ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ చెప్పిందేంటి, జరిగిందేమిటి?

ఫొటో సోర్స్, apsfl.in
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
కొద్దిరోజులుగా ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ వివాదాల్లో నలుగుతోంది.
ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్ ఈ మూడు రకాల సేవలనూ ఒకే కనెక్షన్‌తో అతి తక్కువ ధరకు రాష్ట్ర ప్రజలకు అందించడమే ధ్యేయంగా 2017లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ప్రారంభమైంది. మరి ఆ లక్ష్యం నెరవేరిందా?
అతి తక్కువ ధరకే వినియోగదారులకు కేబుల్, ఫోన్, నెట్ సేవలను అందిస్తామని చెప్పింది నిజమైందా?
అసలు ఫైబర్ నెట్ సంస్థ ఏం చెప్పింది? ఇప్పటి వరకూ ఏం జరిగింది?


ఫొటో సోర్స్, UGC
2017లో ప్రారంభమైన సేవలు
సర్వీస్ ప్రొవైడర్లు విడివిడిగా అందించే ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్ ఈ మూడు రకాల సేవలనూ ఒకే కనెక్షన్‌తో, తక్కువ ధరకు వినియోగదారులకు అందించడమే ఫైబర్ నెట్ సంస్థ లక్ష్యంగా చెప్పారు.
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో, 2015లో ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టగా, 2017 డిసెంబర్ 27న అమరావతిలో లాంఛనంగా అందుబాటులోకి తెచ్చారు.
ఇందుకోసం, విద్యుత్ శాఖతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 2,449 సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటూ 24 వేల కిలోమీటర్ల పొడవున 24-కోర్ ఆల్-డైఎలెక్ట్రిక్ సెల్ఫ్-సపోర్టింగ్ కేబుళ్లను వేశారు.
కేబుల్ ఆపరేటర్లను ఇందులో భాగస్వాములను చేయడంతో వారే ఇంటింటికీ తిరిగి ఫైబర్‌నెట్ కనెక్షన్లు ఇచ్చారు.

ఫొటో సోర్స్, apsfl.in
రూ. 149కే బేసిక్ ప్లాన్..
సంస్థ ప్రారంభించిన తొలినాళ్లలో.. అంటే, 2017లో రూ.149కే బేసిక్ ప్లాన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ప్లాన్‌లో కేబుల్, ఇంటర్ నెట్, ఫోన్ ఇలా మూడు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ప్రైవేట్ ఆపరేటర్లు ఇంటిపై డిష్ బిగించి ఈ సౌకర్యాలను కల్పిస్తారు. కానీ, ఫైబర్ నెట్‌తో కేబుల్ వైర్ ద్వారా ప్రసారాలు వస్తాయి.
ఈ మూడు సేవలను అందించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు కనీసం రూ. 400 నుంచి రూ. 550 వరకు చార్జ్ చేస్తారు.
అంతకంటే, తక్కువకే బేసిక్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చిన ఫైబర్‌నెట్ సంస్థ ఆ తర్వాత ధరలు పెంచుకుంటూ పోయింది.
టీడీపీ హయాంలోనే ఆ ధరను రూ.149 నుంచి రూ.250కి పెంచారు. 2019–24 మధ్య, వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్లాన్ రేటును రూ.350కి పెంచారు.
2020లో 9.70 లక్షల కనెక్షన్లు
ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం విశాఖపట్నంలో నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 2020 సెప్టెంబర్ నాటికి 9.70 లక్షల మంది వినియోగదారులు ఉన్నారని అప్పట్లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ప్రకటించింది.
ఏపీలో 3,000కు పైగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలను తమ నెట్‌వర్క్‌కు అనుసంధానించామని వెల్లడించింది. వినియోగదారులకు సెకనుకు సగటున 200 గిగాబైట్ల వేగాన్ని అందిస్తున్నామని పేర్కొంది.
2024 నాటికి 5 లక్షలే మిగిలాయి..
2024లో కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి 5 లక్షల కనెకన్లు మాత్రమే ఉన్నట్లు ఇటీవల రాజీనామా చేసిన ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, బాధ్యతలు చేపట్టిన కొత్తలో చెప్పారు. కోటి మందికి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు.
గత ప్రభుత్వం పెంచిన ప్లాన్‌ల ధరలు తగ్గించి నెలకు రూ.149 బేసిక్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ తొమ్మిది నెలల్లో సంస్థకు ఒక్క కనెక్షన్ కూడా రాలేదని, పైగా ప్రభుత్వం వచ్చేసరికి సుమారు 5 లక్షల కనెక్షన్లు ఉండగా, ఇప్పుడు మరో 50 వేల కనెక్షన్లు తగ్గిపోయాయని జీవీ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు.
కాగా, సంస్థ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 27 నాటికి, 4.95లక్షల హౌస్‌హోల్డ్ కనెక్షన్లు ఉన్నట్టు చూపిస్తోంది. దీన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, UGC
ధర చాలా తక్కువే, కానీ..
ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ సంస్థ ప్లాన్ ధరలు తక్కువే అయినప్పటికీ వినియోగదారులు కనెక్షన్లు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదనేదే ఇక్కడి ప్రశ్న.
ఈ విషయంపై తిరుపతిలోని పెదకాపు వీధిలో ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్న దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
''కనీసం 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 350 రూపాయలకే కనెక్షన్ ఇవ్వడం వల్ల ప్రజల్లో ఆదరణ బాగానే ఉంది. ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు ఇచ్చే ప్యాకేజీ ధర కంటే ఫైబర్‌నెట్ ప్లాన్ ధర తక్కువ. ప్రస్తుతం మా ప్రాంతంలో ఎటువంటి నెట్‌వర్క్ సమస్య లేదు, బాగానే ఉంది.
కానీ, కొన్ని ప్రాంతాల్లో బాక్సులు పాడవడం వల్ల నెట్‌వర్క్ సమస్య వస్తుందని అందుకే కనెక్షన్లు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు" అని మునిశేఖర్ చెప్పారు.
'సమస్య వస్తే పరిష్కరించే పరిస్థితి లేదు'
ఫైబర్ నెట్ ధర తక్కువ ఉన్నప్పటికీ, నెట్‌వర్క్ సమస్య వస్తే వేగంగా పరిష్కరించే పరిస్థితి లేదని తిరుపతి చెందిన సీనియర్ ఆపరేటర్ కృష్ణ అన్నారు.
''నేను పాతికేళ్లుగా కేబుల్ రంగంలోనే ఉన్నా. ఫైబర్ నెట్ తక్కువ ధరకు ఇస్తున్న మాట వాస్తవమే, కానీ నెట్‌వర్క్ సమస్య వస్తే వేగంగా పరిష్కరించే పరిస్థితి లేదు.
ప్రైవేట్ కనెక్షన్లు అయితే 49 ఎంబీపీఎస్‌కే రూ. 699 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, సర్వీస్‌లో వేగం, నెట్‌వర్క్‌లో వేగం ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రైవేట్ సంస్థల కనెక్షన్ల వైపే మొగ్గు చూపుతుంటారు'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, UGC
బాక్సులు మార్చాలి : గౌతమ్ రెడ్డి
ఫైబర్ నెట్ ప్లాన్ ధరల పెంపు, కనెక్షన్లు తగ్గిపోవడం గురించి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ సంస్థ చైర్మన్‌గా పనిచేసిన గౌతమ్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
''2019 తర్వాత మేం వెరిఫై చేస్తే 9 లక్షల కనెక్షన్లు మాత్రమే వచ్చాయి. వాటిని నిలబెట్టుకుని మరిన్ని కనెక్షన్లు పెంచేందుకు కృషి చేశాం. నెట్ స్పీడ్‌ను పెంచే క్రమంలోనే రేట్లు పెంచాం'' అని మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు.
అలాగే, ''గతంలో ఇచ్చిన బాక్సుల కాలపరిమితి ఎప్పుడో ముగిసిపోయింది. వాటి స్థానంలో కొత్త బాక్సులు ఇవ్వాలి. ఒక్కో బాక్స్ ధర రూ. 3,000 వరకు ఉంటుంది. నిధుల కొరతతో వాటిని తెప్పించడం సాధ్యం కాలేదు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
కొత్త ఎండీ ఏమన్నారంటే..
ఫైబర్‌నెట్ సంస్థ పనితీరును మెరుగుపర్చడమే నా లక్ష్యమని ఇన్‌చార్జి ఎండీగా నియమితులైన ప్రవీణ్ ఆదిత్య తెలిపారు.
''ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని సంస్థ పనితీరును మెరుగుపరచడమే నా ముందున్న లక్ష్యం'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














