విడదల రజినిపై ఏసీబీ కేసు ఏమిటి? ఐపీఎస్ అధికారి జాషువా వాంగ్మూలంలో ఏం ఉంది?

విడదల రజనీ, కృష్ణదేవరాయలు

ఫొటో సోర్స్, https://www.facebook.com/

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని చుట్టూ కేసులతో పాటు వివాదాలూ ముసురుకుంటున్నాయి.

గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చిలకలూరిపేట నియోజకవర్గంలో స్టోన్‌ క్రషర్‌ యజమానులను బెదిరించి డబ్బులు వసూళ్లు చేశారన్న ఆరోపణపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే విచారణ మొదలైంది.

విజిలెన్స్‌ విచారణ తరువాత ఇప్పుడు ఏసీబీ కేసు నమోదైంది.

ఈ కేసు నమోదు కాగానే ఆమె టీడీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవ రాయలుపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేశారు.

ప్రతిగా ఆయన రజినీని టార్గెట్‌ చేస్తూ మరిన్ని ఆరోపణలను గుప్పించారు.

ఏసీబీ కేసులో రజినితో పాటు నిందితుడిగా ఉన్న విజిలెన్స్‌ మాజీ ఎస్పీ పల్లె జాషువా.. అప్పట్లో రజిని ఒత్తిడి వల్లనే తాను స్టోన్‌ క్రషర్లను తనిఖీ చేశానని, డబ్బుల వ్యవహారంలో తనకేం సంబంధం లేదనీ గతంలో విజిలెన్స్‌కు రాసిన లేఖ సరిగ్గా ఇప్పుడు బయటపడటం చర్చనీయమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విడదల రజనీ, కృష్ణదేవరాయలు

ఫొటో సోర్స్, https://www.facebook.com/

ఫొటో క్యాప్షన్, రజనీ ఒత్తిడి వల్లే స్టోన్ క్రషర్ యజమానులను తనిఖీ చేశానని విజిలెన్స్‌ మాజీ ఎస్పీ పల్లె జాషువా ఆరోపించారు.

రజనీపై ఏసీబీ కేసు ఏంటంటే...

2020 సెప్టెంబర్‌లో అప్పటి గుంటూరు.. ప్రస్తుత పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావును పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వాలని అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే రజిని తన ఆఫీసుకు పిలిపించుకుని మరీ బెదిరించారని ఏసీబీ నమోదుచేసిన కేసులో ఉంది.

రూ. 10 కోట్లు ఇవ్వాలని, మిగిలిన విషయాలు ఏవైనా ఉంటే పీఏ రామకృష్ణతో మాట్లాడుకోవాలని స్పష్టం చేశారని, ఇలా వారికి చెప్పిన వారం వ్యవధిలోనే సెప్టెంబర్‌ 10న అప్పటి గుంటూరు రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి జాషువా ఆ స్టోన్‌ క్రషర్‌లో తనిఖీలు చేశారని ఏసీబీ పేర్కొంది.

ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా పన్నులు ఎగవేశారనీ, వెంటనే ఎమ్మెల్యే రజినిని కలిసి సెటిల్‌ చేసుకోకుంటే క్రషర్‌ మూయించివేస్తానని జాషువా వాళ్లను బెదిరించారని, దీంతో వారిద్దరూ ఆమెను కలిసి.. ఆ తర్వాత ఆమె సూచనల మేరకు 2021 ఏప్రిల్‌ 4న రాత్రి ఆమె మరిది విడదల గోపికి రూ.2 కోట్ల10లక్షలు ఇచ్చారని, అదే రోజు గుంటూరులో జాషువాకు రూ.10 లక్షలు చెల్లించారని ఏసీబీ పేర్కొంది.

ఈ మేరకు విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికను అనుసరించి ఈ నెల 22న ఏసీబీ కేసులు నమోదు చేసింది.

విడదల రజనీ, కృష్ణదేవరాయలు

ఫొటో సోర్స్, facebook.com

ఫొటో క్యాప్షన్, ఏసీబీ కేసులో రజనీ ఏ1గా ఉన్నారు.

