శబ్దం: మన జీవితాల్లో 'కంటికి కనిపించని కిల్లర్', అదృశ్య ముప్పు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గల్లాఘర్
- హోదా, లౌడ్ ప్రెజెంటర్, బీబీసీ వరల్డ్ సర్వీస్
మన చుట్టూ ఒక అదృశ్య ముప్పు ఉంది. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనీ మనం గమనించడం లేదు. గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్‌కు ఇది కారణమవుతోంది. జ్ఞాపకశక్తి కోల్పోవడానికీ ఇదీ ఒక కారణంగా అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇంతకీ అదేంటో తెలుసా? శబ్దం.
ఇది ప్రజారోగ్య సంక్షోభమని, ప్రతిరోజూ చాలామంది బాధితులవుతున్నారని లండన్ విశ్వవిద్యాలయంలోని సెయింట్ జార్జ్ ప్రొఫెసర్ షార్లెట్ క్లార్క్ అన్నారు.
అయినప్పటికీ, మనం ఈ శబ్ద తీవ్రత సమస్యను చాలా అరుదుగా చర్చిస్తాం.
శబ్దం ఎప్పుడు హానికరంగా మారుతుందో అర్థం చేసుకోవడానికి, అనారోగ్యానికి గురైన వారితో మాట్లాడాను. ఎప్పుడూ శబ్దాలతో ధ్వనించే ఈ ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్వేషించాను.
చాలా నిశ్శబ్దమైన సౌండ్ ల్యాబ్‌లో ప్రొఫెసర్ క్లార్క్‌ను కలవడం ద్వారా దీనిని ప్రారంభించా. నా శరీరం శబ్దానికి ఎలా స్పందిస్తుందో చూడటానికి మేం ప్లాన్ చేశాం. పెద్ద స్మార్ట్‌వాచ్‌ను పోలిన పరికరాన్ని ధరించాను. ఈ పరికరం నా హృదయ స్పందన రేటును, నా చర్మానికి ఎంత చెమట పడుతుందో కొలుస్తుంది. మీకు హెడ్‌ఫోన్‌లు ఉంటే మీరు ఇలా చేయవచ్చు, తెలుసుకోవచ్చు.


ప్రపంచంలోనే అత్యంత శబ్దవంతమైన నగరంగా పేరుగాంచిన బంగ్లాదేశ్‌లోని ఢాకా నుంచి వచ్చే ట్రాఫిక్ శబ్దం నాకు చిరాకు కలిగించింది. భారీ, ఒత్తిడితో కూడిన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నట్లు అనిపించింది. సెన్సార్లు నా ఆందోళనను గుర్తిస్తున్నాయి, నా హృదయ స్పందన రేటు పెరుగుతోంది, ఎక్కువగా చెమట పడుతోంది.
'ట్రాఫిక్ శబ్దం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి' అని ప్రొఫెసర్ క్లార్క్ తదుపరి శబ్దాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు చెప్పారు.
ఆట స్థలం నుంచి వచ్చే సంతోషకరమైన ధ్వనులు మాత్రమే నా శరీరంపై శాంతపరిచే ప్రభావాన్ని చూపాయి. కానీ, కుక్కలు మొరిగే శబ్దాలు, రాత్రిపూట పొరుగువారు చేసుకొనే పార్టీ శబ్దాలు నన్ను ప్రతికూలంగా మార్చాయి.
కానీ, శబ్దం నా శరీరాన్ని ఇలా ఎందుకు మారుస్తోంది?

ఫొటో సోర్స్, BOY_ANUPONG/GETTYIMAGES
ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి?
"శబ్దానికి మీ నుంచి భావోద్వేగ ప్రతిస్పందన ఉంటుంది" అని ప్రొఫెసర్ క్లార్క్ చెబుతున్నారు.
మీ చెవి ధ్వనిని గుర్తించి మెదడుకు పంపుతుంది. మెదడులోని ఒక భాగం అమిగ్డాలా, ధ్వనికి సంబంధించిన భావోద్వేగాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఇది శరీర సహజ రక్షణ వ్యవస్థలో భాగం, ప్రమాదాలకు త్వరగా స్పందించడానికి సహాయపడుతుంది.
