టీకాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌ను ఆరోగ్య మంత్రిగా ట్రంప్ ఎందుకు నామినేట్ చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి పదవికి వివాదాస్పద నేత రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌ను డోనల్డ్ ట్రంప్ ఎంచుకున్నారు.
దేశంలో ప్రజారోగ్యాన్ని సంక్షోభంలో పడేసిన ప్రమాదకర రసాయనాలు, కాలుష్యకారకాలు, క్రిమిసంహారకాలు, ఔషధాలు, ఫుడ్ ఎడిటివ్స్ నుంచి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ ప్రతి ఒక్కరినీ రక్షించాలని ట్రంప్ ‘ఎక్స్’లో తెలిపారు.
కెన్నడీ నియామకాన్ని సెనెట్ ధ్రువీకరించాల్సి ఉంది. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో ఇదొకటి.
రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ అమెరికా చరిత్రలో బాగా పేరుపొందిన కెన్నడీ కుటుంబానికి చెందిన వ్యక్తి.
1963లో హత్యకు గురైన అమెరికా 35వ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెన్నడీ సోదరుడి కొడుకు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్. 70 ఏళ్ల రాబర్ట్ భార్య పేరు జాక్వెలైన్ కెన్నడీ ఒనాసిస్.
జాన్ ఎఫ్ కెన్నడీ లాగానే రాబర్ట్ ఎఫ్ కెన్నడీ కూడా హత్యకు గురయ్యారు. జాన్ ఎఫ్ కెన్నడీ హత్య జరిగిన ఐదేళ్లకు 1968లో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ చనిపోయారు. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ అమెరికా మాజీ అటార్నీ జనరల్, సెనెటర్.


ఫొటో సోర్స్, Getty Images
‘అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతమైన దేశంగా మారుస్తా’
టీకాల పట్ల వ్యతిరేక వైఖరితో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ గుర్తింపు పొందారు.
లాయర్ అయిన 70 ఏళ్ల రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడి తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. అనంతరం మనసు మార్చుకుని ఎన్నికలకు కొన్ని నెలల ముందు పోటీ నుంచి వైదొలిగి ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చారు. ట్రంప్ నేతృత్వంలో అమెరికాను మళ్లీ ఆరోగ్యంగా మార్చాలని పిలుపునిచ్చారు.
తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార పరిశ్రమ, ఔషధ కంపెనీల నుంచి ప్రజలందరినీ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ రక్షిస్తారని ట్రంప్ అన్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షులుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు.
దీర్ఘకాలిక వ్యాధులను అంతమొందింపజేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యవంతంగా మార్చడమే తన లక్ష్యమని ట్రంప్ చెప్పారు.
ప్రపంచంలో అమెరికన్లను మళ్లీ ఆరోగ్యకరమైన మనుషులుగా మార్చేందుకు పనిచేస్తానని రాబర్ట్ అన్నారు. అవినీతిని అంతమొందించి ప్రభుత్వానికి, ఆహార పరిశ్రమలకు మధ్య ఉన్న తలుపులను తొలగిస్తానని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ప్రత్యర్థి నుంచి మిత్రుడి దాకా..
1954లో వాషింగ్టన్ డీసీలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ పుట్టారు. కుటుంబంలో రెబల్‌గా గుర్తింపు పొందిన ఆయన, యువకుడిగా ఉన్నప్పుడు కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటుపడి చట్టపరంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
పర్యావరణ లాయర్‌గా 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, ఇటీవలి సంవత్సరాల్లో టీకాలను వ్యతిరేకించడం ద్వారా, ఔషధ ఉత్పత్తుల నియంత్రణ, భద్రతను ప్రశ్నిస్తూ ఉద్యమాలకు నేతృత్వం వహించడం ద్వారా వివాదాల్లో చిక్కుకున్నారు.
డెమొక్రటిక్ ప్రైమరీస్‌లో ఒకరిగా అధ్యక్ష అభ్యర్థి బరిలో నిలిచే ప్రయత్నం చేశారు.
ప్రచారం సమయంలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ గతంలో జరిగిన విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచారు.
2014లో కారు ఢీకొనడంతో చనిపోయిన ఎలుగుబంటి కూన మృతదేహాన్ని న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో విసరడం సహా అనేక విషయాలు తెరపైకి వచ్చాయి.
చివరకు తన అభ్యర్థిత్వాన్ని వదలుకుని ఆగస్టులో ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు.
ట్రంప్ నేతృత్వంలో అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతమైన దేశంగా మారుస్తామని ఆయన ప్రచారం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
టీకా వ్యతిరేకవాది
వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఔషధ పరిశ్రమ చేస్తున్న హానికారిక విధానాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా చిల్డ్రన్స్ హెల్త్ డిఫెన్స్ అనే సంస్థను 2007లో ఆయన ప్రారంభించారు.
కొన్ని రసాయనాల వినియోగాన్ని నిషేధించాలని ఈ ఎన్జీవో ప్రచారం చేసింది. అయితే, ఆ సంస్థ ద్వారా టీకాల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేశారని సైన్స్ కమ్యూనిటీ భావించింది.
రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ అనేక పుస్తకాలు రాశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో ప్రముఖంగా గుర్తింపు పొందిన ఫౌసీని ఉద్దేశిస్తూ రాసిన ‘‘ది రియల్ ఆంథోని ఫాసి’’తో పాటు ‘‘ఎ లెటర్ టు లిబరల్స్’’ వంటివి ఉన్నాయి.
