నెలసరి సమయంలో శుభ్రంగా ఉండాలంటే టాయిలెట్‌లో ఏమేం వస్తువులు ఉండాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ దేశం పీఆర్
- హోదా, బీబీసీ కోసం
ప్రతి మహిళకూ వారి జీవితంలో కనీసం 30ఏళ్ల పాటు నెలసరి వస్తుంది. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా, తర్వాత చాలామంది మహిళలు దానికి అలవాటు పడిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఇంచుమించు 30 కోట్ల మంది మహిళలు పీరియడ్స్‌లో ఉంటారని అంచనా.
ప్రపంచ జనాభాలోని 400 కోట్ల మంది మహిళల్లో దాదాపు 200 కోట్ల మంది పిల్లలు, వృద్ధులు కాగా మిగిలిన 200 కోట్ల మంది మహిళలు పీరియడ్స్ వచ్చే వయసులోనే ఉంటారని అంచనా.
ఈ 200 కోట్ల మంది మహిళల్లో నాలుగో వంతు మహిళలకు అంటే 50 కోట్ల మందికి నెలసరి సమయంలో తమను తాము శుభ్రంగా ఉంచుకోవడానికి సరైన సదుపాయాలు అందుబాటులో లేవని అధ్యయనాలు చెబుతున్నాయి.
పేద దేశాల్లో సగం (50%) మంది మహిళలకు సరైన సదుపాయాలు అందుబాటులో లేవని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
భారత్‌లో కనీసం 25 శాతం మంది ఆడపిల్లలు నెలసరి సమయంలో ఆ మూడు, నాలుగు రోజులు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లడం లేదు. దీనికి వారు చెప్పే ముఖ్య కారణం… వారి విద్యాసంస్థల్లో లేదా పనిచేసే చోట సరైన టాయిలెట్లు అందుబాటులో లేవు అని.


ఫొటో సోర్స్, Getty Images
నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రత పద్ధతులేంటి?
శుభ్రమైన నీళ్లు, చేతులు, శరీర భాగాలు కడుక్కోవడానికి ఓ సబ్బు, మళ్లీ వాడగలిగే గుడ్డలు ఉపయోగిస్తుంటే బట్టలు ఉతికే సబ్బు, ఉతుక్కోవడానికి సరైన స్థలం, అమ్మాయిలు వాడేసిన శానిటరీ నాప్కిన్ వేయడానికి ఓ చెత్తబుట్ట, అవి చుట్టడానికి న్యూస్ పేపర్లు అందుబాటులో పెట్టాలి. ఇలాంటి కనీస సౌకర్యాలు లేకపోతే వాటిని టాయిలెట్లలో పడేస్తే, అవి బ్లాక్ అయిపోతాయి.
మహిళలు తమ నెలసరిలో అవసరమయ్యే ఉత్పత్తులను, అండర్‌వేర్‌లను బాత్రూంలోనే పెట్టుకునే విధంగా వారికి ఒక కప్ బోర్డు లేదా ఒక బ్యాగ్ ఏర్పాటు చేయవచ్చు.
వారి టాయిలెట్లకి సరైన తలుపులు ఉండాలి. కిటికీలు ఎవరికీ కనబడనంత, వాటిలో నుంచి ఎవరూ చూడలేనంత ఎత్తులో ఉండాలి. ఇవన్నీ విద్యా సంస్థలు, కార్యాలయాల యాజమాన్యాలు పటిష్టంగా అమలు చేయాలి.
మల మూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ యోని చుట్టూ ప్రదేశాన్ని కడుక్కోవాలి. యోని దానంతట అదే స్రావాలను బయటకు పంపిస్తుంది కాబట్టి ఎప్పుడూ సబ్బు నీరు లోపలకు పంపించడం వంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి, దురద వచ్చే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పీరియడ్స్‌లో వాడటానికి ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి?
శానిటరీ ప్యాడ్స్.. ఇవి అందరికీ తెలిసినవే.
1920లో మొదటి ప్రపంచం యుద్ధం ముగిశాక యుద్ధంలో గాయపడిన వారికి ఉపయోగించే దూది బ్యాండేజీలు రక్తాన్ని బాగా పీల్చుకుంటాయని గమనించిన నర్సులు వాటిని ప్యాడ్స్‌గా వాడటం మొదలుపెట్టారు.
ఆ తర్వాత దూదిని లేదా సెల్యులోజ్ వంటి ఇతర పదార్థాలను నెలసరి సమయంలో వాడే ప్యాడ్స్ లాగా తయారు చేసే కంపెనీలు వచ్చాయి.
ఇప్పుడు భారత్‌లో ఏ గ్రామానికి వెళ్లినా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటి ధర ఎక్కువని, ఇంకా చాలా మంది పాత చీరల గుడ్డలను, బట్టలను కత్తిరించి ప్యాడ్లుగా వాడుకుంటున్నారు.
