ట్రంప్: అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన, బయటపెట్టిన తాజా సర్వే

భారత్- అమెరికా సంబంధాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ- డోనల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్,
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ భవిష్యత్తు గురించి భారతీయ అమెరికన్లు ఆశాభావంతో ఉన్నారు. కానీ, డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత రెండు దేశాల సంబంధాలపై ఆందోళన చెందుతున్నారని తాజా సర్వేలో తేలింది.

భారత్ - అమెరికా రాజకీయ సంబంధాలు, వైఖరిపై 2024 అక్టోబర్‌లో కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ యూ గవర్నెన్స్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది.

2024లో భారత్, అమెరికాలో ఎన్నికలు జరిగాయి.

ఈ రెండు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నా, అప్పుడప్పుడు అది కాస్త ఒత్తిడి ఎదుర్కొంటోంది.

భారతీయ సంపన్నుడు గౌతం అదానీపై అమెరికా దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడం, అమెరికా గడ్డపై హత్యకు దిల్లీ నుంచి కుట్ర చేశారనే ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత ఏర్పడింది.

అమెరికాలో 50 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు.

ఈ సర్వేలో భాగంగా భారతీయ అమెరికన్లను కొన్ని కీలక ప్రశ్నలు అడిగారు.

మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనా కాలంలో అమెరికా- భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయని భారతీయ అమెరికన్లు భావిస్తున్నారు? డోనల్డ్ ట్రంప్ మంచి ప్రత్యామ్నాయమని మీరు భావిస్తున్నారా? 2024 ఎన్నికల తర్వాత భారతదేశపు గమనాన్ని ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నల గురించి అమెరికా వ్యాప్తంగా ఉన్న 1206 మంది భారతీయ అమెరికన్ల అభిప్రాయాలను సేకరించారు. అందులో కొన్ని కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్ - బైడెన్: భారత్‌తో ఎవరెలా ఉన్నారు?

ట్రంప్ మొదటి పాలనా కాలం కంటే జో బైడెన్‌ హయాంలో భారత్- అమెరికా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని ఇండియన్ అమెరికన్లు భావిస్తున్నారు.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడం కంటే, కమలా హారిస్ అధ్యక్షురాలై ఉంటే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బావుండేవని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.

ఎవరు ఏ పక్షమనేది కూడా కీలకపాత్ర వహించింది: భారత్- అమెరికా సంబంధాలు ట్రంప్ హయాంలో మెరుగుపడతాయని 66 శాతం మంది భారతీయ అమెరికన్ రిపబ్లికన్లు నమ్ముతున్నారు. 8 శాతం డెమోక్రాట్లు దీన్ని అంగీకరించడం లేదు.

దీనికి విరుద్దంగా, భారతీయ అమెరికన్ డెమొక్రాట్లలో సగం మంది బైడెన్‌కు మద్దతిస్తున్నారు. రిపబ్లికన్లలో 15 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు.

భారతీయ అమెరికన్లలో ఎక్కువ మంది డెమోక్రాట్ పార్టీ మద్దతుదారులే కావడంతో బైడెన్‌కు మద్దతు కాస్త ఎక్కువగా ఉంది.

2025 ఫిబ్రవరిలో డోనల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ వైట్ హౌస్‌లో సమావేశం అయ్యారు. ఇద్దరూ ఒకరి నాయకత్వాన్ని మరొకరు ప్రశంసించారు. అయితే, ట్రంప్ మాత్రం భారత దేశం అధిక పన్నులు విధిస్తోందని, ఇది చాలా 'పెద్ద సమస్య' అని విమర్శించారు.

భారత్ అమెరికా సంబంధాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గురుపట్వంత్ సింగ్ పన్నూను హత్య చేేసేందుకు భారత నిఘా విభాగం మాజీ అధికారి ప్రయత్నించారని అమెరికా ఆరోపించింది.

హత్యాయత్నం ఆరోపణలు

అమెరికన్ భూభాగం మీద వేర్పాటువాదిని హత్య చేసేందుకు దిల్లీ నుంచి కుట్ర జరిగిందనే ఆరోపణల గురించి సర్వేలో పాల్గొన్న భారతీయ అమెరికన్లలో సగం మందికి తెలియదు. ఈ విషయం తెలుసని సగం మంది మాత్రమే సర్వేలో చెప్పారు.

