టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ : అదే పనిగా రీల్స్ చూస్తే క్రమంగా భుజాలు ముందుకు వంగిపోతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు అదే పనిగా రీల్స్ చూస్తుంటారా? ఉదయం నిద్రలేచింది మొదలు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, టీవీ అంటూ ఏదో ఒక స్క్రీన్‌కు అతుక్కుపోయే ఉంటున్నారా?
మదిలో ఏదైనా తట్టగానే గూగుల్‌లో సెర్చ్ చేయడం, పుస్తకాలు కూడా స్క్రీన్‌పైనే చదవడం, బోర్ కోడితే ఓటీటీలు, ఆఫీస్ పని కోసం ల్యాప్‌టాప్, ఫోన్లు, రీల్స్, మెసేజులు.. ఇలా రాత్రింబవళ్లూ డిజిటల్ స్క్రీన్లతోనే గడుపుతుంటే ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నట్టే లెక్క.
చాలామంది స్క్రీన్ చూడకుండా కనీసం 30 -40 సెకన్లు కూడా ఉండలేరు. ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా చాలామంది మొబైల్స్ చూస్తూ కనిపిస్తారు. ఇక రైళ్లు, బస్సులలో ప్రయాణించే సమయంలో ఫోన్‌కు అతుక్కుపోయే ఉంటారు. వీటన్నింటినీ గమనిస్తే, మన స్క్రీన్ టైమ్ (స్క్రీన్‌ని చూసే సమయం) పెరిగిపోయిందని అర్థం చేసుకోవచ్చు.

అదే పనిగా స్క్రీన్ చూడటం (స్క్రీన్ టైం) శారీర, మానసిక ప్రభావాలు చూపుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రభావాలలో ప్రధానమైనది టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. అసలేమిటీ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్? దీనివల్ల వచ్చే సమస్యలేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
మెడపై ప్రభావమెంత?
ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ వంటివి చూస్తూ మెడ వంచి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మీ మెడ ఒత్తిడికి గురవుతుంది. ఇది టెక్స్ట్ నెక్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది.
చిన్న భావన(కాన్సెప్ట్) ద్వారా దీనిని మరింత బాగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే గురుత్వాకర్షణ రేఖ (గ్రావిటీ లైన్).

ఫొటో సోర్స్, Getty Images
ఒక వస్తువు లేదా, ఒక వ్యక్తి కేంద్రకం నుంచి భూ ఉపరితలం వరకూ వెళ్లే నిలువు సరళ రేఖే (వర్టికల్ లైన్) ఈ గ్రావిటీ లైన్. ఇదో ఊహాత్మక రేఖ.
అంటే మన తల గురుత్వాకర్షణ రేఖ నుంచి దూరంగా వెళ్లినప్పుడు మెడ కండరాలు ఒత్తిడికి గురవుతాయి. అలాంటప్పుడు, మన తలను మళ్లీ గురుత్వాకర్షణ రేఖ దిశకు తీసుకురావడానికి మన మెడ కండరాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. నిరంతరం లాగి ఉంచినట్లు అవి అదే ఒత్తిడితో ఉంటాయి. అలా ఎక్కువ కాలం ఉంటే, మెడనొప్పి మొదలవుతుంది. క్రమంగా ఆ మెడనొప్పి ఒక వ్యాధిగా పరిణమిస్తుంది. దీనినే టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే, మీ తల, మెడ వంచడంలో ఇబ్బందులు మొదలవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంకా ఎలాంటి ఇబ్బందులున్నాయి?
ఈ విధమైన మెడనొప్పి అనేక ఇతర సమస్యలకూ దారితీస్తుంది. ఈ విషయమై మేం ఎంజీఎం హెల్త్‌కేర్ హాస్పిటల్ స్పైన్ సర్జరీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కరుణాకరన్‌తో మాట్లాడాం.
''ఇవన్నీ మన కీళ్లపై ప్రభావం చూపుతాయి. స్పాండిలోసిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. సర్వైకల్ డిస్క్ డీజనరేషన్‌కు కూడా కారణమవుతాయి'' అని కరుణాకరన్ అన్నారు.
(సర్వైకల్ డిస్క్ అంటే, వెన్నెముక లేదా వెన్నుపూసలోని రెండు ఎముకల మధ్యలో కుషన్‌లా పనిచేసే భాగం. ఇది ఎముకల కదలికలను సులభతరం చేస్తుంది. ఈ డిస్క్‌లు అరిగిపోతే భరించలేని నొప్పి మొదలవుతుంది.)
''సర్వైకల్ డిస్క్‌కు ఏదైనా నష్టం జరిగితే అది శరీరం పైభాగం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల భరించలేని నొప్పి, తిమ్మిర్లు, ఇతర సమస్యలు రావొచ్చు. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ ఉన్నవారు రౌండెడ్ షోల్డర్స్(భుజాలు ముందుకు వంగిపోవడం- గూని తరహాలో) ఇబ్బందులెదుర్కొంటారు.
