'వక్షోజాలు పెద్దవిగా ఉన్నంత మాత్రాన అదనపు అందం, ఆనందం ఉండవని నాకిప్పుడు అర్థమైంది'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇలోనా హ్రోమ్లియుక్, లూయిస్ బరూచో
- హోదా, బీబీసీ న్యూస్ యుక్రెయిన్, బీబీసీ వరల్డ్ సర్వీస్
తన రొమ్ముల్లో నుంచి ఇంప్లాంట్స్‌ను తొలగించుకున్నట్లు యుక్రెయిన్ బ్లాగర్, పోషకాహార నిపుణురాలు 32 ఏళ్ల కాటరీనా క్రుప్కినా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాను ఆ విషయాన్ని వెల్లడించడం పెద్దయెత్తున ప్రభావం చూపుతుందని అప్పుడు ఆమెకు తెలియదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వీడియోను 75 లక్షల మంది చూశారు. తనలాగే బ్రెస్ట్ ఇంప్లాంట్లను తొలగించుకోవాలని భావిస్తున్న 1000 కంటే ఎక్కువ మంది మహిళలు తనకు మెసేజులు చేశారని ఆమె చెప్పారు.
''వక్షోజాలు పెద్దవిగా ఉన్నంత మాత్రాన అదనపు అందం, ఆనందం, ఆరోగ్యం రావని నాకిప్పుడు అర్థమైంది'' అని బీబీసీతో ఆమె చెప్పారు.
''మమ్మీలాగే నాకు కూడా పెద్ద రొమ్ములు కావాలని'' తన చిన్నకూతురు చెప్పిందని, ఆ తర్వాతే బ్రెస్ట్ ఇంప్లాంట్లను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు కాటరీనా వెల్లడించారు.
''నేను నా కూతురికి తప్పుడు ఉదాహరణగా కనిపిస్తున్నానని ఆ క్షణమే నాకు అర్థమైంది'' అని ఆమె చెప్పారు.
కాటరీనా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మహిళలు తమ బ్రెస్ట్ ఇంప్లాంట్లను తీసేయాలని అనుకుంటున్నారు. కారణమేంటి?

వివిధ కారణాలు
బ్రెస్ట్ ఎక్స్‌ప్లాంట్స్ (ఇంప్లాంట్లను తొలగించడం) సంఖ్య 2019 నుంచి 46.3 శాతం పెరిగినట్లు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఏస్తటిక్ ప్లాస్టిక్ సర్జరీ (ఐఎస్‌ఏపీఎస్) సంస్థ తాజా డేటా సూచిస్తోంది.
మరోవైపు, ఇదే కాలవ్యవధిలో రొమ్ముల పరిమాణాన్ని పెంచే 'బ్రెస్ట్ ఆగ్మంటేషన్' సర్జరీ చేయించుకునేవారి సంఖ్య కేవలం 5.4 శాతమే పెరిగింది. 2022 నుంచి 2023 మధ్య 13 శాతం పడిపోయింది. 1990-2000 మధ్య ఈ సర్జరీలు ఎక్కువగా జరిగేవి.
బ్రెస్ట్ ఇంప్లాంట్లను తొలగించుకోవడానికి ఏస్తటిక్, కాస్మెటిక్ అంశాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. రొమ్ములు చిన్నగా, మరింత సహజంగా కనిపించాలనే ట్రెండ్ ఇప్పుడు పెరుగుతోందని చెబుతున్నారు.
''ఐదు, పదేళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు.. అంటే 2025లో భిన్నంగా కనిపించాలని మహిళలు కోరుకుంటున్నారు'' అని అమెరికన్ సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ (ఏఎస్‌పీఎస్)లో సోషల్ మీడియా సబ్ కమిటీకి నేతృత్వం వహించే డాక్టర్ క్రిస్టీ హామిల్టన్ చెప్పారు.
