ఫేక్ హార్ట్ డాక్టర్: ఏడుగురు పేషెంట్లు చనిపోయాక అసలు విషయం తెలిసింది

ఆరోగ్యం, నేరాలు, ఫేక్ డాక్టర్
ఫొటో క్యాప్షన్, లండన్ డాక్టర్ పేరుతో నకిలీ డాక్టర్ రోగులకు ఆపరేషన్లు చేయడంతో మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌లోని మిషన్ హాస్పిటల్ వార్తల్లోకెక్కింది.
    • రచయిత, విష్ణుకాంత్ తివారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్య‌ప్రదేశ్‌లోని దమోహ్‌కి చెందిన రహీసా ఖురేషీకి ఛాతీలో తీవ్రమైన నొప్పివచ్చింది. ఆమె కుమారుడు నబీ వెంటనే మిషన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తక్షణమే ఆపరేషన్ చేయాలని అక్కడున్న ఒక డాక్టర్ సలహా ఇచ్చారు.

ఆ తర్వాత, రహీసా చనిపోయారు. జనవరి 14న ఆమెకు యాంజియోప్లాస్టీ చేశారు. మరుసటి రోజు ఆమెకు మళ్లీ గుండెపోటు వచ్చింది. వెంటిలేటర్‌పై ఉంచారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆమె మరణించారు. 'గుండెపోటు వచ్చింది, ఏమీ చేయలేకపోయాం' అని ఆస్పత్రి సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు.

అయితే, ఈ ఆపరేషన్ ఒక నకిలీ డాక్టర్ చేశారని అప్పటి వరకూ వారికి తెలియదు.

దమోహ్‌లోని మిషన్ ఆస్పత్రిలో డాక్టర్ ఎన్.జాన్ కేమ్ అనే డాక్టర్ 15 ఆపరేషన్లు చేశారని, కానీ ఆయన నకిలీ అని టీవీలో చూసినప్పుడు నబీ కాళ్లకింద భూమి కదిలిపోయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

లండన్‌కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు, ప్రొఫెసర్ జాన్ కేమ్ పేరుతో ఒక నకిలీ వైద్యుడు మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో వైద్యం చేస్తున్నారని, ఆయన దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకున్న ఐదుగురు చనిపోయారన్న కేసు వెలుగులోకి వచ్చింది.

ఈ మరణాలను జిల్లా అధికారులు ధ్రువీకరించారు. కానీ, బాధిత కుటుంబాలు చెబుతున్న దాని ప్రకారం, ఇప్పటి వరకూ ఏడుగురు చనిపోయారు.

ఏప్రిల్ 6వ తేదీ రాత్రి, జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ముకేశ్ జైన్ ఫిర్యాదు మేరకు దమోహ్ పోలీసులు నకిలీ డాక్టర్ ఎన్. జాన్ కేమ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

దమోహ్ జిల్లా కలెక్టర్ సుధీర్ కొచ్చర్ ఈ విషయం గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు.

దమోహ్ నగర సూపరింటెండెంట్ అభిషేక్ తివారీ బీబీసీతో మాట్లాడుతూ, ప్రాథమికంగా ''మోసం, సరైన వైద్య అనుమతులు లేకుండా వైద్యం అందించడం'' వంటి ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నారని, ఆయన కోసం గాలింపు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకు, వైద్యం అందించడంలో నిర్లక్ష్యం, హత్య వంటి అభియోగాలు కూడా చేర్చవచ్చని పోలీసులు చెబుతున్నారు.

మానవ హక్కుల సంఘం, ఆరోగ్యం, నేరాలు
ఫొటో క్యాప్షన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ప్రియాంక్ కానుంగో (ఎర్ర కుర్తా)

లండన్ డాక్టర్ పేరుతో ఈ నకిలీ ఎలా?

దమోహ్‌లోని భారత్‌లా గ్రామానికి చెందిన 64 ఏళ్ల మంగళ్ సింగ్ ఫిబ్రవరి 4న కడుపులో గ్యాస్ సమస్యతో మిషన్ ఆస్పత్రిలో చేరారు. ఈయన కేసులోనూ రహీసా కథే పునరావృత్తమైంది.

మంగళ్‌ సింగ్ కుమారుడు జితేంద్ర సింగ్ బీబీసీతో మాట్లాడారు. ''నాన్న ఛాతినొప్పితో బాధపడుతుండడంతో ఫిబ్రవరి 3న మిషన్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆయుష్మాన్ కార్డుపై యాంజియోగ్రఫీ జరిగింది, గుండెలో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్ వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. కానీ ఆపరేషన్ సమయంలో ఆయన పరిస్థితి మరింత విషమించింది. మమ్మల్ని బయటకు పంపించి, ఆస్పత్రి సిబ్బంది చాలాసేపు పంపింగ్ చేశారు. ఆ తర్వాత వెంటిలేటర్‌పై ఉంచారు. కొద్దిసేపటి తర్వాత నాన్న చనిపోయారు'' అని ఆయన చెప్పారు.

