వాయిస్ ఆఫ్ అమెరికా మూసివేత: ‘రాడికల్ ప్రాపగాండా నుంచి ప్రజలకు విముక్తి’ అంటూ వైట్ హౌస్ ప్రకటన

వాయిస్ ఆఫ్ అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, థామస్ మెకింతోష్, మెర్లిన్ థామస్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ప్రభుత్వ నిధులతో నడిచే ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ వార్తా సంస్థ మూసివేత ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

ఈ వార్తా సంస్థ యాంటీ ట్రంప్ విధానాలు అనుసరిస్తోందనీ, రాడికల్ భావజాలాన్ని ప్రచారం చేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

''పన్నులు చెల్లించే ప్రజలు ఇకపై రాడికల్ ప్రాపగాండా బారిన పడకుండా ఈ నిర్ణయం కాపాడుతుంది'' అని వైట్‌హౌస్ నుంచి వెలువడిన ఒక ప్రకటన వెల్లడించింది.

ఈ రేడియో చానెల్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందనీ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తోందంటూ రైట్ వింగ్‌కు చెందిన రాజకీయ నాయకులు, మీడియా నుంచి వెలువడిన కొన్ని వ్యాఖ్యలను కూడా వైట్‌హౌస్ తన ప్రకటనలో చేర్చింది.

ప్రధానంగా రేడియో సర్వీసును అందించే వాయిస్ ఆఫ్ అమెరికాను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ ప్రచారాలను తిప్పికొట్టడానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దీనిని వినేవాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఉన్నారు.

తనతోపాటు సంస్థలో పని చేస్తున్న 1300 మంది సిబ్బంది వేతనంతో కూడిన సెలవులో ఉన్నట్లయిందని వాయిస్ ఆఫ్ అమెరికా డైరెక్టర్ మైక్ అబ్రమోవిట్జ్ అన్నారు.

ఇరాన్, చైనా, రష్యా వంటి దేశాలు అమెరికాను అప్రతిష్ట పాలు చేయడానికి తప్పుడు కథనాలను సృష్టిస్తున్నాయని, ఇందుకోసం వేలకోట్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయని అబ్రమోవిట్జ్ ఆరోపించారు.

ప్రభుత్వ ఉత్తర్వుతో కీలకమైన సమయంలో తమ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే అవకాశం లేకుండా పోయిందని అబ్రమోవిట్జ్ అభిప్రాయపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వాయిస్ ఆఫ్ అమెరికాకు మాతృసంస్థ యూఎస్ ఏజెన్సీ ఫర్ గ్లోబల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాయిస్ ఆఫ్ అమెరికాకు మాతృసంస్థ యూఎస్ ఏజెన్సీ ఫర్ గ్లోబల్ మీడియా

ఉద్యోగులకు మెయిల్స్

ట్రంప్ ఉత్తర్వులు ప్రధానంగా వాయిస్ ఆఫ్ అమెరికాకు మాతృసంస్థ అయిన యూఎస్ ఏజెన్సీ ఫర్ గ్లోబల్ మీడియా (USAGM)ను లక్ష్యంగా చేసుకుని వెలువడింది.

ఈ సంస్థ రేడియో ఫ్రీ యూరప్, రేడియో ఫ్రీ ఏషియా వంటి లాభాపేక్షలేని సంస్థలకు కూడా నిధులు సమకూరుస్తుంది.

కమ్యూనిజాన్ని ఎదుర్కోవడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

సంస్థను మూసివేస్తున్న విషయాన్ని కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా తెలిపారు ఆ సంస్థ హ్యూమన్ రీసోర్సెస్ డైరక్టర్ క్రిస్టల్ థామస్.

ఇకపై మీకు చెల్లించడానికి నిధులు లేవంటూ వాయిస్ ఆఫ్ అమెరికా కోసం పని చేసే ఫ్రీలాన్సర్లు, ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్లకు చెప్పేశారని తమకు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందిందని బీబీసీకి అమెరికాలో న్యూస్ పార్ట్‌నర్ అయిన సీబీఎస్‌ వెల్లడించింది.

