'ఆరేళ్ల కొడుకుని కొట్టి చంపేసిన సవతి తల్లి, వంతపాడిన కన్నతండ్రి', గుంటూరు జిల్లాలో దారుణం

గుంటూరు, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కవల సోదరులు ఆకాశ్, కార్తీక్
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు)

సవతి తల్లి అమానుషానికి కన్నతండ్రి కర్కశత్వం కూడా తోడు కావడంతో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆరేళ్ల చిన్నారి కార్తీక్‌ను సవతి తల్లి లక్ష్మి దారుణంగా కొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కవల సోదరుడైన మరో బాలుడు ఆకాశ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన హృదయాలను చలింపజేసేలా ఉంది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారులను విచక్షణా రహితంగా కొట్టడం, కాలుతున్న అట్లపెనం మీద కూర్చోబెట్టడం వంటి చర్యలకు ఎలా పాల్పడతారు? అసలు ఇంతటి పాషాణ హృదయాలు కూడా ఉంటాయా? అనే చర్చకు దారితీసింది.

సవతి తల్లి లక్ష్మి, తండ్రి సాగర్‌పై 103(1), 109(1), 238 రెడ్‌విత్, 3(5) బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పోలీసులు ఏం చెబుతున్నారు?

ఈ ఘటన గురించి, ఫిరంగిపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీంద్రబాబుతో బీబీసీ మాట్లాడింది. ఆయన చెప్పిన వివరాలిలా ఉన్నాయి.

''పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్‌కు కృష్ణా జిల్లాకి చెందిన అనూషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల క్రితం కవలలు ఆకాశ్, కార్తీక్‌ జన్మించారు.

రెండేళ్ల క్రితం రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనూష, ఆ మరుసటి రోజు చనిపోయారు. అనంతరం, ఆ పాపను యనమదల గ్రామానికి చెందిన వారికి దత్తత ఇచ్చారు.

ఆ తర్వాత, తనతోపాటు తన కవల పిల్లల బాగోగులు చూసుకునేందుకు సాగర్‌.. ఏడాదిన్నర కిందట గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నారు.''

'బిడ్డ పుట్టిన తర్వాత నుంచి కవలలకు నరకం'

సాగర్, లక్ష్మిలకు ఏడు నెలల క్రితం ఓ ఆడబిడ్డ జన్మించింది.

''పెళ్లైన కొత్తలో ఆకాశ్, కార్తీక్‌ను సూటిపోటి మాటలతో వేధించిన సవతి తల్లి లక్ష్మి ఆర్నెల్లుగా నరకం చూపిస్తూ వచ్చింది'' అని సీఐ రవీంద్రబాబు చెప్పారు.

''అంగన్‌వాడీ స్కూల్లో చదువుకుంటున్న కవల పిల్లలిద్దరూ మధ్యాహ్నానికే ఇంటికి వచ్చేసే వారు. రాడ్‌ వెల్డింగ్‌ పనిచేసే సాగర్‌ ఉదయం ఇంటి నుంచి వెళ్తే, పొద్దుపోయాక తిరిగొచ్చేవాడు. ఈలోగా పిల్లలిద్దరినీ రక్తం వచ్చేట్టు కొట్టడం ఆమెకు నిత్యకృత్యంగా మారింది. నాన్నకు చెబితే పరిస్థితి మారుతుందనుకుని పిల్లలు ఒకటికి రెండుసార్లు తండ్రికి చెప్పుకున్నారు. అయితే, సాగర్‌ కూడా పిల్లలనే తిరిగి కొట్టడంతో అప్పటి నుంచి వారు తండ్రికి కూడా చెప్పుకోవడం లేదు. దీంతో లక్ష్మి మరింత రాక్షసంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.''

చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆమెను పలుమార్లు మందలించారని ఆయన అన్నారు.

గుంటూరు, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, చిన్నారుల మేనత్త విజయ ఫిర్యాదు మేరకు సవతి తల్లి లక్ష్మి, తండ్రి సాగర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాలుడు ఎలా చనిపోయాడు?

ఇటీవల, కొండవీడు నుంచి లక్ష్మి సొంతూరు గొల్లపాలెంకు మాకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు. సాగర్‌ కూడా పిల్లలను తీసుకుని గొల్లపాలెం వచ్చేశారు.

''ఈక్రమంలో శనివారం ఉదయం సాగర్‌ పనికి వెళ్లిన తర్వాత, లక్ష్మి కవలలిద్దరినీ చిత్రహింసలకు గురిచేసింది. కార్తీక్‌(6)ను గోడకేసి కొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు'' అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ రవీంద్రబాబు తెలిపారు.

''ఆకాశ్‌ను బట్టలు మొత్తం ఊడదీయించి మొండిమొలతో పొయ్యి మీద కాలుతున్న అట్ల పెనంపై కూర్చోబెట్టింది. కదలకుండా ఉండేందుకు ముందుగానే చేతులు, కాళ్లు కట్టేసింది. మంట తట్టుకోలేక ఆకాశ్‌ ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగువారు ఫిరంగిపురం పోలీసులకు సమాచారం అందించారు.''

తాము అక్కడికి వెళ్లేప్పటికి కార్తీక్‌ నిర్జీవంగా పడి ఉన్నాడని, కాలిన గాయాలతో ఏడుస్తున్న ఆకాశ్‌ను వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామని సీఐ అన్నారు.

చిన్నారుల మేనత్త విజయ ఫిర్యాదు మేరకు సవతి తల్లి లక్ష్మి, సాగర్‌పై 103(1), 109(1), 238 రెడ్‌విత్, 3(5) బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు చెప్పారు.

గుంటూరు, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాలు

'మా పిల్లలను చంపుకుంటాం.. మీకెందుకు?'

''పిల్లలని చిత్రహింసలు పెడుతోందని తెలిసి, పోలీసులు రావడానికి ముందే మేం వాళ్లింటికి వెళ్లాం. అప్పటికే కార్తీక్‌ నిర్జీవంగా పడి ఉన్నాడు. కాలిన గాయాలతో ఆకాశ్‌ చావుకేకలు పెడుతున్నాడు.

ఏమిటీ ఘోరం అని అడిగితే, అక్కడున్న సాగర్‌.. నా పిల్లలు నా ఇష్టం.. చంపుకుంటాం.. మీకెందుకని ఎదురు ప్రశ్నించాడు'' అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మేనత్త విజయ పేర్కొన్నారు.

ఆ ఇంటి కోసమేనా?

కొండవీడులో సాగర్‌కు ఉన్న ఇంటి గురించే సవతి తల్లి లక్ష్మి ఇలా చేసి ఉంటుందని మేనత్త విజయ భర్త డేవిడ్ బీబీసీతో అన్నారు.

''కొండవీడులో సాగర్‌కు ఓ చిన్న ఇల్లు ఉంది. మొదట్లో లక్ష్మికి చెడు ఆలోచనలు లేకపోయినా, ఆమెకు పిల్ల పుట్టిన తర్వాత మార్పు వచ్చింది. ఆ కవల పిల్లలు ఉంటే ఆ ఇల్లు వారికే వెళ్తుందని, వాళ్లు పోతే తన పాపకే వస్తుందని భావించి ఇలా పిల్లలకు నరకం చూపించింది. సాగర్‌ మొదటే అడ్డుకట్ట వేస్తే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు'' అని డేవిడ్‌ చెప్పారు.

ఈ ఆరోపణలకు సంబంధించి లక్ష్మి తరఫు వారితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది, అయితే వారు అందుబాటులోకి రాలేదు. వారి నుంచి స్పందన రాగానే, ఈ కథనానికి జోడిస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)