటింటికీ జత ఎడ్లు కచ్చితంగా కనిపించేవి. కానీ వ్యవసాయంలో యంత్రీకరణ పెరగడం, ప్రధానంగా ఈ ప్రాంతంలో వాణిజ్య పంటల సాగు పెరిగి, వరిసాగు తగ్గడంతో ఈ పశువుల పోషణ ఆర్థికంగా భారంగా మారింది. దీంతో వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది.
"దాదాపు నలభై ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. చిన్నప్పుడు ఎద్దులతో వ్యవసాయం చేశాను. ఇప్పుడు ట్రాక్టర్లు రావడంతో వ్యవసాయం నుంచి ఎద్దులు దాదాపుగా దూరమయ్యాయి'' అని రైతు మండవ శ్రీనివాసరావు అన్నారు.
"అంతెందుకు.. ఒకప్పుడు బ్రెజిల్‌కు ఎక్కువ ఎద్దులను ఎగుమతి చేసిన కరవదిలోనే ఇప్పుడు ఎక్కువగా ఎద్దులు లేవు'' అని ఆ ఊరికి చెందిన రైతు నాగినేని సురేశ్ చెప్పారు.
"1990 తర్వాత ఎద్దులతో అరక దున్నడం చాలావరకు మానేశారు. ట్రాక్టర్ సేద్యం ఎక్కువైంది. క్రమంగా ఈ ఎద్దులను ఇప్పుడు పోటీలు నిర్వహించే వారు, ఆర్థికంగా బలవంతులు మాత్రమే పెంచుకునే పరిస్థితి వచ్చింది'' అని డాక్టర్ చెలమయ్య అన్నారు.
అయితే, కొన్ని చోట్ల వ్యవసాయంలో ఎద్దులను వినియోగించే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా పొగాకు పంటల్లో అరక దున్నేందుకు ఎక్కువగా ఈ ఎద్దులనే ఉపయోగిస్తున్నామని రైతులు చెబుతున్నారు.
"నాలుగు ఎద్దులను పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నాను. రోజుకి నాలుగైదు ఎకరాలు దున్నుతాం'' అని రైతు సింగంశెట్టి అంకమ్మరావు తెలిపారు.

బ్రెజిల్‌లో ఒంగోలు గిత్తలకు ఎందుకంత క్రేజ్?
భారత్‌లో అరక దున్నేందుకు, పాల కోసం మాత్రమే పశువులను ప్రధానంగా వినియోగిస్తారు. కానీ విదేశాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి కూడా ఉంటుందని చెలమయ్య అభిప్రాయపడ్డారు.
"ప్రధానంగా బ్రెజిల్‌లో 80శాతం మాంసం కోసమే ఆవులు, ఎద్దులను వినియోగిస్తున్నారు. అక్కడ మూపురం లేని ఎద్దులుంటాయి. అవి కూడా కేవలం 450 నుంచి 500 కేజీల్లోపే బరువుంటాయి.
కానీ ఒంగోలు ఎద్దులైతే 1100 నుంచి 1200 కేజీల వరకు పెరుగుతాయి. అక్కడ ఎద్దుల పోషణకు కూడా ఖర్చు తక్కువే అవుతుంది. వీటి మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని తేలింది. దీంతో వాళ్లు వీటిపైనే ఆధారపడుతున్నారు'' అని డాక్టర్ చెలమయ్య తెలిపారు.
'ఒంగోలు గిత్తలతో కొత్త జాతుల్ని పుట్టిస్తున్నారు'
విదేశాల్లో ముఖ్యంగా పశు సంపదపైనే ఆధారపడ్డ బ్రెజిల్ వంటి దేశాల్లోఒంగోలు గిత్తల ఆధారంగా కొత్త జాతులను అభివృద్ధి చేస్తున్నారు.
''ముఖ్యంగా బ్రాహ్మణ కాటిల్ అనే పశుజాతి ఒంగోలు గిత్తల నుంచే పుట్టింది. ప్రస్తుతం బ్రెజిల్‌లో పెంచుతున్న 80% కంటే ఎక్కువ పశువులు ఒంగోలు జాతి నుంచి పుట్టినవే. వీటిని కేవలం మాంసం కోసం వినియోగిస్తున్నారు'' అని డాక్టర్ చెలమయ్య తెలిపారు.

ఈ బ్రీడ్‌ను ఎలా వృద్ధి చేస్తున్నారంటే..
ఒంగోలు జాతి పశువులను బ్రెజిల్ వంటి దేశాల్లో విపరీతంగా వృద్ధి చేస్తున్నారు.
"ఒంగోలు ఆవు సహజంగా ఆరేడుసార్లు ఈనుతుంది. కానీ ఇటీవల వాళ్లు ఒంగోలు ఆవు నుంచి వీర్యాన్ని తీసి, ఆర్టిఫిషియల్‌గా ఫెర్టిలైజ్ చేసి, వాళ్ల నేటివ్ బ్రీడ్‌తో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆవిధంగా ఈ బ్రీడ్‌ను ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నారు'' అని డాక్టర్ చెలమయ్య వివరించారు.

‘ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి’
ఒంగోలు జాతి గిత్తల అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని రైతు సంఘం నేత ఎస్. గోపీనాథ్ కోరారు.
బ్రెజిల్‌లో మాదిరి భారత్‌లో కూడా పరిశోధన, అధ్యయనం చేసి, ఈ జాతి ఎద్దులు, ఆవుల సంతతిని పెంచాలని ఆయన సూచించారు.
ఒంగోలు గిత్తల పరిరక్షణను మన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమని డాక్టర్ చెలమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఒంగోలు గిత్తల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కృషి చేస్తున్నాయని ప్రకాశం జిల్లా చదలవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రం డైరెక్టర్ డాక్టర్ బి. రవి, గుంటూరుకు సమీపంలోని లాం ఫాం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ముత్తారావు బీబీసీకి తెలిపారు.
ఒంగోలు ఆవులు, ఎద్దుల జాతి పరిరక్షణ కోసం ప్రభుత్వం మూడు కేంద్రాలను ఏర్పాటు చేసిందని బి. రవి వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














