జ్వాలాపురం: ఆదిమానవుడి చరిత్ర, టన్ను వెయ్యి రూపాయలకు అమ్ముకుంటున్నారు

ఆదిమ మానవుడు, జ్వాలాపురం, కర్నూలు జిల్లా
ఫొటో క్యాప్షన్, 74 వేల ఏళ్ల క్రితమే భారతదేశంలో మనిషి సంచరించాడు అని కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది జ్వాలాపురం
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్ర ప్రదేశ్‌లో ఆదిమానవుడు నడయాడిన అద్భుత ప్రదేశం. భారత్‌లో మనిషి ఎప్పుడు అడుగుపెట్టాడనే చరిత్రకు కీలక సాక్ష్యం, ఖండాలు దాటిన మనిషి మజిలీకి సజీవ సాక్ష్యం నంద్యాల జిల్లాలో బూడిద మూటల్లో భద్రంగా ఉంది.

అయితే ఆ చారిత్రక ఆనవాళ్లపై అవగాహన లేని జనం ఆ బూడిదను టన్ను వెయ్యి రూపాయల చొప్పున అమ్ముతున్నారు.

మానవ చరిత్ర సాక్ష్యం మూటల్లో ఉండడం ఏంటి, టన్నుల లెక్కన అమ్మడం ఏంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో జరుగుతోంది ఇది.

ఒకప్పటి కర్నూలు, ఇప్పటి నంద్యాల జిల్లాలో బేతంచర్ల యాగంటి దగ్గర జ్వాలాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో ఓ అరుదైన బూడిద దొరుకుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆదిమ మానవుడు, జ్వాలాపురం, కర్నూలు జిల్లా
ఫొటో క్యాప్షన్, టన్ను బూడిదను వెయ్యి రూపాయలకు అమ్ముతున్నట్టు కొందరు గ్రామస్తులు బీబీసీకి చెప్పారు.

ఆ బూడిద ఇక్కడకు ఎలా వచ్చింది?

భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం.. "దాదాపు 74 వేల ఏళ్ల క్రితం ప్రస్తుత ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్ని పర్వతం పేలింది. ఆ పేలుడు ప్రభావం దాదాపు దశాబ్ద కాలం పాటు ఈ భూమిపై ఉంది. ఆ పేలుడు వెదజల్లిన లావా భూమండలమంతటా వ్యాప్తి చెందింది. ఆ బూడిద ఒక పొరలా కమ్మేసి సూర్యకాంతి భూమి మీద పడకుండా చేసింది. దాంతో ఎండ లేక, ఒక రకమైన మంచుయుగం లాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ దెబ్బకు మానవ జాతి దాదాపు అంతరించే ప్రమాదంలో పడింది. కేవలం అతికొద్ది శాతం మంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారు."

ఆ లావా బూడిద భారత్‌లో కూడా కొన్ని చోట్ల పడింది. జ్వాలాపురంలో కూడా పెద్ద ఎత్తున ఆ లావా బూడిద దొరికింది. ఇంత పెద్ద మొత్తంలో బూడిద దొరకడం చాలా అరుదు.

జ్వాలాపురంలో ఆ లావా బూడిదను గమనించిన రవి కొరిశెట్టార్ అనే శాస్త్రవేత్త అక్కడ తవ్వకాలు జరిపారు.

ఆ బూడిద పొర పైనా, కిందా కూడా మనిషి వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే దాదాపు 60 వేల ఏళ్ల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి భారత్ వచ్చాడని శాస్త్రవేత్తలు అంచనా వేసేవారు. కానీ ఆ అంచనాను సవాల్ చేసింది జ్వాలాపురం.

శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు 60 వేల ఏళ్లు కాదు... 74 వేల ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడు అని కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది ఈ జ్వాలాపురం.

ఒక రకంగా భారతదేశ రాతి యుగ చరిత్ర దిశనే మార్చింది ఈ ఆర్కియలాజికల్ సైట్.

