ఆరేళ్ల దక్షిణాఫ్రికా బాలిక అదృశ్యం-కళ్లు, చర్మం కోసం కిడ్నాప్ చేశారా?

ఫొటో సోర్స్, Executive Mayor Andrè Truter/ Facebook
- రచయిత, ఖన్యిసిలే నగ్కోబో
- హోదా, బీబీసీ న్యూస్ , జోహన్నెస్‌బర్గ్
గత ఏడాది అదృశ్యమైన ఆరేళ్ల దక్షిణాఫ్రికా బాలిక జోష్లిన్ స్మిత్‌ను ఆమె కళ్లు, చర్మం కోసం ఒక సంప్రదాయ వైద్యురాలు తీసుకెళ్లినట్లు కోర్టు విచారణలో తెలిసింది.
జోష్లిన్ స్మిత్ కిడ్నాప్‌కు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో బాలిక తల్లి కెల్లీ స్మిత్ కూడా ఉన్నారు.
సంప్రదాయ వైద్యురాలికి తన బిడ్డను కెల్లీ విక్రయించారన్న ఆరోపణలున్నాయి.
స్మిత్, ఆమె ప్రియుడు జాక్వెన్ అపోలిస్, వారి స్నేహితుడు స్టీవెనో వాన్ రైన్‌పై మానవ అక్రమ రవాణా, కిడ్నాప్ ఆరోపణలు నమోదయ్యాయి.
అయితే తాము నిర్దోషులమని వారంటున్నారు.
2024 ఫిబ్రవరిలో కేప్ టౌన్ సమీపంలోని సల్దానా బేలో ఉన్న తన ఇంటి బయటే జోష్లిన్ అదృశ్యమవడం దక్షిణాఫ్రికా అంతటా సంచలనంగా మారింది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.

జోష్లిన్ చర్మం తెల్లగా ఉంటుంది, ఆమె కళ్లు కూడా నీలి రంగులో ఉంటాయి.
ఆమెను అపోలిస్ సంరక్షణలో ఉంచిన తర్వాత కనిపించకుండా పోయిందని తల్లి తొలుత చెప్పారు.
సల్దానాలోని ఒక కమ్యూనిటీ సెంటర్‌లో మూడు వారాలుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
జోష్లిన్ కనిపించకుండా పోయిన రోజు గురించి విచారణ మొదటి వారంలో కోర్టు వివరాలు విన్నది. బాలిక కనిపించడంలేదని గమనించిన ఆరు గంటల తరువాతే స్మిత్ పోలీసులకు సంప్రదించారని కోర్టుకు తెలిపారు.
అయితే బాలికకోసం వెతుకుతున్నప్పుడు స్మిత్ ప్రశాంతంగా కనిపించారని.. తప్పిపోయిన బిడ్డ కంటే తన ప్రియుడి ఆచూకీ గురించే ఆమె ఎక్కువగా ఆందోళన చెందారని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.
రెండవ వారంలో మరిన్ని షాకింగ్ వాదనలు జరిగాయి.
2023 నాటికే ముగ్గురు పిల్లల తల్లి అయిన స్మిత్ తన పిల్లలను ఒక్కొక్కరికి 20,000 రేండ్ ( భారత కరెన్సీలో సుమారు 95 వేల రూపాయలు)కి అమ్మేస్తామని మాట్లాడినట్లు స్థానిక పాస్టర్ ఒకరు చెప్పారు. అయితే కనీసం 25 వేల రూపాయలు ఇచ్చినా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పినట్లు ఆ పాస్టర్ తెలిపారు.
తన కూతురు ఇప్పటికే "ఓడలో, కంటైనర్‌లో ఉందని, వారు పశ్చిమ ఆఫ్రికాకు వెళ్తున్నారని" స్మిత్ తనతో చెప్పినట్లు జోష్లిన్ టీచర్ కోర్టుకి వివరించారు.