"కాబట్టి మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. మీ నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. మీ శరీరం ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది" అని ప్రొఫెసర్ క్లార్క్ వివరించారు.
ఇవన్నీ అత్యవసర పరిస్థితిలో సహాయపడతాయి, కానీ కాలక్రమేణా, ఇది శరీరానికి హాని కలిగించవచ్చు.
"మీరు చాలా ఏళ్లుగా అతి ధ్వనులకు గురైతే, మీ శరీరం ఈ విధంగానే స్పందిస్తూ ఉంటుంది. ఇది గుండెపోటు, అధిక రక్తపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది" అని ప్రొఫెసర్ క్లార్క్ సూచించారు.
మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. శబ్దం అలవాటైందని మనం అనుకోవచ్చు. ఇంటి పక్కన విమానాశ్రయం ఉండటంతో ఇలా జరిగిందనుకున్నా. కానీ, బయాలజీ కథ వేరు.
"మీరు మీ చెవులను ఎప్పుడూ మూసుకోరు, నిద్రపోతున్నప్పుడు కూడా మీరు శబ్దాలు వింటారు. అందుకే నిద్రలో కూడా మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది" అని ప్రొఫెసర్ క్లార్క్ తెలిపారు.
శబ్దం ఒక అవాంఛిత ధ్వని. మనకు రవాణా(ట్రాఫిక్, రైళ్లు, విమానాలు) ప్రధాన వనరే. అలాగే, ప్రజలు ఆనందిస్తున్న ధ్వనులు కూడా అంతే. అయితే, ఒక వ్యక్తి సరదా పార్టీ మరొకరికి అతిధ్వనిగా ఉంటుంది.

నా శరీరాన్ని ఏదో చేస్తుంది: కోకో
స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంటున్న కోకోను నేను కలిశాను. ఆమె విలా డి గ్రాసియా ప్రాంతంలో నాలుగో అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో ఉంటున్నారు. పక్కింటి వారు బహుమతిగా ఇచ్చిన తాజా నిమ్మకాయల సంచి ఆమె తలుపు మీద వేలాడుతోంది. ఆమె ఫ్రిజ్‌లో మరొక పొరుగువారు తయారు చేసి ఇచ్చిన టోర్టిల్లా ఉంది. ఆమె బాల్కనీ నుంచి ఫేమస్ సాగ్రడా ఫ్యామిలియా కేథడ్రల్‌ను చూడొచ్చు. కోకో ఇక్కడ నివసించడానికి ఎందుకు ఇష్టపడుతున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
కానీ, కోకో దానికోసం ఏం మూల్యం చెల్లిస్తున్నారు? ఆమె ఆరోగ్యాన్ని. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె భావిస్తున్నారు.
"చాలా శబ్దం వస్తోంది, 24 గంటలూ అదే గోల" అని కోకో చెప్పారు.
ఆమె అపార్ట్‌మెంట్ సమీపంలో ఒక డాగ్ పార్క్ ఉంది. అక్కడ రాత్రిపూట రెండు, మూడు, నాలుగు గంటల సమయంలో కూడా కుక్కలు మొరుగుతాయి. ఇక ఆ ప్రాంగణం పిల్లల పుట్టినరోజు పార్టీల నుంచి కచేరీల వరకు ప్రతిదానికీ ఉపయోగించే బహిరంగ స్థలం.
పని అయిపోయాక విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రదేశంగా ఆమెకు ఇల్లు ఉండాలి. కానీ, కోకోకు ఆ ప్రదేశం అలా లేదు. "శబ్దాలు నిస్పృహకు గురిచేస్తాయి, నాకు ఏడవాలని అనిపిస్తుంది" అని ఆమె అన్నారు.
కోకో ఛాతీ నొప్పితో రెండుసార్లు ఆసుపత్రి పాలయ్యారు. శబ్ద తీవ్రత తనకు ఒత్తిడిని కలిగించడమే కాకుండా, అనారోగ్యానికీ గురిచేస్తోందని కోకో గట్టిగా నమ్ముతున్నారు.