శానిటరీ నాప్కిన్స్ కాకుండా టాంపూన్లు, మెన్‌స్ట్రువల్ కప్‌లు, ప్యాంటీలు...
పెరిగిన సాంకేతిక, శాస్త్ర విజ్ఞానాన్ని బట్టి నెలసరిలో వాడటానికి రకరకాల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. శానిటరీ నాప్కిన్స్ కాకుండా టాంపూన్లు, మెన్‌స్ట్రువల్ కప్‌లు, మెన్‌స్ట్రువల్ డిస్క్, పీరియడ్ ప్యాంటీలు, డైపర్లు, పర్యావరణహితమైన బయోడీగ్రేడబుల్ ప్యాడ్లు వంటివి వీటిలో కొన్ని.
టాంపూన్లు, మెన్‌స్ట్రువల్ కప్‌లు, డిస్క్‌లను యోని లోపల పెట్టి ఉపయోగించాల్సి ఉంటుంది. టాంపూన్లు పూర్వ కాలం నుంచే వాడుతున్నారు గానీ వాటికి ఆ పేరు మాత్రం తర్వాతే పెట్టారు.
పూర్వం గ్రీకులు పీరియడ్ల సమయంలో ఉన్నిని, దూదిని, ఏదైనా ఒక మెత్తని గుడ్డను చిన్న చెక్కకు చుట్టి యోని లోపల పెట్టుకునేవారు. కానీ, పారిశ్రామిక విప్లవం తర్వాత ఈ టాంపూన్లను రక్తంలాంటి ద్రవాలను బాగా పీల్చుకునే దూదిలాంటి పదార్ధాలతో తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు.
భారత్‌లో ఇప్పుడిప్పుడే టాంపూన్లపై అవగాహన పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
రెండు, మూడు దశాబ్దాల కిందటి వరకు శానిటరీ నాప్కిన్స్ విస్తృతంగా అందుబాటులో ఉండేవి కాదు. అందరూ పాత, మెత్తటి గుడ్డల్నే నాప్కిన్స్‌గా వాడేవారు. ఇప్పటికీ ప్యాడ్స్ ఖరీదు ఎక్కువని కొందరు, పర్యావరణానికి కాస్త మేలు చేద్దామని కొందరూ గుడ్డల్నే వాడుతున్నారు.
ఈ గుడ్డలతో సమస్య ఏంటంటే వాటిని శుభ్రంగా ఉతికి ఎండలో, వేడి, గాలి తగిలేలా ఆరేయాలి. లేదంటే వాటిని నీటిలో కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించి ఆరేయాలి. ఎప్పుడూ వదులుగా, తేలిగ్గా ఉండే లోదుస్తులు మాత్రమే ధరించాలి.
కానీ, మన దగ్గర ఉన్న స్టిగ్మా (నెలసరి పట్ల మూఢ నమ్మకాలు, ఏహ్యభావం) వల్ల ఈ గుడ్డలను ఎవరికీ కనబడకుండా ఆరేయడం, చీకట్లో ఆరేయడం, గాలి, వెలుతురు తగలని ప్రదేశాల్లో ఆరేయడం వంటివి చేస్తారు.
అండర్ వేర్‌లు కూడా పూర్తిగా ఆరకుండానే తడిగా ఉన్నపుడు వేసుకోవడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
నెలసరిలో సరైన శుభ్రత లేకపోవడం, వాడిన బట్టలు సరిగా ఉతకకుండా, ఆరేయకుండా వాడటం వల్ల గర్భాశయ ముఖద్వారానికి, యోనికి, చర్మానికి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఇన్ఫెక్షన్లు రావడం ఒక సమస్య అయితే దాని గురించి చర్చించకుండా, ఎవరినీ సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవడం, వైద్యుల దగ్గరకు వెళ్లడానికి సిగ్గుపడటం, సంకోచించడం ఇంకో సమస్య.

ఫొటో సోర్స్, Getty Images
మెన్‌స్ట్రువల్ కప్, డిస్క్‌లను ఎలా వాడాలి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులలో పర్యావరణానికి హాని చేయనివి, ఆడవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉండేవి మెన్‌స్ట్రువల్ కప్, డిస్క్ మాత్రమే. ఇవి సిలికాన్ (ప్లాస్టిక్ వంటి మెత్తని పదార్థం)తో తయారు చేస్తారు. ఒక్క కప్పు లేదా డిస్క్ ఐదు నుంచి పదేళ్ల వరకు ఉపయోగించవచ్చు.
చేతులు శుభ్రంగా కడుక్కొని, వీటిని ఇంగ్లిష్‌లోని వి లేదా సి (V లేదా C) అక్షరాల ఆకారంలో మడత పెట్టి యోని లోపల పెట్టుకోవలసి ఉంటుంది. ఒకసారి పెట్టుకుంటే, రక్తస్రావాన్ని బట్టి 8- 12 గంటల వరకు అలాగే ఉంచుకోవచ్చు.
