300 మంది బందీలను విడిపించాం, 33 మంది మిలిటెంట్లను హతమార్చాం - పాకిస్తాన్ సైన్యం

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మొహమ్మద్ కజీమ్, మొహమ్మద్ జుబైర్ ఖాన్
- హోదా, బీబీసీ ఉర్దూ
మార్చి 11వ తేదీ రాత్రి 11గంటల సమయంలో ఓ గూడ్సు రైలు మెల్లిగా ఫ్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. అందులోని ప్రయాణికులలో కొందరు కింద కూర్చుని ఉండగా, మరికొందరు నుంచున్నారు. అందరూ అలసటతో ఉన్నారు.
ఈ అసాధారణ దృశ్యం బలూచిస్తాన్‌లోని మాచ్ నగరంలో కనిపించింది. ఈ ట్రైన్‌లో వచ్చిన వారు అంతకు ముందు తొమ్మిది గంటల పాటు జరిగిన సన్నివేశాలను తమ జీవితాంతం మర్చిపోలేరు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులలో కొందరు ఈ గూడ్సు రైలులో వచ్చారు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మంగళవారం (మార్చి 11) బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) బోలన్ పాస్ వద్ద దాదర్ ప్రాంతంలో దాడిచేసింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో 9 బోగీలు ఉన్నాయి. దాడి జరిగిన సమయంలో రైలులో మొత్తం 400మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
మిలిటెంట్లు ఓ టన్నెల్ వద్ద రైలును ఆపి, ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ ఘటన జరిగి అనేక గంటలు దాటినా ఇంకా సెక్యూరిటీ ఆపరేషన్ కొనసాగుతోంది.
బుధవారం రాత్రి సరికి మొత్తం 300మంది ప్రయాణికులను రక్షించినట్టు పాకిస్తాన్ మిలటరీ వర్గాలు చెప్పాయి. బందీలను రక్షించేందుకు భద్రతా దళాల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ఇప్పటివరకు 33 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు మిలటరీ అధికార ప్రతినిధి చెప్పారు.
కాగా 21 మంది పౌరులు, నలుగురు సైనికులను మిలిటెంట్లు చంపేశారని అధికారులు చెప్పారు.
మరోపక్క బీఎల్‌ఏ కూడా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వృద్ధులను, మహిళలను, పిల్లలను విడుదల చేసినట్టు తెలిపింది.
అయితే మిగిలిన ప్రయాణికుల గురించి ఇంకా కచ్చితమైన సమాచారం తెలియడం లేదు.
‘‘చాలామంది ప్రయాణికులను మిలిటెంట్లు తమతోపాటు పర్వతప్రాంతాలలోకి తీసుకువెళ్లారు’’ అని పాకిస్తాన్ హోం శాఖామంత్రి తలాల్ చౌదరి ప్రైవేటు టీవీ చానల్ జియో న్యూస్‌కు తెలిపారు.
మాచ్ స్టేషన్‌కు మంగళవారం రాత్రి చేరుకున్న ప్రయాణికులు దాడి జరిగిన తీరు, తరువాత పరిణామాల గురించి బీబీసీతో మాట్లాడారు.

జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌నెంబర్ 3లో ప్రయాణించిన ముస్తాక్ మొహమ్మద్ మాట్లాడుతూ ‘‘భారీ పేలుడుతో ఆ దాడి మొదలైంది’’ అని చెప్పారు.
ఇషాక్ నూర్ అనే మరో ప్రయాణికుడు క్వెట్టా నుంచి రావల్పిండికి తన భార్య ఇద్దరు పిల్లలతో కోచ్ నెంబర్ 7లో ప్రయాణిస్తున్నాడు. ‘‘ఆ పేలుడు చాలా తీవ్రంగా ఉంది. రైలు తలుపులు, కిటికీలు కంపించిపోయాయి. నా పక్కనే కూర్చున్న మా అబ్బాయి కిందపడిపోయాడు’’ అని చెప్పారు.
ముస్తాక్ మొహమ్మద్ మాట్లాడుతూ ‘‘పేలుడు తరువాత కాల్పులు మొదలయ్యాయి. గంటకుపైగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని తెలిపారు.
మిలిటెంట్ల కాల్పుల్లో దూసుకొస్తున్న తూటాలు బోగీలకు తగులుతుండటంతో తమ ఇద్దరు పిల్లల్లో ఒకరిని తాను, మరొకరికి తన భార్య రక్షణ కవచంలా నిలిచామని, ఒకవేళ బుల్లెట్లు తమపైకి దూసుకొచ్చినా అవి తమకు తగిలేలా తమ బిడ్డలను పొదువుకున్నట్టు చెప్పారు. దాదాపు గంటసేపు జరిగిన ఆ కాల్పులు చూసి ఊపిరి తీసుకోలేకపోయాం. ఏం జరుగుతోందో అర్థం కాలేదు’’ అని ఇషాక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కాల్పులు ఆగిపోయిన తర్వాత, సాయుధులు బోగీల్లోకి వచ్చారని ఇషాక్ గుర్తు చేసుకున్నారు.