ఈ కేసులో సాక్షి అయిన స్మిత్ స్నేహితురాలు, ఇంటి పొరుగున ఉండే లౌరెంటియా లోంబార్డ్ మరిన్ని విషయాలు చెప్పారు.
జోష్లిన్ అదృశ్యానికి ముందు జరిగిన సంఘటనలను లౌరెంటియా వివరించారు. దక్షిణాఫ్రికాలో "సాంగోమా" అని పిలువబడే ఒక సంప్రదాయ వైద్యురాలికి సంబంధం ఉందని ఆమె తెలిపింది.
"నేను తెలివితక్కువ పని చేశాను... నా బిడ్డను ఒక సంగోమాకు అమ్మేశాను" అని తన స్నేహితురాలు తనతో చెప్పినట్లు లోంబార్డ్ కోర్టుకు చెప్పారు. డబ్బు అవసరమే ఆమెతో ఇలా చేయించింది అని చెప్పారామె.
ఈ ప్లాన్ గురించి తెలిసిన వారు ఎవరికీ చెప్పకుండా ఉంటే, ప్రతిఫలంగా కొంత డబ్బు ఇస్తానని జోష్లిన్ తల్లి ప్రలోభపెట్టినట్లు లోంబార్డ్ చెప్పారు.
తరువాత జోష్లిన్ కోసం స్మిత్ ఒక బ్లాక్ బ్యాగ్‌లో దుస్తులు ప్యాక్ చేయడాన్ని తాను చూశానని, ఒక మహిళను కలవడానికి ఇద్దరూ నడుచుకుంటూ వెళుతుండగా ఆమెచేతిలో అదే బ్యాగ్ ఉందని, బహుశా ఆ మహిళే సంగోమా కావొచ్చని లోంబార్డ్ కోర్టుకు తెలిపారు.
తల్లి, కూతురు తెల్లటి కారులో ఎక్కి ఆ మహిళతో వెళ్లిపోయారని లోంబార్డ్ చెప్పారు.
"జోష్లిన్‌ను ఆమె కళ్లు, చర్మం కోసం తీసుకెళ్లారు’ అని లోంబార్డ్ కోర్టులో చెప్పారు.
ఒక సంగోమా ఇలాంటి బిడ్డను ఎందుకు కోరుకుంటుందో కోర్టు విచరణలో స్పష్టంగా తేలలేదు.
ఈ కేసులో ప్రమేయం ఉందంటున్న సంప్రదాయ వైద్యురాలిగా భావించి ఒక మహిళను మొదట అరెస్టు చేసి.. స్మిత్, ఆమె సహ నిందితులపై గత సంవత్సరం అభియోగాలు మోపారు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమెపై ఉన్న అభియోగాలను తొలగించారు.
దక్షిణాఫ్రికాలో ట్రెడిషనల్ హెల్త్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ ఆఫ్ 2007 ప్రకారం మూలికా నిపుణులు, సంప్రదాయ మంత్రసానులు, సంప్రదాయ సర్జన్లకు, సంగోమాలకు గుర్తింపు ఉంటుంది.
అయితే, కొంతమంది మోసగాళ్లు సంప్రదాయ వైద్యం పేరుతో అనుచితమైన పనులు చేస్తుంటారు. శరీర భాగాలతో చేసిన కొన్ని వస్తువులను అదృష్టం తెచ్చిపెట్టేవిగా చెప్పి విక్రయిస్తారు.
జోష్లిన్ అదృశ్యంలో తన పాత్రపై లోంబార్డ్ విచారం వ్యక్తం చేస్తూ, స్మిత్ తన కుమార్తెను అమ్మకుండా ఆపడానికి తాను ప్రయత్నించానని, కానీ ఆపలేకపోయానని తెలిపారు.
ఆ యువతిని తీసుకెళ్లిన వారెవరైనా సరే "దయచేసి ఆమెను సజీవంగా తిరిగి తీసుకురండి" అని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ విచారణ మార్చి చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