సిక్కుల స్వతంత్ర రాజ్యం ఖలిస్తాన్ కావాలని వాదిస్తున్న అమెరికాకి చెందిన న్యాయవాది గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో భారత నిఘా విభాగానికి చెందిన మాజీ అధికారిపై అమెరికా హత్యాయత్నం, మనీలాండరింగ్‌ అభియోగాలు మోపింది.

ఈ సంఘటనతో అసమ్మతివాదులను హత్య చేయించేందుకు ప్రయత్నిస్తోందని భారత్‌పై తొలిసారి ఆరోపణలు వచ్చాయి.

ఈ హత్యకు సంబంధించి అమెరికాలో జరుగుతున్న దర్యాప్తుకు తాము సహకరిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది.

వాషింగ్టన్ ఆరోపణలను పరిశీలించేందుకు భారతదేశం ఏర్పాటు చేసిన ప్యానల్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి అని చెబుతున్న సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనవరిలో సిఫార్సు చేసింది.

"అలాంటి నిర్ణయం తీసుకోవడం సమర్థనీయం కాదు" అని కొంతమంది అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తోంది.

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఈ విషయంలో భారతీయ అమెరికన్లు పార్టీల వారీగా విడిపోయారు. డెమోక్రాట్లకు మద్దతిస్తున్నవారు పాలస్తీనీయులకు, రిపబ్లికన్లు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న యుద్ధం విషయంలో పది మంది భారతీయ అమరికన్లలో నలుగురు బైడెన్ ఇజ్రాయెల్ అనుకూల విధానంతో ఉన్నారని చెప్పారు.

2023 అక్టోబర్‌లో హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మంది ప్రాణాలు తీసింది. 251 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. కాల్పుల విరమణ, ఇతర ఒప్పందాల తర్వాత వారిలో కొంతమందిని విడుదల చేశారు.

ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో గాజాలో 48 వేల మంది పాలస్తీనీయులు చనిపోయారని, వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య శాఖ తెలిపింది.

మార్చ్ 1న ముగిసిన మొదటి దశ కాల్పుల విరమణను పొడిగించే చర్చలు మార్చి 17న ఖతార్‌లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

భారత్ అమెరికా సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

మోదీకి బలమైన మద్దతు

భారత దేశం సరైన దిశగా పయనిస్తోందని 47 శాతం మంది ఇండియన్ అమరికన్లు భావిస్తున్నారు. గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఇది 10 శాతం ఎక్కువ.

ప్రధాన మంత్రిగా మోదీ పనితీరు బాగుందని 47 శాతం మంది చెప్పారు. ప్రతీ పది మందిలో నలుగురు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాకపోవడం, భారతదేశాన్ని మరింత ప్రజాస్వామికంగా మార్చిందని అభిప్రాయపడ్డారు.

మోదీకి మద్దతిస్తున్నవారు, భారత దేశం సరైన దిశలో ప్రయాణిస్తుందని చెబుతున్న అమెరికాలోని భారతీయుల్లో అనేక మందికి అమెరికా నేలమీద జరిగిన హత్యాయత్నం ఆరోపణల గురించి తెలియదని సర్వేలో తేలింది.

ఇది, సమాచార లోపమా? లేక సర్వే కోసం కొంతమందిని ఎంచుకోవడం వల్ల ఇలా జరిగిందా? విస్తృత జాతీయ భావనకు అనుకూల వైఖరిని సూచిస్తోందా?

"దీనికి సరైన కారణం ఏంటనేది చెప్పడం కష్టం. అయితే, కొంతమందిని ప్రత్యేకంగా ఎంచుకోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు" అని ఈ సర్వే నివేదిక రూపొందించిన వారిలో ఒకరైన మిలన్ వైష్ణవ్ చెప్పారు.

కార్నెగీ 2020లో సేకరించిన డేటా ప్రకారం 60 శాతం మంది భారతీయ అమెరికన్లు భారతదేశంలో జరిగే రోజువారీ సంఘటనలను నిరంతరం ఫాలో అవుతుంటారు. మిగిలినవారు "అప్పుడప్పుడు" మాత్రమే దృష్టి పెడుతుంటారు.

