టైటానిక్ సముద్రంలో మునిగిపోతున్నా లైట్లు వెలిగి ఉండడానికి అదే కారణమా, కొత్త స్కాన్ చెబుతున్న సంచలన వివరాలివే...

టైటానిక్

ఫొటో సోర్స్, Atlantic Productions/Magellan

ఫొటో క్యాప్షన్, టైటానిక్ నౌక మునిగిపోవడానికి కారణాలను డిజిటల్ స్కాన్ వివరించింది.

టైటానిక్ ఓడపై జరిపిన పూర్తిస్థాయి డిజిటల్ స్కాన్‌ను విశ్లేషించినప్పుడు ఈ భారీ నౌక మునిగిపోయే చివరి గంటల గురించి కొత్త విషయాలు వెలుగుచూశాయి.

టైటానిక్ ఓడ 1912లో మంచుకొండను ఢీకొట్టి రెండుగా ఎలా చీలిపోయిందో ఈ కచ్చితమైన 3డీ ప్రతిరూపం చూపుతోంది. ఆ ప్రమాదంలో 1500మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ స్కానింగ్ ఓడలోని బాయిలర్ గది గురించి కొత్త విషయాలను చెబుతోంది. లైట్లు వెలుగుతూ ఉండడం కోసం ఇంజినీర్లు చివరి వరకు ప్రయత్నించారన్న ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని ఇది ధ్రువీకరిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టైటానిక్, ఓడ, సముద్ర యానం

ఫొటో సోర్స్, Atlantic Productions/Magellan

ఫొటో క్యాప్షన్, ఓడలో ప్రొపల్షన్, స్టీరింగ్ మెకానిజం ఉండే స్టెర్న్ భాగం తీవ్రంగా దెబ్బతింది.

అలాగే, టైటానిక్‌కు ఏ4 పేపర్ సైజులో పడిన రంధ్రాలు ఓడ మునకకు దారితీశాయని కంప్యూటర్ ఊహాచిత్రాలు సూచిస్తున్నాయి.

''ఆ విపత్తుకు ప్రత్యక్ష సాక్షిగా మిగిలివున్నది టైటానిక్ మాత్రమే, అది చెప్పే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి'' అని టైటానిక్ అనలిస్ట్ పార్క్స్ స్టీఫెన్‌సన్ అన్నారు.

టైటానిక్, సముద్రం, సముద్ర ప్రయాణం

ఫొటో సోర్స్, Atlantic Productions/Magellan

ఫొటో క్యాప్షన్, పోర్ట్ హోల్‌లోని ఈ గ్లాసు కిటికీలు మంచుకొండను దాటుతున్నప్పుడు పగిలిపోయి ఉండవచ్చు.

నేషనల్ జాగ్రఫిక్, అట్లాంటిక్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'టైటానిక్: ది డిజిటల్ రీసరెక్షన్' డాక్యుమెంటరీ కోసం ఈ స్కాన్‌ను అధ్యయనం చేశారు.

అట్లాంటిక్ మహాసముద్రంలో, దాదాపు 3,800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ శిథిలాలను అండర్‌వాటర్ రోబోల సాయంతో పరిశీలించారు.

ఓడను అన్ని కోణాల్లో నుంచి తీసిన దాదాపు 7,00,000 లకు పైగా ఫోటోలను ఉపయోగించి టైటానిక్‌ ఓడ డిజిటల్ రూపాన్ని సృష్టించారు. ఈ విషయంపై బీబీసీ న్యూస్ 2023లో కథనం ప్రచురించింది.

శిథిలావస్థకు చేరిన ఈ నౌక భారీ పరిమాణంలో ఉండడంతో పాటు అక్కడంతా చీకటిగా ఉంటుంది, అందువల్ల సబ్‌మెర్సిబుల్స్‌ సాయంతో దీనిని శోధించడం వల్ల కొన్ని అందమైన స్నాప్‌షాట్‌లు మాత్రమే సాధ్యమవుతాయి. కానీ, ఈ స్కాన్‌తో టైటానిక్‌‌ను పూర్తి స్థాయిలో వీక్షించేందుకు సాధ్యమవుతుంది.

