బంగారం వాడకపోతే తుప్పు పడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇటికాల భవాని
- హోదా, బీబీసీ ప్రతినిధి
అక్రమ మైనింగ్ కేసులో తన ఇంటి నుంచి సీజ్ చేసిన బంగారు నగలను తమకు తిరిగి ఇవ్వాలంటూ గాలి జనార్దన్ రెడ్డి ఇటివలే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
2011లో అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై 2015లో బెయిల్‌పై జనార్దన్ రెడ్డి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆయన బయటే ఉన్నారు.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులు గాలి జనార్దన్‌రెడ్డి నుంచి సుమారు 53 కేజీల బరువు ఉన్న 105 బంగారు ఆభరణాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
జప్తు చేసిన నగలను సీబీఐ విడుదల చేసేలా ఆదేశించాలంటూ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
ఇంతకీ బంగారానికి తుప్పు పడుతుందా? బంగారు ఆభరణాలను వాడకుండా దాచిపెడితే ఏమవుతాయి? ఇంతకీ తుప్పు అంటే ఏంటి?

తుప్పు అంటే ఏమిటి?
తుప్పు అంటే ఐరన్ ఆక్సైడ్. లోహశాస్త్రం ప్రకారం కేవలం ఇనుము, ఇనుము మిశ్రమంగా ఉన్నవాటికి(ఉక్కు) మాత్రమే తుప్పు పడుతుంది.
తేమ, ఆక్సిజన్ వల్ల ఇనుములో రసాయన చర్య జరిగి ముదురు ఎర్ర రంగు పొర(తుప్పు) ఏర్పడుతుంది. దీన్ని రస్టింగ్ అంటారు.
ఇలాంటి పొర ఏర్పడిన తరువాత కూడా తగిన చర్యలు తీసుకోకపోతే లోహం క్రమంగా తన సహజ రూపం కోల్పోయి నశిస్తుందని రసాయన శాస్త్ర అధ్యాపకుడు వెంకటేశ్ తెలిపారు.
నట్‌లు, బోల్ట్‌లు, ఫ్యాన్లు, సైకిల్ చైన్‌లు, ఆటోమొబైల్ విడి భాగాలలో చాలావరకు ఇనుము మిశ్రమ లోహాలు వాడతారు.
వీటికి పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీసింగ్ ఇతర మార్గాలు ఉపయోగించి తుప్పు పట్టకుండా చూస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం, రాగి, ఇత్తడి, వెండి తుప్పు పడతాయా?
గోల్డ్‌ను నోబుల్ ఎలిమెంట్ అంటారు. బంగారాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగించి ఆభరణాలు తయారుచేయవచ్చు.
బంగారం సాధారణ ఆసిడ్‌లకు స్పందించదు. కేవలం ఆక్వా రెగియా(నైట్రిక్ ఆసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ల మిశ్రమం) అనే ఆమ్లంలో ఇది కరుగుతుంది.
వెండి కూడా నోబుల్ ఎలిమెంటే. కాని గాలిలో ఉండే సల్ఫర్‌తో (స్వల్పంగా ఉంటుంది) చర్యకు గురవుతుంది.
ఇత్తడి అనేది జింక్ - రాగి మిశ్రమం. దాదాపు ఖరీదైన ఆభరణాలు తయారు చేయటానికి వాడే లోహంలా కనిపిస్తుంది.
అందుకే ఎక్కువగా శిల్పకారులు విగ్రహాల తయారీలో ఇత్తడి వాడతారు.
జింక్ ఎక్కువ శాతం వాడితే వస్తువులకు బలం పెరుగుతుంది. రాగి ప్రధాన లోహంగా ఉన్నప్పుడు ముదురు రంగులో కనిపిస్తుంది.
అయితే ఇత్తడి కూడా తుప్పు పట్టదు కాని క్రమంగా తరిగిపోతుంది(చిలుము పట్టడం). వాతావరణం కారణంగా ఇత్తడిలో ఉండే జింక్‌లో రసాయన మార్పులు జరుగుతాయి. కేవలం రాగి మిగిలిపోతుంది. అందువల్ల రంగు మారుతుంది.
ఇత్తడి అన్నిరకాల ఆమ్లాలకు రసాయనంగా స్పందిస్తుంది.
రాగి- కొందరు రాగి గ్లాసులు, పాత్రలు ఇప్పటికీ వాడతారు. అయితే రాగికి కూడా తుప్పు పట్టదు. ఏళ్ల తరబడి వాడిన తర్వాత పచ్చ రంగులో మచ్చలు ఉండటం మనం గమనించవచ్చు. రాగి బలమైన ఆసిడ్‌లకు రియాక్ట్ కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు తుప్పు పట్టవు
బంగారం, రాగి, ఇత్తడి, వెండి ఏవీ తుప్పు పట్టవు.
అయితే మన దేశంలో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్‌ల స్వచ్ఛత ఉన్న బంగారం దొరుకుతుంది. ఇందులో 22, 18, 14 క్యారెట్స్ బంగారాన్ని ఆభరణాల తయారీలో వాడుతుంటారు.
"బంగారం అనేది ఎప్పుడూ తుప్పుపట్టదు" అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్కెటింగ్ అధికారి వనజ బీబీసీతో చెప్పారు.
తక్కువ స్వచ్ఛత ఉండే 14 క్యారెట్స్ బంగారం సహా, బంగారు ఆభరణాలు ఏవీ తుప్పుపట్టవు అని వనజ అన్నారు.
"వాడినా, వాడకుండా దాచిపెట్టినా బంగారు ఆభరణాలు పాతబడతాయి కానీ తుప్పు పట్టవు. ఎక్కువ కాలం ఆభరణాలు ధరిస్తే ఒక పసుపు-పచ్చరంగు పొర ఏర్పడుతుందే కానీ తుప్పుపట్టదు" అని ఆమె చెప్పారు.
బంగారంలో ఇంప్యూరిటీస్ అంటే స్వచ్ఛమైన బంగారం కాకుండా అందులో బలం (పట్టు) పెంచేందుకు వాడే రాగి వంటి లోహాల వల్ల ఆభరణాలపై పొర ఏర్పడుతుందన్నారు.
బంగారు అణువులు చాలా స్థిరంగా ఉంటాయి. అందుకే గాలి, నీరు, తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో కూడా స్వచ్ఛమైన బంగారం రసాయన పరిమాణం మారదు.
ఈ కారణంగానే బంగారాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడతారని, ముఖ్యంగా సర్క్యూట్ బోర్డులలో బంగారాన్ని వాడుతారని అధ్యాపకుడు వెంకటేశ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














