శవంతో రైల్వేస్టేషన్‌లో దొరికిపోయిన మూగ, చెవిటి వ్యక్తులు.. వారిని విచారించలేక పోలీసుల ఇబ్బందులు, చివరకు ఏమైందంటే..

- రచయిత, అల్పేశ్ కర్కరే
- హోదా, బీబీసీ కోసం
డెడ్‌బాడీతో దొరికిన చెవిటి, మూగ నిందితుల నుంచి సమాచారం రాబట్టడం పోలీసులకు కష్టమైంది. అయితే, ఈ కేసును ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ఛేదించారు.
2024 ఆగస్టులో, ముంబయిలో రద్దీగా ఉండే దాదర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఒక బ్యాగులో డెడ్‌బాడీ కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
బ్యాగుతో దొరికిన ఇద్దరు నిందితులు చెవిటి, మూగవారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో ముంబయి పోలీసులు నిస్సహాయులయ్యారు, నిందితుల నుంచి సమాచారం రాబట్టడంలో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చివరకు, ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడి సాయంతో ఈ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
ముంబయిలోని పైధునీ పోలీస్ స్టేషన్‌లో ఈ హత్య కేసు నమోదైంది. పైధునీ పోలీసులతో పాటు దాదర్ రైల్వే పోలీసులు, ముంబయి పోలీసు విభాగంలోని పలు బృందాలు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నాయి.
కేసు వివరాలు పోలీస్ అధికారులు ‘బీబీసీ’కి చెప్పారు.

ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందంటే..
అది, 2024 ఆగస్ట్ 4 ఆదివారం.
సమయం సుమారు రాత్రి 11 గంటల 50 నిమిషాలు.
ప్రదేశం, దాదర్ రైల్వే స్టేషన్.
రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా ఉంది.
దాదర్ రైల్వే స్టేషన్ జంక్షన్ కావడంతో, ఎప్పటిలానే లోకల్ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
దాదర్ నుంచి సావంతవాడీ వెళ్లే తుతారి ఎక్స్‌ప్రెస్ కోసం 11వ నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు వేచిచూస్తున్నారు.
ఇంతలో, తుతారి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం పైకి వచ్చేసింది. రైలు ఎక్కడం కోసం ప్రయాణికుల హడావిడి ప్రారంభమైంది.
పదకొండో నంబర్ ప్లాట్‌ఫాంపై, తుతారి ఎక్స్‌ప్రెస్ 5 - 6 బోగీల మధ్య రైలెక్కేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. వారి వద్ద ట్రాలీ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌ను రైల్లోకి ఎక్కించేందుకు ఆ ఇద్దరు తంటాలు పడుతున్నారు, బరువు ఎక్కువగా ఉండడంతో ఇద్దరికీ చెమటలు పడుతున్నాయి.
అదే సమయంలో, అక్కడ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంతోష్ కుమార్ యాదవ్, పోలీస్ కానిస్టేబుల్ మాధవ్‌కి వారిపై అనుమానం వచ్చింది.

వారి దగ్గరకు వెళ్లి ఆ బ్యాగ్‌ను తెరవమనడంతో, వారు తటపటాయించారు. వారి కదలికలతో పాటు బ్యాగ్‌లో ఏముందనే అనుమానంతో, ఆ బ్యాగ్‌ను ఓపెన్ చేశారు.
‘‘ఆ బ్యాగ్‌లో రక్తపు మరకలతో ఒక మృతదేహం ఉంది. డెడ్‌బాడీ తలపై తీవ్రగాయాలున్నాయి. ఆ వెంటనే ఇద్దరినీ పట్టుకునేందుకు ప్రయత్నించాం, కానీ ఇద్దరిలో ఒకరు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు, ఒకరిని అదుపులోకి తీసుకున్నాం’’ అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంతోష్ కుమార్ యాదవ్, పోలీస్ కానిస్టేబుల్ మాధవ్ విచారణ సందర్భంగా చెప్పారు.
పోలీసులు ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పైధునీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, అరెస్టయిన నిందితుడు బధిరుడు కావడంతో పోలీసులు అతని నుంచి ఎలాంటి వివరాలు, సమాచారం రాబట్టలేకపోయారు. విచారణలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి కోసం వెతుకులాట

పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. కానీ, నిందితుడి నుంచి ఎలాంటి సమాచారం తెలియకపోతుండడంతో దర్యాప్తు నిలిచిపోయింది.
కొద్ది గంటల తర్వాత, ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడం కోసం మూగ, చెవిటి వారితో సైన్ లాంగ్వేజ్(సంజ్ఞల భాష)లో మాట్లాడగలిగే వ్యక్తి కోసం పైధునీ పోలీసులు వెతకడం మొదలుపెట్టారు.
అప్పటికే అర్ధరాత్రి దాటింది. ఈ సమయంలో ఎవరు దొరుకుతారు? అనే ప్రశ్న తలెత్తింది.
వారికి అందిన సమాచారం మేరకు, సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి కోసం పోలీసు బృందం బయలుదేరింది.
ఆర్ఏకే కిద్వాయ్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సాధారణ తనిఖీలు చేస్తున్న చోట పోలీసు బృందం ఆగింది. అక్కడ కానిస్టేబుల్ రాజేశ్ సాత్పుతే విధుల్లో ఉన్నారు.
అక్కడ ఆగినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారని పోలీసు బృందాన్ని ఆర్ఏకే కిద్వాయ్ మార్గ్ స్టేషన్ పోలీసులు అడిగారు. అందుకు వారు, సాధన విద్యాలయానికి చెందిన బధిర(మూగ, చెవిటి) వ్యక్తి కోసం వెళ్తున్నట్లు చెప్పారు.
అయితే, ఈ సమయంలో అక్కడ ఎవరూ అందుబాటులో ఉండరని తనిఖీ విధుల్లో ఉన్న రాజేశ్ సాత్పుతే పోలీసు బృందానికి చెప్పారు. తన కొడుకు కూడా అదే స్కూల్‌లో చదువుకున్నాడని రాజేశ్ వారితో చెప్పారు. అతను ఏమైనా సాయం చేయగలడా? అని పైధునీ పోలీసుల బృందాన్ని రాజేశ్ సాత్పుతే అడిగారు.
దాంతో తమకు సాయం చేయాలని పైధునీ పోలీసులు రాజేశ్ సాత్పుతేను కోరారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు, తెల్లవారుజామున 2 గంటలకు సాత్పుతే ఇంటికి వెళ్లి, ఆయన కుమారుడు గౌరవ్ సాత్పుతేను వెంటబెట్టుకుని పైధునీ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

