సునీతా విలియమ్స్‌ను తీసుకొచ్చిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమితో 7 నిమిషాల పాటు ఎందుకు కాంటాక్ట్ కోల్పోయింది?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు బుధవారం (మార్చి 19, 2025) తెల్లవారుజామున భూమి మీదకు సురక్షితంగా వచ్చారు.
ప్రపంచమంతా వారి సేఫ్ ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, సరిగ్గా ఉదయం 3.15 నిమిషాలకు స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్ పూర్తిగా కోల్పోయింది నాసా.
ఈ సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ భూమికి 70 నుంచి 40 కి.మీల ఎత్తులో ఉంది. గంటకు 27 వేల కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది.
ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఏమైంది లేదా ఎక్కడుందో కూడా నాసా కంట్రోల్ రూమ్‌లో ఎవరికీ తెలియదు.
3.20 నిమిషాలకు నాసా డబ్ల్యూబీ57 సర్వైలెన్స్ ప్లేన్‌లో ఉన్న కెమెరాలు డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి దగ్గరగా వచ్చిన ఇమేజ్‌లను చిత్రీకరించాయి.
అప్పుడే నాసా కంట్రోల్ రూమ్‌లో ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాసా కంట్రోల్ రూమ్ కోల్పోయిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే తిరిగి రీస్టోర్ అయింది.

భూమి మీదకు వచ్చే ప్రతి స్పేస్‌క్రాఫ్ట్ కూడా కొన్ని నిమిషాల పాటు కంట్రోల్ రూమ్‌తో కాంటాక్ట్‌ను కోల్పోతుంది. అట్మాస్పెరిక్ రీఎంట్రీ (భూవాతావరణ పునఃప్రవేశం)గా పిలిచే ప్రమాదకరమైన ప్రక్రియలో ఇదొక భాగం.
ఈ కొన్ని నిమిషాలను 'బ్లాక్ అవుట్ టైమ్' అంటారు. ఇది సాధారణమే అయినప్పటికీ, చాలా స్పేస్ ప్రమాదాలు ఈ కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరుగుతాయి.
ఆ నిర్దిష్ట సమయంలో స్పేస్‌క్రాఫ్ట్‌కు ఏదైనా జరిగితే... వ్యోమగాములకు కంట్రోల్ సెంటర్‌లో ఉండే నిపుణుల బృందం ఎలాంటి సూచనలు చేయలేదు.
అదేవిధంగా, భూమిపై ఉన్న ఈ నిపుణుల బృందానికి కూడా వ్యోమగాములు ఎలాంటి ఎమర్జెన్సీ సమాచారాన్ని చేరవేయలేరు.
2003 ప్రమాదమే దీనికి ఉదాహరణ. భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాతో పాటు నాసాకు చెందిన ఏడుగురు బృందంతో వస్తున్న కొలంబియా స్పేస్ షటిల్... బ్లాక్ అవుట్ టైమ్‌లోనే క్రాష్ అయింది. ఆ నౌకలో ఉన్నవారంతా మరణించారు.

ఫొటో సోర్స్, NASA
'రేడియో బ్లాక్ అవుట్' ఎందుకు ఏర్పడుతుంది?
భూమిపైకి వచ్చేటప్పుడు రేడియో బ్లాక్ అవుట్ లేదా బ్లాక్ అవుట్ టైమ్‌ను స్పేస్‌క్రాఫ్ట్‌లు ఎందుకు ఎదుర్కొంటాయో మోహాలిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు ప్రొఫెసర్ డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ వివరించారు.
''భూవాతావరణంలోకి పునఃప్రవేశించేటప్పుడు, తీవ్రమైన వేగం, గాలి అణువులతో ఘర్షణ వల్ల 1900 నుంచి 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటాయి. 1000 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు స్పేస్‌క్రాఫ్ట్ చుట్టూ ప్లాస్మా పొర ఏర్పడేందుకు కారణమవుతాయి'' అని చెప్పారు.
''ఈ ప్లాస్మా పొర వల్లనే భూమికి, స్పేస్‌క్రాఫ్ట్ మధ్యనున్న రేడియో కమ్యూనికేషన్ కట్ అవుతుంది'' అని డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ వివరించారు.