టీకాల దుష్ప్రభావాలు, అమెరికా ఆరోగ్య వ్యవస్థలో సంక్లిష్టతలపై కెన్నడీ తన పోస్టుల్లో చేసిన అనేక వాదనలు వివాదాస్పదమయ్యాయి.
కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న తప్పుడు ఆరోపణల్లో ఒకటి ఆటిజానికి, టీకాలకు సంబంధం ఉందనడం. అనేకమంది శాస్త్రవేత్తలు పలు అధ్యయనాల ద్వారా ఈ ఆరోపణలను ఖండించారు.
ఆంథోని ఫాసీతో పాటు బిల్ గేట్స్, జో బైడన్ వంటి ప్రముఖులపై కెన్నెడీ ఆరోపణలు చేశారు. ప్రయివేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం కరోనా గురించి తప్పుడు సమాచారం వ్యాపింపచేస్తున్నారని వారిని ఉద్దేశించి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ ఆరోపించారు.
యాంటీ వ్యాక్సీన్ ఉద్యమం ప్రారంభించిన మాజీ ఫిజీషియన్ ఆండ్రూ వేక్‌ఫీల్డ్ దర్శకత్వం వహించిన వ్యాక్స్‌డ్ డాక్యుమెంటరీకి సీక్వెల్‌గా 2021లో ‘‘వ్యాక్స్‌డ్ 2: ది పీపుల్స్ ట్రూత్’’ను నిర్మించారు.
టీకాలకు వ్యతిరేకంగా కెన్నడీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శాస్త్రీయ సమాజంలోనే కాదు.. ఆయన సొంత కుటుంబంలోనూ వ్యతిరేకత వచ్చింది.
రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ వ్యాఖ్యలను వారు బహిరంగంగానే వ్యతిరేకించారు. ఆయన మాట్లాడే మాటలు, చర్యలు ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, టీకాలను తాను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ట్రంప్ తనను ఆరోగ్యమంత్రిగా నియమిస్తే... టీకాలను నిషేధించబోనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గతవారం కెన్నడీ చెప్పారు.
పర్యావరణ లాయర్
పర్యావరణ లాయర్‌గా, కార్యకర్తగా కెన్నడీకి విశేష అనుభవం ఉంది. రివర్ కీపర్-నేచురల్ రిసోర్సెస్ ఢిఫెన్స్ కౌన్సిల్(ఎన్‌ఆర్‌డీసీ) వంటి సంస్థలకు 1980ల నుంచి ఆయన లాయర్‌గా ఉన్నారు. పర్యావరణ హక్కులకు సంబంధించి పెద్ద కంపెనీలకు వ్యతిరేకంగా వ్యక్తులు, సంస్థలు తరఫున వాదించారు.
ప్రపంచవ్యాప్తంగా నీటివనరుల సంరక్షణ కోసం పనిచేసే వందలాది సంస్థలను ఒకచోటకు చేర్చి వాటర్‌కీపర్ అలయన్స్‌ను 1999లో ప్రారంభించారు.
తన న్యాయపరమైన సంస్థ కెన్నడీ, మడోన్నా ఎల్‌ఎల్‌పీ ద్వారా అనేక పర్యావరణ కాలుష్య కేసులకు వ్యతిరేకంగా వాదించారు.
పశ్చిమ వర్జీనియాలో కాలుష్యానికి బాధ్యత వహింపజేస్తూ డుపాంట్‌తో 396 మిలియన్ డాలర్లను చెల్లింపచేయడం ద్వారా 2007లో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ ‘‘లాయర్ ఆఫ్ ది ఇయర్’’గా నిలిచారు.
2017లో మోన్‌శాంటో సంస్థకు వ్యతిరేకంగా 670 మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్ చేయడంలోనూ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ కీలక పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Reuters
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా
వ్యాక్సీన్లను వ్యతిరేకించే రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌ని ఆరోగ్య శాఖ మంత్రిగా ట్రంప్ నామినేట్ చేసిన తర్వాత వ్యాక్సీన్ తయారీ కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి.
ఊబకాయం, డయాబెటిస్, ఆటిజం, క్యాన్సర్ సహా దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసేలా చేస్తానని, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల ప్రభావం నుంచి వాటిని బయటకు తీసుకువస్తానని రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ హామీ ఇచ్చారు.
తాగు నీటి నుంచి ఫ్లోరైడ్‌ను తొలగిస్తానని హామీ ఇచ్చారు.
యువకునిగా ఉన్నప్పుడు 14 సంవత్సరాలు పాటు హెరాయిన్‌కు బానిసగా ఉన్న రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, డ్రగ్స్ సంక్షోభ పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నుంచి ప్రాసెస్డ్ ఫుడ్‌ను తొలగిస్తానని, ఆహార పరిశ్రమకు రసాయనాల నుంచి విముక్తి కల్పిస్తానని అన్నారు.
తనకు స్పాస్మోడిక్ డిస్ఫోనియా అనే వ్యాధి ఉందని ఎన్నికల ప్రచారంలో కెన్నడీ చెప్పారు. ఈ వ్యాధి ఉన్నవారు స్పష్టంగా మాట్లాడలేరు.
ఈ ఏడాది ప్రారంభంలో లాస్ ఏంజలస్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెరాయిన్‌కు బానిస కావడంపై కెన్నడీ మాట్లాడారు. తన తండ్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ హత్యకు గురైన కొన్నిరోజులకే 15 ఏళ్ల వయసులో తాను హెరాయిన్‌కు బానిసనయ్యానని కెన్నడీ చెప్పారు.
29 ఏళ్ల వయసులో డ్రగ్స్ వినియోగిస్తూ కెన్నడీ పోలీసులకు దొరికిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














