భారత్: కులాంతర వివాహాలు ఇంకా అరుదుగానే ఎందుకు జరుగుతున్నాయి?

కులాంతర వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కులాంతర వివాహాలు ఇప్పటికీ తక్కువగానే జరుగుతున్నాయి
    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1996. బనారస్‌కు చెందిన శ్యామ్ సుందర్ దుబేకి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో కొత్త ఉద్యోగం రావడంతో దిల్లీ వచ్చారు.

వారి కొత్త ఉద్యోగుల బ్యాచ్‌లో ఝార్ఖండ్‌కు చెందిన సునీతా కుషావాహ కూడా ఉన్నారు.

ఈ ఇద్దరి మధ్య చనువు, సాన్నిహిత్యం పెరిగింది. దీంతో, ఏడాది తర్వాత వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

శ్యామ్ సుందర్ , సునీతా కుటుంబాలు కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు.

ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ఒక అమ్మాయి తమ కుటుంబంలోకి రావడానికి దుబే కుటుంబం ఒప్పుకోలేదు. అలాగే, సునీతా తల్లిదండ్రులు కూడా కుషావాహ కమ్యూనిటీకి చెందిన మంచి అబ్బాయినే తమ కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు.

కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో, శ్యామ్ సుందర్, సునీతా దిల్లీలోని కోర్టులో పెళ్లి చేసుకున్నారు.

ఎన్నో ఏళ్ల వ్యతిరేకత తర్వాత, చివరికి వారి కుటుంబాలు ఒప్పుకున్నాయి.

దిల్లీకి చెందిన జర్నలిస్ట్ పూజ శ్రీవాస్తవ 2013లో తన కొలీగ్ పవిత్రా మిశ్రాను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, వారి కుటుంబాలు ఒప్పుకోలేదు.

భారతీయ సమాజంలో వీరి కుటుంబాలు అగ్ర కులానికి చెందినవి.

కులాంతర ప్రేమ వివాహానికి వీరి కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో, దిల్లీ జర్నలిస్ట్ జంట కోర్టులో వివాహం చేసుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కుల గోడలు

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన సంజయ్ భట్, కీర్తి ఆర్య పెళ్లి విషయంలో భట్ కమ్యూనిటీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భట్ బ్రాహ్మిణ్. కీర్తి దళిత్.

భట్ ప్రజలు ఎక్కువగా నివసించే హల్ద్వానీలో సంజయ్ ఉండేవారు. వారందరూ ఆయన చుట్టాలే.

షెడ్యూల్డ్ కులానికి చెందిన అమ్మాయిని సంజయ్ భట్ పెళ్లి చేసుకోవడం ఆ కుటుంబాల్లో పెద్ద చర్చగా మారింది.

2016లో కీర్తిని సంజయ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, బంధువులు ఆయన తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు.

తన నిర్ణయం మార్చుకునేందుకు సంజయ్ ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు కూడా పెళ్లికి సమ్మతించలేదు. ఆర్య సమాజ్‌లో కీర్తిని సంజయ్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ అసలు చుట్టాలే లేరు.

పెళ్లి తర్వాత, నగరంలో సంజయ్ వేరే ఇంటికి మారాల్సి వచ్చింది. ఏడేళ్లకు వీరికి బిడ్డ పుట్టాక, ఆ తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడటం మొదలుపెట్టారు.

పై మూడు కథనాలు భారతీయ సమాజంలో కులాంతర వివాహానికి పెద్దలను ఒప్పించడం ఎంత కష్టమో చూపిస్తున్నాయి.

పట్టణీకరణ, మహిళల విద్య, పని ప్రదేశాల్లో మహిళల శాతం పెరగడం, అమ్మాయిలు, అబ్బాయిల మధ్య సంభాషణా సౌలభ్యాలు పెరిగినప్పటికీ, భారత్‌లో కులాంతర వివాహాలు ఇంకా తక్కువగానే జరుగుతున్నాయి. దేశంలో కులాంతర వివాహాలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన డేటా లేదు.

కానీ, శాంపుల్ సర్వేల ఆధారంగా నిర్వహించిన అధ్యయనాల్లో, భారతీయ కుటుంబాలలో కులాంతర వివాహాల విషయంలో తీవ్ర వ్యతిరేకత వస్తోందని తెలిసింది.

