ఎస్సీ, ఎస్టీ కులం సర్టిఫికెట్‌ను ఎప్పుడు రద్దు చేస్తారో తెలుసా?

ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలానికి చెందిన కోన జోసెఫ్‌ అలియాస్‌ యోసెఫ్‌కు ఉన్న ఎస్సీ కుల ధ్రువీకరణను ఇటీవల ఆ జిల్లా అధికారులు రద్దు చేశారు.

బీసీ 'సి' సర్టిఫికెట్‌ పొందేందుకు అర్హుడైన ఆయన తప్పుడు ధ్రువపత్రాలతో ఎస్సీ సర్టిఫికెట్‌ను తీసుకున్నారని నిర్ధరించి ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ నాగరాణి ప్రకటించారు.

ఈ మేరకు ఈనెల 3వ తేదీన గెజిట్‌ (పశ్చిమ గోదావరి జిల్లా రాజపత్రం) విడుదల చేసినట్లు బీబీసీకి కలెక్టర్‌ నాగరాణి తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎందుకు రద్దు చేశారంటే?

పశ్చిమ గోదావరి జిల్లా రెవిన్యూ అధికారి (డీఆర్వో) వెంకటేశ్వర్లు, కాళ్ల మండలం తహశీల్దార్‌ సుందర్‌సింగ్‌ బీబీసీకి వెల్లడించిన వివరాల ప్రకారం, జోసెఫ్ గతంలో హిందూ మాల కులస్థునిగా పేర్కొంటూ ఎస్సీ సర్టిఫికెట్‌ పొందారు.

కానీ, ఆయన క్రైస్తవ మతంలోకి మారారని, అదే మతాన్ని అనుసరిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

ఇలా మతం మారితే ఎస్సీ గుర్తింపు రద్దు అవుతుంది. క్రైస్తవాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి బీసీ-సి కేటగిరీలోకి వస్తారని అధికారులు తెలిపారు.

కానీ, మతం మారిన విషయాన్ని దాచిపెట్టి ఎస్సీగా జోసెఫ్ చెలామణీ అవుతున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.

ఈ మేరకు జిల్లా స్థాయిలో పరిశీలనా కమిటీని ఏర్పాటు చేశారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్, డీఆర్‌వో, జిల్లా ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్లు, ఆర్డీవో, కాళ్ల మండలం తహశీల్దార్‌ ఈ పరిశీలనా కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

జోసెఫ్ విద్యార్హతతో పాటు ఇతర గుర్తింపు కార్డులన్నింటినీ ఈ కమిటీ పరిశీలించింది.

ఈ క్రమంలో కమిటీ మూడుసార్లు భేటీ అయింది. జోసెఫ్ వాదనలు కూడా విని, ఆ తర్వాత మిగతా విషయాలన్ని పరిగణనలోకి తీసుకొని చివరకు జోసెఫ్‌, ఎస్సీ కాదని నిర్ధరించినట్లు డీఆర్‌వో తెలిపారు.

ఎస్సీ ధ్రువీకరణ పత్రం రద్దు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మొదట బీసీ-సీ, తర్వాత ఎస్సీగా సర్టిఫికెట్‌

''వాస్తవానికి జోసెఫ్‌ స్కూలు, కాలేజీ చదివే సమయంలో అన్నీ బీసీ–సి సర్టిఫికెట్లే ఉన్నాయి. ఆ తర్వాతే, ఆయన ఎస్సీ సర్టిఫికెట్ సంపాదించారు. మొత్తం రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత, కమిటీ నిర్ణయం మేరకు ఆయన ఎస్సీ సర్టిఫికెట్‌‌ను రద్దు చేశాం'' అని కాళ్ల తహశీల్దార్‌ సుందర్‌ సింగ్‌ వివరించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి కేసు ఇదే మొదటిదని డీఆర్‌వో మొగిలి వెంకటేశ్వర్లు బీబీసీకి తెలిపారు.

గెజిట్
ఫొటో క్యాప్షన్, ఎస్సీ కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ జారీ అయిన గెజిట్

ఏ సందర్భాల్లో కుల ధ్రువీకరణ రద్దు అవుతుంది?

1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ కులాలు) ఉత్తర్వు ప్రకారం, ఎస్సీ నేపథ్యం ఉన్న వ్యక్తులు ఇతర మతాల్లోకి మారినప్పుడు ఎస్సీ హోదాను కోల్పోతారని స్పష్టంగా పేర్కొంటూ పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది.

విచారణ అనంతరం జిల్లా స్థాయి పరిశీలనా కమిటీ సిఫార్సుల మేరకు, అలాగే 1993 నాటి కమ్యూనిటీ, నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చట్టం, 1997 జీఓ నెం.58 ద్వారా ఏర్పాటైన చట్టం ఇచ్చిన అధికారాల కింద జోసెఫ్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్లు రాజపత్రంలో పేర్కొన్నారు.