"దీనివల్ల నా శరీరంలో మార్పు వస్తోంది. నా శరీరాన్ని ఏదో చేస్తోంది" అని కోకో చెప్పారు.
బార్సిలోనాలో ట్రాఫిక్ శబ్దం మాత్రమే ప్రతి సంవత్సరం దాదాపు 300 గుండెపోట్లకు, 30 మరణాలకు కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోసం శబ్దాన్ని అధ్యయనం చేసిన పరిశోధకురాలు డాక్టర్ మరియా ఫోరాస్టర్ తెలిపారు.

'ఎంత ఎక్కువుంటే అంత ప్రమాదం'
యూరప్‌లో ప్రతి సంవత్సరం 12,000 అకాల మరణాలకు శబ్దం కారణమవుతోంది. ఇది లక్షలాది మంది నిద్రలేమికి, తీవ్రమైన శబ్ద చికాకుకు కారణమవుతుంది, ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
బార్సిలోనాలో ఒక చిన్న పార్కు పక్కన ఉన్న కేఫ్‌లో డాక్టర్ ఫోరాస్టర్‌ను కలిశాను. ఇక్కడ ట్రాఫిక్ శబ్దం 60 డెసిబుల్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉందని నా సౌండ్ మీటర్ చూపించింది.
"గుండె ఆరోగ్యానికి 53 డెసిబుల్స్ ఫర్వాలేదు. శబ్దం ఎంత ఎక్కువగా ఉంటే, ఆరోగ్యానికి అంత ప్రమాదం" అని డాక్టర్ ఫోరాస్టర్ చెప్పారు.
ఆరోగ్యంపై శబ్ద ప్రభావం వాయు కాలుష్య స్థాయిలో ఉంటుందన్నారు.
"రసాయనాలు ఆరోగ్యానికి హానికరం, విషపూరితం కావొచ్చని మనకు తెలుసు. కానీ, శబ్దం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం కష్టం" అని ఫోరాస్టర్ అభిప్రాయపడ్డారు.
ట్రాఫిక్ శబ్దం ఆరోగ్యంపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే చాలామంది దీనికి గురవుతారు. కానీ, ట్రాఫిక్ రోజువారీ జీవితంలో ఒక భాగం - పనికి వెళ్లడం, షాపింగ్ చేయడం, పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం ఇందులో భాగమే. శబ్దాన్ని తగ్గించడం అంటే ప్రజలు జీవన విధానాన్ని మార్చడం.
బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్‌కు చెందిన డాక్టర్ నటాలీ ముల్లర్‌తో కలిసి నగరంలో వాకింగ్‌కు వెళ్లాను. మేం రద్దీగా ఉండే రోడ్డులో నడక ప్రారంభించాం, అక్కడ నా సౌండ్ మీటర్ 80 డెసిబెల్స్ కంటే ఎక్కువ రికార్డ్ చేసింది.
ఆ తరువాత, చెట్లు ఎక్కువగా ఉన్న దారి గుండా వెళ్లాం, అక్కడ శబ్దం డెసిబెల్స్ 50కి పడిపోయింది.
ఈ దారిలో ఏదో వ్యత్యాసం ఉంది, ఇది ఒకప్పుడు రద్దీగా ఉండే రోడ్డు. ఇప్పుడు పాదచారులకు, కేఫ్‌లకు, తోటలకు అనువుగా మారింది. వాహనాలు ఇక్కడ తక్కువ వేగంతో వెళుతున్నాయి.
కొన్ని శబ్దాలు శాంత ప్రభావాన్ని చూపుతాయని ప్రయోగశాలలో మేం చూశాం.
"ఇది పూర్తిగా నిశ్శబ్దంగా లేదు. కానీ, ఇక్కడ ధ్వని, భారీ శబ్ద తీవ్రతను అనుభవించేలా భిన్నంగా ఉంది" అని డాక్టర్ నటాలీ ముల్లర్ చెప్పారు.