2014 సర్వేలో, అప్పటిదాకా భారత్‌లో కేవలం 5 శాతం కులాంతర వివాహాలు మాత్రమే జరిగినట్లు ఉంది.

కులవ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

కులాంతర వివాహాలపై సమాచారం కోసం 2018లో 1,60,000 కుటుంబాలపై సర్వే చేశారు. దానిలో 93 శాతం ప్రజలు తమ కుటుంబాలు కుదిర్చిన పెళ్లిళ్లనే చేసుకున్నట్లు చెప్పారు.

కేవలం 3 శాతం మందే ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. వారిలో 2 శాతం ప్రేమ వివాహాలకు మాత్రమే కుటుంబాల నుంచి అనుమతి వచ్చినట్లు తెలిసింది.

భారత్‌లో మెజార్టీ హిందూ కుటుంబాలు, ఒకే కులానికి చెందిన వ్యక్తులతో పెద్దలు కుదిర్చిన వివాహాలు చేస్తుంటాయి.

దశాబ్దాలు దాటినప్పటికీ, కులాంతర వివాహాలకు అనుమతి అనేది చాలా తక్కువగా ఉంటుందని ఈ సర్వేలో తేలింది.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -3కి చెందిన 2005-06 డేటాను ఆధారంగా చేసుకుని నిర్వహించిన సర్వేలో, భారత్‌లో అన్ని కులాలు, మతాల మధ్యలో జరిగిన కులాంతర వివాహాల రేటు కేవలం 11 శాతమే.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 95 శాతం మంది జమ్ము, కశ్మీర్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. తమ కులానికి చెందిన వ్యక్తులతోనే తమ పెళ్లి జరిగినట్లు వీరు చెప్పారు.

పంజాబ్, గోవా, కేరళలలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అక్కడ 80 శాతం మంది తమ కులానికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు.

ప్రజలు విద్యావంతులుగా మారుతున్నప్పటికీ, భారతీయ సమాజంలో ఉన్న కుల అవరోధాలను పూర్తిగా తుడిచేయలేమని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రీసెర్చర్లు, ఇండియన్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే 2011-12ల డేటాను ఉద్దేశించి చెప్పారు.

చాలామంది తమ కులానికి చెందిన వ్యక్తులనే పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

2016-17లో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన సర్వేలో, కులాంతర వివాహాలపై వ్యతిరేకత విద్యావంతులైనా, తక్కువ చదువుకున్న వారైనా లేదా నిరక్షరాస్యులైనా ఒకే విధంగా ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో ప్రతి కులానికి చెందిన, వర్గానికి, మతానికి చెందిన వ్యక్తులు పాల్గొన్నారు.

కులాంతర వివాహం

ఫొటో సోర్స్, Getty Images

అడ్డంకులేంటి?

కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న తర్వాత కుటుంబాల నుంచి వచ్చే ఇబ్బందులు, హింస లేదా అభద్రతా భావాన్ని ఎదుర్కొనే జంటలకు రక్షణను కల్పించే, లింగ సమానత్వం కోసం పనిచేసే ఎన్‌జీవో 'ధనక్' సంస్థ సహ వ్యవస్థాపకులు ఆసిఫ్ ఇక్బాల్‌తో బీబీసీ మాట్లాడింది.

కులాంతర ప్రేమ పెళ్లిళ్ల విషయంలో కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులు అంత చిన్నవి కాదని ఆయన చెప్పారు.

''భారతీయ కుటుంబాలలో కులాంతర వివాహాలను అంగీకరించే రేటు ఇంకా ఎక్కువగా లేదు. అయితే, కుటుంబాల వెలుపల పెళ్లి చేసుకునే జంటలకు ప్రభుత్వం రక్షణ ఇస్తుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ రాగానే, కోర్టు, పోలీసులు వారిని రక్షించేందుకు ముందుకు వస్తారు.'' అని తెలిపారు.

''కులాంతర వివాహాల విషయంలో గ్రామాల్లో మరింత హింస, వివాదం కనిపిస్తుంటుంది. నగరాల్లో ఈ హింసను చూడం. ఎందుకంటే, రాష్ట్రాలు, కోర్టులు ముందుకు వచ్చి కులాంతర వివాహాలకు రక్షణ కల్పిస్తుంటాయి. నగరాల్లో కూడా ఈ పెళ్లిళ్లకు ఆమోదం కొద్దిగానే ఉంటుంది.'' అన్నారు.

