‘నేను ఇల్లు సర్దుకుంటుంటే విపరీతంగా చూస్తున్నారు’

రూ డే

ఫొటో సోర్స్, Roo Day

ఫొటో క్యాప్షన్, రూ డే
    • రచయిత, మేగాన్ డేవీస్
    • హోదా, బీబీసీ న్యూస్

చాలామంది తల్లిదండ్రులు లాగానే, కారీస్ హార్డింగ్ తన పిల్లల పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రపర్చడంలోనే చాలాసేపు గడుపుతుంటారు.

అయితే, ముగ్గురు పిల్లల తల్లి అయిన కారీస్ హార్డింగ్ తన ఇంటిని శుభ్రం చేసుకోవడాన్ని, సర్దుకోవడాన్ని ఆన్‌లైన్‌లో వేలమంది చూస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ''రీసెట్'' అనేది ఒక ట్రెండ్‌గా మారింది.

ఈ ట్రెండ్‌లో భాగంగానే ఇళ్లను శుభ్రపరిచే, సర్దుకునే వీడియోలను చాలామంది వీక్షిస్తున్నారు.

కారీస్ హార్డింగ్‌కు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తమ రోజువారీ జీవితాలను మానిటైజ్ (సొమ్ము) చేసుకుంటున్న చాలామంది ఫుల్-టైమ్ ఇన్‌ఫ్లుయెన్సర్లలో కారీస్ కూడా ఒకరు.

''నా జీవితంలోని రోజువారీ పనులు మిగతావారికి ఆసక్తికరంగా ఉంటాయని నేను ఎప్పుడూ అనుకోలేదు'' అని వేల్స్‌లోని స్వాన్సీకి చెందిన కారీస్ చెప్పారు.

2022లో రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన రోజువారీ పనుల్లో భాగంగా 'ఈవెనింగ్ రీసెట్ (సాయంత్రం పూట అన్ని శుభ్రపరచుకునే)' ప్రారంభించానని కారీస్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లీనింగ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రతి రీసెట్‌లో సుమారు 20 నిమిషాలు ఇంటిని ఊడవడం, తుడవడం, వస్తువులను శుభ్రపర్చడం, ఏమైనా వస్తువులు అడ్డదిడ్డంగా పడి ఉంటే వాటిని ఎక్కడివక్కడ సర్దడం, పిల్లలు పడుకున్నాక మరుసటి రోజుకు సిద్ధమవ్వడం చేస్తుంటానని తెలిపారు.

చేసే పనులన్నింటినీ తానే స్వయంగా వీడియో తీసుకుంటారు. వీడియోలను ముందు షార్ట్ రీల్స్‌గా ఎడిట్ చేసి, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తుంటారు.

''నాకు సాయపడే విషయాలను షేర్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే, తల్లిగా ఉండటం చాలా కష్టం'' అని కారీస్ తెలిపారు.

రిలేటబుల్‌గా ఉండటం తాను చాలా ముఖ్యమైనదిగా భావిస్తానన్నారు.

ఎమిలీ జోన్స్

ఫొటో సోర్స్, Emily Jones

సమయాన్ని ఆదా చేసే క్లీనింగ్ టిప్స్‌ను షేర్ చేస్తున్నప్పుడు తాను 100 శాతం పారదర్శకంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని మరో ఇన్‌ఫ్లుయెన్సర్ ఎమిలీ జోన్స్ చెప్పారు. ఆమె వేల్స్‌లోని అమన్‌ఫోర్డ్‌కు చెందినవారు. ఆమెకు 13 వేల మంది ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇంటిని రీసెట్ చేసుకోవడం, శుభ్రపర్చుకోవడం రోజువారీ పని అని ఈ ఇద్దరు పిల్లల తల్లి చెప్పారు.

అయితే, రోజంతా శుభ్రం చేసుకుంటూ ఉండలేమని, అది అసాధ్యమని అన్నారు.

''నేను తల్లిని, అదే సమయంలో వర్క్ కూడా చేయాలి. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవన్ని నా జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి'' అని అన్నారు.

#cleaning అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాలో 11 మిలియన్లకు పైగా పోస్టులు ఉండగా.. #reset అనే హ్యాష్‌ట్యాగ్‌తో 2.6 మిలియన్లకు పైగా పోస్టులు ఉన్నాయి.

ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో సుమారు 20 లక్షల ఫాలోవర్లతో, హార్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన 30 ఏళ్ల రూ డే బ్రిటన్‌లో అత్యంత హై-ప్రొఫైల్ క్లీనింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఒకరిగా ఉన్నారు.

ఇల్లు శుభ్రం చేసుకోవడం

ఫొటో సోర్స్, Getty Images

''వన్ అవర్ స్పీడ్ క్లీన్స్''కు పిలుపునిస్తూ ఆమె వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. దీనిలో 60 నిమిషాల టైమర్‌ను పెట్టుకుని, ఎంత వీలైతే అంత ఇంటిని శుభ్రపరుచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

సోషల్ మీడియాలో క్లీనింగ్‌కు సంబంధించిన కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్న వారిలో మెజార్టీ మహిళలే అని రూ డే చెప్పారు. కానీ, మగ ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలిపారు.

''ఒకవేళ మీరు జెండర్ గురించి మాట్లాడితే, కేవలం మహిళలు మాత్రమే చేయాల్సింది కాదు'' అని రూ డే అన్నారు.

క్లీనింగ్ సాధారణంగా మహిళలు ఎక్కువగా చేస్తుంటారని లండన్‌లోని సిటీ సెయింట్ జార్జ్ యూనివర్సిటీలో పనిచేసే సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్టెఫానీ అలీస్ బేకర్ చెప్పారు.

ఎలాంటి చెల్లింపులు లేకుండా సంప్రదాయంగా ఇంటిని అద్దంలా తీర్చిదిద్దుతున్న వారు ప్రస్తుతం తమ పనులను మోనిటైజ్ చేసుకోవచ్చన్నారు.

లైఫ్‌స్టైల్ కంటెంట్‌కు పాపులారిటీ పెరుగుతున్నప్పటికీ, ప్రేక్షకుల ఆసక్తి అనేది కొత్తేమీ కాదని చెప్పారు.

సోషల్ మీడియాకు ముందు కూడా ఈ రకమైన కంటెంట్ ఉండేదని, కానీ, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత మంది చూడగలుగుతున్నారని తెలిపారు.

మాధ్యమాలు, ప్రేక్షకులు మాత్రమే మారారని అన్నారు.

60 సెకన్ల క్లీనింగ్ వీడియోలు చూసి ప్రజలు తేలిగ్గా మోసపోయే ప్రమాదం ఉందని, వాస్తవంగా గంటల తరబడి క్లీనింగ్ కోసం శ్రమించాల్సి వస్తుందని స్వాన్సీ యూనివర్సిటీ సైకాలజిస్ట్ డాక్టర్ సెరీ బ్రాడ్‌షా చెప్పారు.

''మనం చూసే మనుషుల్లాగానే ఉండాలని అనుకుని మనం తేలిగ్గా మోసపోతుంటామని నేను భావిస్తాను'' అని అన్నారు.

క్లీనింగ్ కంటెంట్‌ చూసేందుకు పెరుగుతున్న ఆసక్తిని తాను అర్థం చేసుకోగలని డాక్టర్ బ్రాడ్‌షా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)