పెయింట్ డబ్బాలు పేలుతాయా? హైదరాబాద్‌లో కొన్ని అగ్ని ప్రమాదాలకు అవే కారణమా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ కుషాయిగూడలో మార్చి 23న జరిగిన ఓ పేలుడులో నాగరాజు అనే చెత్త ఏరుకునే వ్యక్తి మరణించారు.
రసాయనాలు ఉన్న డబ్బా తెరవడం వల్లే ఇది జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అది రంగుల డబ్బా కావచ్చని కూడా చెబుతున్నారు.
గతంలోనూ కొన్ని భారీ అగ్ని ప్రమాదాలకు రంగుల డబ్బాలు కారణమయ్యాయని పోలీసులు చెప్తున్నారు.

- 2023 ఏప్రిల్‌లో అనంతపురంలో నిల్వ ఉన్న పెయింట్ డబ్బా తెరవగానే పేలుడు జరిగి, డబ్బా తెరిచిన వ్యక్తి శరీరం ముక్కలై 30 అడుగుల దూరంలో భాగాలు పడ్డాయి.
- 2019 నవంబరులో మీర్ పేటలో ఒక మహిళ ఇలానే రసాయనాలు ఉన్న డబ్బా తెరవడం వలన మరణించారు.
- అదే ఏడాది సెప్టెంబరులో రాజేంద్ర నగర్‌లో కూడా రంగుల డబ్బా తెరిచిన వ్యక్తి మరణించారు.
- 2023 డిసెంబరులో బండ్లగూడలో చెత్త కుప్పలో పేలుడు జరిగి ఒక చెత్త ఏరుకునే వృద్ధుడి కాలు, చేయి దెబ్బతిన్నాయి. ఆ ప్రమాదానికి కూడా రంగుల డబ్బాయే కారణమని తరువాత తేలింది.
- 2023 అక్టోబరులో సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర చెత్త ఏరుకునే వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి.
- 2022 డిసెంబరులో లోయర్ ట్యాంక్‌బండ్ చెత్త కుప్పలో పేలుడు జరిగి, చెత్త ఎత్తుకునే తండ్రీ కొడుకులకు గాయాలయ్యాయి. పెయింట్ డబ్బాను కదిలించడంతో ఈ ప్రమాదం జరిగింది.
- 2020 ఫిబ్రవరిలో ముషీరాబాద్‌లో కూడా చెత్తకుప్ప పేలుడుకు కూడా రంగుల డబ్బాయే కారణం.