''కాల్పులు ఆగిపోయిన తర్వాత, కొంతమంది సాయుధ వ్యక్తులు బోగీల్లోకి వచ్చారు. కొంతమంది గుర్తింపుకార్డులను పరిశీలించారు. మాలో కొందర్ని వేరు చేశారు. ముగ్గురు మిలిటెంట్లు మా బోగీల వద్ద కాపలాగా నిల్చున్నారు. అయితే మహిళలు, పిల్లలు, వృద్ధులకు, బలూచీలకు ఏమీ చేయమని వారు చెప్పారు’’ అని ఇషాక్ తెలిపారు.
‘‘దాడిచేసినవారు ఒకరితో ఒకరు బలూచిలో మాట్లాడుకున్నారు. భద్రతా సిబ్బందిపై కన్నేసి ఉంచాలని, వారు మన చేయి దాటిపోకూడదంటూ పదేపదే వారి లీడర్ మిలిటెంట్లకు చెబుతున్నారు.'' అని ముస్తాక్ మొహమ్మద్ కూడా గుర్తు చేసుకున్నారు.
తమ కోచ్ నుంచి భద్రతా సిబ్బంది అనే పేరుతో 11 మంది ప్రయాణికులను దాడిచేసినవారు తీసుకెళ్లారని, ఇషాక్ నూర్ చెప్పారు.
''ఆ సమయంలో ఒక వ్యక్తి ప్రతిఘటించేందుకు ప్రయత్నించాడు. అతన్ని చాలా హింసాత్మకంగా కిందకి దించారు. ఆ తర్వాత తుపాకీ పేలిన శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత బోగీలో ఉన్న వారందరం కూడా వారి సూచనలను పాటించాం.'' అని తెలిపారు.
బలూచ్ వ్యక్తులను, మహిళలను, పిల్లలను, పెద్ద వారిని విడిచిపెడతామని మిలిటెంట్లు సాయంత్రం చెప్పారని, కానీ తనను వెళ్లనీయలేదని ఇషాక్ నూర్ చెప్పారు. అయితే, తాను తుర్బత్‌కు చెందిన నివాసిని అని, తనతో పాటు పిల్లలు, భార్య ఉన్నారని చెప్పడంతో వదిలిపెట్టారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మహమ్మద్ అష్రాఫ్ మంగళవారం ఉదయం క్వెట్టా నుంచి లాహోర్‌కు బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం అష్రాఫ్ గురించిన సమాచారం తెలుసుకోవడానికి ఆయన కుమారుడు క్వెట్టా రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బీబీసీ కరస్పాండెంట్ మహమ్మద్ ఖాజిమ్‌తో మాట్లాడారు.
మాచ్ స్టేషన్’ నుంచి మహమ్మద్ అష్రాఫ్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు. క్వెట్వా రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరినప్పటి నుంచి దాడిజరిగిన ప్రాంతానికి చేరుకునేవరకూ ఏం జరిగిందో వివరించారు.
వృద్ధులు,మహిళలు, పిల్లలను మిలిటెంట్లు వదిలిపెట్టారని, వీరందరూ పనీర్ స్టేషన్‌కు బయల్దేరారని తెలిపారు. మూడు, మూడున్నరగంటల సమయం తరువాత అతి కష్టం మీద మేం పనీర్ స్టేషన్‌కు చేరుకున్నాం. మేం బాగా అలసిపోయాం. మాతోపాటు పిల్లు, యువతులు, మహిళలు ఉన్నారు.
మిలిటెంట్ల బారి నుంచి బయటపడ్డ చాలామంది ప్రయాణికులు తమ వస్తువులను అక్కడే విడిచిపెట్టగా.. కొందరు తమ లగేజీలతో వచ్చారు. ఇక్కడ ప్రాణాలతో బయటపడటమే కష్టమని తాను వారితో చెప్పినట్లు అష్రఫ్ తెలిపారు. విడిచిపెట్టిన వారిలో కొందరు పెద్దవారు ఉండటంతో, వారిని తమ భుజాలపై మోసుకుని తీసుకొచ్చినట్లు చెప్పారు.
ప్రయాణికులు బాగా భయపడ్డారని అష్రఫ్ చెప్పారు. ''నా అంచనా ప్రకారం.. సుమారు 250 మంది ప్రయాణికులను మిలిటెంట్లు బంధించారు. దాడి చేసిన వారు కూడా సుమారు 110 వరకు ఉన్నారు.'' అని అష్రఫ్ తెలిపారు.
వెనక్కి తిరిగి చూడొద్దని తమకు సాయుధ వ్యక్తులు చెప్పారని, ఆ తర్వాత క్లిష్టమైన మార్గాల్లో తాము పనిర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు బషీర్ అనే ప్రయాణికుడు చెప్పారు. ఆయన తన భార్య, పిల్లలతో కలిసి ఈ రైలులో ప్రయాణిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