ఏఏ కేసులంటే..

శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానులను విజిలెన్స్‌ తనిఖీల పేరిట బెదిరించి వారి నుంచి రూ.2కోట్ల 20లక్షలు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణను ఏసీబీ నిందితులుగా చేర్చింది.

బెదిరించడం,బలవంతపు వసూళ్లు చేయడం, లంచం తీసుకోవడం, తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లను వర్తింపజేస్తూ కేసు పెట్టింది.

విడదల రజనీ, కృష్ణదేవరాయలు

ఫొటో సోర్స్, ACB

ఫొటో క్యాప్షన్, ఆధారాలు లభించడంతోనే రజనీపై కేసు నమోదుచేశామని ఏసీబీ అంటోంది.

ఆధారాలు ఉన్నాయంటున్న ఏసీబీ

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రషర్‌ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుపై గత డిసెంబర్‌లో కేసు నమోదు చేసి.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌కుమార్‌ గుప్తా విచారణ జరిపి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ సింగ్‌ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో గత శనివారం కేసు నమోదు చేశామని దర్యాప్తు బృందంలోని ఓ ఏసీబీ అధికారి బీబీసీకి వెల్లడించారు.

విడదల రజనీ, కృష్ణదేవరాయలు

ఫొటో సోర్స్, vigilance copy

ఫొటో క్యాప్షన్, ఐపీఎస్‌ అధికారి జాషువా విజిలెన్స్‌కి ఇచ్చిన వాంగ్మూలం కాపీలు

అంతా ఆమే చేశారంటూ జాషువా వాంగ్మూలం

కాగా ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏ–2గా ఉన్న ఐపీఎస్‌ అధికారి జాషువా గతంలో విజిలెన్స్‌కు ఇచ్చిన వాంగ్మూలం రెండు రోజుల కిందట బయటపడింది.

విచారణలో భాగంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి గతేడాది అక్టోబర్‌ 21న ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

2019 జూన్‌ 24 నుంచి 2021 ఆగస్టు 24 వరకూ గుంటూరు రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా తాను పని చేసిన కాలంలో అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని స్వయంగా విజిలెన్స్‌ కార్యాలయానికి వచ్చి శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్‌ క్రషర్‌పై లిఖితపూర్వక ఫిర్యాదిచ్చారని ఆయన తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా మైనింగ్‌ చేస్తోందని ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తోందని తగిన చర్యలు తీసుకోవాలని రజనీ కోరారని, ఆ ఆరోపణలపై తాను వ్యక్తిగతంగా విచారణ చేయగా, క్రషర్‌ యజమానులు టీడీపీ సానుభూతిపరులనీ, గతంలో వారు చిలకలూరిపేటలోని కూడలిలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా రజిని, ఆమె అనుచరులు అడ్డుకోవడంతో కట్టా శ్రీనివాస్‌ తన నివాసంలో ఆ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారని వెల్లడయిందని, అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ శత్రుత్వం ఏర్పడిందని జాషువా ఆ లేఖలో తెలిపారు.

ఈ పరిణామాలు, విభేదాల నేపథ్యంలోనే ఫిర్యాదు అందిందని తాను భావించానని, పైగా ఆ సమయంలో రజిని ఫిర్యాదుపై విచారణ చేసేందుకు తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మైనింగ్‌ శాఖకు లేఖ రాశానని, వారు ఓ ప్రైవేట్‌ సంస్థతో థర్డ్‌ పార్టీ విచారణ చేయించి స్టోన్‌ క్రషర్‌ పదిన్నర కోట్లు మైనింగ్‌ రాయల్టీ ఎగవేసినట్టు నివేదికిచ్చారని తెలిపారు.

ఆ నివేదికపై తనకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా, కేవలం రజిని ఒత్తిడి మేరకే థర్డ్‌పార్టీ ఏజెన్సీ అలా నివేదిక ఇచ్చిందని అర్ధమైందని, ఈ లోగానే తాను అక్కడి నుంచి బదిలీ అయ్యానని ఆ వాంగ్మూలంలో జాషువా పేర్కొన్నారు.