'నేను హిందువునే'

ఎస్సీ కులం సర్టిఫికెట్ రద్దు కావడం గురించి బీబీసీతో జోసెఫ్ మాట్లాడారు. తన వాదనను వినిపించారు.

''నేను మొదటి నుంచి హిందూ మతాన్నే అనుసరిస్తున్నా. హిందువుల్లోని మాల వర్గం నాది. చిన్నప్పుడు మా అమ్మానాన్నలకు తెలియక మా కాలనీలో అందరితో పాటు నాక్కూడా బీసీ–సి సర్టిఫికెట్‌ తీసుకున్నారు. 1984లో ఇంటర్‌ చదివేటప్పుడు అర్హత, నిబంధనల ప్రకారం రావాల్సిన ఎస్సీ సర్టిఫికెట్‌ తీసుకున్నాను. అప్పటి నుంచి అదే సర్టిఫికెట్‌ ఉంది. కానీ, ఇటీవల రాజకీయ కారణాలతో కొందరు నాపై కక్ష కట్టి తప్పుడు ఫిర్యాదులు సృష్టించారు. ఇప్పటికీ నేను హిందువునే. జిల్లా కమిటీ ఇచ్చిన తీర్పుపై నేను హైకోర్టుకు వెళ్లాను'' అని బీబీసీకి చెప్పారు కోన జోసెఫ్‌ .

కత్తి పద్మారావు

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, కత్తి పద్మారావు

'బాప్తిజం తీసుకుంటేనే క్రైస్తవుడు'

బాప్తిజం తీసుకున్నట్లు పాస్టర్‌ సర్టిఫికెట్‌ ఇస్తేనే కులం మారుతుందని బీబీసీతో దళిత బహుజన మహాసభ వ్యవస్థాపకులు డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు.

''అన్యమతస్థుల పేర్లు పెట్టుకోవడం వల్ల, సంప్రదాయాలు అనుసరించడం వల్ల మతం మారదు. అధికారికంగా కూడా అలా మారినట్టు కాదు. నేను ప్రత్యేకించి ఒక కేసు గురించి మాట్లాడట్లేదు. వాస్తవానికి పేర్లు ఏవైనా పెట్టుకోవచ్చు.

క్రిస్టియన్‌లు హిందూ పేర్లు పెట్టుకోవచ్చు. ఏ మతానికి చెందినవారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా తమకు నచ్చిన ఏ పేరునైనా పెట్టుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే, వారికిష్టమైన సంప్రదాయాలను అనుసరించవచ్చు. దానివల్ల ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దు చేయడం సరికాదు. కేవలం బాప్తిజం తీసుకుంటేనే సర్టిఫికెట్‌ రద్దవుతుంది'' అని ఆయన వివరించారు.

ఎక్కడెక్కడ ఇలాంటి వివాదాలు?

నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేములపాలెం గ్రామస్థుడు టి. లక్ష్మణరావు కుటుంబం క్రైస్తవంలోకి మారినా కుల ధ్రువీకరణ పత్రంలో మార్పు రాలేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో 2024 అక్టోబర్‌లో ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులకు ఉన్న ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేశారు.

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామానికి చెందిన కందుకూరి రాణి గిరిజనురాలు కాకపోయినప్పటికీ ఎస్టీ కోయ కుల ధ్రువీకరణ పత్రం పొందారని ఫిర్యాదులు వచ్చాయి.

అధికారులు విచారించి వాస్తవాలు నిర్ధిరించి ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేశారు.

ఎస్సీ కుల ధ్రువీకరణ

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రయోజనాల కోసం మతం మారడం అనైతికం’

రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందడం కోసం మతం, కులం మారడం నైతిక విలువలకే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం, పౌరులు తమకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు ఉందని వ్యాఖ్యానించింది.

అయితే, కేవలం కొన్ని ప్రయోజనాల కోసం మతం ముసుగు వేసుకోవడం అనైతికమని ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లను దుర్వినియోగం చేయడం తీవ్రమైన పరిణామమని పలుమార్లు న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

''తప్పుడు ఆధారాలతో సర్టిఫికెట్‌ పొందడం, లేదా నిజమైన సర్టిఫికెట్‌ను మోసపూరితంగా ఉపయోగించడం వంటివి నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో ఆరు నెలల నుంచి రెండు ఏళ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఒక వ్యక్తి మోసపూరితంగా నకిలీ సర్టిఫికెట్‌ పొందాడని తేలితే, సదరు వ్యక్తి విద్య లేదా ఉద్యోగంలో రిజర్వ్‌ సీట్లు వంటి ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది'' అని గుంటూరుకి చెందిన న్యాయవాది అనూరాధ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)