డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయా, ట్రంప్ పాలనలో భారతీయ విద్యార్థుల పరిస్థితేంటి?

అమెరికా, చదువు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముంబయిలో నివసించే 21 ఏళ్ల జీల్ పాండ్యా, అమెరికాలోని రోచెస్టర్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నారు. అమెరికాలో చదువుకునే అవకాశం గురించి, ముఖ్యంగా తన కోర్సు గురించి ఆమె ఉత్సాహంగా ఉన్నారు.

జీల్ ప్రస్తుతం అమెరికా వెళ్లడానికి వీసా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వీడియో కాల్‌లో బీబీసీతో మాట్లాడారు.

"నేను ఒకరోజు ఫ్యామిలీతో కలిసి కూర్చుని, టీ తాగుతూ టీవీలో వార్తలు చూస్తున్నా. అప్పుడు నాన్న నిజంగా అమెరికా వెళ్లాలనుకుంటున్నావా? అని నన్ను అడిగారు. అక్కడ కళాశాలలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయని గుర్తుచేశారు. ఆయన వాటి గురించి ఆందోళన చెందారు. కోర్సు పూర్తయిన తర్వాత అక్కడ పని చేయగలవా? అంటూ చాలా ప్రశ్నలు అడిగారు. నేను మా నాన్నకు భరోసా ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నించాను. ఆయన అంగీకరించారు కానీ, చివరి వరకు ఆందోళనగానే ఉన్నారు" అని జీల్ పాండ్యా అన్నారు.

జీల్ వంటి విద్యార్థులు, కొందరు నిపుణులు, అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులతో ఈ విషయాలపై బీబీసీ హిందీ మాట్లాడింది. వారి మనస్సులోని ఆందోళన, అనిశ్చితిని తెలుసుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జీల్ పాండ్యా, వయసు 21 సంవత్సరాలు
ఫొటో క్యాప్షన్, జీల్ పాండ్యా, వయసు 21 సంవత్సరాలు

ఆందోళనకు కారణాలు ఏమిటి?

భారత ప్రభుత్వ డేటా ప్రకారం, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులకు అమెరికా...'అత్యంత ఇష్టపడే దేశాలలో ఒకటి' అని తెలుస్తోంది.

2024లో 7.5 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. ఇందులో 2 లక్షలకు పైగా విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. అంటే దాదాపు 27 శాతం మంది.

అయితే, 2023లో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ముఖ్యంగా అమెరికాకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 2024లో చాలా తగ్గింది.

ఇంతలో ఒక వార్త వచ్చింది, అమెరికాలో చదువుకోవడానికి మంజూరు చేసిన వీసాల సంఖ్యలో తగ్గుదల కనిపించింది.

ఇప్పుడు కారణాల గురించి మాట్లాడుకుందాం.

గత సంవత్సరం బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని అనేక కళాశాలల్లో విద్యార్థులు నిరసన తెలిపారు. పోలీసులు చాలామందిని అరెస్టు చేశారు.

అయితే, డోనల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధాన సమీక్షలు, యూనివర్సిటీలకు నిధుల వ్యవస్థలో మార్పులు, కొంతమంది విద్యార్థుల అరెస్టు వంటి అంశాలు ప్రముఖంగా కనిపించాయి.

జో బైెడెన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా క్యాంపస్‌లలో అనిశ్చితి

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న తేజస్ హరాద్ 2023లో ఇండియా నుంచి అక్కడికి వెళ్లారు. గత కొన్నివారాలుగా క్యాంపస్‌లో అనిశ్చితి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

"ప్రతిరోజూ మాకు కొత్త ఆదేశాల సమాచారం అందుతోంది. రేపు ఏం జరగబోతుంది? వచ్చే ఏడాది ఏం జరుగుతుంది? యూనివర్సిటీల నిధులలో కోతలు...అనేది అనేక రకాల వార్తలను అర్ధం చేసుకోవడం విద్యార్థులకు కష్టమవుతోంది. అయితే, ప్రస్తుతానికి మా నిధులపై ఎటువంటి ప్రభావం ఉండదని మా విశ్వవిద్యాలయం హామీ ఇచ్చింది" అని తేజస్ అన్నారు.