''90వ దశకంలో అమర్చిన బ్రెస్ట్ ఇంప్లాంట్లు చాలా పెద్దగా ఉండేవి. ఇప్పుడు మహిళలు వాటి పరిమాణాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు. లేదా సహజంగా రొమ్ము కణజాలం ఎక్కువగా ఉంటే మొత్తానికే వాటిని తొలగించుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి చిన్న రొమ్ములపై వారు ఆసక్తి కనబరుస్తున్నారు'' అని క్రిస్టీ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సంబంధిత సమస్యలు, ఆటోఇమ్యూన్ రియాక్షన్లు వంటి వాటిపై పెరుగుతున్న అవగాహన వల్ల కొంతమంది మహిళలు వాటిని తొలగించుకోవాలని, మరికొందరు అసలు ఇంప్లాంట్స్ జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నారని బ్రెజిలియన్ ప్లాస్టిక్ సర్జన్ అసోసియేషన్ (ఎస్‌బీసీపీ) అధ్యక్షుడు, డాక్టర్ బ్రూనో హర్కెన్‌హాఫ్ అన్నారు.
''సిలికాన్ సంబంధిత వ్యాధులు, ఆటోఇమ్యూన్ రియాక్షన్ల గురించి ఇప్పుడు చాలా సమాచారం అందుబాటులో ఉంది. సిలికాన్ వల్ల శరీరంలో మార్పులు జరిగి కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొన్ని రకాల ఇంప్లాంట్ల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రూనో అన్నారు. ఇలా రావడం చాలా అరుదు అని, కానీ ఇందులో నిజం ఉందని చెప్పారు. ఇలాంటి ఇంప్లాంట్లను తాను ఉపయోగించనని తెలిపారు.
ఈ రకమైన ఇంప్లాంట్లలో ఒకటి కాటరీనాకు ఉంది. ఇది తెలిశాక వాటిని తొలగించుకోవాలనే తన నిర్ణయం మరింత బలపడిందని కాటరీనా చెప్పారు. అయితే, వైద్యపరీక్షల్లో తనలో క్యాన్సర్ లక్షణాలేమీ కనిపించలేదని ఆమె చెప్పారు.
ఇంప్లాంట్లను అమర్చే పద్ధతుల్లో మార్పుల వల్ల కూడా ఎక్స్‌ప్లాంట్ ధోరణి పెరిగిందని డాక్టర్ హామిల్టన్ అంటున్నారు.
''పాత కాలంలో ఇంప్లాంట్లను కండరాల కింద అమర్చేవారు. మామూలుగా కదులుతున్నప్పుడు ఇవి అసహజంగా కనిపించేవి. చాలా ఏళ్ల క్రితం ఇంప్లాంట్లను అమర్చిన పద్ధతి వల్ల మహిళలు వ్యాయామం చేసేటప్పుడు, కౌగిలించుకునేటప్పుడు, యోగా చేసేటప్పుడు అవి జారిపోతుంటాయి. వాటిని తిరిగి సర్దుకోవాల్సి ఉంటుంది'' అని వివరించారు.
కొత్త పద్ధతుల్లో ఇంప్లాంట్లను కండరం ముందు భాగంలో అమర్చుతున్నారు. దీనివల్ల సహజంగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
విపరీతంగా ఫిల్లర్లు వాడి..
మరింత సహజంగా కనిపించాలనే ధోరణి కేవలం రొమ్ములకు మాత్రమే పరిమితం కాదని నిపుణులు అంటున్నారు.
ముఖం, ముక్కు, రొమ్ములు, శరీరం ఇలా ప్రతిదీ సహజంగా కనిపించాలని కోరుకుంటున్నారని డాక్టర్ హామిల్టన్ చెప్పారు
ఫిల్లర్లు, బొటాక్స్ వంటి నాన్ ఇన్వాసివ్ కాస్మెటిక్ ప్రక్రియల వల్ల అసహజ ఫలితాలు వచ్చేవి. దీనివల్ల రోగులు తమ నిర్ణయాలను పునరాలోచించుకుంటున్నారు.
''విపరీతంగా ఫిల్లర్లను వాడటం వల్ల మరీ అసహజంగా కనిపించిన చాలా సందర్భాలు మనం చూశాం. ముఖ సౌందర్యం కోసం వెళ్తే చికిత్స తర్వాత దెయ్యాల్లా మారిపోయారు. చాలామంది ముఖాల్లో అసలు మార్పులేం రాలేదు. ఇప్పుడు, రోగులు చాలా సహజమైన, ప్రశాంతమైన వదనాలను కోరుకుంటున్నారు'' అని డాక్టర్ బ్రూనో అన్నారు.
తన రోగుల్లో చాలామంది ఇప్పుడు ఫిల్లర్లను పూర్తిగా దూరం పెడుతున్నారని డాక్టర్ హామిల్టన్ చెప్పారు.