2009లో 'బీబీసీ 2' ఛానెల్‌లో ప్రసారమైన 'ది ఇన్‌క్రెడిబుల్ హ్యూమన్ జర్నీ' అనే డాక్యుమెంటరీ సిరీస్‌లో జ్వాలాపురం గురించి చెప్పారు.

రవి కొరిశెట్టార్‌తో పాటు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మైకేల్ పెట్రాగ్లియా సహా మరికొందరు ఇతర శాస్త్రవేత్తలు ఈ స్థలంపై పరిశోధన చేశారు.

ఆదిమ మానవుడు, జ్వాలాపురం, కర్నూలు జిల్లా
ఫొటో క్యాప్షన్, జ్వాలాపురం తవ్వకాల్లో బయటపడిన వస్తువులన్నీ బళ్లారిలోని రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ సంగనకల్లు మ్యూజియంలో భద్రపరిచారు.

జ్వాలాపురం ఎందుకంత ప్రత్యేకం?

జ్వాలాపురంలో తవ్వకాల వల్ల భారత చరిత్రకు రెండు ప్రధాన లాభాలు కలిగాయని రవి కొరిశెట్టార్ అన్నారు.

"ఒకటి... పాలీ లిథిక్ ఆవాసాలకు సంబంధించి భారత్‌లో సరైన క్రమం లేదు. కానీ ఈ బూడిద ఆ లోటు తీర్చింది. 74 వేల సంవత్సరాల ముందు, తరువాత అనే మార్కును అందించింది. రెండు... భారత్‌కు 60 వేల ఏళ్లు కాదు... 74 వేల ఏళ్ల క్రితమే మనుషులు వచ్చారు, ఇక్కడ ఉన్నారు అని తేల్చింది.

అలాగే యంగెస్ట్ టోబా పేలుడు మొత్తం మానవజాతిని తుడిచేయలేదు. ఆ పేలుడు ముందు, తరువాత కూడా మిడిల్ పాలీ లిథిక్ యుగం కొనసాగిందని వాదించగలిగాం.

ఆఫ్రికాలో దొరికిన పనిముట్లకు, జ్వాలాపురంలో దొరికిన వాటికి కూడా పోలికలున్నాయి. కాబట్టి మనుషులు 90 వేల ఏళ్ల క్రితం కూడా ఇక్కడకు వచ్చి ఉండొచ్చు.

అలాగే మైక్రో లిథిక్ పీరియడ్ పనిముట్ల వల్లే మనిషి ఆఫ్రికా నుంచి బయటకు వచ్చాడన్న సిద్ధాంతం కూడా తప్పు కావచ్చు" అని రవి కొరిశెట్టార్ బీబీసీతో చెప్పారు.

మొత్తంగా ఆధునిక మానవుడి గమనాన్ని, భారత్‌లో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది ఈ జ్వాలాపురం.

అయితే ఇదంతా గతం కాబోతోంది. ఎందుకంటే ఆ బూడిద వెనుక ఉన్న వేలాది ఏళ్ల మనిషి చరిత్ర.. టన్ను వెయ్యి రూపాయల చొప్పున అమ్ముడుపోతోంది.

దాదాపు 90 శాతం పైగా బూడిదను ఇప్పటికే తవ్వేసి అమ్మేశారు.

ఇంకా అమ్ముతున్నారు.

ఇప్పుడు అక్కడ ఆది మానవుడి ఆనవాళ్లు దాదాపుగా కనుమరుగైపోయాయి.

ఆదిమ మానవుడు, జ్వాలాపురం, కర్నూలు జిల్లా
ఫొటో క్యాప్షన్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారిని బీబీసీ సంప్రదించినప్పుడు, వీలైనంత త్వరగా ఈ సైట్‌ను రక్షించే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

టన్ను బూడిద వెయ్యి రూపాయలు

సున్నితంగా మనుషులతో తవ్వించాల్సిన పురాతత్వ ప్రదేశాన్ని బుల్డోజర్లతో తవ్వి, అందులో బూడిదను తీసి, ఆ బూడిదలోని నాటి చెట్ల అవశేషాలు, మనుషులు వాడిన ఆయుధాలను జల్లెడతో వేరు చేసి, మెత్తని బూడిదను మూటల్లో ఎత్తి అమ్మేస్తున్నారు. డిటర్జెంట్ పౌడర్, గిన్నెలు తోమే పౌడర్లలో ఈ బూడిద వాడతారని స్థానికులు చెబుతున్నారు.