గత రెండు నెలలుగా, అమెరికన్ విశ్వవిద్యాలయాల కష్టాలకు తోడుగా, వివిధ కారణాలను చూపుతూ అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఉదాహరణకు, ఫిబ్రవరిలో ఫౌండేషన్‌లు, విశ్వవిద్యాలయాలకు బయోమెడికల్ పరిశోధన నిధులను తగ్గించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రభుత్వానికి నాలుగు బిలియన్ డాలర్లు (రూ. 34,400 కోట్లు) ఆదా చేస్తుందని తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో యూదు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 3,400 కోట్లు) నిధులను నిలిపివేసింది.

2025 మార్చి 19న పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం విధానాలపై అభ్యంతరం చెబుతూ 175 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,500 కోట్లు) ప్రభుత్వ నిధులను నిలిపివేసింది.

ఇటువంటి నిర్ణయాలు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫోర్డ్, నార్త్‌వెస్ట్రన్ వంటి అనేక సంస్థలకు కొత్త నియామకాలు, ఇతర ఖర్చులను నిలిపివేసేలా చేశాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

విద్యార్థులపై చర్యలు

అమెరికా ప్రభుత్వం కొంతమంది విద్యార్థులపై తీవ్రమైన అభియోగాలు మోపి, వారిని అరెస్టు చేసింది. వారి వీసాలను కూడా రద్దు చేయాలని నిర్ణయించింది.

ఈ నెలలో కొలంబియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దు చేశారు. దీంతో రంజనీ అమెరికా వదిలి వెళ్లాల్సి వచ్చింది. హింస, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు రంజనీపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, రంజనీ శ్రీనివాసన్ వాటిని ఖండించారు.

హమాస్‌ను ప్రోత్సహించడం, సంస్థ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు, భారతీయ పౌరుడు బదర్ ఖాన్ సూరిని కొన్ని రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. సూరి న్యాయవాదులు ఈ ఆరోపణలను ఖండించారు

సుశీల్ సుఖ్వానీ
ఫొటో క్యాప్షన్, సుశీల్ సుఖ్వానీ

అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం

"అమెరికన్ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తుల సంఖ్య తగ్గింది. వారి ప్రతినిధులు దీనిపై ఆందోళన చెందుతున్నారు" అని అడ్వైస్ ఇంటర్నేషనల్ యజమాని సుశీల్ సుఖ్వానీ అన్నారు.

"ట్రంప్ అనిశ్చితిని ఇష్టపడతారనుకుంటున్నా కానీ, అది ప్రమాదం కూడా. ట్రంప్ తన నిర్ణయాలలో స్పష్టంగా మరింత ఆలోచనాత్మకంగా ఉంటే పర్లేదు, లేకుంటే విద్యార్థులు అమెరికాపై విశ్వాసం కోల్పోయి మరో చోటకు వెళతారు" అని సుశీల్ అభిప్రాయపడ్డారు.

అమెరికాకు చెందిన 71 రీసర్చ్ యూనివర్సిటీల గ్రూప్ అయిన అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్‌ని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారి నుంచి స్పందన రాలేదు.

విద్యార్థులపై ప్రభావం

ఈ సంఘటనలు తమ మనస్సులలో లేదా వారి కుటుంబీకులలో అమెరికాలో చదువుకోవడం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని అనేకమంది విద్యార్థులు బీబీసీతో చెప్పారు.

"చదువు తర్వాత అక్కడ ఉద్యోగం దొరుకుతుందా? విదేశీ విద్యార్థులు ఉద్యోగాలు పొందేంత మార్కెట్ అక్కడ ఉంటుందా? వీటిపై నేను ఆశ వదులుకుని యూరోపియన్ దేశాల వైపు చూశాను. కానీ, అమెరికాలో ఉంటున్న మా బంధువులు నేను యూఎస్‌లోనే చదువుకోవాలని సూచించారు. ఇప్పుడు నేను మళ్లీ అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతున్నాను" అని అనీష్ (పేరు మార్చాం) అంటున్నారు.

న్యూయార్క్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ మేఘనాద్ బోస్ గత సంవత్సరం కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.