ఫొటో సోర్స్, Getty Images
ఆశతో తెరిస్తే ప్రాణాలకు ముప్పు
ఇవన్నీ తెలిసీ తెలియకుండా ఇంట్లో వాడే రంగులు, థిన్నర్లు, టర్పెంట్ ఆయిల్, ఇతర రసాయనాల డబ్బాలను చెత్తలో పారేయడం వల్ల జరిగిన ప్రమాదాలు.
రంగు డబ్బాల వల్ల ఎన్నో పెద్ద ప్రమాదాలు కూడా జరిగాయని తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారులు బీబీసీతో చెప్పారు.
''ఇటీవలే నాంపల్లిలో రంగుల డబ్బాలు సక్రమంగా నిల్వ చేయకపోవడం వల్ల పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది'' అని బీబీసీతో చెప్పారు రంగారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి షేక్ కరీం.
కేవలం రంగు (పెయింట్) డబ్బాలే కాదు. సెంటు, పెర్ఫ్యూమ్ బాటిళ్ళు (బాగా ప్రెజర్ ఉండేవి), టర్పెంట్ ఆయిల్ డబ్బాలు, డ్రై క్లీనింగ్ రసాయనాలు, పెయింట్ థిన్నర్లు, నెయిల్ పాలిష్ రిమూవర్లు, ఫర్నీచర్ స్ట్రిప్పర్లు.. ఇలా రసాయనాలతో తయారై ఇంటికి ఉపయోగించే చాలా రకాల వస్తువులతో ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు.
పెయింట్ సహా ఇలాంటి చాలా వస్తువుల్లో టాల్విన్, ఈథర్ అనేవి ఉంటాయి.
సగం వాడిన డబ్బాలో మిగతా రంగు పొదుపు చేయడం కోసం మూత పెట్టి ఉంచుతారు.
ఆవిరి స్వభావం ఉండే రసాయనాలు గాలిలోని ఆక్సిజన్‌తో కలసి రసాయన చర్య జరుపుతాయి. కానీ, డబ్బాలో ఖాళీలో వ్యాక్యూమ్ ఏర్పడి వాటిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు పేలే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
‘వాడిన పెయింట్ డబ్బాలను మళ్లీ అవసరం రావొచ్చన్న ఉద్దేశంతో మూతపెట్టి దాచి ఉంచుతారు.
కానీ, అప్పటికి అది గట్టి పడటమో, లేదా డబ్బా మూత రాకపోవడంతో పారేస్తారు. అది చెత్తకుప్పలో తేలుతుంది. అలాంటి డబ్బాలో ఏముందా అని ఆశతో వాటిని తెరవడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చెత్త ఏరేవారు.
మరోవైపు భవనాల కోసం తెచ్చిన పెయింట్లు, ఇతర రసాయనాలు సెల్లార్లలో స్టోర్ చేస్తూ, నివాస సముదాయాల మధ్య స్టోర్ చేస్తూ కూడా భారీ అగ్ని ప్రమాదాలకు కారణం అవుతున్నారు పలువురు’ అని చెప్పారు అగ్నిమాపక అధికారులు.

ఫొటో సోర్స్, Getty Images
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఆర్గానిక్ సాల్వెంట్స్ ఉండే పెయింట్స్‌ను డబ్బా సీల్ తీసిన తర్వాత పూర్తిగా వాడేయడం ఉత్తమం. వాడలేకపోతే అవసరం ఉన్న వారికి, వెంటనే వాడుకోగలిగిన వారికి ఇచ్చివేయాలి.
- మిగిలిపోయిన రసాయనం గాలి తగిలేలా, అగ్ని తగలని విధంగా నిల్వ చేయాల్సి ఉంటుంది.
- పారేయాలి అనుకుంటే ఆ డబ్బా మీద రాసిన విధంగా మాత్రమే డిస్పోజ్ చేయాలి.
- డబ్బాలో రసాయనం ఉండగా, దాని మూత బిగించి బయట వేయకూడదు.
- నేరుగా భూమిలో వేస్తే నీరు, నేల కలుషితం అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పెయింట్ కేన్లను రసాయన వ్యర్థాల తరహాలోనే డిస్పోజ్ చేయాలని టొరంటో విశ్వవిద్యాలయం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
''రంగులు కానీ మరే రసాయనాలతో తయారైన పదార్థాలు కానీ నివాస సముదాయాలున్న చోట నిల్వ చేయకూడదు. ముఖ్యంగా అపార్టుమెంట్ సెల్లార్లలోనూ, స్టోర్ రూముల్లోనూ వీటిని పెడుతున్నారు. అది సరికాదు.
దానికి పరిశ్రమల శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రత్యేకంగా నిల్వ చేయాలి. మీరు ఎక్కడ కొంటున్నారో వారి దగ్గరే గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. పబ్లిక్ ప్లేసుల్లో అసలు వేయకూడదు. మేం కూడా దీనిపై స్పెషల్ డ్రైవ్ పెట్టి అవగాహన కల్పిస్తున్నాం.
చాలా చోట్ల బేస్మెంట్లు, సెల్లార్లలో పెట్టిన పెయింట్ డబ్బాలను పట్టుకున్నాం. థిన్నర్లను కూడా అలా ఉంచకూడదు. ఎక్కడో అవసరం లేదు. మీరు కొనే పెయింట్ డబ్బా మీదే దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో రాసి ఉంటుంది. దాన్ని అనుసరించాలి'' అని బీబీసీతో చెప్పారు రంగారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి షేక్ కరీం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














