భారత ఫార్మా కంపెనీలపై ట్రంప్ సుంకాల ప్రభావమేంటి, నిపుణులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అర్చనా శుక్లా, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
వచ్చే నెల నుంచి భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో లక్షలాది మంది అమెరికన్ల మెడికల్ బిల్లులు పెరిగే అవకాశముంది.
ఈ క్రమంలోనే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా అక్కడి అధికారులతో చర్చలు జరిపేందుకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ముందస్తు పర్యటన షెడ్యూల్ లేకపోయినప్పటికీ, గత వారం అమెరికా వెళ్లారు.
అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అవుతున్న వస్తువుల మీద విధిస్తున్న పన్నులకు ప్రతిగా, భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ఏప్రిల్ 2 నుంచి పన్నులు పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
అయితే, భారత్‌లోని ఔషధాల వంటి కీలక పరిశ్రమలపై పన్నుల భారం మోపవద్దని గోయల్ కోరుతున్నారు.
అమెరికన్లు వాడే జనరిక్ ఔషధాల్లో దాదాపు సగం మందులు భారత్ నుంచే వస్తున్నాయి.

విరివిగా వాడే ప్రముఖ బ్రాండెడ్ ఔషధాల స్థానంలో చౌకగా లభించే జనరిక్ మెడిసిన్ భారత్ నుంచే వస్తోంది. అమెరికన్ వైద్యులు సూచించే ప్రతి 10 జనరిక్ ఔషధాల్లో 9 భారత్ నుంచే అమెరికాకు దిగుమతి అవుతున్నాయి.
దీని వల్ల అమెరికన్ల వైద్య ఖర్చు వందల కోట్లు తగ్గుతోంది. 2022లో భారతీయ జనరిక్ ఔషధాల వల్ల 219 బిలియన్ డాలర్లు(అంటే దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు) ఆదా అయినట్లు కన్సల్టింగ్ సంస్థ ఐక్యూవీఐఏ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
వాణిజ్య ఒప్పందం లేకుంటే, ట్రంప్ విధించే పన్నుల వల్ల చౌకగా లభించే భారతీయ జనరిక్ ఔషధాలు కూడా భారంగా మారతాయి.
ట్రంప్ విధించే పన్నుల వల్ల కొన్ని సంస్థలు బలవంతంగా అమెరికన్ మార్కెట్ నుంచి వైదొలగాల్సి వస్తుంది. దీని వల్ల ఔషధాల కొరత పెరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
పన్నుల వల్ల "డిమాండ్- సప్లయి సమతుల్యతను దెబ్బతీయొచ్చు" అంతే కాకుండా ఇన్సూరెన్స్ లేనివాళ్లు, పేదవాళ్ల వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని యేల్ యూనివర్సిటీలో డ్రగ్ కాస్టింగ్ నిపుణురాలు మెలిస్సా బార్బర్ చెప్పారు.
వివిధ రకాల అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారిపై దీని ప్రభావం పడుతుంది.
అమెరికాలో తీవ్ర మానసిక ఆందోళన, మానసిక అనారోగ్య సమస్యలకు 60 శాతానికి పైగా భారతీయ ఔషధాలను సూచిస్తున్నారని ఐక్యూవీఐఏ అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
యాంటీడిప్రెస్సెంట్ ఔషధమైన సెర్ట్రాలైన్‌ను అమెరికన్ వైద్యులు రోగులకు ఎక్కువగా సూచిస్తారు. భారత్ నుంచి సరఫరా అయ్యే అత్యవసర ఔషధాల మీద అమెరికన్లు ఎంతలా ఆధారపడుతున్నారో చెప్పడానికి ఈ ఔషధం ఒక ఉదాహరణ.
భారతీయేతర సంస్థలు అమ్ముతున్న ఔషధాలతో పోలిస్తే వీటి ధరలు దాదాపు సగం.
"మమ్మల్ని ఈ విషయం బాగా కలవరపెడుతోంది" అని తక్కువ ధరకు ఔషధాలు అందించేందుకు పోరాడుతున్న పబ్లిక్ సిటిజన్స్ సంస్థకు చెందిన లాయర్ పీటర్ మేబర్దుక్ చెప్పారు.