అలాగే రేడియో ఫ్రీ ఏషియా, రేడియో యూరప్‌లకు ఇదే తరహా మెయిల్స్ అందాయని సీబీఎస్‌ వెల్లడించింది.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ నిర్ణయంపై విమర్శలు

''పత్రికా స్వేచ్ఛ విషయంలో ఇన్నాళ్లూ కొనసాగిన అమెరికా నిబద్ధతను దెబ్బతీసే ఉత్తర్వు ఇది" అని నేషనల్ ప్రెస్ క్లబ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

''ఒక వార్తా సంస్థను రాత్రికి రాత్రే మూసేయగలిగారు. పత్రికా స్వేచ్ఛ గురించి ఏం మాట్లాడగలం. ఇదేదో ఉద్యోగులను తగ్గించుకునే వ్యవహారం కాదు. మొత్తం జర్నలిజాన్నే ప్రమాదంలో పడేసే చర్య.'' అని ఆ ప్రకటనలో ఉంది.

వాయిస్ ఆఫ్ అమెరికాతోపాటు యూఎస్ ఏజెన్సీ ఫర్ గ్లోబల్ మీడియా ఆధ్వర్యంలో పని చేసే ఇతర స్టేషన్లు సుమారు 40 కోట్లమంది శ్రోతలకు సర్వీసులు అందిస్తున్నాయి. ఇది బ్రిటిష్ ప్రభుత్వం పాక్షికంగా నిధులు సమకూర్చే బీబీసీ వరల్డ్ సర్వీస్‌ శ్రోతల సంఖ్యలకు దాదాపు సమానం.

రేడియో ఫ్రీ యూరప్/రేడియో లిబర్టీ సంస్థలు కొనసాగేలా యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు చేయాలని తాను ఆశిస్తున్నట్లు చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి జాన్ లిపావ్స్కీ అన్నారు.

కనీసం పాక్షికంగా ప్రసార సంస్థ కార్యకలాపాలను నిర్వహించడానికి మార్గాలను కనుగొనాల్సిందిగా సోమవారం జరిగే సమావేశంలో యూరోపియన్ విదేశాంగ మంత్రులను కోరతానని ఆయన చెప్పారు.

ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కూడా వాయిస్ ఆఫ్ అమెరికాపై తీవ్రంగా విమర్శలు చేశారు.

ఇటీవలే ఆయన, తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన కారి లేక్‌ను యూఎస్ ఏజెన్సీ ఫర్ గ్లోబల్ మీడియాకు స్పెషల్ అడ్వైజర్‌గా నియమించారు.

మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలన్నీ తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని, పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని ట్రంప్ తరచూ ప్రకటనలు చేస్తూ వచ్చారు.

వాయిస్ ఆఫ్ అమెరికాను మూసేయాలని ఎలాన్ మస్క్ కూడా ఇటీవల ఎక్స్‌లో పిలుపునిచ్చారు.

1950ల్లో వాయిస్ ఆఫ్ అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాయిస్ ఆఫ్ అమెరికా స్టూడియో ( ఫైల్ ఫోటో)

వాయిస్ ఆఫ్ అమెరికా చరిత్ర ఏంటి?

అమెరికాకు వ్యతిరేకంగా నాజీ జర్మనీతోపాటు, జపాన్‌ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి 1942లో వాయిస్ ఆఫ్ అమెరికా మొదలైంది. దీని మొదటి ప్రసారం బీబీసీ నుంచి అమెరికా అరువుగా తీసుకున్న ట్రాన్స్‌మీటర్ నుంచి ప్రారంభించారు.

ఒక మంచి ఉద్దేశంతో ఈ రేడియో ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు అప్పట్లో అమెరికా ప్రకటించింది.

స్వేచ్ఛాయుత పాత్రికేయానికి రక్షణ కల్పిస్తామంటూ 1976లో అప్పటి అమెరికా మాజీ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ ఒక పబ్లిక్ చార్టర్‌పై సంతకం చేశారు.

1994లో సైనికేతర ప్రసారాలపై పర్యవేక్షణ కోసం బ్రాడ్‌కాస్ట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను ఏర్పాటు చేశారు.

వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పని చేసే వాయిస్ ఆఫ్ అమెరికా తన కార్యక్రమాలను అమెరికా ఆవల మాత్రమే ప్రసారం చేసేది.

2013లో చట్టంలో మార్పులు చేసి వాయిస్ ఆఫ్ ఆమెరికా, దాని అనుబంధ సంస్థలు అమెరికాలో కూడా ప్రసారాలు ప్రారంభించడానికి అనుమతించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,డి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)