అత్యంత చవకగా టన్ను బూడిదను వెయ్యి రూపాయలకు అమ్ముతున్నట్టు కొందరు గ్రామస్తులు బీబీసీకి చెప్పారు.

అయితే ఏ సంస్థ వారు దీన్ని కొంటున్నారు, ఎందుకు వినియోగస్తున్నారనేది బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఈ తవ్వకాల గురించి అక్కడ పనిచేస్తున్న కూలీలను బీబీసీ ప్రశ్నించినప్పుడు తమకేమీ తెలియదని, తాము కేవలం పనికి మాత్రమే వచ్చామని చెప్పారు. కానీ ఈ బూడిద అమ్మకాలు ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నాయని వారు బీబీసీతో చెప్పారు.

ఆ స్థల యజమానితో కూడా బీబీసీ మాట్లాడింది.

''ఇక్కడ అందరూ తమ పొలాల్లో బూడిదను తవ్వి అమ్ముతున్నారు. అందుకే నేనూ అమ్మాను. దీని గురించి నాకేమీ తెలియదు'' అని ఆయన చెప్పారు.

అక్కడ ఇప్పటికే ఆయా భూయజమానులు తమ భూముల్లో తవ్వకాలు పూర్తి చేసి బూడిదను అమ్మేశారు

ఆదిమ మానవుడు, జ్వాలాపురం, కర్నూలు జిల్లా
ఫొటో క్యాప్షన్, 2004-05 కాలం నుంచి రెండేళ్ల పాటు జ్వాలాపురంలో రవి కొరిశెట్టార్ తవ్వకాలు జరిపారు

జ్వాలాపురం గురించి ఎలా తెలిసింది?

కర్నూలు జిల్లా బిల్లసర్గం గుహలు జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించి చాలా కీలకమైనవి.

భారతీయ పురా చరిత్ర పితామహునిగా చెప్పే రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ మొదటిసారి ఈ గుహల గురించి రాశారు.

తిరిగి మళ్లీ ఆ గుహల్లో మనిషి జాడ కనుగొనడం కోసం ఆర్కియాలజిస్ట్ రవి కొరిశెట్టార్ బృందం వెతుకుతున్న క్రమంలో స్థానికుల ద్వారా జ్వాలాపురం గురించి ఆయనకు తెలిసింది.

2004-05 కాలం నుంచి రెండేళ్ల పాటు జ్వాలాపురంలో తవ్వకాలు జరిపారు రవి కొరిశెట్టార్.

''సాధారణంగా పాత సైట్లలో మళ్లీ మళ్లీ పరిశోధనలకు వెళ్లినప్పుడు, కొత్త విషయాలు బయటపడుతుంటాయి. గతంలో దొరకనివి కూడా దొరుకుతాయి. ఎలాగూ కర్నూలు వెళ్లాను కదా అని కొత్త వాటి కోసం వెతుకుతున్నప్పుడు సర్వే ఆఫ్ ఇండియా టోపోగ్రఫీ షీట్లలో జ్వాలాపురం అనే పేరు నాకు ఆసక్తి కలిగించడంతో ఆ ఊరి గురించి ఆరా తీశాను.

మేం స్థానికులతో కూడా మాట్లాడుతూ ఉంటే వారెన్నో కొత్త విషయాలు చెప్పారు.