కేసుతో తనకు సంబంధం లేదని జాషువా అంటున్నారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఐపీఎస్ జాషువా

కనిపించకుండాపోయిన ఫిర్యాదు పత్రాలు

అయితే విడదల రజిని ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఆ తర్వాత కనపడకుండా పోయిందని, దాంతో పాటు కొన్ని విజిలెన్స్‌ ఫైల్స్‌ ట్యాంపరింగ్‌ చేశారని, పైగా ఆ విభాగం నుంచి తాను బయటకొచ్చేసి మూడేళ్లు దాటిపోయినందున తనపై విజిలెన్స్‌ విచారణకు ప్రామాణికత లేదని జాషువా ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే ఏసీబీ కేసు పెట్టిన నేపథ్యంలో ఈ వాంగ్మూలం కాపీ బయటపడటం ఇప్పుడు చర్చాంశనీయమైంది.

ఎంపీ కృష్ణదేవరాయలుపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు

కాగా, తనపై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలోనరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలుపై రజిని ఆరోపణలు గుప్పించారు.

కేసు నమోదైన మరుసటి రోజే మీడియాతో మాట్లాడుతూ.. కేవలం ఎంపీ ఒత్తిడి, కూటమి నేతల డైరెక్షన్‌లోనే తనపై ఏసీబీ కేసు నమోదు అయిందని ఆరోపించారు. తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు.

గతంలోనే ఎంపీ కృష్ణదేవరాయులు తన కాల్‌ డేటా తీశారనీ, ఇదంతా తమ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగినా అప్పట్లో ఆయన కూడా వైసీపీలోనే ఉండటంతో పార్టీ పెద్దల దృష్టికి తీసుకువచ్చి వదిలేశానని రజిని చెప్పారు. ఎంపీ ఒత్తిడితోనే కాల్‌ డేటా తీసినట్టు పోలీసులు అప్పట్లో ఒప్పుకున్నారని రజిని ఆరోపించారు.

విడదల రజనీ, కృష్ణదేవరాయలు

ఫొటో సోర్స్, facebook.com

ఫొటో క్యాప్షన్, టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలుపై రజనీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు.

ఆమె చెప్పేవన్నీ అబద్ధాలేనన్న ఎంపీ

విడదల రజనీ చెప్పేవన్నీ అబద్ధాలేననీ, ఆమెలా తాను అబద్ధాలు ఆడలేనని ఎంపీ కృష్ణ దేవరాయులు అన్నారు. రజనీ ఆరోపణలపై దిల్లీలో స్పందించిన ఆయన

కాల్ డేటా ఆరోపణలు వందకు వందశాతం అబద్ధమన్నారు. తమ ఇంట్లో మహిళలు ఉన్నారని, వారికో న్యాయం బయటి వారికో న్యాయం ఉండదని వ్యాఖ్యానించారు.

రజిని బెదిరింపులు ఎదుర్కొన్న స్టోన్‌ క్రషర్స్‌ నిర్వాహకులు కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

ఇప్పుడేమీ మాట్లాడలేం: కుమారస్వామి

అసలు విడదల రజిపై ఎవరో కేసు పెడితే తనపై ఆరోపణలు చేయడం దారుణమని ఎంపీ కృష్ణదేవరాయులు బీబీసీతో అన్నారు.

కాగా, ఏసీబీ కేసు నమోదైన మరుసటి రోజు మీడియా సమావేశం పెట్టి కృష్ణదేవరాయలుపై ఆరోపణలు చేసిన రజిని ఆ తర్వాత మీడియాకి అందుబాటులోకి రాలేదు.

ఆమె వివరణ కోసం ప్రయత్నించగా, రజిని భర్త విడదల కుమార స్వామి అందుబాటులోకి వచ్చారు.

ఏసీబీ కేసు నేపథ్యంలో న్యాయ సలహా సంప్రదింపుల పనిలో ఉన్నామని, ఇప్పుడు మాట్లాడలేమని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం)