ఏపీ బడ్జెట్: తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్, 'సూపర్ సిక్స్' పథకాల మాటేంటి?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఏపీ బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్ల రూపాయలు దాటింది. మరి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? సూపర్ సిక్స్ పథకాలకు నిధుల మాటేంటి?
2025–26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ గత నవంబర్ 11వ తేదీన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2.94 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే ఇది 10 శాతం ఎక్కువ. ఆ బడ్జెట్.. గత ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలల కాలానికి ప్రతిపాదించింది కాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే.
అలాగే, రూ.48 వేల కోట్ల అంచనాతో రూపొందించిన వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.

అటు అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ కేటాయింపులు చేయాల్సి రావడంతో బడ్టెట్ రూ.3 లక్షల కోట్లు దాటిందని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టామని, రాజధాని పనులను పట్టాలెక్కిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సేవల రంగంలో 11.7% వృద్ధి సాధించామని పయ్యావుల ప్రకటించారు.
రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు కాగా రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా చూపించారు. ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగానూ, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగానూ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, UGC
బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు ఇలా...
వైద్య ఆరోగ్య శాఖ- రూ.19,260 కోట్లు
పాఠశాల విద్య- రూ.31,806 కోట్లు
జల వనరుల శాఖ- రూ.18,020 కోట్లు
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ - రూ.18,848 కోట్లు
విద్యుత్ శాఖ - రూ.13,600 కోట్లు
సాంఘిక సంక్షేమం - రూ.10,909 కోట్లు
బీసీ వెల్ఫేర్ - రూ.23, 260 కోట్లు
ఎస్సీల సంక్షేమం - రూ.20,281 కోట్లు
ఎస్టీల సంక్షేమం - రూ.8,159 కోట్లు
ఆర్థికంగా వెనుకబడిన తరగతులు - రూ.10,619 కోట్లు
రవాణా శాఖ- రూ.8,785 కోట్లు
పురపాలక శాఖ- రూ.13,862 కోట్లు
స్వచ్ఛాంధ్ర - రూ.820 కోట్లు
పౌరసరఫరాల శాఖ - రూ.3,806 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాలు- రూ.5,434 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం- రూ.4,332 కోట్లు
గృహనిర్మాణ శాఖ- రూ.6,318 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖ- రూ.3,156 కోట్లు
ఇంధన శాఖ - రూ.13,600 కోట్లు
ఆర్‌అండ్‌బీ- రూ.8,785 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం - రూ.10 కోట్లు
అన్నదాత సుఖీభవ - రూ.6,300 కోట్లు
పోలవరం - రూ.6,705 కోట్లు
జల్‌జీవన్ మిషన్ - రూ.2,800 కోట్లు
తల్లికి వందనం - రూ.9,407 కోట్లు
దీపం పథకం- రూ.2,601 కోట్లు
వీటితో పాటు ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ వైద్య భరోసా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించింది.

ఫొటో సోర్స్, UGC
నగదు బదిలీ పథకాల మాటేమిటి?
సూపర్ సిక్స్ ఎన్నికల హామీలకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ చెప్పారు. కానీ, సూపర్ సిక్స్‌లోని ఆరు పథకాల్లో కొన్నింటి అమలుపై బడ్జెట్‌లో స్పష్టత లేదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.
సూపర్ సిక్స్ హామీల్లో నగదు బదిలీతో ముడిపడిన పథకాలు ఐదు ఉన్నాయి.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని మినహాయిస్తే.. తల్లికి వందనం, మహిళలకు ప్రతి నెలా భృతి, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు ఏటా ఆర్థిక సాయం, ఏడాదికి ఉచితంగా మూడు వంట సిలిండర్ల హామీలు.. ప్రత్యక్ష నగదు బదలీ పథకాలకు సంబంధించినవి.
వీటిలో కొన్ని పథకాలపై స్పష్టత లేకపోగా, మరికొన్ని పథకాలకు కేటాయించిన బడ్జెట్ అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు సరిపోతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మహిళలకు ఉచిత ప్రయాణంపై లేని స్పష్టత
ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, ఎప్పటి నుంచి మొదలుపెడతారనే దానిపై స్పష్టత లేదు.
నిరుద్యోగ భృతిపై కూడా..
రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతీయువకులకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల వేళ కూటమి హామీనిచ్చింది.
అలాగే, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.1500 చెల్లిస్తామని హామీ ఇచ్చాయి.
అయితే, ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ హామీల అమలుకు సంబంధించిన ప్రస్తావన బడ్జెట్ ప్రసంగంలో కనిపించలేదు.

ఫొటో సోర్స్, UGC
రైతులకు పెట్టుబడి సాయం పూర్తిగా వస్తుందా?
సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల వేళ టీడీపీ, జనసేన వాగ్దానం చేశాయి.
ఎన్నికల హామీ ప్రకారం, రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇవ్వాలంటే రూ.పది వేల కోట్లకు పైగా అవసరం. ఈ బడ్టెట్‌లో అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు కేటాయించారు.
ఈ తక్కువ కేటాయింపులతో రైతులకిచ్చిన హామీ ఎలా అమలవుతుందని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ పరిశీలకులు గాలి నాగరాజు ప్రశ్నించారు.
మొత్తంగా, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ముడిపడి ఉన్న ఎన్నికల హామీల విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనే చర్చ నడుస్తోంది.

ఫొటో సోర్స్, UGC
'రూ.6 వేల కోట్లతో పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది?'
''పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పుడు చేసిన కేటాయింపులతో పోలిస్తే ఐదారురెట్లు ఎక్కువ కేటాయింపులు కావాలని గతంలో ప్రభుత్వమే అంచనావేసింది. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అంటోంది. కానీ, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించారు'' అని సీనియర్ జర్నలిస్ట్ గాలి నాగరాజు బీబీసీతో అన్నారు.
ఇలాగైతే ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
''2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ 2024లోగా పూర్తి చేస్తామన్నారు. అయినా సగం పనులు కూడా పూర్తయిన పరిస్థితి లేదు.
కేంద్రంపై ఒత్తిడి చేసి ఎక్కువ నిధులు తెప్పించాల్సిన బాధ్యత బాబుపై ఉంది. అలాగే, సమైక్య రాష్ట్రంలో కూడా రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన దాఖలాలు లేవు. అయితే, ఈ అంచనా బడ్టెట్ కేటాయింపులన్నీ పక్కాగా విడుదలయ్యేలా చూస్తే చాలు.. కొంతవరకు ప్రగతి సాధించినట్టే'' అని సీనియర్ జర్నలిస్టు గాలి నాగరాజు బడ్జెట్‌పై తన అభిప్రాయాన్ని బీబీసీ వద్ద వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, UGC
బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ అద్బుతంగా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రజల అకాంక్షలను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎం చంద్రబాబు బడ్జెట్‌లో పొందుపరిచారని, అభివృద్ధి, సంక్షేమంతోపాటు హామీల అమలుకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారని అనగాని చెప్పారు.
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని చెప్పారు.
బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో పెద్ద పీట వేశారని, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి బాటలు వేశారని అనగాని సత్యప్రసాద్ అన్నారు.
'మహిళలకిచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు'
బడ్జెట్లో అన్ని రంగాలకూ మోసం జరిగిందని, మహిళలకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు.
మహిళా శక్తికి, నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించలేదని, ఉచిత బస్సు ఊసే లేదని ఆమె అన్నారు. తల్లికి వందనం అన్నదాత సుఖీభవ నిధుల్లో భారీగా కోత విధించారని ఆరోపించిన వరద కళ్యాణి ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