"ఇక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులలో భయం, ఆందోళన నెలకొన్నాయి. సోషల్ మీడియాలో రాస్తున్న విషయాలు చూసి విద్యార్థులు భయపడుతున్నారు. స్కాలర్‌షిప్‌లపై ఇక్కడికి వచ్చే విదేశీ విద్యార్థులకు మరిన్ని నిధులు అందుతాయో లేదో తెలియదు?. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందడానికి నియమాలలో ఏదైనా మార్పు వస్తుందో లేదో తెలియదు" అని బోస్ బీబీసీతో చెప్పారు.

"వచ్చే ఏడాది అమెరికన్ విశ్వవిద్యాలయాలలో పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని అనుకుంటున్నా." అని తేజస్ అన్నారు.

సాధారణంగా, పీహెచ్‌డీ విద్యార్థులకు మొత్తం కోర్సు కాలానికి స్టైఫండ్, ఇతర ఖర్చుల కోసం నెలవారీ మొత్తాన్ని కాలేజీయే ఇస్తుంది. ప్రతిగా విద్యార్థులు చదువుకుంటూ ఉపాధ్యాయులకు వారి పనిలో సహాయం చేస్తారు.

సుయాష్ దేశాయ్ ఒక రీసెర్చ్ స్కాలర్. ఆయన చైనా సైనిక కార్యకలాపాలను నిశితంగా గమనిస్తారు. గత సంవత్సరం, పీహెచ్‌డీ చేయాలనే ఉద్దేశంతో అమెరికాలోని పన్నెండు విశ్వవిద్యాలయాలను సంప్రదించారు. అయితే, ఆయనకు ఏ కాలేజీలోనూ సీటు దొరకలేదు. దీనితో సుయాష్ నిరాశ పడ్డారు.

"అమెరికాలో ప్రస్తుతం చాలా ఒడిదుడుకులున్నాయి. అక్కడి విశ్వవిద్యాలయాలు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వారి విద్యార్థులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కొత్త విద్యార్థులు తక్కువగా ఉండాలని కోరుకుంటున్నాయి." అని సుయాష్ అభిప్రాయపడ్డారు.

అమెరికా ప్రతినిధి ఏం చెప్పారు?

కొన్ని స్కాలర్‌షిప్ పథకాలతో విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారా? అని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని బీబీసీ అడిగింది.

దీనికి ప్రతిస్పందనగా "విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పనిని అమెరికా ప్రభుత్వం వ్యూహాత్మకంగా సమీక్షిస్తోంది. తద్వారా దాని పనులన్నీ 'అమెరికా ఫస్ట్' ఎజెండాతో ముడిపడి ఉంటాయి. ఇందులో విద్యా, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు కూడా ఉన్నాయి" అని తెలిపారు.

స్కాలర్‌షిప్ విషయంలో అనిశ్చితిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఏదైనా సహాయం అందిస్తుందా? అని ప్రశ్నించగా..కొన్ని ప్రోగ్రామ్‌లు ప్రభావితమవుతాయని రాయబార కార్యాలయం తెలిపింది. కానీ, దాని గురించి మరిన్ని వివరాలు వెల్లడించ లేదు.

ప్రభుత్వపు వ్యూహాత్మక సమీక్ష ఎప్పుడు పూర్తవుతుందో కూడా స్పష్టం చేయలేదు.

ఎడ్యుకేషన్ కౌన్సెలర్ కరణ్ గుప్తా మాట్లాడుతూ "కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు తమ ఆఫర్లను కూడా ఉపసంహరించుకున్నాయి. ఇది ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ STEM )లో పోస్ట్-డాక్టోరల్ పరిశోధకులు, ఫెలోషిప్ గ్రహీతలను ప్రభావితం చేస్తోంది" అని అన్నారు.

సుయాష్ దేశాయ్
ఫొటో క్యాప్షన్, సుయాష్ దేశాయ్

ఆకర్షణ తగ్గుతోందా?

ఈ ప్రశ్నపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.