"కుటుంబ సభ్యులు, స్నేహితులు, సోషల్ మీడియాలో చర్చలు, వార్తలు ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల అమెరికాలో వెల్లువెత్తిన వార్తల వరద నేపథ్యంలో, సుపారీ హత్యాయత్నం ఆరోపణలు ఎక్కువ మందికి ఆశ్యర్యం కలిగించకపోవచ్చు" అని వైష్ణవ్ చెప్పారు.

భారతీయ అమెరికన్లు ట్రంప్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ, భారత్ – అమెరికా సంబంధాల కోసం బైడెన్ లేదా హారిస్‌కు మద్దతిస్తున్నారు. అలాగే, భారత్‌లో మోదీ తిరిగి ఎన్నిక కావడాన్ని బలంగా సమర్థిస్తున్నారు.

మోదీ జాతీయ విధానాల పరంగా చూస్తే, ఈ వైవిధ్యానికి కారణమేంటి? సిద్ధాంతాల కంటే వ్యక్తి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతోందా?

"ఇది మన నేపథ్యం, దృక్పథం నుంచి వస్తుందనే దానికి ఉదాహరణ" అని వైష్ణవ్ చెప్పారు.

"భారత్‌తో పోల్చుకుంటే, అమెరికాలో విధానపరమైన అంశాల గురించి భారతీయ అమెరికన్లు ఉదారమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు మా పరిశోధనలో తేలింది" అని ఆయన అన్నారు.

"ఉదాహరణకు ముస్లిం భారతీయ అమెరికన్లు రెండు దేశాల్లోనూ మైనార్టీలు. రెండు దేశాల్లోనూ వారు ఉదార స్వభావంతో ఉన్నారు. హిందూ ఇండియన్ అమెరికన్లు అమెరికాలో ఉదారవాదాన్ని ( ఇక్కడ వారు మైనారిటీలు), ఇండియాలో (అక్కడ మెజారిటీలు) సంప్రదాయవాదానికి జై కొడుతున్నారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి మైనారిటీ, మెజారిటీ స్టేటస్ అతడి రాజకీయ అభిప్రాయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది" అని వైష్ణవ్ చెప్పారు.

భారత్ అమెరికా సంబంధాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2019లో హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోడీ' సభలో భారత జాతీయ పతాక ప్రదర్శన.

రాజకీయ పరిస్థితులు మారాయా?

భారతీయ అమెరికన్లు భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు ట్రంప్ ప్రమాదకరమని భావిస్తే .. వాళ్లు ట్రంప్‌కు మొదట్లో ఎందుకు అంత మద్దతిచ్చారు. హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి 50 వేల మంది భారతీయులు హాజరయ్యారు. అమెరికాలోని భారతీయులు తమ అభిప్రాయాలు మార్చుకున్నారా? లేదా ప్రస్తుత రాజకీయాల వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడిందా?

"ఒక కార్యక్రమం లేదా కొంతమందిని పరిగణనలోకి తీసుకుని, దానిని భారతీయ అమెరికన్లు అందరికీ వర్తింపజేయలేం. హౌడీ మోడీ కార్యక్రమానికి 50 వేల మంది భారతీయులు హాజరైనా వారంతా ట్రంప్‌ను కాకుండా మోదీని చూడటానికి వచ్చి ఉండవచ్చు. అయితే, తర్వాత దాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు" అని వైష్ణవ్ చెప్పారు.

"ఇందులో మరో అంశం అమెరికాలోని భారతీయుల్లో వైవిధ్యం. భారతీయ అమెరికన్లలో ఎక్కువ మది డెమోక్రాట్ పార్టీ మద్దతుదారులు . 2024లో 30 శాతం మంది మాత్రమే రిపబ్లికన్లకు మద్దతిచ్చారు. అయితే, పరిస్థితులు మారాయి. ఇండియన్ అమెరికన్స్ డెమోక్రాట్ల వైపే ఉన్నా, వారితో అనుబంధం తగ్గింది. 2020లో 56 శాతం ఉంటే తర్వాతి ఎన్నికలకు అది 47 శాతానికి తగ్గినట్లు సర్వేలో తేలింది.

చివరగా, ఈ సర్వే అమెరికాలోని భారతీయ సమాజంలో సంక్లిష్టతను నొక్కిచెబుతోంది. మారుతున్న రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత అనుభవాల ప్రాతిపదిక వారి అభిప్రాయం ఏర్పడుతోందని సూచిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)