ఎవరీ బదర్ ఖాన్ సురి, ఈ భారతీయ స్కాలర్‌ను అమెరికా ఎందుకు అరెస్ట్ చేసింది?

- రచయిత, దిల్ నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత సంతతి రీసర్చ్ స్కాలర్ బదర్ ఖాన్ సురిని అమెరికానుంచి బహిష్కరించవద్దని ఆదేశిస్తూ అమెరికన్ కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
బదర్ ఖాన్‌ను భారతదేశానికి పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వర్జినీయా డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి పాట్రీసియా గైల్స్ అడ్డుకున్నారు.
బదర్ ఖాన్ సురి భార్య మఫజ్ యూసుఫ్ సలేహ్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
బదర్ ఖాన్ సురికి పాలస్తీనా సంస్థ హమాస్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ మార్చ్ 17న యూఎస్ హోమ్‌ల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అతనిని అదుపులోకి తీసుకుంది.
ఆయన వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో రీసర్చ్ స్కాలర్‌గా ఉన్నారు. ఆయన భార్య మఫజ్ సలేహ్ పాలస్తీనీయురాలు. ఆమె అమెరికాలో జర్నలిస్టు. ఆమె చాలా కాలం పాటు భారత్‌లో నివసించారు.
తమకు మీడియా ద్వారా ఈ విషయం తెలిసిందని, సురి కానీ, అతని కుటుంబ సభ్యులు కానీ తమను సంప్రదించలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
సురి, మఫజ్‌ను ఎలా కలుసుకున్నారు?
2011లో గాజా పర్యటనలో భాగంగా బదర్ ఖాన్ మఫజ్ సలేహ్‌ను కలుసుకున్నారు.
ఈ పర్యటనలో జామియా మిలియా యూనివర్సిటీకి చెందిన అనేక మంది విద్యార్థులు, పాల్గొన్నారు. వీరు అనేక దేశాలు పర్యటించి గాజా చేరుకున్నారు.
పాలస్తీనా సమస్యల మీద అవగాహన కల్పించడమే ఈ పర్యటన ఉద్దేశం. భారతీయ నటి స్వర భాస్కర్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు.
ఈ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత బదర్ ఖాన్ తన తండ్రితో కలిసి గాజా వెళ్లి మఫజ్‌ను అక్కడే పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయిన తర్వాత బదర్ ఖాన్, మఫజ్ సలేహ్ భారత్ వచ్చారు. 2013లో భారత్ వచ్చిన తర్వాత, రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లేవరకూ వారిద్దరూ భారత దేశంలోనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మాటలు తక్కువ
బదర్ ఖఆన్ సురి జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ సెంటర్‌లో ఎంఏ చదివారు. అదే సంస్థ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
"ట్రాన్సిషన్ డెమోక్రసీ, డివైడెడ్ సొసైటీస్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ పీస్: ఏ స్టడీ ఆఫ్ స్టేట్ బిల్డింగ్ ఇన్ ఆఫ్గానిస్తాన్ అండ్ ఇరాక్" అనే టైటిల్‌తో థీసీస్ రాశారు.
జాతులుగా విడిపోయి, అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో ఎదురయ్యే సవాళ్లను ఆయన తన పరిశోధనలో ప్రస్తావించారు.
బదర్ ఖాన్ కుటుంబ స్వస్థలం ఉత్తర ప్రదేశ్ అయితే వాళ్లు ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు. ఆయన తండ్రి ఫుడ్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు.
"బదర్‌ఖాన్ ఎక్కువగా మాట్లాడడు. సీరియస్ స్టూడెంట్. ఆందోళనల్లో పాల్గొనే వాడు కాదు. అయితే పాలస్తీనా సమస్య మీద ఆయనకంటూ కొన్ని సొంత అభిప్రాయాలు ఉన్నాయి" అని బదర్ ఖాన్‌తో కలిసి జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో చదువుకున్న ఆమిర్ ఖాన్ చెప్పారు.
బదర్ ఖాన్ చాలా తక్కువగా మాట్లాడతాడని, అయితే తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడిస్తాడని ఆమిర్ ఖాన్ తెలిపారు.
బదర్‌ఖాన్ సురి ప్రస్తుతం వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలోని అల్ వలీద్ బిన్ తలల్ సెంటర్ ఫర్ ముస్లిం క్రిస్టియన్ అండర్‌స్టాండింగ్ ఎట్ ది స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా ఉన్నారు.
స్టూడెంట్ వీసాతో అమెరికాలోకి ప్రవేశించిన బదర్‌ఖాన్ జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పాఠాలు కూడా చెప్పారు. ఆఫ్గానిస్తాన్, ఇరాక్‌లో శాంతి స్థాపన మీద ఆయన రీసర్చ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?
మార్చి 17వ తేదీ రాత్రి వర్జీనియాలోని అర్లింగ్‌టన్‌లోని తన ఇంట్లో ఉన్నసురిని అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగాలకు చెందిన అధికారులు మాస్కులు వేసుకుని వచ్చి ఆయనను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో బదర్‌ఖాన్ భార్య ఆయనతోనే ఉన్నారు.
సురి సామాజిక మాధ్యమాలలో హమాస్ తరపున ప్రచారం చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గుర్తించిన లేదా అనుమానిత టెర్రరిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని చెబుతోంది.
సురికి హమాస్‌తో సంబంధాలు ఉన్నాయని,ఆయన యూదు వ్యతిరేక అంశాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని అమెరికన్ అధికారులు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రకటనలో తెలిపారు.
అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలను ఇవ్వలేదు.ఆయనను అమెరికా నుంచి పంపించి వేయాలని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో ఆదేశించినట్లు అధికారులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
యూదుల మనోభావావాలకు సురి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు.
ఆయన్ను ప్రస్తుతం లూసియానాలోని ఓ నిర్బంధ కేంద్రంలో ఉంచినట్లు ఆయన తరపు న్యాయవాది చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
లాయర్ ఏం చెప్పారు?
బదర్‌ఖాన్‌ను తక్షణం విడుదల చేయాలని ఆయన తరపు న్యాయవాది హసన్ అహ్మద్ కోరారు. పాలస్తీనా హక్కుల కోసం పోరాడుతున్నవారిని లక్ష్యంగా చేసుకుని బదర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారని అన్నారు.
బదర్‌ఖాన్ భార్య పాలస్తీనీయురాలని, ఆమె పాలస్తీనా కోసం పని చేస్తున్నారని అందుకే బదర్‌ఖాన్‌ను అరెస్టు చేశారని హసన్ అహ్మద్ చెప్పారు.
కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బదర్‌ఖాన్‌ను అమెరికా నుంచి పంపించవద్దని డిస్ట్రిక్ట్ జడ్జ్ పాట్రీసియా గైల్స్ మార్చ్ 20న ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఆయన బహిష్కరణ ఆగిపోయింది. ఈ కేసును అమెరికాలో న్యాయబద్దంగా పరిష్కరించేందుకు మార్గం ఏర్పడింది.
బదర్ ఖాన్ మీద ఎలాంటి నేరారోపణలులేవని, ఆయనకు నేరపూరిత చరిత్ర ఏమీ లేదని ఆయన తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. హమాస్‌లోని ప్రముఖ సలహాదారుతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని చెబుతోంది. అయితే ఆ సలహాదారు ఎవరో మాత్రం వెల్లడించలేదు.
తన భర్త రెండుసార్లు గాజా వచ్చారని సలేహ్ అఫిడవిట్ ఇచ్చారు. మొదటి సారి 2011లో ఓ పర్యటన కోసం, రెండోసారి తమ వివాహం కోసం వచ్చినట్లు అందులో చెప్పారు.
కొన్ని రాడికల్ వెబ్‌సైట్లు సురికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయని, అందుకే సురి లక్ష్యంగా మారారని సలేహ్ చెప్పారు.
ఈ పరిణామంపై బదర్ ఖాన్ కుటుంబం స్పందించలేదు. మీడియాతో మాట్లాడవద్దని తమకు న్యాయసలహా ఇచ్చారని కుటుంబ సభ్యులు బీబీసీకి చెప్పారు.
అయితే ఈ సంఘటనకు సంబంధించి సురి కుటుంబసభ్యులకు కూడా పెద్దగా తెలియదని ఖాన్ క్లాస్‌మేట్ అమిర్ ఖాన్ బీబీసీకి చెప్పారు.
''సురి కుటుంబానికి ఈ విషయం గురించి పెద్దగా సమాచారం లేదు. ఆయన భార్య సలేహ్‌కు కూడా పెద్దగా తెలియదు. ప్రస్తుతం సురి లూసియానాలో డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారని సురి న్యాయవాది చెప్పారు''
సురిని వెంటనే విడుదల చేయాలని ఆయన భార్య సలేహ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ప్రభుత్వం చర్యలు
సురిని అదుపులోకి తీసుకోవడం ఆయన హక్కులను కాలరాయడమేనని వర్జీనియాకు చెందిన డెమొక్రటిక్ పార్టీ పార్లమెంటరీ ప్రతినిధి డాన్ బేయర్ అభివర్ణించారు.
సురి నిర్బంధం రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సివిల్ లిబర్టీస్ యూనియన్ ఖండించింది.
కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి మహమ్మద్ ఖలీల్‌ను కూడా హమాస్ కార్యకలాపాలకు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై సురికంటే ముందే అరెస్ట్ చేశారు. ఖలీల్‌కు అమెరికన్ గ్రీన్ కార్డు ఉంది.
పాలస్తీనాకు మద్దతు పలికేవారిపై ఇటీవల కాలంలో ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని ముమ్మరం చేసింది.

ఫొటో సోర్స్, ANI
‘ఎవరూ సంప్రదించలేదు’
సురి లేదా ఆయన కుటుంబం సహాయం కోసం తమను సంప్రదించలేదని బదర్ ఖాన్ సురి గురించి అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిచ్చారు.
సురిని అదుపులోకి తీసుకున్నట్టు మీడియా కథనాల ద్వారా విదేశాంగ మంత్రిత్వశాఖకు తెలిసిందని చెప్పారు.
అమెరికా ప్రభుత్వం గానీ, సురి కుటుంబం గానీ తమను సంప్రదించలేదని జైస్వాల్ తెలిపారు.
విదేశాలలో నివసించే భారతీయులు అక్కడి స్థానిక చట్టాలను పాటించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో తెలిపింది.
కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ రీసర్చ్ స్కాలర్ రజనీ శ్రీనివాసన్ కూడా స్వచ్ఛందంగా అమెరికాను వీడిపోయారు. పాలస్తీనా ఆందోళనకు రజనీ మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలను రజనీ ఎదుర్కొంటున్నారు.
2023 అక్టోబర్ నుంచి గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణ కొనసాగుతోంది.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ జరిగింది.
ఆ తర్వాత ఈ వారం ఇజ్రాయెల్ దాడుల్లో నాలుగు వందల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించడంతో కాల్పుల విరమణ ఒప్పందం ముందుకు సాగడంలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