''మృతదేహాన్ని తీసుకెళ్లాలని డాక్టర్ ఎన్. జాన్ కేమ్ ఫోన్‌లో చెప్పారు. ఆ సమయంలో మాకేమీ అర్థం కాలేదు. గుండెపోటు అని భావించి మౌనంగా ఉన్నాం. మీడియాలో చూసిన తర్వాత, అతను నకిలీ డాక్టర్ అని మాకు తెలిసింది''అన్నారు జితేంద్ర సింగ్.

ఏప్రిల్ 4న జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ప్రియాంక్ కానుంగో చేసిన సోషల్ మీడియా పోస్టుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దమోహ్ మిషన్ హాస్పిటల్‌లో బ్రిటన్‌కు చెందిన కార్డియాలజిస్ట్ అని చెప్పుకుంటున్న ఓ నకిలీ డాక్టర్ 15 మంది రోగులకు గుండె ఆపరేషన్లు చేశారని, వారిలో ఏడుగురు చనిపోయారని ఆయన ఆరోపించారు.

2025 ఫిబ్రవరిలోనే తాను సీఎంహెచ్‌వో డాక్టర్ ముకేశ్ జైన్‌కు ఫిర్యాదు చేసినట్లు దమోహ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు దీపక్ తివారీ బీబీసీతో చెప్పారు. ఈయనే నకిలీ డాక్టర్ గురించి మొదటగా ఫిర్యాదు చేశారు.

దీపక్ తివారీ బీబీసీతో మాట్లాడుతూ, ''ఈ వ్యవహారంపై ఫిబ్రవరిలోనే జిల్లా యంత్రాంగానికి, ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశాం. ఫిబ్రవరి 12న కొన్ని కుటుంబాలు మా వద్దకు వచ్చాయి. మేం మూడు రోజుల పాటు మొత్తం సమాచారం సేకరించిన తర్వాత, ఫిబ్రవరి 15న చీఫ్‌ మెడికల్ ఆఫీసర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాం. కానీ, మా ఫిర్యాదుని పట్టించుకోలేదు, ఎలాంటి చర్యలూ తీసుకోలేదు'' అన్నారు.

ఈ ఆరోపణలకు సంబంధించి జిల్లా వైద్యాధికారి ముకేశ్ జైన్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ, ఈ వార్త రాసే సమయం వరకూ ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

డాక్టర్ ఎన్.జాన్ కేమ్ గతంలోనూ ఎన్నో వివాదాల్లో ఉన్నారు.

ఈ నకిలీ డాక్టర్ వాడుకుంటున్న పేరు నిజానికి, లండన్‌లోని సెయింట్ జార్జ్ హాస్పిటల్‌లో క్లినికల్ కార్డియాలజీ ప్రొఫెసర్ ఎ.జాన్ కేమ్‌ ది. ఆయన కార్డియాక్ అరిథ్మియాస్, ఏట్రియల్ ఫైబ్రిలేషన్, కార్డియోమయోపతి, పేస్‌మేకర్ థెరపీలో నిపుణులు.

ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ బూమ్ లైవ్ 2023లో ప్రచురించిన ఒక కథనంలో, నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అలియాస్ ఎన్.జాన్ కేమ్ లండన్‌‌కు చెందిన వైద్యుడని బ్రాన్‌వాల్డ్ హెల్త్‌కేర్ వెబ్‌సైట్‌ పేర్కొంటోందని, అలా నమ్మించేందుకే ఈ వెబ్‌సైట్‌ను సృష్టించారని పేర్కొంది.

నరేంద్ర విక్రమ్ యాదవ్ ప్రొఫెసర్ ఎన్.జాన్ కేమ్ పేరుతో చెలామణి అవుతున్నారనే విషయంతో పాటు అనేక వాస్తవాలను బూమ్‌ లైవ్ తన కథనంలో పేర్కొంది.

మధ్యప్రదేశ్, ఆరోగ్యం, నేరాలు, వైద్యం
ఫొటో క్యాప్షన్, నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అలియాస్ ఎన్.జాన్ కేమ్

మిషన్ ఆస్పత్రి మేనేజ్‌మెంట్ ఏం చెబుతోంది?

నకిలీ డాక్టర్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సభ్యురాలు పుష్పా ఖరే మాట్లాడుతూ, ''కేసు దర్యాప్తు అధికారులు అడిగిన అన్ని డాక్యుమెంట్లు వారికి అందించాం. మా రికార్డుల్లో డాక్టర్ పేరు నరేంద్ర జాన్ కేమ్ అని, ఆయనది ఉత్తరాఖండ్ అని ఉంది'' అన్నారు.

''ప్రభుత్వ ఆథరైజ్డ్ ఏజెన్సీ అయిన ఇంటిగ్రేటెడ్ వర్క్‌ఫోర్స్ ఎంక్వైరీ సొల్యూషన్ (ఐడబ్ల్యూయూఎస్‌) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆయన ఉద్యోగంలో చేరారు. జనవరి 1న ఆస్పత్రిలో విధుల్లో చేరారు. ఫిబ్రవరిలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే వెళ్లిపోయారు'' అని ఆమె చెప్పారు.