చైనా నుంచి దిగుమతి అయ్యే ఔషధాల మీద పన్నులు పెంచడంతో, అమెరికన్ ఆసుపత్రులు, జనరిక్ ఔషధాల ఉత్పత్తిదారుల నుంచి ట్రంప్ ఇప్పటికే ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
అమెరికాలో అమ్మే 87 శాతం ఔషధాలకు సంబంధించిన ముడి పదార్ధాలు అమెరికా వెలుపల ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం చైనాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్ధాల్లో 40 శాతం చైనా నుంచే సరఫరా అవుతున్నాయి.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనా దిగుమతులపై పన్నుల్ని 20 శాతం పెంచారు. దీంతో ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్ధాల ధరలు కూడా పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో కంపెనీల ఏర్పాటు ఆర్థికంగా భారమా?
ఈ పన్నుల్ని తప్పించుకోవాలంటే ఔషధాల తయారీ సంస్థలు అమెరికాలో కంపెనీలు ఏర్పాటు చేయాలని ట్రంప్ చెబుతున్నారు.
ఫైజర్, ఎలి లిలీ వంటి ప్రముఖ ఫార్మా సంస్థలు తమ సంస్థలలో కొన్నింటిని అమెరికాకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి.
అయితే, చౌక ధరలకు ఔషధాలను విక్రయిస్తున్న సంస్థలు అందుకు సిద్ధంగా లేవు.
భారతదేశంలో అతి పెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వి గత వారం జరిగిన ఫార్మా సంస్థల సమావేశంలో మాట్లాడుతూ, తమ కంపెనీ ఒక్కో మందుల డబ్బాను 1 డాలర్ నుంచి 5 డాలర్ల మధ్య అమ్ముతుందని, ఈ ధరల వల్ల తమ కంపెనీని అక్కడకు తరలించడం సాధ్యం కాదని చెప్పారు.
"అమెరికాలో ఔషధాల ఉత్పత్తి ఖర్చుతో పోల్చుకుంటే భారత్‌లో ఔషధాల తయారీ ఖర్చు మూడు నాలుగురెట్లు తక్కువ" అని ఐపీఏకు చెందిన సుదర్శన్ జైన్ చెప్పారు.
ఇప్పటికిప్పుడు అమెరికాకు సంస్థలను తరలించడం అసాధ్యం. అమెరికాలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే కనీసం పదేళ్ల సమయం, 2 బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు 17,357 కోట్ల రూపాయలు) అవసరం. ఇది కేవలం నిర్మాణానికి సంబంధించిన వ్యయం మాత్రమే అని లాబీ గ్రూప్ ఫార్మా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా దిగుమతులపై పన్నులు తొలగించాలనే సూచన
ఈ పన్నుల దెబ్బ భారత్‌లోని ఫార్మా కంపెనీలను కూడా గట్టిగానే తాకొచ్చు.
ట్రేడ్ రీసర్చ్ ఏజన్సీ అయిన డీటీఆర్ఐ ప్రకారం, భారత పారిశ్రామిక ఎగుమతుల్లో ఫార్మా రంగం వాటా పెద్దదే.
అమెరికాకు భారత్ ఏటా 12.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎలాంటి పన్నులు లేకుండా ఎగుమతి చేస్తోంది.
అయితే, అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న ఔషధాలపై 10.91 శాతం పన్ను అమలవుతోంది.
దీని వల్ల 10.9 వాణిజ్య లోటు తలెత్తుతోంది. అమెరికా విధించే ప్రతీకార పన్నుల వల్ల ప్రత్యేక ఔషధాలు, జనరిక్ మెడిసిన్స్ ధరలు పెరుగుతాయని జీటీఆర్ఐ చెబుతోంది.
దీంతో అమెరికన్ మార్కెట్లలో ఔషధాల ధరలు పెరుగుతాయి.
అమెరికాలో జనరిక్ మందులను ఎక్కువగా విక్రయించే భారతీయ ఫార్మా సంస్థలు తక్కువ ధరలకు అమ్ముతున్నాయి. అందుకే ఆయా సంస్థలు ఈ పన్నుల భారాన్ని మోయలేమని చెబుతున్నాయి.