స్పేస్‌క్రాఫ్ట్ చుట్టూ ఉండే ఈ ప్లాస్మా పొర గురించి వివరించిన ఆయన '' మన టెలికమ్యూనికేషన్స్ సిస్టమ్స్ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ వేవ్స్‌పై ఆధారపడతాయి. ఈ ప్లాస్మా పొర వల్ల ఏ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ వేవ్స్ స్పేస్‌క్రాఫ్ట్‌ను చేరుకోలేవు. అందుకే, స్పేస్‌క్రాఫ్ట్ నుంచి భూమికి, భూమి నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌కు మధ్య పూర్తిగా కమ్యూనికేషన్ తొలగిపోతుంది'' అని వివరించారు.
బ్లాక్ అవుట్ సమయంలో ఈ కొద్ది నిమిషాల్లో స్పేస్ క్రాఫ్ట్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం అసాధ్యమని వెంకటేశ్వరన్ చెప్పారు. మోనిటరింగ్ సిస్టమ్స్‌కు చెందిన టెలిస్కోపుల ద్వారా చూసినప్పుడు, తెలుపు లేదా నీలం రంగులోని బంతి వస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుందని తెలిపారు.
స్పేస్‌క్రాఫ్ట్ తొలి పారాచూట్‌ను వదిలేంత వరకు ఈ ప్లాస్మా పొర ఉంటుందని, ఆ తర్వాతనే కంట్రోల్ సెంటర్‌తో కమ్యూనికేషన్ రీస్టోర్ అవుతుందని వివరించారు.
అంతరిక్ష ప్రయాణాల చరిత్రను తీసుకుంటే, చాలా ప్రమాదాలు భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఆ కొద్ది నిమిషాల్లోనే జరుగుతున్నాయని టీవీ వెంకటేశ్వరన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'బ్లాక్ అవుట్ టైమ్' ప్రమాదాలు
అంతరిక్షంలో 16 రోజులు ఉన్న తర్వాత 2003 ఫిబ్రవరి 1న స్పేస్ షటిల్ కొలంబియా భూమిపైకి బయలుదేరింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో ఏడుగురు సభ్యుల నాసా బృందం ఉంది.
2003 జనవరి 16న స్పేస్ షటిల్ కొలంబియా లాంచ్ అయినప్పుడు, దానికి బయట ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫోమ్ ఇన్సులేషన్ కొంతభాగం ఊడిపోయి, స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన ఎడమ వైపు రెక్కపై పడింది. దీనివల్ల కొన్ని హీట్-రెసిస్టెంట్ టైల్స్ దెబ్బతిన్నాయి.
''కొలంబియా లాంటి తిరిగి వాడుకునే స్పేస్‌క్రాఫ్ట్‌లకు పలకల రూపంలో హీట్ షీల్డ్ సిస్టమ్స్ (ఉష్ణ కవచ వ్యవస్థలు) ఉండేవి. ఇవి తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌ను కాపాడతాయి. మన ఇళ్ల గోడలకు పెట్టుకునే టైల్స్ మాదిరే తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి కాపాడేందుకు స్పేస్‌క్రాఫ్ట్‌కు ప్రత్యేక టైల్స్ పెడతారు.'' అని టీ.వీ వెంకటేశ్వరన్ చెప్పారు.
''కొలంబియా స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన టైల్ హీట్ షీల్డ్ సిస్టమ్ దెబ్బతినడంతో, ఈ ప్రమాదం జరిగింది'' అని తెలిపారు.
2003 ఫిబ్రవరి 1న భూ వాతావరణంలోకి కొలంబియా స్పేస్‌క్రాఫ్ట్ ప్రవేశించింది. ఆ సమయంలో దానిచుట్టూ ప్లాస్మా పొర, తీవ్రమైన ఉష్ణోగ్రతలు చుట్టుముట్టాయి. దీంతో, కల్పనా చావ్లాతో పాటు ఏడుగురు వ్యోమగాములు మరణించారు.