"ఆధునిక పరిశోధనపై పనిచేయాలనుకునే వారందరికీ అమెరికన్ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ పెద్ద ఆకర్షణగా ఉన్నాయి. మా విద్యార్థులు మెరుగైన నాణ్యమైన విద్య కోసం అక్కడికి వెళ్తున్నారు. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మేం వారికి చెబుతున్నాం" అని కేపీ సింగ్ అంటున్నారు.

కేపీ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫారిన్ స్టడీస్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్.

"భారత్, చైనాల నుంచి విదేశాలకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు వెళ్లేవారు. ఇపుడు చైనా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల, ప్రపంచంలోని ఎడ్యుకేషన్ మార్కెట్ భారతదేశంపై ఆధారపడి ఉంది. ఇపుడు, మంచి విద్య అందుబాటులో ఉన్న దేశాలకు భారతీయ విద్యార్థులు అవసరం. ఇందులో అమెరికా కూడా ఉంది" అని ఆయన అన్నారు.

ప్రభుత్వం వెనక్కి తగ్గితే, కంపెనీలు ముందుకు వస్తాయి కాబట్టి, అమెరికాలో పరిశోధన అవకాశాలు తగ్గవని కె.పి.సింగ్ భావిస్తున్నారు.

కానీ, అధ్యయన అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులు అమెరికాతో పాటు ఇతర ఆప్షన్లను కూడా వెతుకుతున్నారని అడ్వైస్ ఇంటర్నేషనల్‌కు చెందిన సుశీల్ సుఖ్‌వానీ అంటున్నారు.

"విద్యార్థులు కొత్త దేశాల వైపు చూడటం ప్రారంభించారు. జర్మనీ, ఫ్రాన్స్ వైపు చూస్తున్నారు. దుబయి ఆర్థిక వ్యవస్థ బాగున్నందున అటువైపు కూడా చూస్తున్నారు. విద్యార్థులు అక్కడ పని చేయవచ్చు. చదువుకోవచ్చు. ఉద్యోగాలు పొందవచ్చు. ఐర్లాండ్ గతంలో కంటే మెరుగ్గా ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రంప్ ప్రభుత్వం 'ఫండ్స్ కట్ ఆర్డర్'కు ప్రతిస్పందనగా అమెరికన్ యూనివర్సిటీల సంఘం, అనేక కాలేజీలు కేసులు వేశాయి. ఈ కోతలు అమలైతే అమెరికా విశ్వవిద్యాలయాలలో వైద్య పరిశోధనలు దెబ్బతింటాయని హెచ్చరించాయి.

ముంబయిలో డిగ్రీ చదువుతున్న శ్రేయ మాల్వంకర్ అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసి, డేటా అనలిస్ట్ కావాలనుకుంటున్నారు.

"నాకు భయంగా ఉంది కానీ, ఇతర దేశాల కంటే అక్కడ నాణ్యమైన విద్య ఉందని భావిస్తున్నాను. అందుకే అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను. నాకు పర్డ్యూ నుంచి పార్షియల్ స్కాలర్‌షిప్ వచ్చింది. ఇది నాకు కొంత ఊరట. అలాగే, నేను రుణం తీసుకోబోతున్నాను. నా తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదనుకుంటున్నాను. అక్కడి పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. ఇది ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో విద్యార్థులు భయపడతారు. అమెరికాలో చదువుకోవాలని నిర్ణయించుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు" అని శ్రేయ అన్నారు.

డోరతీ మిల్లర్
ఫొటో క్యాప్షన్, డోరతీ మిల్లర్

కార్నెల్ కాలేజ్ 1880 నుంచి కార్నెల్ డైలీ సన్ అనే వార్తాపత్రికను నడుపుతోంది. డోరతీ మిల్లర్ ఆ వార్తాపత్రిక మేనేజింగ్ ఎడిటర్. ఆమె కార్నెల్ విశ్వవిద్యాలయంలో సెకండ్ ఇయర్ విద్యార్థి.

ఇంత గందరగోళంలోనూ సంతోషించాల్సిన విషయం విద్యార్థి సంఘాలు తమ కమ్యూనిటీల నుంచి సహాయం పొందడమేనని ఆమె అన్నారు.

"విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు మద్దతు కోసం, భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. కమ్యూనిటీలలో అది దొరుకుతోంది" అని మిల్లర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)