టైటానిక్, సినిమా, సముద్రం

ఫొటో సోర్స్, Atlantic Productions/Magellan

ఫొటో క్యాప్షన్, ఓడ వెనుక ఉండే బాయిలర్ గది. ఇక్కడే ఓడ రెండుగా చీలిపోయింది.

ఈ భారీ నౌక సముద్రం అడుగున అలాగే ఉంది, దాదాపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లుగానే కనిపిస్తుంది.

అయితే, 600 మీటర్ల దూరం నుంచి చూసినప్పుడు, ఓడ వెనుకభాగం నలిగిపోయిన లోహపు కుప్పలా ఉంది. ఓడ సగానికి విరిగిపోయిన తర్వాత, సముద్రపు అడుగుభాగానికి దూసుకెళ్లడంతో నౌకకు నష్టం జరిగింది.

ఈ కొత్త మ్యాపింగ్ టెక్నాలజీ ఓడను అధ్యయనం చేయడానికి కొత్త మార్గాన్ని చూపుతోంది.

''అది ఒక నేరస్థలం లాంటిది: అక్కడున్న ఆధారాలు ఏమిటి? అవి ఎక్కడున్నాయనే కోణంలో దానిని చూడాలి'' అని పార్క్స్ స్టీఫెన్‌సన్ అన్నారు.

''అలాగే, అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడంలో శిథిలాలున్న ప్రాంతం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం చాలా కీలకం'' అన్నారు.

ఈ స్కాన్ చాలా సూక్ష్మమైన వివరాలను కూడా తెలియజేస్తోంది, వాటిలో మంచుపర్వతం ఢీకొనడం వల్ల బద్దలైన పోర్ట్‌హోల్ (ఓడకు ఉండే చిన్న కిటికీ) కూడా ఉంది.

మంచుకొండను ఢీకొట్టిన సమయంలో కొంతమంది క్యాబిన్ల లోపలికి మంచు వచ్చిందంటూ, ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్షసాక్షులు చెప్పిన విషయాలతో ఇది సరిపోలుతోంది.

టైటానిక్‌లోని భారీ బాయిలర్ గదుల్లో ఒక దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. స్కాన్‌లో దీనిని చూడడం సులువు. ఎందుకంటే.. ఓడ వెనుక భాగంలో, ఓడ విరిగిపోయిన ప్రదేశంలో ఇది ఉంది.

ఓడ అలల కిందకు ఒరిగిపోతున్నప్పుడు కూడా లైట్లు వెలుగుతూనే ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు.

కొన్ని బాయిలర్లు కాంకేవ్ (పుటాకారం) ఆకారంలో ఉన్నట్లు టైటానిక్ డిజిటల్ ప్రతిరూపం చూపుతోంది, అంటే.. అవి నీటిలో మునుగుతున్నా పనిచేస్తూనే ఉన్నాయని సూచిస్తోంది.

ఓడ వెనుక భాగంలో ఒక వాల్వ్ తెరిచి ఉన్నట్లు కూడా గుర్తించారు, నీటిలో మునిగిపోతున్నప్పటికీ దానిని ఆపరేట్ చేస్తూనే ఉన్నట్లు ఇది సూచిస్తోంది.

లైట్లు వెలుగుతూ ఉండడం కోసం జోసెఫ్ బెల్ నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం నిరంతరాయంగా బొగ్గును వేస్తూ ఉండేందుకు వెనక ఉండి ఉంటే, అది అభినందించదగ్గ పరిణామం.

ఈ ప్రమాదంలో ఎంతోమంది చనిపోయారు, కానీ వారి సాహసోపేత చర్యలు చాలామంది ప్రాణాలను కాపాడాయని పార్క్స్ స్టీఫెన్‌సన్ అన్నారు.

''లైఫ్ బోట్లను చీకట్లో కాకుండా, కొంత వెలుతురులో సురక్షితంగా దించేలా సిబ్బందికి సమయం కల్పించేందుకు చివరి వరకూ లైట్లు వెలిగేలా, విద్యుత్ సరఫరా ఉండేలా వారు చూశారు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

''వారు వీలైనంత వరకూ గందరగోళం తలెత్తకుండా అడ్డుకున్నారు, ఓడ వెనుక భాగంలో ఈ తెరిచివున్న ఆవిరి వాల్వ్ దీనిని సూచిస్తోంది'' అన్నారు.