జనరిక్ ఔషధాల విషయంలో ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే భారతీయ కంపెనీల ధరలు చాలా తక్కువ. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్యం, చర్మ వ్యాధులు, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాల మార్కెట్‌లో భారతీయ ఫార్మా కంపెనీలు ఆధిపత్యం సంపాదించుకున్నాయి.
"ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా పన్నుల పెంపును భర్తీ చేయగలం. అయితే, అది మరీ ఎక్కువగా ఉంటే, ఆ పెంపును వినియోగదారుల మీదకు మళ్లించాల్సి ఉంటుంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రముఖ ఫార్మా సంస్థ అధిపతి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఇండియన్ ఫార్మాకు ఉత్తర అమెరికా పెద్ద ఆదాయ వనరు. అనేక కంపెనీలు తమ ఆదాయంలో మూడో వంతు ఇక్కడి నుంచే పొందుతున్నాయి.
"నార్త్ అమెరికాలో మార్కెట్ వేగంగా పెరుగుతుంది. అంతే కాదు. అది చాలా కీలకం కూడా. మనం ఇతర మార్కెట్లకు విస్తరించినా, అమెరికా మార్కెట్‌ను కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చెయ్యలేదు" అని ఆయన అన్నారు.
వ్యాపారాన్ని సుంకాలు శాసించలేవని, భారత దేశంలో మూడో అతి పెద్ద ఫార్మా సంస్థ సిప్లా సీఈవో ఉమంగ్ వోహ్రా ఇటీవల ఒక సమావేశంలో అన్నారు.
"ఎందుకంటే, నాలుగేళ్ల తర్వాత ఈ పన్నులు ఉండకపోవచ్చు" అని ఆయన అన్నారు.
అయితే, నాలుగేళ్లు సుదీర్ఘ సమయం. అది అనేక కంపెనీల అదృష్టాన్ని మార్చేయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే "భారతదేశం అమెరికా నుంచి దిగుమతయ్యే మందుల మీద వసూలు చేస్తున్న పన్నుల్ని వదులుకోవాలి" అని మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా బీబీసీకి చెప్పారు.
"భారత్‌కు అమెరికా ఎగుమతి చేస్తున్న ఔషధాల విలువ 0.5 బిలియన్ డాలర్లు. కాబట్టి వాటిపై విధిస్తున్న పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పోతుందని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.
భారతదేశంలో అతిపెద్ద ఔషధ తయారీ సంస్థలు సభ్యులుగా ఉన్న ఐపీఏ కూడా ఇదే విషయం చెబుతోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఔషధాల మీద పన్నుల్ని తొలగిస్తే భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తున్న మందుల మీద ప్రతీకార పన్నులు ఉండవని అంటోంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ప్రాణాలను కాపాడే 36 ఔషధాల మీద కస్టమ్స్ డ్యూటీ తొలగించింది.
పన్నుల విషయంలో భారత్ తన ఒత్తిడికి తలొగ్గవచ్చని గత వారం ట్రంప్ సంకేతాలిచ్చారు.
భారత్ ''పన్నులు కాస్త తగ్గించేందుకు అంగీకరించింది.''
''ఎందుకంటే, ఎట్టకేలకు వాళ్లు ఏం చేశారో వారు చూపిస్తున్నారు'' అని ఆయన అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై దిల్లీ ఇంకా స్పందించలేదు. అయితే, రెండు దేశాల్లోని ఫార్మా సంస్థలు మాత్రం ఎన్నో జీవితాలు, ఎంతోమంది జీవనోపాధిని ప్రభావితం చేయగలిగిన భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఏముంటుందా? అనే ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి.
"కొత్త పన్నుల వల్ల స్వల్పకాల వ్యవధిలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. కానీ, ఈ ఏడాదిలోనే వారు వాణిజ్య ఒప్పందంలో పురోగతి సాధిస్తారని నేను అనుకుంటున్నా" అని యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌సిప్ ఫోరం సీనియర్ అడ్వైజర్ మార్క్ లిన్‌స్కాట్ చెప్పారు.
ఎందుకంటే, ఫార్మా సరఫరాల చైన్ తెగిపోవడాన్ని ఏ దేశం కూడా భరించలేదు అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














