మొహమ్మద్ షమీ ఉపవాసంపై చర్చ, ఇంజమామ్ ఉల్ హక్ ఇచ్చిన సలహా ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
దుబయి వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు గెలుచుకుంది. కానీ, టోర్నమెంట్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు చర్చనీయమయ్యాయి.
దుబయిలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మొహమ్మద్ షమీ నీళ్లు లేదా జ్యూస్ తాగారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, కొందరు ప్రముఖులు షమీకి మద్దతుగా నిలిచారు.
ప్రస్తుతం రంజాన్ మాసం జరుగుతోంది. ఇస్లాంలో దీనిని పవిత్ర మాసంగా పరిగణిస్తారు. రంజాన్ సమయంలో ఒక ముస్లిం ఉపవాసం ఉండకపోవడం నేరమని ఆ వర్గానికి చెందిన కొందరు అంటున్నారు. రంజాన్ సమయంలో అలాంటి చర్య నేరమని ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ అభిప్రాయపడ్డారు.
అయితే, ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ షమీకి మద్దతుగా నిలిచారు.
"షమీ సాహెబ్.. మండే ఎండ సమయంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ సమయంలో మైదానంలో నీళ్లు తాగడాన్ని సమస్యగా భావిస్తున్న ఆ మూర్ఖుల గురించి చింతించకండి. వారికి ఎలాంటి సంబంధం లేదు. మమ్మల్ని గర్వపడేలా చేస్తున్న గొప్ప భారత జట్టులో మీరు ఒక ముఖ్యమైన భాగం. మీకు, భారత జట్టుకు నా శుభాకాంక్షలు" అని అన్నారు.
కానీ, ఈ చర్చ భారతదేశానికే పరిమితం కాలేదు. సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు చేరుకుంది.


ఫొటో సోర్స్, Getty Images
ఇంజమామ్ ఏమన్నారు?
మొహమ్మద్ షమీ ఉపవాసం ఉండకపోవడంపై స్పందించాల్సిందిగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్‌ను పాకిస్తాన్ సిటీ-42 చానల్ యాంకర్ అడిగారు.
"ఆడుతున్నప్పుడు ఉపవాసం చేయకపోవడం పెద్ద విషయం కాదు. కానీ, అతను బహిరంగంగా నీళ్లు తాగడం అతిపెద్ద అభ్యంతరం. ఆడుతున్నప్పుడు ఉపవాసం ఉండటం కష్టమైనదే, ఆ విషయంలో మాకూ అనుభవముంది. ఉపవాసం సమయంలో మేం మ్యాచ్ ఆడితే, డ్రింక్స్ బ్రేక్ సమయంలో స్క్రీన్ వెనుకకు వెళ్లేవాళ్లం" అని అన్నారు.
"స్క్రీన్ వెనక్కి వెళ్లి నీళ్లు తాగడమో, మరేదైనా చేసుకోవచ్చు. కానీ, అందరిముందు గౌరవం చూపించాలి. స్క్రీన్ ముందు నీళ్లు తాగొద్దని, వెనక్కి వెళ్లి తాగాలని నేను అతనికి సూచిస్తున్నా. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉంటే ఉపవాసం వదిలేయవచ్చు" అని అన్నారు.
''ఎవరినీ సంతోషపెట్టడానికి ఉపవాసం ఉండరు లేదా విరమించరు. ఫాస్ట్ బౌలర్ చాలా కష్టపడాలి. అందుకే, ఒక క్రీడాకారుడిగా చెబుతున్నా ఆడుతున్నప్పుడు ఉపవాసం ఉండటం కష్టం'' అని ఇంజమామ్ అన్నారు.
షమీ స్క్రీన్ వెనకాల నీళ్లు తాగితే ఎలాంటి వివాదం ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచకప్ సమయంలోనూ..
2023 వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సమయంలోనూ షమీ విషయంలో వివాదం చెలరేగింది.
ఆ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఐదో వికెట్ తీసిన తర్వాత షమీ మైదానంలో కూర్చున్నారు. అది చూసి ఆయన సజ్దా (నమాజ్‌లో భాగంగా కూర్చుని తలను నేలకు ఆన్చడం) చేయడానికి కూర్చున్నారని అనుకున్నారని, కానీ అలా చేయలేదని, వివాదాస్పదం కాకుండా ఉండడం కోసం షమీ తనను తాను నియంత్రించుకున్నారని కొందరు అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ వివాదంపై 2024 ఫిబ్రవరిలో ఒక యూట్యూబ్ చానల్‌లో షమీ వివరణ ఇచ్చారు.
"నేను సజ్దా చేయాలనుకున్నానని, కానీ అది చేయలేదని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది నన్ను దేశం విడిచి వెళ్లమన్నారు. వాళ్లు మనసులో ఏదైనా పురుగు ఉంటే, అలా చెబుతారు."
"నేను ఎవరికీ భయపడను. నేను ముస్లింని, ఆ విషయంలో గర్వపడుతున్నా. నేను భారతీయుడిని అయినందుకూ గర్వంగా ఉంది. నాకైతే దేశమే ప్రథమం. ఇది ఎవరికైనా నచ్చకపోతే దాన్ని పట్టించుకోను. నేను సజ్దా చేయాలనుకుంటే చేస్తాను" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సక్లైన్ ముస్తాక్ ఏమన్నారంటే..
షమీ 'రోజా' వివాదంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముష్తాక్ స్పందించారు.
"మనం ఇలాంటి వాటిపై ఎందుకు శ్రద్ధ చూపుతున్నామో నాకర్థం కావడం లేదు. మనం మంచి మనుషులుగా ఉండటం, సానుకూల విషయాలతో ముందుకు సాగడంపై దృష్టి పెట్టాలి. ఉపయోగం లేని వాటి గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నాం. పాకిస్తాన్‌లోనే కాకుండా భారత్ వైపు నుంచి ఇలాంటివి పెరుగుతున్నాయి" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