టైటానిక్, సముద్ర ప్రయాణం

ఫొటో సోర్స్, Atlantic Productions/Magellan

ఫొటో క్యాప్షన్, ఈ వృత్తాకార వాల్వ్ ఓపెన్ అయి కనిపిస్తోంది.

ఈ ఊహాచిత్రం ఓడ మునిగిపోవడం గురించి మరిన్ని కోణాలను కూడా ఆవిష్కరించింది.

ఓడ మంచుకొండను ఢీకొన్నప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు,దాని వేగం, దిశ, ఓడ పరిస్థితి వంటివి కనుగొనేందుకు టైటానిక్ బ్లూప్రింట్‌ల ఆధారంగా సృష్టించిన ఈ వివరణాత్మక నమూనా ఉపయోగపడుతుంది.

''టైటానిక్ మునిగిపోయిన సంఘటనను తిరిగి సృష్టించడానికి అడ్వాన్స్‌డ్ న్యూమరికల్ అల్గారిథమ్స్, కంప్యూటేషనల్ మోడలింగ్, సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యాలను ఉపయోగించాం'' అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కి చెందిన ప్రొఫెసర్ జియోమ్ కీ పెయిక్ అన్నారు.

టైటానిక్, సముద్ర ప్రయాణం

ఫొటో సోర్స్, Jeom Kee-Paik/ University College London

ఫొటో క్యాప్షన్, టైటానిక్ నౌక మంచుకొండను ఢీకొన్నప్పుడు అది నౌకపై సన్నని చీలికలకు కారణమైంది.

ఈ నమూనా ప్రకారం, ఓడ అకస్మాత్తుగా మంచుకొండను ఢీకొట్టడంతో ఓడకు వరుసగా రంధ్రాలు పడ్డాయి.

టైటానిక్ మునిగిపోదని, అందులోని నాలుగు కంపార్ట్‌మెంట్లు నీటితో నిండిపోయినా అది తేలుతూ ఉండేలా రూపొందించినట్లు భావించారు.

కానీ, మంచుకొండను ఢీకొట్టిన తర్వాత ఆరు కంపార్ట్‌మెంట్లలోకి నీరు చేరినట్లు ఈ నమూనా సూచిస్తోంది.

''టైటానిక్ మునిగిపోవడానికి, మునగకపోవడానికి మధ్య తేడా కాగితం పరిమాణంలో పడిన ఈ రంధ్రాల మధ్య దూరంపై ఆధారపడి ఉంది'' అని న్యూక్యాజిల్ యూనివర్సిటీ నేవల్ ఆర్కిటెక్చర్‌లో అసోసియేట్ లెక్చరర్ సైమన్ బెన్సన్ అన్నారు.

''కానీ, ఇక్కడ సమస్య ఏంటంటే ఆ చిన్నచిన్న రంధ్రాలు ఓడ పొడవునా ఉన్నాయి. అందువల్ల, నీరు నెమ్మదిగా అయినా ఆ రంధ్రాలన్నింటిలో నుంచి లోపలికి వస్తుంది, అలా నెమ్మదిగా కంపార్ట్‌మెంట్లన్నీ పైవరకూ నిండిపోయి, టైటానిక్ మునిగిపోయి ఉంటుంది.''

దురదృష్టవశాత్తూ, ఓడ అడుగుభాగం సముద్రంలోనూ అలాగే ఉండడంతో(కిందివైపు నుంచి) ఎంత నష్టం జరిగిందనేది ఈ స్కాన్‌లో కనిపించే అవకాశం లేదు.

టైటానిక్ ప్రమాదం నాటి విషాదం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రయాణికుల వ్యక్తిగత వస్తువులు సముద్రపు అడుగుభాగంలో చెల్లాచెదురుగా పడివున్నాయి.

1912 నాటి ఆ రాత్రి గురించి ఎన్నో ఆధారాలను ఈ స్కాన్ అందిస్తోంది, కాకపోతే ఈ 3డీ నమూనా ద్వారా ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు నిపుణులకు చాలా కాలమే పడుతుంది.

''అది తన కథను కొద్దికొద్దిగా మాత్రమే వెల్లడిస్తోంది'' అని పార్క్ స్టీఫెన్‌సన్ అన్నారు.

''ప్రతిసారీ, ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆకాంక్షను మాత్రం మనలో రేపుతోంది.''

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)