గర్భాశయం నుండి స్రవించే రక్తమంతా ఈ కప్పులో లేదా డిస్క్‌లో చేరుతుంది. ప్రతి పన్నెండు గంటలకోసారి దాన్ని బయటకు తీసి నీళ్లు, సబ్బుతో శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు.
అన్ని వయసుల మహిళలకు రకరకాల సైజుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. అప్పుడే రజస్వల అయిన అమ్మాయిలకు మొదట్లో వీటి వాడకం కష్టం కావచ్చు.
వారికి తమ శరీర భాగాల గురించి, ఈ కప్పుల వాడకం గురించి అవగాహన వచ్చాకే ఇవి ఉపయోగించాలి.
రుతుస్రావం అలవాటు అయిన మహిళలకు, పిల్లలున్న మహిళలకు ఇవి వాడటం చాలా సులభం. నాప్కిన్స్‌తో పోలిస్తే వీటితో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇవి వాడటం అలవాటైతే, నెలసరిలో కూడా మహిళలు అన్ని రకాల వ్యాయామాలు, స్విమ్మింగ్, ఏరోబిక్స్ వంటివి చేసుకోవచ్చు. ఎలాంటి అసౌకర్యం ఉండదు.
అయితే పీరియడ్‌కు, పీరియడ్‌కు మధ్యలో కచ్చితంగా దాన్ని వేడి నీళ్లలో కనీసం మూడు నిమిషాలు ఉడకబెట్టాలి.
టాంపూన్లు, కప్పులు, డిస్కులు వాడేవారు కచ్చితంగా గుర్తు పెట్టుకొని ప్రతి 12 గంటలకు ఓసారి తీసి శుభ్రం చేయాలి. లేదంటే కొందరికి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నెలసరిలో ఉన్న మహిళల పట్ల సమాజంలో పరోక్షంగా వివక్ష
చాలామంది తల్లిదండ్రులకు రుతుక్రమంపైన సరైన అవగాహన లేక తమ పిల్లలకూ తప్పుడు సమాచారం ఇస్తారు. ఆ సమయంలో పచ్చళ్లు ముట్టుకోకూడదు, ఇంట్లో, ఇంటి బయట అటూ ఇటూ తిరగకూడదు, నెలసరి సమయంలో బాగా విశ్రాంతి తీసుకోవాలి, వ్యాయామం చేయకూడదు, పెరుగు తినకూడదు, మాంసం, చేపలు, స్వీట్లు తినకూడదు.. ఇలా ఎన్నో చెబుతుంటారు. కానీ, ఇవన్నీ అపోహలు మాత్రమే.
ఆడపిల్లలు నెలసరి సమయంలో స్వేచ్ఛగా అన్ని పనులూ చేసుకోవచ్చు. పచ్చడికి తడి తగిలితే పాడవుతుంది కానీ నెలసరిలో ఉన్న ఆడవాళ్లు ముట్టుకోవడం వల్ల కాదు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో సోనీ అనే 36 ఏళ్ల మహిళ పూజ మొదలు పెట్టే రోజు నెలసరి మొదలైందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు.
నెలసరిలో ఉన్న మహిళలు మసీదులోకి వెళ్లడం కూడా నిషిద్ధమే.
మహిళల పట్ల వివక్ష చూపకపోయినా, సమాజంలో పేరుకుపోయిన అపోహలు, చిన్న చూపు, పితృస్వామ్య భావజాలం, రకరకాల కట్టుబాట్ల కారణంగా ఎంతో మంది మహిళలు తమ నెలసరి సమయాలను హార్మోన్ల ద్వారా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు.
కొంతమంది మహిళలు పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి, పెళ్లిళ్లకు వెళ్లడానికి, పరీక్షలు రాయడానికి, ఇంకేవైనా అవసరాలకు హార్మోన్ మందులు వేసుకుంటుంటారు. అవి తరచూ వాడటం గర్భసంచికి మంచిది కాదు.
అత్యవసరం అనుకుంటే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వేసుకోవాల్సిన మందులు ఇవి. కానీ మందుల షాపుల నుంచి నేరుగా తెచ్చుకుని, వాడేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని శారీరక, మానసిక సమస్యలు వస్తాయి.
నెలసరి పట్ల అపోహలపై అందరూ చర్చించుకోవాలి. పురుషుల్లో కూడా దీనిపై అవగాహన పెంచాలి. మగవారికీ ఈ విషయాలపై అవగాహన కలిగిస్తే వారు తమ తమ జీవిత భాగస్వాములకు, పిల్లలకు తగిన ధైర్యం చెప్పే వీలుంటుంది. ఆడవారికి తోడుగా నిలబడే అవకాశం లభిస్తుంది.
(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