అంతరిక్షం నుంచి అమిత వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రకరకాల వాయువులతో స్పేస్ క్రాఫ్ట్‌కు కలిగే ఘర్షణ వల్ల విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది. అంత వేడిని తట్టుకునేలా స్పేస్ క్రాఫ్ట్‌ను డిజైన్ చేస్తారు.
‘‘కొలంబియా షటిల్ ఎడమ రెక్కకు రంధ్రం పడింది. ఈ రంధ్రంతో భూవాతావరణంలోని తీవ్రమైన వేడిగల గ్యాస్‌లు స్పేస్‌క్రాఫ్ట్ లోపలికి ప్రవేశించాయి. దీనివల్ల కొలంబియా స్పేస్‌క్రాఫ్ట్‌లోని కీలక వ్యవస్థలు పనిచేయకుండా పోయి చివరికి ముక్కలుగా విడిపోయి కాలిపోయింది.
రేడియో బ్లాక్ అవుట్‌కు 14 సెకన్ల సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ నియంత్రణను కోల్పోయిందని, ఎమర్జెన్సీ చర్యలు తీసుకున్నప్పటికీ, స్పేస్‌క్రాఫ్ట్ కంట్రోల్‌ను తిరిగి పొందలేకపోయాం’ అని నాసా రిపోర్టులో వెల్లడించింది.

ఫొటో సోర్స్, NASA
'రేడియో బ్లాక్ అవుట్'ను తగ్గించేందుకు నాసా ప్రయత్నాలు
మరో ఉదాహరణ రష్యన్ సోయజ్ 11 స్పేస్‌క్రాఫ్ట్. 1971లో ముగ్గురు వ్యోమగాములతో భూమికి తిరిగి వచ్చే సమయంలో... 'భూవాతావరణంలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాల్లోనే భూమితో కాంటాక్ట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత పారాచూట్లు తెరుచుకుని, విజయవంతంగా ఇది ల్యాండ్ అయింది.
సోయజ్ స్పేస్‌క్రాఫ్ట్ డోర్లను రెస్క్యూ టీమ్ తెరిచినప్పటికీ లోపలున్న ముగ్గురు వ్యోమగాములు చనిపోవడం చూసి వారు షాకయ్యారు.
స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన కేబిన్ ఎయిర్ ప్రెజర్ పడిపోవడంతో ముగ్గురు రష్యన్ కాస్మోనాట్స్ చనిపోయినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. రేడియో బ్లాక్ అవుట్ వల్ల కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చే ఎలాంటి మార్గదర్శకాలు వారు అందుకోలేకపోయారు.
దృఢమైన, అధునాతన ఉష్ణ కవచాలతో ప్లాస్మా పొర ప్రభావాలను తగ్గించేందుకు నాసా ప్రయత్నిస్తోంది. స్పేస్‌క్రాఫ్ట్ వేగం బట్టి 'రేడియో బ్లాక్ అవుట్' వ్యవధి పెరుగుతుంది.
వేగం ఎక్కువుంటే, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువ వేగం ఉంటే, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటూ, బ్లాక్ అవుట్ టైమ్ కూడా అత్యధికంగా ఉంటుంది. అందుకే, స్పేస్‌క్రాఫ్ట్ ఉష్ణ కవచాలు దానికి అనుగుణంగా రూపొందుతూ ఉంటాయి.
భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో వేడి నుంచి సిబ్బందిని రక్షించేందుకు స్పేస్‌క్రాఫ్ట్ ఉష్ణ కవచ వ్యవస్థలో Avcoat టైల్స్‌ను నాసా ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ వాడింది. ఈ ప్రత్యేక పలకలు 2760 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు.
అంతరిక్ష ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లలో రేడియో బ్లాక్ అవుట్ ఒకటి.
బ్లాక్ అవుట్ నిమిషాలను మరింత తగ్గించేందుకు నాసా, స్పేస్‌ఎక్స్ వంటి కంపెనీలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, దీనిలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నది వాస్తవం.
'' అందుకే, భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఎదుర్కొనే ప్రభావాల నుంచి వ్యోమగాములను రక్షించేందుకు అత్యంత ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు.'' అని ప్రొఫెసర్, డాక్టర్ టీ.వీ వెంకటేశ్వరన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














