చనిపోయిన అమ్మాయి, అబ్బాయి కోసం భారత్, పాక్ పాలిత కశ్మీర్ మధ్య వంతెనను ఆరేళ్ల తరువాత తెరిచారు.. ఇంతకీ వారు ఎందుకు చనిపోయారు?

భారత, పాకిస్తాన్ సైనిక అధికారులు

ఫొటో సోర్స్, Indian Army

ఫొటో క్యాప్షన్, భారత, పాకిస్తాన్ సైనిక అధికారులు
    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశం, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖపై నిర్మించిన 'కమాన్ అమన్ సేతు' వంతెనను ఆరేళ్ల తర్వాత ఇటీవల తెరిచారు.

రెండు మృతదేహాలను తిరిగి తీసుకురావడానికే దీన్ని తెరిచారు.

కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీ ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జీలం నదిలో మునిగిపోయి మరణించారు.

ఆ తర్వాత వారిద్దరి మృతదేహాలు పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌కు కొట్టుకుపోయాయి.

'కమాన్ అమన్ సేతు' బారాముల్లాలోని ఉరీ ప్రాంతంలోని నియంత్రణ రేఖపై ఉంది. ఒకవైపు భారత సైన్యం, మరోవైపు పాకిస్తాన్ సైన్యం ఇక్కడ మోహరించి ఉన్నాయి.

చనిపోయిన యువకుడు, యువతి మృతదేహాలు జీలం నదిలో ప్రవాహ వేగానికి పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో‌కి కొట్టుకుపోయాయి.

చాలా రోజులుగా వెతికిన తరువాత వారిద్దరి మృతదేహాలు దొరికాయి.

మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడానికి రెండు దేశాల సైనికాధిరుల మధ్య చర్చలు జరిగాయి.

అనంతరం వారి మృతదేహాలు భారత్‌లోకి తీసుకొచ్చేందుకు వీలుగా ఆరేళ్లుగా మూసేసిన 'కమాన్ అమన్ సేతు'ను తెరవాలని నిర్ణయం తీసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కశ్మీర్

ఫొటో సోర్స్, Photo by Firdous Nazir/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ఉరీ ప్రాంతంలో జీలం నదిలో మునిగి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి గల్లంతయ్యారు.

అసలేం జరిగింది?

కశ్మీర్‌లోని ఉరీ ప్రాంతంలో మార్చి 5, 2025న జీలం నదిలో మునిగి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి గల్లంతయ్యారు.

స్థానిక పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందం వారిద్దరి కోసం చాలా రోజులుగా వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది.

ప్రవాహం కారణంగా వారిద్దరి మృతదేహాలు నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌కు చేరుకున్నాయని తరువాత తెలిసింది.

ఆ ఇద్దరినీ 22 ఏళ్ల యాసిర్ హుస్సేన్ షా, 21 ఏళ్ల ఆయేషా బానోగా గుర్తించారు.

మార్చి 19న, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని చినారి సెక్టార్‌లో ఆయేషా బానో మృతదేహాన్ని కనుగొన్నారు.

స్థానికుల సమాచారం మేరకు అక్కడి అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల తరువాత, మార్చి 21న, చినారి సెక్టార్ సమీపంలోని చకోఠీ ప్రాంతంలో యాసిర్ మృతదేహం కూడా కనిపించింది.

మృతదేహాలు దొరికాయనే సమాచారం అందుకున్న తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ సైన్యాలు పరస్పరం సంప్రదించుకుని వాటిని వారి కుటుంబాలకు తిరిగి పంపాలని నిర్ణయం తీసుకున్నాయి.

మార్చి 22, 2025న, పాకిస్తాన్ సైన్యం రెండు మృతదేహాలను భారత సైన్యానికి అప్పగించింది. తరువాత అధికారులు, పోలీసుల సమక్షంలో వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు.

ఈ విషయంలో భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేస్తూ "20 మార్చి 2025న, జీలం నదిలో క్లిష్ట పరిస్థితుల్లో సైనిక సిబ్బంది ఒక మృతదేహాన్ని చూసి దానిని తీయడానికి ప్రయత్నించారు. కానీ బలమైన ప్రవాహం కారణంగా అది నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని చకోఠీ సెక్టార్‌కు చేరుకుంది. తరువాత, పాకిస్తాన్ అధికారులను సంప్రదించి మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి సైన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు మృతదేహాలను సైన్యం వాటిని కుటుంబాలకు అప్పగించింది" అని పేర్కొంది.