అలా యాగంటి ప్రాంతానికి చెందిన చెంగళ రెడ్డి అనే రైతును జ్వాలాపురం, పాతపాడు గురించి అడిగినప్పుడు, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా తెల్లటి, మెత్తటి బూడిద వంటి ఉన్న ఆనవాళ్లు తెలుసా అని అడిగినప్పుడు ఆయన మమ్మల్ని స్వయంగా జ్వాలాపురం తీసుకెళ్లారు.

నేను మొదటిసారి జ్వాలాపురం వెళ్తున్నప్పుడు దూరం నుంచి గాల్లో ఎగురుతున్న దుమ్ము చూసి ఇక్కడేదో ఉందనిపించింది.

దగ్గరకు వెళ్లి అక్కడ తవ్వుతున్న వాటిని చూసినప్పుడు అది అగ్నిపర్వతపు బూడిద అని అర్థమైంది.

అయితే అప్పటికే అక్కడ గ్రామస్తులు తవ్వకాలు జరుపుతున్నారు.

"వారికి అది అగ్నిపర్వత బూడిద అని తెలియదు. కానీ వారు దాన్ని డిటర్జెంట్ పరిశ్రమలకు ఎగుమతి చేస్తున్నారు" అంటూ తాను మొదటిసారి జ్వాలాపురం వెళ్లిన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

దీంతో బిల్లసర్గం కోసం వెళ్లిన బృందంలో కొందరిని ఇటు మళ్లించి జ్వాలాపురంలో తవ్వకాలు జరిపారు రవి.

అవి ప్రైవేటు పట్టా భూములు కావడంతో, అక్కడి రైతులకు కొంత డబ్బు ఇచ్చి తవ్వకాలు చేశారు. దాదాపు ఏడాది పాటు అదేపనిగా శ్రద్ధగా అక్కడ పనిచేస్తే, ఎన్నో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.

''జ్వాలాపురం తవ్వకంలో ఒక మిడిల్ పాలీ లిథిక్ రాయి దొరికింది. దానికి దగ్గరలో ఎర్లీ పాలీ లిథిక్ రాయి దొరికింది. ఇక జుర్రేరు నది ఒడ్డున మైక్రో లిథిక్ వస్తువులు దొరికాయి. యాగంటి పెయింటెడ్ రాక్ షెల్టర్ల దగ్గరలో నేలపై మైక్రో లిథిక్ పరికరాలు కనిపించాయి. మొత్తం మీద ఆ చుట్టుపక్కల దాదాపు 2 వేల ఎకరాల పరిధిలో పాలీ లిథిక్ నుంచి మెగా లిథిక్ వరకూ చాలా మానవ ఆవాస సాక్ష్యాలు దొరికాయి. తూర్పు ఆఫ్రికాతో సమానమైన సాక్ష్యాలు దొరికాయి" అంటూ జ్వాలాపురం ప్రాధాన్యాన్ని వివరించారాయన.

ఆదిమ మానవుడు, జ్వాలాపురం, కర్నూలు జిల్లా
ఫొటో క్యాప్షన్, ఆర్కియాలజిస్ట్ రవి కొరిశెట్టార్

స్థానికులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు

ప్రస్తుతం జ్వాలాపురం తవ్వకాల్లో బయటపడిన వస్తువులన్నీ కర్ణాటకలో భద్రపరిచారు. రాతి పనిముట్లు, ఇతర ముఖ్యమైన అవశేషాలను కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ సంగనకల్లు మ్యూజియంలో భద్రపరిచారు రవి.

''నేను అక్కడకు వెళ్లే సరికే అక్కడ బూడిద అమ్మేస్తున్నారు. బహుశా ఎవరో దాని ప్రాధాన్యాన్ని అప్పటికే గుర్తించి, రక్షించడం కాకుండా, వ్యాపార పరంగా అమ్మడం ప్రారంభించారు.

ఆ ప్రాంత ప్రాధాన్యాన్ని కాపాడాలని స్థానికులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించాం. మేం అక్కడకు వెళ్లే సరికే 50 శాతం దెబ్బతింది. ఇప్పుడు గత పదేళ్లుగా వెళ్తూనే ఉన్నాను. అక్కడ ఇంకా ఏదైనా దొరుకుతుందేమో అన్న ఆశతోనే వెళ్తున్నాను. కానీ ఒకసారి తవ్వినదాన్ని మళ్లీ తిరిగి కప్పెట్టేస్తే ఇంకేం దొరకదు.

