ల్యాబ్‌లో తయారైన మాంసం త్వరలో మార్కెట్లోకి రానుందా?

ఫుడ్, మాంసం
ఫొటో క్యాప్షన్, ప్రయోగశాలలో తయారుచేసిన మాంసం
    • రచయిత, పల్లబ్ ఘోష్

ల్యాబ్‌లో తయారు చేసిన మాంసం, పాల ఉత్పత్తులు, చక్కెర త్వరలోనే యూకేలో మొట్టమొదటిసారిగా అమ్మకానికి రావొచ్చు.

రెండేళ్లలో లేదా ఇంకా త్వరగా ఇవి మానవ వినియోగం కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ (ఎఫ్ఎస్ఏ), ప్రయోగశాలలో తయారుచేసిన ఆహారాలను ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేసే ఆలోచనలో ఉంది.

ఇలాంటి ఉత్పత్తులను ఔషధ గుణాలున్న మొక్కల కణజాలం నుంచి తయారు చేస్తారు.

బ్రిటన్ సంస్థలు ఈ రంగంలో శాస్త్రీయంగా ముందంజలో ఉన్నా, ప్రస్తుత నిబంధనల వల్ల తాము వెనుకబడ్డామని అంటున్నాయి.

అయితే ఇప్పటికే, బ్రిటన్‌ ఫ్యాక్టరీలలో తయారైన మాంసంతో తయారు చేసిన డాగ్ ఫుడ్ (కుక్క ఆహారం) గత నెలలో మొదటిసారిగా యూకేలో అమ్మకానికి వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సింగపూర్, మొదటిసారిగా 2020లో ల్యాబ్‌లో తయారు చేసిన మాంసాన్ని మానవ వినియోగం కోసం ఆమోదించింది.

మూడేళ్ల తర్వాత అమెరికా, నిరుడు ఇజ్రాయెల్ కూడా ఈ ఆహారాన్ని ఆమోదించాయి.

మరోవైపు ఇటలీ, అమెరికాలోని ఆలబామా, ఫ్లోరిడా వంటివి ఇటువంటి ఆహారాన్ని నిషేధించాయి.

హైటెక్ ఆహార సంస్థల నిపుణులు, ఈ రంగంలో పని చేస్తున్న పరిశోధకులతో కలిసి కొత్త నిబంధనలను ఎఫ్‌ఎస్‌ఏ అభివృద్ధి చేయనుంది.

కానీ, ఈ కొత్త నిబంధనలను రూపొందించే ప్రక్రియలో ఆహార తయారీ సంస్థల ప్రమేయాన్ని విమర్శకులు తప్పుబడుతున్నారు.

ల్యాబ్‌లో మాంసం తయారీ

ఫొటో సోర్స్, BBC News

ఫొటో క్యాప్షన్, ఫర్మంటేషన్ ట్యాంకుల్లో కణాలను పెంచి, తర్వాత వాటిని ఆహారంగా ప్రాసెస్ చేస్తారు

ల్యాబ్‌లో పెరిగే ఆహారం ఆరోగ్యానికి మంచిదేనా?

ప్రయోగశాలలో తయారైన ఆహారాన్ని చిన్న కణాల నుంచి పెంచుతారు.

ఇందులో కొన్నిసార్లు ఆహార లక్షణాలను సర్దుబాటు చేయడానికి జన్యు సవరణ చేస్తారు.

ఇవి పర్యావరణానికి, ఆరోగ్యానికి మంచిదని కొన్ని వర్గాలు అంటున్నాయి. మరో వైపు ఇటువంటి సంస్థలపై ప్రభుత్వం ఆసక్తి చూపుతుంది. ఈ సంస్థలు కొత్త ఉద్యోగాలు సృష్టించగలవని, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తుంది.

కానీ, ఈ హైటెక్ ఆహారాలు పర్యావరణ అనుకూలమైనవి కాకపోవచ్చు. ఎందుకంటే, వాటిని తయారు చేయడానికి ఇంధన శక్తి అవసరం.

కాబట్టి వాటిని తయారు చేయడం అంత సులభం కాదని, కొన్ని సందర్భాల్లో వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా అంచనా వేసి మార్కెట్లలో అమ్ముతారని క్యాంపెయినింగ్ గ్రూప్ బియాండ్ జీఎం సంస్థ డైరెక్టర్ పాట్ థామస్ అన్నారు.

"ప్రయోగశాలలో తయారు చేసిన ఆహారాలన్ని ఆల్ట్రా-ప్రాసెస్డ్ పదార్ధాలే.

ఆరోగ్యంపై ప్రభావం చూపించే ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను ప్రజలు తక్కువగా తినే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ పదార్థాలు మన పూర్వీకులు తీసుకునే ఆహారంలో భాగం కాదు" అని ఆమె అన్నారు.

ల్యాబ్‌లో చక్కెర తయారీ
ఫొటో క్యాప్షన్, ల్యాబ్‌లో తయారైన ఈ క్రిస్టల్స్ చూడటానికి చక్కెరలా ఉంటాయి, దానికంటే ఎక్కువ తీపిగా ఉంటాయి.

నియంత్రణల సడలింపా, లేదా ఆవిష్కరణలకు ప్రోత్సాహమా?

విదేశాల్లో ఆమోద ప్రక్రియలు త్వరగా జరిగిపోతున్నాయని, బ్రిటన్‌లో అలా లేకపోవడం వల్ల పోటీలో తాము వెనుకబడుతున్నామని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే, వినియోగదారుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని బీబీసీతో ఎఫ్ఎస్ఏ చీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ రాబిన్ మే అన్నారు.

"మేం ఈ ప్రక్రియలో పాల్గొనే కంపెనీలు, పరిశోధకులతో కలిసి మెరుగైన నియంత్రణ వ్యవస్థ రూపొందించడానికి కలిసి పనిచేస్తున్నాం. సాధ్యమైనంత ఎక్కువగా భద్రతకు ప్రాధాన్యం ఇస్తాం" అని ఆయన అన్నారు.

కానీ,క్యాంపెయినింగ్ గ్రూప్ బియాండ్ జీఎం సంస్థ డైరెక్టర్ పాట్ థామస్ వంటి విమర్శకులు ఈ విధానాన్ని తప్పుబడుతున్నారు.

"ఈ నిబంధనలను రూపొందించడంలో ఎఫ్ఎస్ఏకి సహాయం చేసిన కంపెనీలకే నియంత్రణ సడలింపు నుంచి ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది" అని ఆమె చెప్పారు.

కానీ, ఈ ప్రక్రియను "డీరెగ్యులేషన్" అని పిలవడంపై సైన్స్ మంత్రి లార్డ్ వాలెన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

"ఇది నియంత్రణ సడలింపు కాదు, ఆవిష్కరణలను ప్రోత్సహించే నియంత్రణ" అని ఆయన బీబీసీతో అన్నారు.

అయితే ఇందులో పాల్గొనే కంపెనీల నిపుణులతో పాటు విద్యావేత్తలతో కలిసి పనిచేయడం, సైన్స్-సాంకేతికతను సరిగ్గా అర్థం చేసుకోవడం కోసమే అని అన్నారు ఎఫ్ఎస్ఏ ప్రొఫెసర్ మే.

"ఇది చాలా క్లిష్టమైన అంశం. ఆహార పదార్థాలను ఆమోదించే ముందు అవి సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్ధరించుకోవడానికి మనం సైన్స్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)