మృతదేహం, బారత సైన్యం

ఫొటో సోర్స్, Pakistan Army

ఫొటో క్యాప్షన్, మార్చి 22న మృతదేహాలను భారత సైన్యానికి అప్పగించారు.

కుటుంబ సభ్యులు ఏం చెప్పారు?

ఆ అమ్మాయి తండ్రి మొహబ్బత్ ఖాన్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు. సంఘటన జరిగిన రోజు ఉదయం 10 గంటలకు తన కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిందని చెప్పారు.

"ఆమె తల్లి ఆయేషాను ఆపడానికి ప్రయత్నించింది, కానీ ఆయేషా వినలేదు. చాలా సేపటి వరకు ఆయేషా తిరిగి రాకపోవడంతో, నా కొడుకు ఆమెను వెతకడానికి వెళ్ళాడు. యాసిర్‌తో ఉన్న కుమార్తెను చూశాడు. ఇదంతా ఎలా, ఎందుకు జరిగిందో మాకు తెలియదు" అని మొహబ్బత్ ఖాన్ చెప్పారు.

ఇద్దరి మధ్య సంబంధం గురించి తనకు తెలియదని మొహబ్బత్ ఖాన్ అన్నారు.

యాసిర్ దగ్గరి బంధువు ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, "వారి సంబంధం గురించి మాకు ఏమీ తెలియదు. సంఘటన జరిగిన రోజు, ఉదయం వరకు యాసిర్ ఇంట్లోనే ఉన్నాడు. తరువాత ఇదంతా ఎలా జరిగిందో మాకు తెలియదు. కనీసం ఇప్పుడు అతని మృతదేహం దొరికి ఇంటి దగ్గర ఖననం చేయటంతో మాకు ఉపశమనం కలిగింది" అని అన్నారు.

ఈ కేసులో లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం చనిపోయిన ఇద్దరూ ప్రేమించుకున్నట్లు తెలుస్తోందని పోలీసులు చెప్తున్నారు.

ప్రస్తుతానికి ఇది నీటిలో మునిగి చనిపోయిన కేసుగానే దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు తర్వాత మిగతా విషయాలు స్పష్టమవుతాయని ఉరీ ఎస్‌డీపీఓ తారిఖ్ అహ్మద్ బీబీసీతో అన్నారు.

ప్రతికూల వాతావరణం, ఎడతెగని వర్షం కారణంగా మృతదేహాల కోసం వెతకడం కష్టమైందని, దాంతో మృతదేహాలు అటువైపు కొట్టుకుపోయాయని ఆయన అన్నారు.

'కమాన్ అమన్ సేతు' ఎప్పుడు మూసివేశారు?

భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించిన తరువాత, 2019లో 'కమాన్ అమన్ సేతు' మూసివేశారు.

2019 ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడి జరిగింది, దీనిలో ఆ దాడిలో 40 మంది సైనికులు మరణించారు.

ఈ దాడి తర్వాత, భారత్, పాక్ సంబంధాలలో ఉద్రిక్తత నెలకొంది.

అప్పటి నుంచి ఈ వంతెన ద్వారా జరిగే వాణిజ్యం కూడా ఆగిపోయింది. ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ నోట్లను అక్రమంగా పంపేవారు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారని భారత హోం మంత్రిత్వ శాఖ అప్పట్లో తెలిపింది.

శ్రీనగర్ నుంచి ఉరీకి దూరం దాదాపు 80 కిలోమీటర్లు. ఉరీ అనేది ఎత్తైన కొండల మధ్య ఉన్న ఒక చిన్న పట్టణం, అక్కడి నుంచి 'కమాన్ అమన్ సేతు' దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

వంతెన వద్ద నుంచి చూస్తే రెండు వైపులా భూభాగం స్పష్టంగా కనిపిస్తుంది.

సరిహద్దుకు రెండు వైపులా నివసిస్తున్న కుటుంబాలు రాకపోకలు సాగించడానికి వీలుగా

'కమాన్ అమన్ సేతు'ను 2005లో ప్రారంభించారు. ఈ వంతెన మీదుగా 2008లో, రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా మొదలైంది.

దీనిని 'శాంతి వంతెన' అని కూడా పిలుస్తారు. సరిహద్దుకు రెండు వైపులా వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయి, వారంతా బంధువుల్లా ఉంటారు.

కానీ ఈ కుటుంబాలు ఒకరినొకరు కలవాలంటే రెండు దేశాల ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)