వాస్తవానికి, 500 కంటే ఎక్కువ ఏరియాలు సృష్టించాలనేది అసలు ప్రణాళిక. వీటినే సూపర్‌బ్లాక్‌లుగా చెప్పారు. ఇవి పాదచారులకు అనుకూలమైన జోన్లు, వివిధ నగర బ్లాక్‌లను కలపడం ద్వారా ఏర్పడతాయి.
డాక్టర్ ముల్లర్ పరిశోధన ప్రకారం.. నగరంలో శబ్ద తీవ్రతను 5-10 శాతం తగ్గించడం వల్ల ప్రతి సంవత్సరం 150 అకాల మరణాలను నివారించవచ్చు. కానీ, వాస్తవానికి ఆరు సూపర్‌బ్లాక్‌లు మాత్రమే నిర్మించారు. దీనిపై స్పందించడానికి సిటీ కౌన్సిల్ నిరాకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
పట్టణీకరణ ప్రభావం..
పట్టణాలు విస్తరించే కొద్దీ శబ్ద కాలుష్యం తీవ్రమవుతోంది. ఎక్కువ మంది నగరాలకు తరలివెళుతున్నారు, దీనివల్ల అవి మరింత శబ్దంతో నిండిపోతున్నాయి.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగా సిటీలలో ఢాకా ఒకటి. ఈ వేగవంతమైన ఎదుగుదల ట్రాఫిక్ పెరుగుదలకు దారితీసింది. నగరాన్ని నిరంతరం హారన్ మోతలతో నింపేసింది.
శబ్ద కాలుష్యానికి వ్యతిరేకంగా ఆర్టిస్ట్ మోమినా రామన్ రాయల్ అక్కడ నిశ్శబ్ద నిరసన చేస్తున్నారు. ఆయన ప్రతిరోజూ దాదాపు 10 నిమిషాల పాటు, రద్దీగా ఉండే కూడలి వద్ద పసుపు రంగు ప్లకార్డును పట్టుకుని నిల్చుంటారు. ఆ బోర్డులో డ్రైవర్లు హారన్లు ఎక్కువగా మోగించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
కూతురు పుట్టిన తర్వాత రామన్ రాయల్ ఈ మిషన్ ప్రారంభించారు.
"ఢాకాలో మాత్రమే కాదు, బంగ్లాదేశ్ అంతటా హారన్ మోగించడం ఆపాలనుకుంటున్నాను" అని ఆయన అన్నారు.
''పక్షులు, చెట్లు, నదులు శబ్దం చేయవు. మనుషులు మాత్రమే అలా చేస్తారు, కాబట్టి మనుషులదే బాధ్యత'' అని రామన్ చెప్పారు.

అక్కడి ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్యంపై శబ్దం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళనగా ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ పర్యావరణ సలహాదారు, మంత్రి సయ్యదా రిజ్వానా హసన్ చెప్పారు.
ఈ శబ్ద తీవ్రతను తగ్గించడానికి అవగాహన ప్రచారాలు చేస్తున్నారు, అనవసరంగా హారన్ మోగించడంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
"ఇది ఒకటి లేదా రెండేళ్లలో మారిపోదు. కానీ, మనం నగరాన్ని నిశ్శబ్దంగా మార్చగలం. ప్రజలు తేడాను గమనించినప్పుడు వారి అలవాట్లు కూడా మారుతాయి" అని రిజ్వానా చెప్పారు.
శబ్దాన్ని తగ్గించడం అంత సులభం కాదు. జీవితంలో నిశ్శబ్ద క్షణాల ప్రాముఖ్యతను నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఎందుకంటే, డాక్టర్ మస్రూర్ అబ్దుల్ క్వాడర్ అభిప్రాయం ప్రకారం శబ్దం "సైలెంట్ కిల్లర్, స్లో పాయిజన్".
'LOUD'ను గెర్రీ హోల్ట్ ప్రొడ్యూస్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన సల్మాన్ సయీద్ అదనపు రిపోర్టింగ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