''మిషన్ హాస్పిటల్‌కు ఆ ఏజెన్సీకి మధ్య ఒప్పందం ఉంది. అందులో భాగంగా డాక్టర్ జీతంలో కొంత ఏజెన్సీకి వెళ్తుంది. బదులుగా డాక్టర్ వివరాలు, ఆయన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాధ్యతలను ఆ ఏజెన్సీ చూసుకుంటుంది. మేం కూడా మోసపోయం. దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తున్నాం'' అని పుష్పా ఖరే పేర్కొన్నారు.

అయితే, ఐడబ్ల్యూయూఎస్‌లో పనిచేస్తున్న డీకే విశ్వకర్మ మాట్లాడుతూ, ''డాక్టర్ కేమ్ సీవీ(అభ్యర్థి వివరాల జాబితా) మా కంపెనీకి వచ్చింది. దానిని మేం హాస్పిటల్‌కు పంపించాం. డాక్టర్‌ను, హాస్పిటల్‌‌తో కలపడమే మా పని. ఈ కేసులో డాక్టర్ కేమ్‌ను మా ద్వారా హాస్పిటల్ నియమించుకోలేదు. మమ్మల్ని కాదని, నేరుగా డాక్టర్‌తో మాట్లాడుకుని నియామకం చేసింది. ఒకవేళ మా ద్వారా ఉద్యోగంలో చేరితే, మేం తప్పకుండా ఆయన డాక్టరా కాదా? అనే విషయంతో పాటు ఆయన డిగ్రీలను కూడా వెరిఫై చేసి ఉండేవాళ్లం'' అన్నారు.

మధ్యప్రదేశ్, బీజేపీ, ఆరోగ్యం, నేరాలు
ఫొటో క్యాప్షన్, దమోహ్ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారణకు ఆదేశించారు.

విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి

ప్రొఫెసర్ ఎన్.జాన్ కేమ్ అలియాస్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ గతంలోనూ వార్తల్లో నిలిచారు.

2023లో, ఓ వెరిఫైడ్ ట్విటర్ అకౌంట్ నుంచి వచ్చిన వివాదాస్పద ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. జర్మనీలో కార్డియాలజిస్ట్‌గా చెప్పుకున్న 'ప్రొఫెసర్ ఎన్. జాన్ కేమ్' అనే ట్విటర్ అకౌంట్‌లో ఓ పోస్ట్ చేశారు.

ఫ్రాన్స్‌లో అల్లర్లు ఆపడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పంపడం గురించి అందులో రాశారు.

దీనిని ఒక యూరోపియన్ వైద్యుడి ట్వీట్‌గా కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ కూడా దీనికి స్పందించింది. ఆ తర్వాత, ఈ అకౌంట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఫ్యాక్ట్ చెకర్స్, ఇంటర్నెట్ యూజర్లు ఈ ట్విటర్ అకౌంట్ గురించి ఆరా తీయడంతో దీని వెనక ఉన్నది నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అనే భారతీయుడని, ఉద్యోగులను మోసం చేశారనే ఆరోపణలతో 2019లో హైదరాబాద్ పోలీసులు ఈయన్ను అరెస్టు చేసినట్లు తేలింది.

తనను తాను కార్డియాలజిస్ట్‌గా, ప్రొఫెసర్‌గా, యూరప్‌లో ప్రముఖ వైద్యుడిగా నరేంద్ర ప్రచారం చేసుకున్నారు. బ్రిటన్‌కు చెందిన జాన్ కేమ్ అనే వైద్యుడి ఐడెంటిటీని వాడుకుని, బ్లూటిక్ కొనుగోలు చేసి తన ట్విటర్ అకౌంట్‌ను అధికారిక ఖాతాగా చూపించే ప్రయత్నం చేశారు.

రోగుల మరణాల తర్వాత 2025 ఫిబ్రవరిలో మళ్లీ వార్తల్లోకెక్కారు.

దమోహ్ ఘటన వెలుగుచూసిన తర్వాత ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ... ''ఇంకా ఇలాంటి కేసులు ఏవైనా ఉంటే, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖను ఆదేశించా. మన ప్రభుత్వంపై విశ్వసనీయతకు అదే కారణం'' అని ముఖ్యమంత్రి అన్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.

''ఈ హంతకుడిని బీజేపీ వాళ్లు ప్రోత్సహించారు. ఆ పార్టీ ఐటీ సెల్ ఆయన్ను హీరోని చేసింది. ఆయన ట్వీట్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి స్వయంగా షేర్ చేశారు. కానీ, వాళ్లిప్పుడు ఏమీ మాట్లాడడం లేదెందుకు? పూర్తి వివరాలు తెలుసుకోకుండా, రోగులకు వైద్యం చేసేందుకు ఆయన్ను ఎవరు అనుమతించారు? ఈ మరణాకు బాధ్యులెవరు? ప్రొఫెసర్ ఎన్.జాన్ కేమ్ అలియాస్ విక్రమాదిత్యనా? లేక బీజేపీనా?'' అని రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)