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ సిస్టమ్స్ సోషియాలజీ ప్రొఫెసర్ వివేక్ కుమార్ కూడా ఈ పరిస్థితి గురించి బీబీసీతో మాట్లాడారు.

కులాంతర వివాహాల సంఖ్య తక్కువగా ఉండటం పెద్ద ఆశ్చర్యకరం కాదని, భారతీయ సమాజంలోనే దీని మూలాలు ఉన్నాయని ఆయన నమ్ముతున్నారు.

'' భారత్‌లో 68 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తుంటారు. ఒకే గ్రామంలో నివసించే యువతీ, యువకులను వారు ఏ కులానికి చెందినవారైనా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల సంబంధంగా పరిగణించే సంప్రదాయం ఉంది. భారత్‌లో మెజార్టీ హిందువులు. అన్నా చెల్లెళ్ల మధ్య పెళ్లిళ్లు జరగవు. అందుకే, కులాంతర వివాహాలు తక్కువగా ఉంటున్నాయి. '' అని వివేక్ అన్నారు.

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ముస్లింలలో..

యూనివర్సిటీల్లో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కూడా కులాంతర వివాహాలు తక్కువగా ఉంటున్నాయని వివేక్ కుమార్ భావిస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థలలో యువతీ, యువకులు కలిసి చదువుకుంటారు.

ఇక్కడ అమ్మాయిల సంఖ్య పెరిగితే, కులాంతర వివాహాలు పెరిగే అవకాశముందని అన్నారు. అమ్మాయిలతో పోలిస్తే భారత్‌లో అబ్బాయిలు చాలా సంప్రదాయవాదులుగా ఆలోచిస్తుంటారు. ఇంకా పితృస్వామ్యానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. కట్నంతో పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు.

భారత్‌లో మెజార్టీ హిందువులు, మైనార్టీ కమ్యూనిటీలు ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్ల మధ్యలో కులాల వర్గీకరణ ఉంది. ఇస్లాం సిద్ధాంతపరంగా ముస్లింలందరినీ సమానంగా భావిస్తుంది. కానీ, భారతీయ ముస్లింలలో కూడా కులాంతర వివాహాలకు కుటుంబ ఆమోద రేటు చాలా తక్కువగా ఉంది.

దేశంలో దళిత ముస్లింలు, పస్మాండ (వెనుకబడిన) వారి హక్కుల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు అలీ అన్వర్ దీనిపై మాట్లాడారు. భారత్‌లో ముస్లింల మధ్యలో కూడా కుల వివక్ష ఉందన్నారు.

20 నుంచి 25 కోట్ల ముస్లిం జనాభాలో (అంచనా) ఇలాంటి పెళ్లిళ్లు చాలా అరుదుగా జరుగుతున్నాయని చెప్పారు. వీటిని నామమాత్రంగానే పరిగణించవచ్చని అన్నారు.

''ఐదు నుంచి ఆరు దశాబ్దాల కిందట, భారతీయ ముస్లింలలో ఇటువంటి వివాహాలు చాలా అరుదుగా కనిపించేవి. కానీ, గత 20 నుంచి 30 ఏళ్ల నుంచి ముస్లింలలో ఇటువంటి కులాంతర వివాహాలు కనిపిస్తున్నాయి. వీటికి కుటుంబాల ఆమోదం కూడా లభిస్తోంది.'' అని తెలిపారు.

''అయితే, దీనిలో కూడా ఒక విషయం ఉంది. ముస్లింలలోని అగ్ర కులాల వారు తమ కూతురి వివాహం ముస్లింలలోని వెనకబడిన కులాలకు(పస్మాండ) చెందిన యువకులతో చేయాలనుకుంటే, పెద్ద ప్రభుత్వ ఉద్యోగమో లేక మంచి వ్యాపారమో పరిగణనలోకి తీసుకుంటున్నారు. కానీ, కోడళ్లను తెచ్చుకునేటప్పుడు మాత్రం ముస్లిం కుటుంబాలు అగ్ర కులానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోడలి విషయంలో వారి వంశపారం పర్యత కోసం చూస్తున్నాయి. వెనకబడిన కులం నుంచి కోడళ్లను తెచ్చుకోవడం ద్వారా మా కుటుంబ వటవృక్షాన్ని దెబ్బతీయాలా? అని ప్రశ్నిస్తున్నారు.'' అని అలీ అన్వర్ అన్నారు. పస్మాండ ఉద్యమం కింద ఇలాంటి పెళ్లిళ్లను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు తీసుకున్నామని, కానీ, పరిస్థితిలో పెద్దగా మార్పులేదని చెప్పారు.