''ప్రతీ మూడు నుంచి ఆరు నెలలకు ఫిల్లర్లు వేసుకోవాలని చెప్పడమే సౌందర్య పరిశ్రమ చేసిన పెద్ద తప్పు అని నేను అనుకుంటున్నా. ఈ పద్ధతి వికటించింది కూడా. ఎందుకంటే ఇలా ఎక్కువసార్లు ఫిల్లర్లు వేసుకున్న వారు వింత మనుషుల్లా కనిపించారు'' అని అన్నారు.
ఫలితంగా, ప్రజలు ఇప్పుడు మరింత మెరుగైన చికిత్సల వైపు చూస్తున్నారని ఆమె చెప్పారు.
ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్న కొత్త విధానాల్లో 'కొల్లాజెన్ స్టిమ్యులేషన్' అగ్రస్థానంలో ఉందని డాక్టర్ బ్రూనో చెప్పారు.
కొల్లాజెన్, మానవ శరీరంలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్. ఇది ఎముకలు, చర్మం, కండరాలు, స్నాయువులో ఉంటుంది. వయస్సుతో పాటు శరీరంలో కొల్లాజెన్ స్థాయిలు పడిపోతాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘సహజ రూపం’ అసలు రియాలిటీ
ఈ కొత్త ట్రెండ్‌కు కాటరీనా ఒక ఉదాహరణ. బ్రెస్ట్ ఇంప్లాంట్లను తొలగించిన తర్వాత, ఆమె పెదాల పరిమాణాన్ని కూడా తగ్గించుకున్నారు. ముడతలను దాచడానికి బొటాక్స్ వాడకాన్ని కూడా మానేశారు.
''నా చర్యలు ఒక ట్రెండ్‌గా మారాలని, మహిళలు ఇక నుంచి తాము అందంగా కనిపించాలనే తపనను వదులుకోవాలని నేను కోరుకుంటున్నా'' అని కాటరీనా అన్నారు.
సౌందర్య పరిశ్రమ ఇప్పుడు 'నేచురల్ బ్యూటీ ట్రెండ్'పై దృష్టి మళ్లించిందని బీబీసీకి ఒక ప్రముఖ గ్లోబల్ కాస్మెటిక్ కంపెనీకి చెందిన సీనియర్ సోర్స్ ఒకరు చెప్పారు.
''దీని అర్థం సౌందర్య ఉత్పత్తులు, కాస్మెటిక్ ప్రక్రియలు తక్కువ వాడటం, వాటిపై తక్కువగా ఖర్చు పెట్టడం కాదు. కానీ ఒకరు చాలా సహజంగా, అందంగా కనిపించేలా చేయడం'' అని తెలిపారు.
2023లో ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ మార్కెట్ రీటెయిల్ అమ్మకాలు 446 బిలియన్ డాలర్లకు పెరిగాయని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ యూరోమానిటర్ డేటాను ఉటంకిస్తూ మెకిన్సీ కన్సల్టెంట్ కంపెనీ పేర్కొంది. 2022తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.
సహజంగా కనిపించాలనే ధోరణికి మారుతున్నారంటే ఇన్వాసివ్, నాన్ ఇన్వాసివ్ వంటి కాస్మెటిక్ ప్రోసీజర్లకు దూరంగా ఉంటున్నట్లు కాదని వైద్య నిపుణులు అంటున్నారు.
''ముఖంలో కృత్తిమ ఉత్పత్తులను అమర్చడానికి బదులుగా ముఖాన్ని లిఫ్ట్ చేసే, రీషేప్ చేసే ప్రక్రియలపై దృష్టి సారిస్తున్నాం'' అని డాక్టర్ హామిల్టన్ అన్నారు.
ప్లాస్టిక్ సర్జన్లు 2023లో ప్రపంచవ్యాప్తంగా 15.8 మిలియన్ల శస్త్రచికిత్సలు చేశారని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఏస్తటిక్ ప్లాస్టిక్ సర్జరీ గణాంకాలు చూపుతున్నాయి. 2022తో పోలిస్తే ఇది 5.5 శాతం ఎక్కువ. ఇదే వ్యవధిలో శస్త్రచికిత్స కాకుండా మిగతా పద్ధతులు కూడా 2 శాతం పెరిగినట్లు ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