మెడ అస్తమానం ముందుకు వంగి ఉండడం వల్ల భుజాలు కూడా ముందుకు వంగిపోతాయి. స్క్రీన్‌ను ఎక్కువగా చూడడం వల్ల కళ్లపై, అలాగే టైప్ చేయడం వల్ల వేళ్లపైన ఒత్తిడి పడుతుంది. మీ తల భుజాలకు దూరంగా, గ్రావిటీ లైన్‌కు దూరంగా ఉన్నట్లయితే ఆ నొప్పి అలాగే కొనసాగుతుంది'' అని డాక్టర్ కరుణాకరన్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారమేంటి?
''మీ శరీరం ముందుకు వంగిపోతే, మీకు వెన్నుపూస సమస్యలు మొదలవుతాయి. ఇందులో అతి కీలకమైన పరిష్కారం ఏంటంటే, మీ స్క్రీన్‌ను మీ కళ్లకు ఎదురుగా ఉండేలా చూసుకోవడం. ఫోన్ లేదా, ల్యాప్‌టాప్ వాడుతున్న సమయంలో మీ చేతులు పైకెత్తడం, కాసేపు చేతులు చాచడం వంటివి అవసరం. ఇలాంటి చిన్నపాటి ఒత్తిళ్ల వల్ల అక్కడి కణజాలాలకు ఉపశమనం లభిస్తుంది. ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నా, ఫోన్ చూస్తున్నా వీటిని గుర్తుంచుకోవాలి'' అన్నారాయన.
నిరంతరం స్క్రోల్ చేసే పనిలోనే ఉండేవారు వారి వీపు భాగం, చేతులు, భుజాలపై కూడా శ్రద్ధ వహించాలి. అదేపనిగా స్క్రోల్ చేస్తుండేవారిలో టెక్స్టింగ్ థంబ్ అనే వ్యాధి కూడా రావొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, మనం దేనినైనా అతిగా చేస్తే దాని ప్రభావం శరీరంపైనా, మానసిక ఆరోగ్యంపైనా పడుతుంది.
ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. వెన్నెముక సమస్యలు వస్తాయి. సెడెంటరీ లైఫ్‌స్టైల్ (నిశ్చల జీవనశైలి) వెన్నునొప్పి, మెడనొప్పి, ఆస్టియోపోరోసిస్, వెరికోస్ వెయిన్స్ వంటి వ్యాధులకు కూడా కారణమవుతుంది.
కాబట్టి, స్క్రీన్ ముందు కదలకుండా అలాగే కూర్చుని ఉండడం ప్రమాదకరం. మధ్యమధ్యలో లేచి శరీరాన్ని అటూఇటూ కదిలించడం చాలా అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
కళ్లను కాపాడుకోవడమెలా?
అదేపనిగా రీల్స్ చూడడం, స్క్రీన్‌ను చూడడం కళ్లపై దుష్ప్రభావం కలిగిస్తుంది. కళ్లు పొడిబారడం, కంటి కండరాలు అలసిపోవడం, చిన్నపిల్లల్లో హ్రస్వ దృష్టి (మయోపియా)తో పాటు సరిగ్గా నిద్రపట్టకపోవడం, అర్ధరాత్రిళ్లు హఠాత్తుగా మెలకువ రావడం వంటి సమస్యలు వస్తాయి.
రీల్స్, నిరంతరం స్క్రీన్ వాచింగ్ వల్ల తలెత్తే కంటి సమస్యల గురించి బాద్లాపూర్‌లోని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌కు చెందిన నిపుణుడు డాక్టర్ మందార్ మయెకర్‌తో బీబీసీ మాట్లాడింది.
కళ్లపై స్క్రీన్ల ప్రభావం పడినప్పుడు, కళ్లకు ఏమవుతుందని అడిగినప్పుడు డాక్టర్ మయెకర్ ఇలా చెప్పారు. ''స్క్రీన్‌ను అదేపనిగా చూస్తున్నప్పుడు మన కనురెప్పలు తక్కువసార్లు మూతపడతాయి. దీనివల్ల కళ్లు పొడిబారిపోతాయి. అదే సమయంలో కంటి కండరాలపై ఒత్తిడి పడి, అలసటకు దారితీస్తుంది'' అన్నారు.
''రాత్రిళ్లు ఎక్కువసేపు స్క్రీన్లు చూడడం వల్ల నిద్రపోవడంలో కీలకమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీంతో, కంటినిండా కునుకు సాధ్యం కాదు. రీల్స్ ఎక్కువసేపు చూడడం వల్ల కళ్లు ఒత్తిడికి గురయ్యాయనేందుకు కళ్లు ఎర్రబారడం, నొప్పి పుట్టడం, నీళ్లు కారడం, కళ్లలో మంటలు, సరిగ్గా చూడలేకపోవడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవడం ఎలా?
ఈ విషయంలో పలు సూచనలు చేశారు డాక్టర్ మందార్ మయెకర్.
వ్యక్తిగత విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తూ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవచ్చు. వ్యాయామం కోసమో, లేదంటే కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించుకోవచ్చు.
ఒకవేళ ఆఫీసు పనుల వల్ల స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంటే, 20-20-20 నియమం పాటించాలి. అంటే, 20 నిమిషాల స్క్రీన్ సమయం తర్వాత 20 సెకన్లు విరామం తీసుకుని, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడడం.
ముఖ్యంగా నిద్రపోవడానికి గంట ముందు స్క్రీన్ చూడడం మానేయాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