అంబేడ్కర్, లోహియా, గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

గాంధీ, లోహియా, అంబేడ్కర్ నుంచి ప్రోత్సాహం

భారత్‌లో చాలా కాలం నుంచే కులాంతర వివాహాల గురించి చర్చ ఉంది.

కులం ఆధారంగా విభజనకు గురైన భారతీయ సమాజంలో సామరస్యం కోసం కులాంతర పెళ్లిళ్లు చాలా ముఖ్యమైన సాధనంగా భావించారు.

మహాత్మా గాంధీ కులాంతర వివాహాలపై మాట్లాడేందుకు తొలుత కాస్త సంకోచం చూపినా, ఆ తర్వాత వాటి అవసరాన్నిఅర్థం చేసుకుని మద్దతు పలికారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఇవి అవసరమని భావించారు.

భారత్‌లోని గొప్ప దళిత నాయకుడు బీఆర్ అంబేడ్కర్ కూడా కులాంతర వివాహాలను గట్టిగా సమర్థించారు.

కుల వ్యవస్థను రూపుమాపేందుకు అసలైన వైద్యం కులాంతర వివాహాలేనని 'అనైలేషన్ ఆఫ్ కాస్ట్' (వర్ణ నిర్మూలన) అనే ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ, ఈ ప్రసంగం బయటికి వెళ్లేందుకు అనుమతించలేదు. కానీ, ఆ తర్వాత ఇదొక బుక్‌లెట్‌గా ప్రచురితమైంది.

కులాల మధ్యలో రోటీ-బేటీ సంబంధాన్ని ఏర్పాటు చేసినప్పుడే, భారతీయ సమాజంలో ఐక్యత వస్తుందని అంబేడ్కర్ భావించారు.

భారత్‌లో కుల సంబంధాలను బలహీనపరచడానికి, వివిధ కులాల మధ్యలో రోటీ-బేటీ సంబంధం చాలా ముఖ్యమైందని ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు,రాజకీయ ఆలోచనాపరుడు రామ్ మనోహర్ లోహియా అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల మధ్యలో కులాంతర వివాహాలను తప్పనిసరి చేయాలని సూచించారు.

భారత్‌లో కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు, మన్మోహన్ సింగ్ పాలనలోని యూపీఏ ప్రభుత్వం 2006లో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రూ.50,000 ఇచ్చింది.

2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ద్వారా ఈ జంటలకు ఇచ్చే మొత్తాన్ని రూ.2.5 లక్షలకు పెంచినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ప్రకటించింది. అయితే, ఈ స్కీమ్‌ కింద ఒక షరతు పెట్టింది. ఈ జంటలో వధువు లేదా వరుడిలో ఒకరు దళితులై ఉండాలి.

తొలుత, ఈ స్కీమ్ కింద ఏటా 500 మందికి ఈ మొత్తాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 2014-15లో కేవలం ఐదుగురు మాత్రమే ఈ మొత్తాన్ని పొందారు. 2016-17లో 72 జంటలు ఈ మొత్తాన్ని పొందాయి. అయితే 522 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2017-18లో 409 అప్లికేషన్లకు ఆమోదం పొందగా.. 74 మందికి పైన పేర్కొన్న మొత్తం విడుదలైంది.

ఈ అప్లికేషన్లకు తక్కువ ఆమోద రేటు ఉండేందుకు పలు కారణాలను అధికారులు ఎత్తిచూపుతున్నారు.

నిబంధనల ప్రకారం హిందూ వివాహ చట్టం కింద పెళ్లిళ్లు అయిన కులాంతర జంటల దరఖాస్తులకు మాత్రమే ఆమోదం లభిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే, చాలా కులాంతర వివాహాలు ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ అవుతున్నాయి.

ఈ దరఖాస్తులకు, ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా కలెక్టర్ ఆమోదం కావాలి.

అదీకాక ప్రజల్లో ఈ స్కీమ్ గురించి పెద్దగా అవగాహన లేదు.

కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు చాలా రాష్ట్రాలు పలు పథకాలను ప్రకటిస్తున్నాయి.

దీనికింద, వివిధ రాష్ట్రాలు రూ.10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఈ జంటలకు ఇస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)