గౌరవ్ కమ్యూనికేషన్‌తో కీలక సమాచారం
నిందితుడిని ఏం అడగాలో చెప్తూ పోలీసులు గౌరవ్‌కు ఒక ప్రశ్నపత్రాన్ని ఇచ్చారు. గౌరవ్, నిందితుడు జై చావ్దాతో సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఒక గంట సంభాషణ తర్వాత, దర్యాప్తుకి అవసరమైన కీలక సమాచారం లభ్యమైంది. హత్య ఎలా జరిగింది, ఎందుకు చేశారు, పారిపోయిన సహ నిందితుడెవరు? వంటి కీలక సమాచారం తెలిసింది.
కానిస్టేబుల్ రాజేశ్ సాత్పుతే బీబీసీతో మాట్లాడుతూ.. ''గౌరవ్ సాధన విద్యాలయంలో 10వ తరగతి వరకూ చదువుకున్నాడు. ఆ సమయంలో, పోలీసులకు అతని సాయం అవసరం కాబట్టి, వెంటనే చేశాడు. గౌరవ్ ప్రయత్నంతో పోలీసులకు కీలక సమాచారం లభ్యమైంది. మా అబ్బాయి చెవిటి, మూగ అయినప్పటికీ ఏదైనా పనిచెప్తే సరిగ్గా చేస్తాడు, తెలివైనవాడు'' అన్నారు.
దర్యాప్తులో ఏం తేలింది?
పరారైన రెండో నిందితుడి పేరు శివజిత్ సింగ్ అని దర్యాప్తులో తేలింది. అతను ఉల్హాస్‌నగర్‌లో నివాసముంటున్నట్లు వెల్లడైంది. స్థానిక పోలీసులు, ఇన్ఫార్మర్ల ద్వారా రెండో నిందితుడు శివజిత్ సింగ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్యాగ్‌లో దొరికిన మృతదేహం 30 ఏళ్ల అర్షద్ అలీ సాదిక్ అలీ షేక్‌దిగా గుర్తించారు. శాంతాక్రజ్‌లోని కలినా ప్రాంతంలో అర్షద్ నివసించేవారు. అర్షద్ కూడా బధిరుడు.
అర్షద్ అలీని ఇద్దరూ కలిసి హత్య చేసినట్లు శివజిత్, జై చావ్దా విచారణలో అంగీకరించారు.
హత్య తరువాత మృతదేహాన్ని కొంకణ్‌కు తీసుకెళ్లి పారేయాలని నిర్ణయించుకున్నామని, అందుకోసం అర్షద్ మృతదేహాన్ని బ్యాగ్‌లో ప్యాక్ చేసి, తుతారి ఎక్స్‌ప్రెస్‌లో కొంకణ్ వెళ్లేందుకు బయలుదేరామని.. అయితే, పోలీసులకు అనుమానం రావడంతో దొరికిపోయామని నిందితులు పోలీసుల దర్యాప్తులో చెప్పారు.
కాకపోతే, ఈ మర్డర్ మిస్టరీ అంతటితో అయిపోలేదు. నిందితులతో మాట్లాడిన తర్వాత, కానిస్టేబుల్ రాజేశ్ సాత్పుతే కుమారుడు గౌరవ్ సాత్పుతే పోలీసులకు మరింత సమాచారం అందించారు.
ఈ కేసులో నిందితులిద్దరూ ఒక వాట్సాప్ గ్రూపులో సభ్యులు. ఈ గ్రూపులో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన వికలాంగులు సభ్యులుగా ఉన్నారు.
అర్షద్‌ను హత్య చేసేందుకు, నిందితులు ఈ గ్రూపులోని మరో ముగ్గురి సాయం తీసుకున్నారు.
హత్య సమయంలో ముగ్గురు సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. వారిలో బెల్జియంకు చెందిన ఒక వికలాంగుడు కూడా ఉన్నట్లు నిందితులు చెప్పారు.

హత్యకు కారణమేంటి?
అర్షద్ శాంతాక్రజ్‌లోని గులాల్‌వాడీ ప్రాంతంలో నివసించేవారు. అర్షద్, రుక్సానా ప్రేమించుకున్నారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. రుక్సానా కూడా మాట్లాడలేరు.
కుటుంబ పోషణ కోసం అర్షద్ చిన్నచిన్న పనులు చేస్తుండేవారు. ఒకరోజు అతనికి, పైధునీలో ఖరీదైన ఇంట్లో నివాసముండే జై చావ్దా, శివజిత్‌లతో పరిచయమైంది. వారు స్నేహితులయ్యారు.
అలా, అర్షద్, జై మధ్య స్నేహం బలపడింది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్తుండేవారు. ఈక్రమంలో అర్షద్ భార్య రుక్సానాకు, జై చావ్దాతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
తమ ఇద్దరి మధ్య అర్షద్ అడ్డుగా ఉన్నాడని భావించి, అతని అడ్డు తొలగించుకోవాలని జై పథకం రచించారు.
హత్యకు చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నట్లు పోలీసు విచారణలో నిందితుడు అంగీకరించారు. అందుకు శివజిత్ సాయం తీసుకున్నట్లు చెప్పారు.
అర్షద్‌ను పార్టీ అని ఇంటికి పిలిచి ఫుల్లుగా మద్యం తాగించి, మద్యంమత్తులో ఉన్నప్పుడు సుత్తితో కొట్టి చంపేసినట్లు నిందితులు పోలీసులు ఎదుట అంగీకరించారు.
కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, అర్షద్ భార్య రుక్సానాకు వ్యతిరేకంగా ఆధారాలు లభించిన అనంతరం ఆమెను కూడా అరెస్టు చేశారు.
ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల అంగీకార స్టేట్‌మెంట్‌లు, బలమైన ఆధారాలు సేకరించారు పోలీసులు. నిందితులు జై చావ్దా, శివజిత్ సింగ్, రుక్సానాలపై చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం, ఈ ముగ్గురూ జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఈ మర్డర్ కేసు ఛేదించడంలో సాయమందించిన కిద్వాయ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ సాత్పుతే, ఆయన కుమారుడు గౌరవ్ సాత్పుతేను ఉన్నతాధికారులు సహా ఎంతోమంది అభినందించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