పబ్లిక్ అవుట్ రీచ్ ఆర్కియాలజీని ప్రారంభించాం. ఇంటింటికి వెళ్లి పాంప్లెట్ పంచి, గ్రామస్తులకు వివరించాం. పాఠశాలల్లో ప్రయోగాలు చేశాం. పిల్లలను ఎడ్యుకేట్ చేశాం. అయినా ఇప్పుడు కాపాడినా ఉపయోగం లేదు. చాలా వరకూ దెబ్బతింది" అంటూ నిట్టూర్చారు రవి కొరిశెట్టార్.

తాను ముఖ్యమైన వాటిని దాచి, తెచ్చి ఇక్కడ పెట్టానని, ఎవరైనా వచ్చి ఇక్కడ పరిశోధన చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

జ్వాలాపురంలో రాతి పనిముట్లు దొరికాయి. కానీ వాటిని ఎవరు చేశారన్నది తెలియాలి. ఎందుకంటే పనిముట్లు పాక్షిక సాక్ష్యం అవుతుంది.

మనుషుల ఎముకలు దొరికితే అవి పక్కా ఆధారాలు అవుతాయి.

ఆ పనిముట్లను ఎవరు తయారు చేశారో తెలియాలి. దానికోసం ఇంకా పరిశోధనలు జరగాలి. కానీ అక్కడ బూడిద ఎగుమతి వ్యాపారం ఈ స్థలాన్ని పరిశోధనలకు పనికిరాకుండా మారుస్తోంది.

స్థానిక యంత్రాంగం ఎవరూ దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.

దీనిపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారిని బీబీసీ సంప్రదించినప్పుడు, వీలైనంత త్వరగా ఈ సైట్‌ను రక్షించే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆదిమ మానవుడు, జ్వాలాపురం, కర్నూలు జిల్లా
ఫొటో క్యాప్షన్, బూడిదను స్థానికులు ఇష్టం వచ్చినట్లుగా తవ్వి గోతాములకు నింపి అమ్మేస్తున్నారు.

జ్వాలాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది?

సంస్కృతంలో జ్వాల అంటే అగ్ని. దీంతో అగ్ని పర్వత బూడిద ఉన్న ఈ గ్రామం కాబట్టి జ్వాలాపురం పేరు వచ్చిందన్న కథనాన్ని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు.

అయితే జోలా అంటే జొన్నలు అనే అర్థంలో ఊరి పేరు ఉండేదని, క్రమంగా అదే జ్వాలగా మారిందని కొందరి కథనం.

ఈ గ్రామం దగ్గరలోని కొండల్లోని రాతి గుహల్లో ఆదిమానవుడు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. వాటినే పెయింటెడ్ రాక్ షెల్టర్స్ అంటారు.

ఈ గ్రామం దగ్గరే కాక, యాగంటి పరిసరాల్లో గుహలు, బిల్లసర్గం గుహల్లో జంతువుల ఆనవాళ్లు.. ఇవన్నీ కలిపి ప్రపంచ మానవాళి చరిత్రలో కీలకమైన ఘట్టాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

''యాగంటి, బేతంచర్ల, బిల్లసర్గం చుట్టుపక్కల వందల సంఖ్యలో పెయింటెడ్ రాక్ షెల్టర్లు కనిపించేవి. యాగంటి చుట్టుపక్కల అలాంటి గుహలు ఎన్నో ఉన్నాయి" అన్నారు రవి.

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిసరాలు మానవ జాతి పురా చరిత్రకు, భారతదేశ రాతి యుగ చరిత్రకు గొప్ప ఆధారాలు కలిగి ఉన్నాయి.

కానీ ఆ ప్రదేశాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)